ఆకాశమే హద్దుగా.. 'ధరాభారం' | Essentials and Vegetables Prices hike in Chandrababu Coalition Govt | Sakshi
Sakshi News home page

ఆకాశమే హద్దుగా.. 'ధరాభారం'

Published Tue, Oct 8 2024 3:49 AM | Last Updated on Tue, Oct 8 2024 9:37 AM

Essentials and Vegetables Prices hike in Chandrababu Coalition Govt

చుక్కలనంటిన నిత్యావసరాలు 

సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్న ధరలు

ఠారెత్తిస్తున్న టమోటా.. కిలో రూ.100కి పైనే

కంటతడి పెట్టిస్తున్న ఉల్లి.. కిలో రూ.70–80

కూరగాయలు ఏవైనా సరే కిలో రూ.80 పైమాటే.. వెల్లుల్లి రూ.440.. కొత్తిమీర కట్ట రూ.60

వంటనూనెలు లీటరుకు రూ.15–30 పెరిగిన ధరలు

హడలెత్తిస్తున్న బియ్యం రేట్లు

ధరలు అదుపు చేయడంలో సర్కారు చోద్యం

జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే అధికం..

‘‘నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయా లేదా అని మిమ్మల్నందరినీ అడుగుతున్నా.. బియ్యం రూ.55 అయిపోయింది.. కందిపప్పు 160.. వంట నూనె 120.. ఇలా కడాన ఇంటికి అదనంగా ఐదేళ్లలో రూ.8 లక్షల భారం పడింది. నా ఆడపడుచులందరికీ ఈ ఎనిమిది లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రీ?’’. మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరూవాడా మైకు పట్టుకుని ఇలా హోరెత్తించారు. సీన్‌ కట్‌చేస్తే.. ఆయన సీఎం పీఠమెక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి? నిజానికి.. ధరలు దిగిరావాలి. కానీ ఏం జరుగుతోంది? ఆకాశమే హద్దుగా పైపైకి పోతున్నాయి. ప్రజలను ఏదో ఉద్ధరిస్తామంటూ జట్టు కట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ చోద్యం చూస్తూ సామాన్య జనం నడ్డి విరుస్తున్నాయి. దీంతో.. ‘వాటిజ్‌ దిస్‌ బాబుగారు.. వీ ఆర్‌ ఆస్కింగ్‌ స్ట్రెయిట్‌ క్వశ్చన్‌’.. అని ప్రజలు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో రోజురోజుకూ నింగినంటుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. మేలో ఉన్న ధరలతో పోలిస్తే కనీసం 30–100 శాతం మేర ధరలు పెరిగాయి. ఎంతలా అంటే.. రాష్ట్రంలో ధరలు జాతీయ సగటును మించిపోయాయి. కారణం.. ‘కూటమి’ పార్టీల్లాగే వ్యాపారులందరూ ఒక్కటయ్యారు. వరదలు, వర్షాల సాకుతో కూరగాయల వ్యాపారులు.. సుంకాలు పెరిగాయంటూ నిత్యావసరాల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా ధరలు పెంచేశారు. అయితే.. మార్కెట్‌ను నియంత్రించి, ధరలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కష్టాలేవీ పట్టకుండా మద్యం, ఇసుక దందాలో మునిగితేలుతోంది.     
    – సాక్షి, అమరావతి  

కాటేస్తున్న కూరగాయలు.. 
రిటైల్‌ మార్కెట్‌లో నాలుగు నెలల క్రితం కిలో రూ.28 ఉన్న టమోటాల ధర ప్రస్తుతం సెంచరీ దాటింది. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో రిటైల్‌ మార్కెట్‌లో రూ.100 నుంచి రూ.110 మధ్య పలుకుతోంది. గతేడాది ఇదే సీజన్‌లో మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో టమోటా ధరలు ఒక్కసారిగా వంద దాటిపోయాయి. ఆ సమయంలో నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ఓ దశలో కిలో రూ.150 చొప్పున సేకరించింది. ఇలా రూ.14.66కోట్లు వెచ్చించి రూ.1,364.55 టన్నుల టమోటాలు సేకరించి రూ.50 చొప్పున సబ్సిడీపై వినియోగదారులకు సరఫరా చేశారు. 

ప్రస్తుతం అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని ఎంపిక చేసిన కొన్ని రైతుబజార్లలో మాత్రమే సరఫరా చేస్తున్నారు. అది కూడా రూ.70కి పైగానే. ఇక కిలో రూ.25 ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.70–80 వరకు విక్రయిస్తున్నారు. బంగాళదుంపలు మినహా మిగిలిన కూరగాయలన్నీ కిలో రూ.70 పైమాటగానే ఉన్నాయి. 

రూ.10కు దొరికే కొత్తిమీర కట్ట సైతం రూ.50–60 ఉంది. ఐదు కట్టలు రూ.20కు దొరికే ఆకుకూర ఏదైనాసరే కట్ట రూ.10కు తక్కువకు దొరకడంలేదు. పైగా.. కొందామంటే మార్కెట్లో దొరకని పరిస్థితి ఉంది. మొత్తం మీద రూ.150–200 పెడితే బ్యాగ్‌ నిండే కూరగాయల కోసం ఇప్పుడు రూ.500–600 పెట్టాల్సి వస్తోంది.   


మరుగుతున్న నూనె ధరలు.. 
కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. ఫలితంగా దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనెల ధరలూ విప­రీతంగా పెరిగాయి. ప్రియా, ఫ్రీడం, రుచి ఇలా ప్రధా­న బ్రాండ్‌ నూనెల ధరలన్నీ కిలోకి రూ.25–30 వరకు పెరిగిపోయాయి. 

దిగుమతి సుంకంతో సంబంధంలేని కొబ్బరి నూనె కిలోకి రూ.18, వేరుశనగ నూనెపై రూ.10, పూజాదికాలకు ఉపయోగించే నూనెలపై రూ.10 నుంచి రూ.30 చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్‌ అయితే ఇతర బ్రాండ్‌ ధరల కంటే రూ.10 అదనంగా ఉన్నాయి. ధరలు పెంచిన తర్వాత మొక్కబడి తంతుగా నాలుగైదు రోజులు విజిలెన్స్‌ అధికారులు హడావుడి చేశారు. ఆ తర్వాత పత్తా లేకుండాపోయారు.  

ఆ మూడింటి తర్వాత ఏపీలోనే పప్పుల ధరలు ఎక్కువ.. 
ఇక మేలో కిలో రూ.166.12 ఉన్న కందిపప్పు ప్రస్తుతం రూ.180–220 మధ్య ఉంది. పెసర పప్పు రూ.120.85 నుంచి రూ.139కి పెరిగింది. గోవా, అండమాన్‌ నికోబార్‌ దీవులు, మహారాష్ట్ర తర్వాత పప్పుల ధరలు ఏపీలోనే ఎక్కువ. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటినా కందిపప్పు కాదు కదా కనీసం అర కిలో పంచదార కూడా సక్రమంగా ఇవ్వలేకపోతోంది. బహిరంగ మార్కెట్‌లో కిలోకి రూ.10–20 తగ్గించామని గొప్పలు చెబుతున్నప్పటికీ అవన్నీ నాసిరకం పప్పులే. గోధుమ పిండి సైతం కిలో రూ.45 నుంచి రూ.76కు పైగా పెరిగింది.  



బాబోయ్‌ బియ్యం.. 
మరోవైపు.. రోజువారీ మెనూలో ముఖ్యభూమిక పోషించే బియ్యం ధరలూ ప్రజలను వణికిస్తున్నాయి. పంజాబ్‌లో కిలో బియ్యం ధర రూ.39.58 మాత్రమే. కానీ, అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రాలో మాత్రం వీటి ధరలకు అసాధారణంగా రెక్కలొస్తున్నాయి. సాధారణ రకం బియ్యమే ప్రస్తుతం కిలో రూ.57 ఉండగా, సూపర్‌ ఫైన్‌ బియ్యం (సోనా మసూరి, హెచ్‌ఎంటీ, బీపీటీ రకాలు) కిలో రూ.65 నుంచి రూ.76కి పైనే పలుకుతున్నాయి. 

లూజ్‌ బాస్మతి బియ్యం కిలో రూ.119కి పైగా ఉంది. వాస్తవానికి బియ్యం రేట్లు సహజంగా పెరగట్లేదు. దేశవ్యాప్తంగా బియ్యం నిల్వలకూ లోటులేదు. కానీ, వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్‌గా మారి బ్లాక్‌ చేస్తుండడంతో రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎత్తేసింది. అలాగే, పారాబాయిల్డ్, బ్రౌన్‌ రైస్‌ ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గింది. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి.

ధరల స్థిరీకరణ నిధి ఏది.. 
గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితుల్లో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కె­ట్‌లో జోక్యం చేసుకుని రైతుల నుంచి మార్కెట్‌ ధరకు కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు విక్రయించేవారు. ఐదేళ్లలో రూ.18 కోట్ల విలువైన 8,460 టన్నుల టమోటాలను రైతుల నుంచి మార్కెట్‌ ధరకే కొనుగోలు చేసి సబ్సిడీపై కిలో రూ.50కే విక్రయించే వారు. అలాగే, రూ.69 కోట్ల విలువైన 94,335 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. 

ఇలా ఐదేళ్లలో మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద రూ.7,758 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నులను 6.17 లక్షల మంది రైతుల నుంచి సేకరించారు. అలాగే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఫోర్టిఫైడ్‌ గోధుమ పిండిని ప్యాకెట్ల రూపంలో కిలో రూ.11కే  పంపిణీ చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అధికారులను అడిగితే బడ్జెట్‌లేదని తేల్చి చెప్పేస్తున్నారు. గడిచిన నెలరోజులుగా స్థానిక హోల్‌సేల్‌ మార్కెట్‌లో టమోటాలు సేకరించి రవాణా ఖర్చులు కలుపుకుని రైతుబజార్లలో   విక్రయిస్తున్నారు.

ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. 
కూరగాయలు కొందామంటే భయమేస్తోంది. టమోటా రూ.100 దాటిపోయింది. రైతుబజార్లలో కూడా కిలో రూ.75కు తక్కువగా ఇవ్వడంలేదు. పైగా ఎక్కడా సరుకు ఉండడంలేదు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి నుంచి కొత్తిమీర వరకు అన్ని ధరలు చుక్కలనంటుతున్నాయి. బియ్యం, నూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరల నియంత్రణను ప్రభుత్వం గాలికొదిలేసినట్లుంది.     
– జే.సోమేశ్వరరావు, ప్రైవేటు ఉద్యోగి, విశాఖపట్నం 

ధరలను నియంత్రించాలి.. 
బహిరంగ మార్కెట్‌లో కూరగాయలు, నిత్యావసరాల ధరలు  పెరుగుతున్నాయి. కిలో రూ.20–30లకు వచ్చే బెండ, వంకాయలకు సైతం నేడు రూ.కిలో రూ.80కు పైగా పెట్టాల్సి వస్తోంది. టమోటాలైతే కిలో రూ.100 దాటింది. రైతుబజార్లలో నాణ్యతలేనివి కిలో రూ.70కు పైగానే పలుకుతున్నాయి.                            
– వన్నెంరెడ్డి సురేష్, విజయవాడ 

సబ్సిడీ ధరకే విక్రయించాలి.. 
గతంలో ఇలా టమోటాలు పెరిగినప్పుడు కిలో రూ.50లకే రైతుబజార్ల ద్వారా విక్రయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలేదు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి అన్ని రైతుబజార్లలో కిలో రూ.50కే టమోటాలు సరఫరా చేయాలి. కూరగాయలతో పాటు నిత్యావసర ధరలనూ నియంత్రించాలి. 
– సీహెచ్‌ శివపార్వతి, కొల్లూరు, బాపట్ల 

ఇలా అయితే బతికేదెలా.. 
మార్కెట్‌లో కూరగాయలే కాదు.. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా విపరీతంగా పెరిగాయి. కిలో రూ.25–40 మధ్య దొరికే కూరగాయలు ప్రస్తుతం రూ.80కుపైగా పలుకుతున్నాయి. నూనెలు, బియ్యం ధరలూ అంతే. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకడం కష్టంగా ఉంది.  
    – శ్రీలక్ష్మి, వెంగళాయపాలెం, గుంటూరు 

నూనె ధరలు పెరిగిపోయాయి.. 
ఆయిల్, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సన్‌ఫ్లవర్‌ ఆయిల్స్‌ లీటర్‌కు రూ.25కు పైగా పెరిగాయి. పప్పుల ధరలు కూడా నాణ్యతను బట్టి కిలోకు రూ.30 వరకు పెరిగిపోయాయి. కూరగాయ ఏదైనాసరే రూ.80కి తక్కువలేదు. చికెన్‌ కూడా కిలో రూ.240 దాటిపోయింది. ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. 
 – పి. దేవీకృష్ణవేణి, కాకినాడ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement