
మానుకోట మున్సిపాలిటీ పరిధి బోరింగ్‌తండా సమీపంలో ఘటన
ఘటనా స్థలిని సందర్శించిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
మహబూబాబాద్ రూరల్: ఓ గురుకులంలో హెల్త్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ పి.సర్వయ్య కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన తాటి పార్ధసారథి (42) భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో నివాసముంటున్నాడు. 11 ఏళ్ల క్రితం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రేకపల్లే గ్రామానికి చెందిన స్వప్నతో వివాహం జరిగింది. వారికి పిల్ల లు భార్గవ్‌సాయి, పరమేశ్వరి ఉన్నారు.
పార్ధసారథి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏడాది కాలంగా హెల్త్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య స్వప్న, పిల్లలు భార్గవ్‌సాయి, పరమేశ్వరి భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో ఉంటున్నారు. పార్ధసారథి మాత్రం దంతాపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటూ సెలవు రోజుల్లో ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం భద్రాచలం వెళ్లి సోమవారం సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరాడు.
తాను వస్తున్నానని తన గది యజమానికి ఫోన్ చేసి ఇంటి గేటు వేయొద్దని చెప్పాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున బోరింగ్‌తండా సమీపంలోని మిరప చేనులో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానిక రైతులు గమనించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. దీంతో రూరల్ ఎస్సై వి.దీపిక, సీఐ పి.సర్వయ్య, డీఎస్పీ ఎన్.తిరుపతిరావు ఘటనా స్థలిని పరిశీలించి ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్‌కు సమాచారం ఇవ్వగా ఆయన హుటాహుటిన చేరకున్నారు. డాగ్‌స్కా్వ డ్, ఫింగర్‌ప్రింట్స్, క్లూస్‌టీం బృందాలు వివరాలు సేకరించాయి. ఘటనాస్థలికి చేరుకున్న మృతుడి సోదరి మద్దుల హేమవరలక్ష్మి, బావ శివప్రసాద్ బోరున విలపించారు. హేమవరలక్ష్మి మాట్లాడుతూ.. తన సోదరుడు పార్ధసారథిపై ఏడాది క్రితం దాడి జరిగిందని తెలిపారు.
మరదలు స్వప్నకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఈ కారణంగానే తమ సోదరుడి హత్య జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా, పోలీస్ స్టేషన్‌లో పార్ధసారథిని దుండగులు హత్య చేసి చంపారని ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ గురుకులాల ఆర్‌సీఓ రాజ్‌కుమార్.. పార్ధసారథి హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక, బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతి, సీసీఎస్ సీఐ హథీరాం, ఇతర పోలీసుల అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కీలకం కానున్న హెల్మెట్..
పార్ధసారథి హత్య విషయంలో ఘటనా స్థలిలో లభ్యమైన హెల్మెట్ కీలకం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుల రాకపోకలు, వాళ్లు వాడిన ద్విచక్రవాహనం ఆచూకీ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో నిందితులు హత్య చేయడానికి వచ్చే ముందు ఆ వాహనం నడిపిన వ్యక్తి ధరించిన హెల్మెట్ తెలుపురంగులో ఉండగా, ఘటనా స్థలిలో లభించిన హెల్మెట్ కూడా అదే రంగులో ఉండడం గమనార్హం. పార్ధసారథి హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. భద్రాచలం నుంచి హత్య జరిగిన ప్రాంతం వరకు రహదారుల వెంట ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.