బతుకమ్మ, దసరా పండుగల ముందు కొండెక్కుతున్న నిత్యావసరాలు
పోటాపోటీగా పెరుగుతున్న బియ్యం, నూనెలు, కూరగాయల ధరలు
వారం క్రితం సన్‌ఫ్లవర్ నూనె లీటర్ రూ.105
ఫైన్ రకం బియ్యం కిలో రూ.70పైనే..
ఇప్పటికే రూ.60కి చేరిన టమాటా, ఉల్లి
ఇంకా దిగిరాని వెల్లుల్లి.. మెల్లిగా పెరిగిపోతున్న పప్పులు
గత వారం పదిరోజుల్లో 20 నుంచి 30 శాతం పెరిగిపోయిన ధరలు
ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్న మార్కెట్ వర్గాలు
మధ్యతరగతి వారూ కొనలేనంతగా రేట్ల మంట
ధరల మంటపై ప్రభుత్వం నుంచి స్పందన లేదనే విమర్శలు
రైతు బజార్లు, రేషన్‌షాపుల్లో తక్కువ ధరకు నిత్యావసరాలు విక్రయిస్తే బాగుంటుందనే సూచనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పండుగల ముందు నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. రోజురోజుకూ నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. రాష్ట్రమంతా ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ రెండు వారాల్లోనే మొదలవనుంది. తర్వాత పదిరోజుల్లోనే దసరా పండుగ ఉంది. ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతోంది.
బియ్యం ధరలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంటే.. నూనెలు, కూరగాయల ధరలు గత వారంలోనే ఒక్కసారిగా 20–30 శాతం వరకు పెరగడం ఇబ్బందిగా మారుతోంది. ఇలా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించడంపైగానీ.. సామాన్యులకు తక్కువ ధరలో సరుకులు అందించడంపైన గానీ ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదనే విమర్శలున్నాయి.
బియ్యం మార్కెట్‌పై నియంత్రణ లేక..
రాష్ట్రంలో సన్నబియ్యం బంగారమైపోతోంది. పప్పులతో పోటీపడుతూ రేటు పెరుగుతోంది. జైశ్రీరాం, సోనామసూరి, హెచ్‌ఎంటీ రకాల బియ్యం రేటు కిలో రూ.70కిపైగా పలుకుతోంది. రైతుల నుంచి సన్నరకాల ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,500 నుంచి రూ.3,000కే కొనుగోలు చేస్తున్న మిల్లర్లు.. సన్న బియ్యానికి డిమాండ్ ఉండటంతో అడ్డగోలు రేటుకు విక్రయిస్తున్నారు.
బియ్యం మార్కెట్‌పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం కూడా దీనికి మరింత ఊతమిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం జైశ్రీరాం రకం రా రైస్ (ముడి బియ్యం) మార్కెట్‌లో 26 కిలోల బ్యాగ్ ధర రూ.1,800 వరకు ఉండగా.. స్టీమ్ రైస్ ధర రూ.1,500 వరకు ఉంది. సోనా మసూరి, హెచ్‌ఎంటీ రకాల ధరలు రూ.1,700కు చేరాయి.
కేంద్రం ప్రకటనతో పెరిగిన వంట నూనెల ధర
వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో వాటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్, వేరుశనగ నూనెలపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ఈనెల 14న ఉదయం ప్రకటన చేయగా.. అదే రోజు సాయంత్రానికే నూనెల ధరలు రూ.20కుపైగా పెరిగాయి.
ఇటీవలి వరకు లీటర్ రూ.105గా ఉన్న పొద్దుతిరుగుడు నూనె ధర ప్రస్తుతం రూ.130–140కి చేరింది. పామాయిల్ రేటు రూ.95 నుంచి రూ.120 దాటిపోయింది. వేరుశనగ నూనె రూ.170 దాటింది. నిజానికి కొత్తగా దిగుమతి అయ్యే నూనెలపైనే పన్ను పెరిగింది.
కానీ ఇప్పటికే దిగుమతి అయి, నిల్వ ఉన్న స్టాక్‌పైనా అధిక రేటు వసూలు చేస్తుండటం గమనార్హం. అంతేకాదు.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘విజయ’ వంట నూనె ధరలనూ అమాంతం పెంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘విజయ’ వంట నూనెలను తక్కువ ధరకు అందించే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలేవీ చేపట్టడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కేంద్రం విజ్ఞప్తిని పట్టించుకోని వ్యాపారులు
సుంకం పెంపునకు ముందే దిగుమతి చేసుకున్న స్టాక్ అయిపోయే వరకు కంపెనీలు.. నూనెల ధరలను గరిష్ట రిటైల్ ధర కంటే తక్కువగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా సుంకం పెంపునకు ముందే దిగుమతి అయిన సుమారు 30 లక్షల టన్నుల వంట నూనెల స్టాక్ ఉందని.. అది 45–50 రోజుల వరకు సరిపోతుందని అంచనా.
అయినా కూడా హోల్‌సేల్ నుంచి రిటైల్ వరకు అన్నిచోట్లా వంటనూనెల ధరలు పెంచేశారు. దసరా నాటికి ఇంకా ధరలు పెరుగుతాయనే ప్రచారంతో.. వినియోగదారులు కొనుగోలు చేసి పెట్టుకుంటుండటం గమనార్హం.
అందుబాటులో లేని ఉల్లి, వెల్లుల్లి..
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉల్లి, వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వెల్లుల్లి కిలో రూ.350 నుంచి రూ.400 వరకు ఉండగా.. ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. మన దేశంలో అవసరమైన వెల్లుల్లిలో అత్యధికంగా 40 శాతం వరకు మధ్యప్రదేశ్ నుంచే వస్తోంది.
దీనితోపాటు వెల్లుల్లి పండించే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనూ.. వాతావరణ పరిస్థితులు కలసి రాక దిగుబడి తగ్గిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో వెల్లుల్లి రేటు మరింతగా పెరగొచ్చని అంటున్నాయి. ఉల్లి పంటకు కూడా వర్షాల ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే రూ.60 దాటింది. ఇది రూ.100కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పప్పులు, కూరగాయల మోత కూడా..
కందిపప్పు, పెసర, మినుములు, శనగ.. ఇలా పప్పుల ధరలన్నీ పెరిగాయి. కందిపప్పు ధర నాణ్యతను బట్టి కిలో రూ.150 నుంచి రూ.180 వరకు ఉండగా.. పెసర పప్పు రూ.130 నుంచి రూ.150 వరకు ఉంది. శనగపప్పు ధర గత పదిరోజుల్లోనే రూ.85 నుంచి రూ.105కు పెరిగింది.
మినపపప్పు రూ.150పైనే పలుకుతోంది. మరోవైపు కూరగాయల ధరలు కూడా కొండెక్కుతున్నాయి. కిలోకు కాలీఫ్లవర్ రూ.150కిపైగా, పచ్చిమిర్చి రూ.120కిపైగా ఉంది. టమాటా ధర వారం క్రితం వరకు కిలో రూ.25–30 ఉంటే.. ఇప్పుడు రూ.60కి చేరింది. బీరకాయ, దోసకాయ, పొట్లకాయ, బెండకాయ, వంకాయ ఏది చూసినా కిలో రూ.50–60 దాటిపోయాయి. చిక్కుడు, బీన్స్ అయితే కిలో రూ.120కి తగ్గడం లేదు.
సర్కారులో స్పందనేదీ?
అడ్డగోలుగా ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానరావడం లేదని, పెరుగుతున్న ధరలపై కనీస సమీక్ష కూడా లేకపోవడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కాస్త దృష్టిపెడితే.. ధరలను కాస్తయినా నియంత్రించవచ్చని నిపుణులు చెప్తున్నారు. మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల ద్వారా నిత్యావసరాలను తక్కువ ధరలతో వినియోగదారులకు అందించవచ్చని వివరిస్తున్నారు.
గతంలోనూ ఇలా ధరలు పెరిగినప్పుడు రేషన్‌దుకాణాలు, రైతుబజార్ల ద్వారా తక్కువ ధరలో ఉల్లిగడ్డలు, ఉప్పు, పప్పులు విక్రయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార మార్కెట్లతో కాలనీల్లో కూరగాయలు, ఇతర నిత్యావసరాలను విక్రయిస్తే కొంత మేర ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప పండుగల సమయంలో సామాన్యులు ఇబ్బందులపాలు కావాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
పండుగ ముందు ధరలు పెరిగాయి
ఐదు లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ 15 రోజుల కింద రూ.570 ఉంటే.. ఇప్పుడు రూ.639 తీసుకుంటున్నారు. 15 రోజుల్లోనే 70 రూపాయలు పెరిగింది. దసరా పండుగ ముందు ధరలు పెరిగాయి. ఇంకా పెరుగుతాయని అంటున్నారు.
– నాయిని రవి, న్యూశాయంపేట, హనుమకొండ
అన్నింటి ధరలు మండిపోతున్నాయి
వంట నూనె ఒకటే కాదు..అన్ని నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. పప్పులు, కూరగాయలు కూడా కొనే పరిస్థితి లేదు.
– యానం విద్య , కాకాజీ కాలనీ, హనుమకొండ
కూరగాయల రేట్లు పెంచేశారు
కూరగాయల రేట్లు బాగా పెరిగాయి. టమాటా మొన్నటివరకు 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 50, 60 రూపాయలకు అమ్ముతున్నారు. కాకర 30 నుంచి 45కు పెంచారు. వారంలోనే అన్ని కూరగాయల రేట్లు పెరిగాయి. రోజువారీగా కూరగాయల ధరలను చూసి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– సాంబయ్య, నల్లగొండ
నూనెలు కొనే పరిస్థితి లేదు
వంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సన్ ఫ్లవర్ మొన్నటిదాకా 105 వరకు ఉంటే.. ఇప్పుడు 125, 130 రూపాయలకు పెంచారు. పామాయిల్ 90 నుంచి 120కి పెంచి అమ్ముతున్నారు. శనగపప్పు మొన్నటిదాకా కిలో 85 రూపాయల దాకా ఉంటే.. ఇప్పుడు 110 రూపాయలు తీసుకుంటున్నారు.
– దుర్గ, నల్లగొండ
నూనెలు కొనే పరిస్థితి లేదు
వంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సన్ ఫ్లవర్ మొన్నటిదాకా 105 వరకు ఉంటే.. ఇప్పుడు 125, 130 రూపాయలకు పెంచారు. పామాయిల్ 90 నుంచి 120కి పెంచి అమ్ముతున్నారు. శనగపప్పు మొన్నటిదాకా కిలో 85 రూపాయల దాకా ఉంటే.. ఇప్పుడు 110 రూపాయలు తీసుకుంటున్నారు.
– దుర్గ, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment