essentials prices hikes
-
ఆకాశమే హద్దుగా.. 'ధరాభారం'
‘‘నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయా లేదా అని మిమ్మల్నందరినీ అడుగుతున్నా.. బియ్యం రూ.55 అయిపోయింది.. కందిపప్పు 160.. వంట నూనె 120.. ఇలా కడాన ఇంటికి అదనంగా ఐదేళ్లలో రూ.8 లక్షల భారం పడింది. నా ఆడపడుచులందరికీ ఈ ఎనిమిది లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రీ?’’. మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరూవాడా మైకు పట్టుకుని ఇలా హోరెత్తించారు. సీన్ కట్‌చేస్తే.. ఆయన సీఎం పీఠమెక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి? నిజానికి.. ధరలు దిగిరావాలి. కానీ ఏం జరుగుతోంది? ఆకాశమే హద్దుగా పైపైకి పోతున్నాయి. ప్రజలను ఏదో ఉద్ధరిస్తామంటూ జట్టు కట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ చోద్యం చూస్తూ సామాన్య జనం నడ్డి విరుస్తున్నాయి. దీంతో.. ‘వాటిజ్ దిస్ బాబుగారు.. వీ ఆర్ ఆస్కింగ్ స్ట్రెయిట్ క్వశ్చన్’.. అని ప్రజలు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రంలో రోజురోజుకూ నింగినంటుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. మేలో ఉన్న ధరలతో పోలిస్తే కనీసం 30–100 శాతం మేర ధరలు పెరిగాయి. ఎంతలా అంటే.. రాష్ట్రంలో ధరలు జాతీయ సగటును మించిపోయాయి. కారణం.. ‘కూటమి’ పార్టీల్లాగే వ్యాపారులందరూ ఒక్కటయ్యారు. వరదలు, వర్షాల సాకుతో కూరగాయల వ్యాపారులు.. సుంకాలు పెరిగాయంటూ నిత్యావసరాల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా ధరలు పెంచేశారు. అయితే.. మార్కెట్‌ను నియంత్రించి, ధరలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కష్టాలేవీ పట్టకుండా మద్యం, ఇసుక దందాలో మునిగితేలుతోంది. – సాక్షి, అమరావతి కాటేస్తున్న కూరగాయలు.. రిటైల్ మార్కెట్లో నాలుగు నెలల క్రితం కిలో రూ.28 ఉన్న టమోటాల ధర ప్రస్తుతం సెంచరీ దాటింది. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో రిటైల్ మార్కెట్లో రూ.100 నుంచి రూ.110 మధ్య పలుకుతోంది. గతేడాది ఇదే సీజన్లో మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో టమోటా ధరలు ఒక్కసారిగా వంద దాటిపోయాయి. ఆ సమయంలో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ఓ దశలో కిలో రూ.150 చొప్పున సేకరించింది. ఇలా రూ.14.66కోట్లు వెచ్చించి రూ.1,364.55 టన్నుల టమోటాలు సేకరించి రూ.50 చొప్పున సబ్సిడీపై వినియోగదారులకు సరఫరా చేశారు. ప్రస్తుతం అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఎంపిక చేసిన కొన్ని రైతుబజార్లలో మాత్రమే సరఫరా చేస్తున్నారు. అది కూడా రూ.70కి పైగానే. ఇక కిలో రూ.25 ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.70–80 వరకు విక్రయిస్తున్నారు. బంగాళదుంపలు మినహా మిగిలిన కూరగాయలన్నీ కిలో రూ.70 పైమాటగానే ఉన్నాయి. రూ.10కు దొరికే కొత్తిమీర కట్ట సైతం రూ.50–60 ఉంది. ఐదు కట్టలు రూ.20కు దొరికే ఆకుకూర ఏదైనాసరే కట్ట రూ.10కు తక్కువకు దొరకడంలేదు. పైగా.. కొందామంటే మార్కెట్లో దొరకని పరిస్థితి ఉంది. మొత్తం మీద రూ.150–200 పెడితే బ్యాగ్ నిండే కూరగాయల కోసం ఇప్పుడు రూ.500–600 పెట్టాల్సి వస్తోంది. మరుగుతున్న నూనె ధరలు.. కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. ఫలితంగా దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనెల ధరలూ విపరీతంగా పెరిగాయి. ప్రియా, ఫ్రీడం, రుచి ఇలా ప్రధాన బ్రాండ్ నూనెల ధరలన్నీ కిలోకి రూ.25–30 వరకు పెరిగిపోయాయి. దిగుమతి సుంకంతో సంబంధంలేని కొబ్బరి నూనె కిలోకి రూ.18, వేరుశనగ నూనెపై రూ.10, పూజాదికాలకు ఉపయోగించే నూనెలపై రూ.10 నుంచి రూ.30 చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్ అయితే ఇతర బ్రాండ్ ధరల కంటే రూ.10 అదనంగా ఉన్నాయి. ధరలు పెంచిన తర్వాత మొక్కబడి తంతుగా నాలుగైదు రోజులు విజిలెన్స్ అధికారులు హడావుడి చేశారు. ఆ తర్వాత పత్తా లేకుండాపోయారు. ఆ మూడింటి తర్వాత ఏపీలోనే పప్పుల ధరలు ఎక్కువ.. ఇక మేలో కిలో రూ.166.12 ఉన్న కందిపప్పు ప్రస్తుతం రూ.180–220 మధ్య ఉంది. పెసర పప్పు రూ.120.85 నుంచి రూ.139కి పెరిగింది. గోవా, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర తర్వాత పప్పుల ధరలు ఏపీలోనే ఎక్కువ. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటినా కందిపప్పు కాదు కదా కనీసం అర కిలో పంచదార కూడా సక్రమంగా ఇవ్వలేకపోతోంది. బహిరంగ మార్కెట్లో కిలోకి రూ.10–20 తగ్గించామని గొప్పలు చెబుతున్నప్పటికీ అవన్నీ నాసిరకం పప్పులే. గోధుమ పిండి సైతం కిలో రూ.45 నుంచి రూ.76కు పైగా పెరిగింది. బాబోయ్ బియ్యం.. మరోవైపు.. రోజువారీ మెనూలో ముఖ్యభూమిక పోషించే బియ్యం ధరలూ ప్రజలను వణికిస్తున్నాయి. పంజాబ్‌లో కిలో బియ్యం ధర రూ.39.58 మాత్రమే. కానీ, అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రాలో మాత్రం వీటి ధరలకు అసాధారణంగా రెక్కలొస్తున్నాయి. సాధారణ రకం బియ్యమే ప్రస్తుతం కిలో రూ.57 ఉండగా, సూపర్ ఫైన్ బియ్యం (సోనా మసూరి, హెచ్ఎంటీ, బీపీటీ రకాలు) కిలో రూ.65 నుంచి రూ.76కి పైనే పలుకుతున్నాయి. లూజ్ బాస్మతి బియ్యం కిలో రూ.119కి పైగా ఉంది. వాస్తవానికి బియ్యం రేట్లు సహజంగా పెరగట్లేదు. దేశవ్యాప్తంగా బియ్యం నిల్వలకూ లోటులేదు. కానీ, వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్‌గా మారి బ్లాక్ చేస్తుండడంతో రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎత్తేసింది. అలాగే, పారాబాయిల్డ్, బ్రౌన్ రైస్ ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గింది. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి.ధరల స్థిరీకరణ నిధి ఏది.. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితుల్లో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి మార్కెట్ ధరకు కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు విక్రయించేవారు. ఐదేళ్లలో రూ.18 కోట్ల విలువైన 8,460 టన్నుల టమోటాలను రైతుల నుంచి మార్కెట్ ధరకే కొనుగోలు చేసి సబ్సిడీపై కిలో రూ.50కే విక్రయించే వారు. అలాగే, రూ.69 కోట్ల విలువైన 94,335 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. ఇలా ఐదేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ.7,758 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నులను 6.17 లక్షల మంది రైతుల నుంచి సేకరించారు. అలాగే, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని ప్యాకెట్ల రూపంలో కిలో రూ.11కే పంపిణీ చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అధికారులను అడిగితే బడ్జెట్లేదని తేల్చి చెప్పేస్తున్నారు. గడిచిన నెలరోజులుగా స్థానిక హోల్‌సేల్ మార్కెట్లో టమోటాలు సేకరించి రవాణా ఖర్చులు కలుపుకుని రైతుబజార్లలో విక్రయిస్తున్నారు.ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. కూరగాయలు కొందామంటే భయమేస్తోంది. టమోటా రూ.100 దాటిపోయింది. రైతుబజార్లలో కూడా కిలో రూ.75కు తక్కువగా ఇవ్వడంలేదు. పైగా ఎక్కడా సరుకు ఉండడంలేదు. బహిరంగ మార్కెట్లో ఉల్లి నుంచి కొత్తిమీర వరకు అన్ని ధరలు చుక్కలనంటుతున్నాయి. బియ్యం, నూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరల నియంత్రణను ప్రభుత్వం గాలికొదిలేసినట్లుంది. – జే.సోమేశ్వరరావు, ప్రైవేటు ఉద్యోగి, విశాఖపట్నం ధరలను నియంత్రించాలి.. బహిరంగ మార్కెట్లో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. కిలో రూ.20–30లకు వచ్చే బెండ, వంకాయలకు సైతం నేడు రూ.కిలో రూ.80కు పైగా పెట్టాల్సి వస్తోంది. టమోటాలైతే కిలో రూ.100 దాటింది. రైతుబజార్లలో నాణ్యతలేనివి కిలో రూ.70కు పైగానే పలుకుతున్నాయి. – వన్నెంరెడ్డి సురేష్, విజయవాడ సబ్సిడీ ధరకే విక్రయించాలి.. గతంలో ఇలా టమోటాలు పెరిగినప్పుడు కిలో రూ.50లకే రైతుబజార్ల ద్వారా విక్రయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలేదు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి అన్ని రైతుబజార్లలో కిలో రూ.50కే టమోటాలు సరఫరా చేయాలి. కూరగాయలతో పాటు నిత్యావసర ధరలనూ నియంత్రించాలి. – సీహెచ్ శివపార్వతి, కొల్లూరు, బాపట్ల ఇలా అయితే బతికేదెలా.. మార్కెట్లో కూరగాయలే కాదు.. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా విపరీతంగా పెరిగాయి. కిలో రూ.25–40 మధ్య దొరికే కూరగాయలు ప్రస్తుతం రూ.80కుపైగా పలుకుతున్నాయి. నూనెలు, బియ్యం ధరలూ అంతే. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకడం కష్టంగా ఉంది. – శ్రీలక్ష్మి, వెంగళాయపాలెం, గుంటూరు నూనె ధరలు పెరిగిపోయాయి.. ఆయిల్, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్స్ లీటర్‌కు రూ.25కు పైగా పెరిగాయి. పప్పుల ధరలు కూడా నాణ్యతను బట్టి కిలోకు రూ.30 వరకు పెరిగిపోయాయి. కూరగాయ ఏదైనాసరే రూ.80కి తక్కువలేదు. చికెన్ కూడా కిలో రూ.240 దాటిపోయింది. ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. – పి. దేవీకృష్ణవేణి, కాకినాడ -
పండుగల ముందు 'ధర'.. దడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పండుగల ముందు నిత్యావసరాల ధరలు చుక్కలు తాకుతున్నాయి. రోజురోజుకూ నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. రాష్ట్రమంతా ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ రెండు వారాల్లోనే మొదలవనుంది. తర్వాత పదిరోజుల్లోనే దసరా పండుగ ఉంది. ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతోంది. బియ్యం ధరలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంటే.. నూనెలు, కూరగాయల ధరలు గత వారంలోనే ఒక్కసారిగా 20–30 శాతం వరకు పెరగడం ఇబ్బందిగా మారుతోంది. ఇలా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించడంపైగానీ.. సామాన్యులకు తక్కువ ధరలో సరుకులు అందించడంపైన గానీ ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదనే విమర్శలున్నాయి. బియ్యం మార్కెట్‌పై నియంత్రణ లేక.. రాష్ట్రంలో సన్నబియ్యం బంగారమైపోతోంది. పప్పులతో పోటీపడుతూ రేటు పెరుగుతోంది. జైశ్రీరాం, సోనామసూరి, హెచ్ఎంటీ రకాల బియ్యం రేటు కిలో రూ.70కిపైగా పలుకుతోంది. రైతుల నుంచి సన్నరకాల ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,500 నుంచి రూ.3,000కే కొనుగోలు చేస్తున్న మిల్లర్లు.. సన్న బియ్యానికి డిమాండ్ ఉండటంతో అడ్డగోలు రేటుకు విక్రయిస్తున్నారు. బియ్యం మార్కెట్‌పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం కూడా దీనికి మరింత ఊతమిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం జైశ్రీరాం రకం రా రైస్ (ముడి బియ్యం) మార్కెట్లో 26 కిలోల బ్యాగ్ ధర రూ.1,800 వరకు ఉండగా.. స్టీమ్ రైస్ ధర రూ.1,500 వరకు ఉంది. సోనా మసూరి, హెచ్ఎంటీ రకాల ధరలు రూ.1,700కు చేరాయి. కేంద్రం ప్రకటనతో పెరిగిన వంట నూనెల ధర వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో వాటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్, వేరుశనగ నూనెలపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ఈనెల 14న ఉదయం ప్రకటన చేయగా.. అదే రోజు సాయంత్రానికే నూనెల ధరలు రూ.20కుపైగా పెరిగాయి. ఇటీవలి వరకు లీటర్ రూ.105గా ఉన్న పొద్దుతిరుగుడు నూనె ధర ప్రస్తుతం రూ.130–140కి చేరింది. పామాయిల్ రేటు రూ.95 నుంచి రూ.120 దాటిపోయింది. వేరుశనగ నూనె రూ.170 దాటింది. నిజానికి కొత్తగా దిగుమతి అయ్యే నూనెలపైనే పన్ను పెరిగింది. కానీ ఇప్పటికే దిగుమతి అయి, నిల్వ ఉన్న స్టాక్‌పైనా అధిక రేటు వసూలు చేస్తుండటం గమనార్హం. అంతేకాదు.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘విజయ’ వంట నూనె ధరలనూ అమాంతం పెంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘విజయ’ వంట నూనెలను తక్కువ ధరకు అందించే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలేవీ చేపట్టడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం విజ్ఞప్తిని పట్టించుకోని వ్యాపారులు సుంకం పెంపునకు ముందే దిగుమతి చేసుకున్న స్టాక్ అయిపోయే వరకు కంపెనీలు.. నూనెల ధరలను గరిష్ట రిటైల్ ధర కంటే తక్కువగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా సుంకం పెంపునకు ముందే దిగుమతి అయిన సుమారు 30 లక్షల టన్నుల వంట నూనెల స్టాక్ ఉందని.. అది 45–50 రోజుల వరకు సరిపోతుందని అంచనా. అయినా కూడా హోల్‌సేల్ నుంచి రిటైల్ వరకు అన్నిచోట్లా వంటనూనెల ధరలు పెంచేశారు. దసరా నాటికి ఇంకా ధరలు పెరుగుతాయనే ప్రచారంతో.. వినియోగదారులు కొనుగోలు చేసి పెట్టుకుంటుండటం గమనార్హం. అందుబాటులో లేని ఉల్లి, వెల్లుల్లి.. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉల్లి, వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వెల్లుల్లి కిలో రూ.350 నుంచి రూ.400 వరకు ఉండగా.. ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. మన దేశంలో అవసరమైన వెల్లుల్లిలో అత్యధికంగా 40 శాతం వరకు మధ్యప్రదేశ్ నుంచే వస్తోంది. దీనితోపాటు వెల్లుల్లి పండించే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనూ.. వాతావరణ పరిస్థితులు కలసి రాక దిగుబడి తగ్గిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో వెల్లుల్లి రేటు మరింతగా పెరగొచ్చని అంటున్నాయి. ఉల్లి పంటకు కూడా వర్షాల ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే రూ.60 దాటింది. ఇది రూ.100కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పప్పులు, కూరగాయల మోత కూడా.. కందిపప్పు, పెసర, మినుములు, శనగ.. ఇలా పప్పుల ధరలన్నీ పెరిగాయి. కందిపప్పు ధర నాణ్యతను బట్టి కిలో రూ.150 నుంచి రూ.180 వరకు ఉండగా.. పెసర పప్పు రూ.130 నుంచి రూ.150 వరకు ఉంది. శనగపప్పు ధర గత పదిరోజుల్లోనే రూ.85 నుంచి రూ.105కు పెరిగింది. మినపపప్పు రూ.150పైనే పలుకుతోంది. మరోవైపు కూరగాయల ధరలు కూడా కొండెక్కుతున్నాయి. కిలోకు కాలీఫ్లవర్ రూ.150కిపైగా, పచ్చిమిర్చి రూ.120కిపైగా ఉంది. టమాటా ధర వారం క్రితం వరకు కిలో రూ.25–30 ఉంటే.. ఇప్పుడు రూ.60కి చేరింది. బీరకాయ, దోసకాయ, పొట్లకాయ, బెండకాయ, వంకాయ ఏది చూసినా కిలో రూ.50–60 దాటిపోయాయి. చిక్కుడు, బీన్స్ అయితే కిలో రూ.120కి తగ్గడం లేదు. సర్కారులో స్పందనేదీ? అడ్డగోలుగా ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కానరావడం లేదని, పెరుగుతున్న ధరలపై కనీస సమీక్ష కూడా లేకపోవడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కాస్త దృష్టిపెడితే.. ధరలను కాస్తయినా నియంత్రించవచ్చని నిపుణులు చెప్తున్నారు. మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల ద్వారా నిత్యావసరాలను తక్కువ ధరలతో వినియోగదారులకు అందించవచ్చని వివరిస్తున్నారు. గతంలోనూ ఇలా ధరలు పెరిగినప్పుడు రేషన్‌దుకాణాలు, రైతుబజార్ల ద్వారా తక్కువ ధరలో ఉల్లిగడ్డలు, ఉప్పు, పప్పులు విక్రయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సంచార మార్కెట్లతో కాలనీల్లో కూరగాయలు, ఇతర నిత్యావసరాలను విక్రయిస్తే కొంత మేర ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప పండుగల సమయంలో సామాన్యులు ఇబ్బందులపాలు కావాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. పండుగ ముందు ధరలు పెరిగాయి ఐదు లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ 15 రోజుల కింద రూ.570 ఉంటే.. ఇప్పుడు రూ.639 తీసుకుంటున్నారు. 15 రోజుల్లోనే 70 రూపాయలు పెరిగింది. దసరా పండుగ ముందు ధరలు పెరిగాయి. ఇంకా పెరుగుతాయని అంటున్నారు. – నాయిని రవి, న్యూశాయంపేట, హనుమకొండ అన్నింటి ధరలు మండిపోతున్నాయి వంట నూనె ఒకటే కాదు..అన్ని నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. పప్పులు, కూరగాయలు కూడా కొనే పరిస్థితి లేదు. – యానం విద్య , కాకాజీ కాలనీ, హనుమకొండ కూరగాయల రేట్లు పెంచేశారు కూరగాయల రేట్లు బాగా పెరిగాయి. టమాటా మొన్నటివరకు 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 50, 60 రూపాయలకు అమ్ముతున్నారు. కాకర 30 నుంచి 45కు పెంచారు. వారంలోనే అన్ని కూరగాయల రేట్లు పెరిగాయి. రోజువారీగా కూరగాయల ధరలను చూసి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. – సాంబయ్య, నల్లగొండ నూనెలు కొనే పరిస్థితి లేదు వంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సన్ ఫ్లవర్ మొన్నటిదాకా 105 వరకు ఉంటే.. ఇప్పుడు 125, 130 రూపాయలకు పెంచారు. పామాయిల్ 90 నుంచి 120కి పెంచి అమ్ముతున్నారు. శనగపప్పు మొన్నటిదాకా కిలో 85 రూపాయల దాకా ఉంటే.. ఇప్పుడు 110 రూపాయలు తీసుకుంటున్నారు. – దుర్గ, నల్లగొండ నూనెలు కొనే పరిస్థితి లేదువంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సన్ ఫ్లవర్ మొన్నటిదాకా 105 వరకు ఉంటే.. ఇప్పుడు 125, 130 రూపాయలకు పెంచారు. పామాయిల్ 90 నుంచి 120కి పెంచి అమ్ముతున్నారు. శనగపప్పు మొన్నటిదాకా కిలో 85 రూపాయల దాకా ఉంటే.. ఇప్పుడు 110 రూపాయలు తీసుకుంటున్నారు. – దుర్గ, నల్లగొండ -
Mallikarjun Kharge: ‘పదేళ్ల అన్యాయ కాలం’
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గురువారం ‘బ్లాక్ పేపర్’ విడుదల చేసింది. మోదీ పాలనా కాలంలో ప్రజలకు వాటిల్లిన సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్యాయాన్ని ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, వ్యవసాయ రంగం విధ్వంసానికి గురైందని, మహిళలపై నేరాలు పెరిగాయని పేర్కొంది. పెద్ద నోట్లను రద్దు చేయడం అతిపెద్ద తప్పు అని స్పష్టం చేసింది. ఈ బ్లాక్ పేపర్‌కు ‘10 సంవత్సరాల అన్యాయ కాలం’గా పేరుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వైట్ పేపర్‌కు పోటీగా ఈ బ్లాక్ పేపర్‌ను కాంగ్రెస్ తీసుకొచి్చంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 54 పేజీల ఈ బ్లాక్ పేపర్‌ను నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ‘చార్జిషీట్’గా అభివరి్ణంచారు. గత పదేళ్ల కాలమంతా అన్యాయ కాలమేనని విమర్శించారు. ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో ఎన్నో మాటలు చెప్పే ప్రధానమంత్రి వైఫల్యాలను మాత్రం నిస్సిగ్గుగా దాచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ అసమర్థత గురించి తాము మాట్లాడితే దానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. అందుకే సర్కారు వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి బ్లాక్ పేపర్ తీసుకొచ్చామన్నారు. ఉత్తరం, దక్షిణం పేరిట దేశాన్ని విచి్ఛన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని మోదీ చేసిన విమర్శలపై ఖర్గే స్పందించారు. గతంలో మాట్లాడిన మాటలను అబద్ధాలకోరులు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ పన్ను హక్కులు అంటూ మాట్లాడారని గుర్తుచేశారు. దళితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారు తనను దూషిస్తూ కొన్నిరోజులుగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఖర్గే తెలిపారు. 53 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, దళితుడినైన తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల గురించి తాము నిలదీసినప్పుడల్లా ప్రధాని మోదీ.. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, వాటిపై వివక్ష కొనసాగుతోందని చెప్పారు. ఆయా రాష్ట్రాలకే కేంద్రం నిధులు ఇవ్వడంలేదని, పైగా నిధులిస్తే ఖర్చు చేయడం లేదంటూ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. ఇది కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో మోదీ ప్రభుత్వం లూటీకి పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ఈ సొమ్మును వాడుకుంటోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 411 మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తిప్పుకున్నారని, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని ఆక్షేపించారు. -
Parliament Monsoon Session: ప్రజల ఇక్కట్లు చూడండి
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై రాజ్యసభలో ఎట్టకేలకు చర్చ మొదలయ్యింది. ధరాఘాతంతో జనం అష్టకష్టాలు పడుతున్నారని ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విన్నవించాయి. నిత్యావసరాల ధరల అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో బీజేపీ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. ధరల పెరుగుదల వల్ల ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని చెప్పారు. ధరలను అదుపుచేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ద్రవ్యోల్బణం ఇప్పుడు 7 శాతంగా ఉందని, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో పెరిగినట్లుగా రెండంకెలకు చేరుకోలేదని అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పంపిణీ వ్యవస్థలు దెబ్బతిన్నాయని, చమురు మంట కొనసాగుతోందని, తద్వారా ధరలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. కేవలం మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇప్పటికిప్పుడు నియంత్రణలోకి తీసుకురావడం ఏ దేశం చేతుల్లోనూ లేదని తేల్చిచెప్పారు. ప్రజలు విసుగెత్తిపోయారు ధరల అంశంపై చర్చను సీపీఎం సభ్యుడు ఎళమారమ్ కరీం ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదని ఆక్షేపించారు. గత ఎనిమిదేళ్లుగా ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, జీఎస్టీ మోత, రూపాయి విలువ పతనం వంటివి పేదలను కుంగదీస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ వాపోయారు. సమస్యలను ఇప్పటికైనా గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోయారని కాంగ్రెస్ సభ్యుడు శక్తిసింహ్ గోహిల్ అన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా చెప్పారు. ఆహార ఉత్పత్తి వ్యయం గత ఏడాది కాలంలో 21 శాతం పెరిగిందని వివరించారు. రైతుల ఆదాయం పెరగడం లేదన్నారు. గిరిజనుల సమస్యలను జేఎంఎం ఎంపీ మహువా రాజ్యసభలో ప్రస్తావించారు. ధరల మంట కారణంగా మహిళల కష్టాలు రెట్టింపు అయ్యాయని కాంగ్రెస్ ఎంపీ అశోక్‌రావు ఉద్ఘాటించారు. పన్నుల భారం పెరగలేదు: నిర్మల ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించామని వివరించారు. జీఎస్టీ వల్ల కుటుంబాలపై పన్నుల భారం పెరగలేదన్నారు. బియ్యం, గోధుమ పిండి, పెరుగు వంటి వాటిపై అన్ని రాష్ట్రాల అంగీకారంతోనే జీఎస్టీ విధించినట్లు గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ధరలు అధికంగా ఉండేవని అన్నారు. అప్పట్లో కిలో ఉల్లిపాయల ధర రూ.100 మార్కును దాటిందని వెల్లడించారు. -
పార్లమెంట్లో అదే అలజడి.. కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల పెరుగుదల, లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు సోమవారం కూడా ఆందోళన కొనసాగించాయి. దీంతో రెండు సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టడంతో ధరల పెరుగుదలపై లోక్‌సభలో చర్చ జరిగింది. దీనిపై మంగళవారం రాజ్యసభ కూడా చర్చించనుంది. సభ గౌరవాన్ని తగ్గించొద్దు: స్పీకర్ లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. తమ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభ గౌరవాన్ని తగ్గించే పని చేయొద్దని స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైనా విపక్షాలు నినాదాలు ఆపలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడ్డారు. దాంతో సభ మధ్యాహ్నం రెండింటిదాకా వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా అవే దృశ్యాలు కనిపించాయి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దు, ఇది ఈడీ సర్కారు అంటూ కాంగ్రెస్ సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. డీఎంకే, ఎన్సీపీ సభ్యులు వారికి మద్దతుగా నిలిచారు. సభలోకి ఇకపై ప్లకార్డులు తీసుకురాబోమని నలుగురు కాంగ్రెస్ ఎంపీలు హామీ ఇవ్వడంతో వారిపై సస్సెన్షన్‌ను ఎత్తేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సభ్యులను హెచ్చరించారు. సభాపతి స్థానాన్ని అగౌరవపర్చాలన్న ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల వినతిని ప్రభుత్వం వినకపోవడం వల్లే నిరసన తెలపాల్సి వస్తోందన్నారు. రాజ్యసభలోనూ అవే సీన్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టు తదితరాలపై ప్రతిపక్షాలు రాజ్యసభను స్తంభింపజేశాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఆందోళనకు దిగాయి. దాంతో సభ మధ్యాహ్నం 12 దాకా వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ్యులు శాంతించలేదు. వెల్‌లోకి చేరుకొని, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రతిపక్షాలను కోరారు. ధరల పెరుగుదలపై మంగళవారం సభలో చర్చిస్తామన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, అస్సాంలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సభలో విపక్షాల నిరసనల మధ్యే ఖాదీ, జీడీపీలో వీధి వ్యాపారుల పాత్ర, నదుల స్వచ్ఛీకరణ, అభివృద్ధిపై చర్చను చేపట్టారు. నినాదాల హోరు పెరగడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత కూడా సభ అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. మాంద్యానికి అవకాశం లేదు: నిర్మల భారత్‌లో ఆర్థిక మాంద్యం గానీ, ఆర్థిక మందగమనం గానీ ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో చెప్పారు. ధరల పెరుగుదలపై చర్చలో ఆమె మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా మారుతోంది అని చెప్పడానికి జీఎస్టీ వసూళ్లు, కొనుగోలు సూచికే(పీఎంఐ) సాక్ష్యమని వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరేళ్ల బాలిక ప్రధాని మోదీకి రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. మోదీపై నమ్మకం ఉంది కాబట్టే లేఖ రాసిందని అన్నారు. ప్రభుత్వ చర్యలు, విధానాల వల్ల ఇటీవల వంట నూనెల ధరలు తగ్గిపోయాయని ఉద్ఘాటించారు. ఆర్థిక మంత్రి సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోక్‌సభ నుంచి కాంగ్రెస్, డీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ‘నో వన్ కిల్డ్ జెస్సికా తరహాలో దేశంలో ద్రవ్యోల్బణం లేదు’ అని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఎద్దేవా చేశారు. పచ్చి కూరగాయలు తినాల్సిందే ధరల పెరుగుదలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ లోక్‌సభలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ధరల పెరుగుదలపై చర్చ జరుగుతుండగా హఠాత్తుగా లేచి పచ్చి వంకాయను ప్రదర్శించారు. వంట గ్యాస్ ధర విపరీతంగా పెరగడంతో పచ్చి కూరగాయలు తిని కడుపు నింపుకోవాల్సిందేనంటూ వంకాయను కొరికి నిరసన వెలిబుచ్చారు. -
కొనడానికి లేదు.. తినడానికి లేదు
ఏమీ కొనేటట్టు లేదు. ఏమీ తినేటట్టు లేదు. కొనడానికి డబ్బుల్లేవు. డబ్బులున్నా కొనడానికి ఏమీ దొరకవు. పెట్రోల్ బంకుల దగ్గర రోజుల తరబడి క్యూ లైన్లు ఆఫీసుల్లేవు, పనుల్లేవు. చదువుల్లేవు. కాస్త గాలి ఆడేలా ఫ్యాన్ కింద కునుకు తీద్దామంటే కరెంట్ ఉండదు. ఏం చేయాలి? ఎలా బతకాలి? అందుకే కడుపు మండిన సగటు శ్రీలంక పౌరులు రోడ్డెక్కారు. అవినీతి అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ సమరభేరి మోగించారు. కడుపు నింపుకోవడానికి కావల్సినంత తిండి దొరకదు. అర్థాకలితో కంచం ముందు నుంచి లేవాలి. కాసేపు ఫ్యాన్ కింద కూర్చుద్దామంటే కరెంట్ ఉండదు. రోజుకి 13 గంటల విద్యుత్ కోతలు. బయటకు వెళ్లాలంటే పెట్రోల్ లేక వాహనం కదలదు. పాఠశాలలు, కార్యాలయాలు మూతబడ్డాయి. అటు ధరాభారం, ఇటు నిత్యావసరాల కొరతతో శ్రీలంక పౌరుల బతుకు భారంగా మారింది. ఏది కొనాలన్నా క్యూ లైన్లలో నిల్చోవాలి. కాళ్లు పడిపోయేలా నిల్చున్నా కావల్సినవి దొరుకుతాయన్న నమ్మకం లేదు. లీటర్ పెట్రోల్ రూ.450, కేజీ బియ్యం రూ.250, కేజీ కందిపప్పు రూ. 420, ఒక కొబ్బరికాయ రూ.110, కేజీ కేరట్ రూ.250, అయిదు కేజీల గ్యాస్ బండ ధర రూ.1150... ఇవీ శ్రీలంకలో ధరలు ... నిత్యావసరాల ధరలు ఆ స్థాయిలో ఉంటే ఎలా కొంటారు ? ఏం తింటారు ? ఇక పిల్లలకైతే పౌష్టికాహారం దొరకడం లేదు. పాల పౌడర్ దిగుమతులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. బతుకు దుర్భరమైన పరిస్థితుల్లో ఒంటికేదైనా వచ్చినా ఆస్పత్రుల్లో అత్యవసర మందులకి కూడా కొరత నెలకొంది. వైద్యం కూడా అందరికీ అందని పరిస్థితి వచ్చేసింది. పెట్రోల్ ధరలు మండిపోతూ ఉండడంతో చాలా మంది తమ కండబలాన్ని నమ్ముకున్నారు. స్కూటర్లు, కార్లు అమ్మేసి సైకిళ్లు కొనుక్కుంటున్నారు. బంగారాన్ని, ఆభరణాల్ని కూడా అమ్మేస్తున్నారు. 2021లో 7 టన్నుల బంగారాన్ని అమ్మిన శ్రీలంక ప్రజలు ఈ ఏడాది 20శాతం అధికంగా అమ్మేయవచ్చునని అంచనాలున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో ప్రజాగ్రహం అధ్యక్ష పీఠాన్ని వదలని గొటబాయ రాజపక్స మీదకు మళ్లింది.దేశంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష, ప్రధాని భవనాలను ముట్టడించారు. మొత్తంగా శ్రీలంక ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి ? పర్యాటక రంగం మీద ప్రధానంగా ఆధారపడిన శ్రీలం కోవిడ్–19 విసిరిన పంజా కోలుకోలేని దెబ్బ తీసింది. 2019లో 19 లక్షల మంది లంకను సందర్శిస్తే, 2020లో వారి సంఖ్య ఏకంగా 5 లక్షలకు పడిపోయింది. దీంతో ప్రధానంగా పర్యాటకం మీద ఆధారపడ్డ ఆ దేశానికి దెబ్బ తగిలింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి భారీగా ఆదాయం వచ్చే దేశంలో రైతులు అందరూ సేంద్రీయ ఎరువులు వాడి తీరాలన్న ప్రభుత్వ నిబంధనతో వ్యవసాయ దిగుబడులు భారీగా తగ్గిపోయాయి.. మరీ ముఖ్యంగా ధాన్యం, రబ్బర్, టీ, కొబ్బరి వంటి పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. దీనికి తోడు రాజపక్స కుటుంబం ఏళ్ల తరబడి చేస్తున్న అవినీతి, ప్రభుత్వ అరాచక విధానాలు దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. ఈ ఏడాది 700 కోట్ల డాలర్ల విదేశీ అప్పుల్ని శ్రీలంక ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో డాలర్ మారకం విలువ రూ.200 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.360కు చేరుకుంది. విదేశీ నిల్వలు తరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించడానికి ప్రపంచ దేశాల సహకారంతో పాటు పెద్ద ఎత్తున ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి తేవాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. సాగులో ఉత్పాదకత పెంచడం, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ అవకాశాల కల్పన, సంస్కరణలు పకడ్బందీగా అమలు చేయడం, కార్మికులు రెట్టింపు శ్రమ చేయడం, ప్రజా సేవలు, విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రణాళికను రూపొందించడం వంటివి చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లంక విద్యార్ధులపై విరిగిన లాఠీ
కొలంబో: ఆర్థికంగా అధ్వాన్న స్థితికి చేరుకున్న లంకలో సామాజిక పరిస్థితులు కూడా కట్టు తప్పుతున్నాయి. ప్రజాగ్రహాన్ని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం దమనకాండకు దిగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై నిరసనకు దిగిన వర్సిటీ విద్యార్ధులపై ఆదివారం పోలీసులు లాఠీ చార్జ్, బాష్పవాయు ప్రయోగం చేశారు. ఆల్‌పార్టీ ప్రభు త్వం ఏర్పాటుకు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం ప్రభుత్వ ఆజ్ఞలు లెక్కచేయని ప్రతిపక్ష సమగి జన బలవెగయ పార్టీ కొలంబోలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. లంకలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ప్రతిపక్ష నేత హర్ష డిసిల్వా ప్రకటించారు. నిరసనలో భాగంగా కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్దకు ప్రతిపక్షాలు లాంగ్‌మార్చ్ నిర్వహించాయి. దేశ పశ్చిమ ప్రాంతంలో పోలీసులు కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనకు 664మందిని అరెస్టు చేశారు. ప్రజాహక్కుల పరిరక్షణకే నిరసనలని ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస చెప్పారు. ప్రతిపక్షాలకు మద్దతుగా పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆన్లైన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆల్‌పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ పరిష్కారాన్ని వెతకాలని మాజీ మంత్రి విమల వీరవంశ సూచించారు. ఈ సూచనపై అధ్యక్షుడు, ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. లంక ఆర్థిక వ్యవస్థను కొందరు వ్యక్తులు గుప్పిట్లో ఉంచుకున్నారని, వీరికి ప్రజల్లో మద్దతు పోయిందని మాజీ క్రికెటర్ మహెళ జయవర్ధనే విమర్శించారు. వీరంతా వెంటనే గద్దె దిగాలన్నారు. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో క్రీడలు, యువజన మంత్రి పదవికి నమల్ రాజపక్సా రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. సోషల్ మీడియాపై నిషేధం, ఎత్తివేత ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించిన శ్రీలంక.. తిరిగి 15 గంటల్లోనే ఎత్తివేసింది. 36 గంటల కర్ఫ్యూలో భాగంగా సోషల్ మీడియాపై శనివారం రాత్రి నిషేధం విధించింది. దీన్ని మంత్రులు వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గింది. కిలో బియ్యం రూ.220! శ్రీలంకలో ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఇంధనం, నిత్యావసరాల కోసం జనం భారీగా క్యూ కడుతున్నారు. అయినా ఏ కొందరికో సరుకులు లభిస్తున్నాయి. సూపర్మార్కెట్లలో కిలో బియ్యం రూ. 220, గోధుమలు రూ.190, పంచదార రూ.240, పాల పౌడర్ రూ.1900 చేరడంతో లీటర్ కొబ్బరి నూనె రూ. 850, గుడ్డు రూ.30 పలుకుతున్నాయి. -
వారి కలయిక అందుకే!
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ , కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నిత్యావసరాల ధరలను మరింత మండించేందుకేనని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆరోపించారు. రెండు పార్టీలు పరస్పర మద్దతుతోనే వంటగ్యాస్, సీఎన్ జీ, నీటి చార్జీలను పెంచుతున్నాయని విమర్శిం చారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ధరలు పెంచుతుంటే వారికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ధరలు పెంచుతోంది. వెంటనే సీఎన్జీ,వంటగ్యాస్, నీటి బిల్లులు తగ్గించాలి’ అని ఆయన పేర్కొన్నారు. సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్లపై రూ.220 పెంచ డం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలపై పెనుభారం పడనుందన్నారు. ఇందువల్ల నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతాయన్నారు. ప్రధానమంత్రి సైతం దీనిపై నిస్సహాయత వ్యక్తం చేయడం బాధాకరమన్నారు. ‘కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పరస్పరం సహకరించుకునేందుకే ధరలు పెంపు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ రెండు పార్టీల నాయకులు తమ ను ఎవరూ అడ్డుకోలేరనే విధంగా వ్యవహరిస్తున్నా రు.’అని విమర్శించారు.