Rythu Bazaars
-
ఆకాశమే హద్దుగా.. 'ధరాభారం'
‘‘నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయా లేదా అని మిమ్మల్నందరినీ అడుగుతున్నా.. బియ్యం రూ.55 అయిపోయింది.. కందిపప్పు 160.. వంట నూనె 120.. ఇలా కడాన ఇంటికి అదనంగా ఐదేళ్లలో రూ.8 లక్షల భారం పడింది. నా ఆడపడుచులందరికీ ఈ ఎనిమిది లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రీ?’’. మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరూవాడా మైకు పట్టుకుని ఇలా హోరెత్తించారు. సీన్ కట్‌చేస్తే.. ఆయన సీఎం పీఠమెక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి? నిజానికి.. ధరలు దిగిరావాలి. కానీ ఏం జరుగుతోంది? ఆకాశమే హద్దుగా పైపైకి పోతున్నాయి. ప్రజలను ఏదో ఉద్ధరిస్తామంటూ జట్టు కట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ చోద్యం చూస్తూ సామాన్య జనం నడ్డి విరుస్తున్నాయి. దీంతో.. ‘వాటిజ్ దిస్ బాబుగారు.. వీ ఆర్ ఆస్కింగ్ స్ట్రెయిట్ క్వశ్చన్’.. అని ప్రజలు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రంలో రోజురోజుకూ నింగినంటుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. మేలో ఉన్న ధరలతో పోలిస్తే కనీసం 30–100 శాతం మేర ధరలు పెరిగాయి. ఎంతలా అంటే.. రాష్ట్రంలో ధరలు జాతీయ సగటును మించిపోయాయి. కారణం.. ‘కూటమి’ పార్టీల్లాగే వ్యాపారులందరూ ఒక్కటయ్యారు. వరదలు, వర్షాల సాకుతో కూరగాయల వ్యాపారులు.. సుంకాలు పెరిగాయంటూ నిత్యావసరాల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా ధరలు పెంచేశారు. అయితే.. మార్కెట్‌ను నియంత్రించి, ధరలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కష్టాలేవీ పట్టకుండా మద్యం, ఇసుక దందాలో మునిగితేలుతోంది. – సాక్షి, అమరావతి కాటేస్తున్న కూరగాయలు.. రిటైల్ మార్కెట్లో నాలుగు నెలల క్రితం కిలో రూ.28 ఉన్న టమోటాల ధర ప్రస్తుతం సెంచరీ దాటింది. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో రిటైల్ మార్కెట్లో రూ.100 నుంచి రూ.110 మధ్య పలుకుతోంది. గతేడాది ఇదే సీజన్లో మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో టమోటా ధరలు ఒక్కసారిగా వంద దాటిపోయాయి. ఆ సమయంలో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ఓ దశలో కిలో రూ.150 చొప్పున సేకరించింది. ఇలా రూ.14.66కోట్లు వెచ్చించి రూ.1,364.55 టన్నుల టమోటాలు సేకరించి రూ.50 చొప్పున సబ్సిడీపై వినియోగదారులకు సరఫరా చేశారు. ప్రస్తుతం అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఎంపిక చేసిన కొన్ని రైతుబజార్లలో మాత్రమే సరఫరా చేస్తున్నారు. అది కూడా రూ.70కి పైగానే. ఇక కిలో రూ.25 ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.70–80 వరకు విక్రయిస్తున్నారు. బంగాళదుంపలు మినహా మిగిలిన కూరగాయలన్నీ కిలో రూ.70 పైమాటగానే ఉన్నాయి. రూ.10కు దొరికే కొత్తిమీర కట్ట సైతం రూ.50–60 ఉంది. ఐదు కట్టలు రూ.20కు దొరికే ఆకుకూర ఏదైనాసరే కట్ట రూ.10కు తక్కువకు దొరకడంలేదు. పైగా.. కొందామంటే మార్కెట్లో దొరకని పరిస్థితి ఉంది. మొత్తం మీద రూ.150–200 పెడితే బ్యాగ్ నిండే కూరగాయల కోసం ఇప్పుడు రూ.500–600 పెట్టాల్సి వస్తోంది. మరుగుతున్న నూనె ధరలు.. కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. ఫలితంగా దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనెల ధరలూ విపరీతంగా పెరిగాయి. ప్రియా, ఫ్రీడం, రుచి ఇలా ప్రధాన బ్రాండ్ నూనెల ధరలన్నీ కిలోకి రూ.25–30 వరకు పెరిగిపోయాయి. దిగుమతి సుంకంతో సంబంధంలేని కొబ్బరి నూనె కిలోకి రూ.18, వేరుశనగ నూనెపై రూ.10, పూజాదికాలకు ఉపయోగించే నూనెలపై రూ.10 నుంచి రూ.30 చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్ అయితే ఇతర బ్రాండ్ ధరల కంటే రూ.10 అదనంగా ఉన్నాయి. ధరలు పెంచిన తర్వాత మొక్కబడి తంతుగా నాలుగైదు రోజులు విజిలెన్స్ అధికారులు హడావుడి చేశారు. ఆ తర్వాత పత్తా లేకుండాపోయారు. ఆ మూడింటి తర్వాత ఏపీలోనే పప్పుల ధరలు ఎక్కువ.. ఇక మేలో కిలో రూ.166.12 ఉన్న కందిపప్పు ప్రస్తుతం రూ.180–220 మధ్య ఉంది. పెసర పప్పు రూ.120.85 నుంచి రూ.139కి పెరిగింది. గోవా, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర తర్వాత పప్పుల ధరలు ఏపీలోనే ఎక్కువ. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటినా కందిపప్పు కాదు కదా కనీసం అర కిలో పంచదార కూడా సక్రమంగా ఇవ్వలేకపోతోంది. బహిరంగ మార్కెట్లో కిలోకి రూ.10–20 తగ్గించామని గొప్పలు చెబుతున్నప్పటికీ అవన్నీ నాసిరకం పప్పులే. గోధుమ పిండి సైతం కిలో రూ.45 నుంచి రూ.76కు పైగా పెరిగింది. బాబోయ్ బియ్యం.. మరోవైపు.. రోజువారీ మెనూలో ముఖ్యభూమిక పోషించే బియ్యం ధరలూ ప్రజలను వణికిస్తున్నాయి. పంజాబ్‌లో కిలో బియ్యం ధర రూ.39.58 మాత్రమే. కానీ, అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రాలో మాత్రం వీటి ధరలకు అసాధారణంగా రెక్కలొస్తున్నాయి. సాధారణ రకం బియ్యమే ప్రస్తుతం కిలో రూ.57 ఉండగా, సూపర్ ఫైన్ బియ్యం (సోనా మసూరి, హెచ్ఎంటీ, బీపీటీ రకాలు) కిలో రూ.65 నుంచి రూ.76కి పైనే పలుకుతున్నాయి. లూజ్ బాస్మతి బియ్యం కిలో రూ.119కి పైగా ఉంది. వాస్తవానికి బియ్యం రేట్లు సహజంగా పెరగట్లేదు. దేశవ్యాప్తంగా బియ్యం నిల్వలకూ లోటులేదు. కానీ, వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్‌గా మారి బ్లాక్ చేస్తుండడంతో రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎత్తేసింది. అలాగే, పారాబాయిల్డ్, బ్రౌన్ రైస్ ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గింది. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి.ధరల స్థిరీకరణ నిధి ఏది.. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితుల్లో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి మార్కెట్ ధరకు కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు విక్రయించేవారు. ఐదేళ్లలో రూ.18 కోట్ల విలువైన 8,460 టన్నుల టమోటాలను రైతుల నుంచి మార్కెట్ ధరకే కొనుగోలు చేసి సబ్సిడీపై కిలో రూ.50కే విక్రయించే వారు. అలాగే, రూ.69 కోట్ల విలువైన 94,335 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. ఇలా ఐదేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ.7,758 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నులను 6.17 లక్షల మంది రైతుల నుంచి సేకరించారు. అలాగే, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని ప్యాకెట్ల రూపంలో కిలో రూ.11కే పంపిణీ చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అధికారులను అడిగితే బడ్జెట్లేదని తేల్చి చెప్పేస్తున్నారు. గడిచిన నెలరోజులుగా స్థానిక హోల్‌సేల్ మార్కెట్లో టమోటాలు సేకరించి రవాణా ఖర్చులు కలుపుకుని రైతుబజార్లలో విక్రయిస్తున్నారు.ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. కూరగాయలు కొందామంటే భయమేస్తోంది. టమోటా రూ.100 దాటిపోయింది. రైతుబజార్లలో కూడా కిలో రూ.75కు తక్కువగా ఇవ్వడంలేదు. పైగా ఎక్కడా సరుకు ఉండడంలేదు. బహిరంగ మార్కెట్లో ఉల్లి నుంచి కొత్తిమీర వరకు అన్ని ధరలు చుక్కలనంటుతున్నాయి. బియ్యం, నూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరల నియంత్రణను ప్రభుత్వం గాలికొదిలేసినట్లుంది. – జే.సోమేశ్వరరావు, ప్రైవేటు ఉద్యోగి, విశాఖపట్నం ధరలను నియంత్రించాలి.. బహిరంగ మార్కెట్లో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. కిలో రూ.20–30లకు వచ్చే బెండ, వంకాయలకు సైతం నేడు రూ.కిలో రూ.80కు పైగా పెట్టాల్సి వస్తోంది. టమోటాలైతే కిలో రూ.100 దాటింది. రైతుబజార్లలో నాణ్యతలేనివి కిలో రూ.70కు పైగానే పలుకుతున్నాయి. – వన్నెంరెడ్డి సురేష్, విజయవాడ సబ్సిడీ ధరకే విక్రయించాలి.. గతంలో ఇలా టమోటాలు పెరిగినప్పుడు కిలో రూ.50లకే రైతుబజార్ల ద్వారా విక్రయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలేదు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి అన్ని రైతుబజార్లలో కిలో రూ.50కే టమోటాలు సరఫరా చేయాలి. కూరగాయలతో పాటు నిత్యావసర ధరలనూ నియంత్రించాలి. – సీహెచ్ శివపార్వతి, కొల్లూరు, బాపట్ల ఇలా అయితే బతికేదెలా.. మార్కెట్లో కూరగాయలే కాదు.. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా విపరీతంగా పెరిగాయి. కిలో రూ.25–40 మధ్య దొరికే కూరగాయలు ప్రస్తుతం రూ.80కుపైగా పలుకుతున్నాయి. నూనెలు, బియ్యం ధరలూ అంతే. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకడం కష్టంగా ఉంది. – శ్రీలక్ష్మి, వెంగళాయపాలెం, గుంటూరు నూనె ధరలు పెరిగిపోయాయి.. ఆయిల్, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్స్ లీటర్‌కు రూ.25కు పైగా పెరిగాయి. పప్పుల ధరలు కూడా నాణ్యతను బట్టి కిలోకు రూ.30 వరకు పెరిగిపోయాయి. కూరగాయ ఏదైనాసరే రూ.80కి తక్కువలేదు. చికెన్ కూడా కిలో రూ.240 దాటిపోయింది. ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. – పి. దేవీకృష్ణవేణి, కాకినాడ -
Fact Check: రైతుబజార్లపై ‘కుళ్లు’ కథ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూరగాయ రైతులు, వినియోగదారులకు నష్టం కలిగించేలా ఈనాడు రామోజీరావు మరో అభూతకల్పనల కథను అచ్చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పన, వినియోగదారులకు నాణ్యమైన తాజా కూరగాయలు, ఇతర నిత్యావసరాలను మార్కెట్ ధరలకంటే తక్కువకు అందించేందుకు ఏర్పాటు చేసిన రైతు బజార్ల లక్ష్యాన్ని దెబ్బతీసేలా ‘రైతు బజార్లలోనూ బాదుడే బాదుడు..’ అంటూ ఓ చెత్త కథనాన్ని అల్లారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా రైతుబజార్లను బలోపేతం చేసింది. వాటిని ఆధునీకరించింది. కొత్త రైతు బజార్లనూ నిర్మించింది. పైగా చంద్రబాబు హయాంలోలాగా దళారీలు లేకుండా, కేవలం రైతులే కూరగాయలు అమ్మేలా, వినియోగదారులకు తక్కువ ధరకు లభించేలా చర్యలు తీసుకుంది. పైగా, రైతుబజార్లు ఆర్థిక అవసరాల కోసం మార్కెట్ కమిటీల మీద ఆధారపడకుండా, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతు బజార్ల వ్యవస్థలో ఇలాంటి మార్పులను రామోజీ ఎప్పుడూ చూసి ఉండరు. చంద్రబాబు హయాంలో ఈ వ్యవస్థ ఎంత దైన్యస్థితికి చేరిందో అందరికీ తెలిసిందే. ఒక్క రైతుబజారూ బాగుపడలేదు. బాబు హయాంలో రైతుబజార్లు దళారీల అడ్డాగా మారిపోయాయి. దళారులు వినియోగదారులను నిత్యం దోపిడీ చేసేవారు. కనీస వసతులు లేక రైతులు, వినియోగదారుల అవస్థలు వర్ణనాతీతం. నేడు ఈ అవలక్షణాలన్నింటి నుంచి బయటపడి, వినియోగదారులకు మంచి సేవలందిస్తున్నాయన్నదే రామోజీ బాధ. ఈరోజు ఆధునికంగా రూపుదిద్దుకున్న రైతు బజార్లపై చెత్త రాతలు రాసి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ రైతుబజార్లకు రైతులు రాకూడదని, దళారీలు, వ్యాపారులే వీటిలో వ్యాపారం చేసుకోవాలని, వినియోగదారులను దోపిడీ చేయాలన్నదే రామోజీ లక్ష్యం. అందుకే ఈ అడ్డగోలు కథనం. ఈ కథనంలో వాస్తవాలేమిటో చూద్దాం.. బాబు హయాంలో రైతుబజార్ల దీనావస్థ చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 87 రైతుబజార్లుండేవి. పెరుగుతున్న జనాభాకనుగుణంగా కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్త వాటి ప్రతిపాదనలను చంద్రబాబు ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. బాబు ఐదేళ్లలో మొక్కుబడిగా మార్కెట్‌యార్డు స్థలాల్లో 11 రైతుబజార్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. టీడీపీ హయాంలో ఉన్న రైతుబజార్లలో మూడొంతులు శిథిలావస్థకు చేరుకోవడంతో వినియోగదారులు, రైతులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిత్యం అవస్థలు పడేవారు. అయినా ఆ ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. రైతుబజార్లను ఆధునీకరించాలన్న ఆలోచనే చేయలేదు కొత్తగా 54 రైతుబజార్లు కన్పించడం లేదా? వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుబజార్ల విస్తరణ, ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2019 నుంచి 2023 వరకు రూ.40 కోట్లతో 54 రైతుబజార్లు కొత్తగా ఏర్పాటు చేసింది. వీటిలో ఇప్పటికే 22 రైతుబజార్ల నిర్మాణాలు పూర్తికాగా, 17 వినియోగంలోకి వచ్చాయి. మరో 5 ఫిబ్రవరికల్లా అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 32 రైతుబజార్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్ దశలో 11 ఉండగా, బేస్మెంట్ లెవల్లో 8, రూఫ్ లెవల్లో 8, రూఫ్‌లెవల్ విత్ సీలింగ్ దశలో మరో ఐదు ఉన్నాయి. వీటిని కూడా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగానే అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఏటా పెరుగుతున్న రైతులు, వినియోగదారులు ఈ ప్రభుత్వం వచ్చాక నిర్మించిన రైతుబజార్లతో కలిపి రాష్ట్రంలో 115 రైతుబజార్లున్నాయి. వీటి ద్వారా 10 వేల మంది రైతులు ప్రత్యక్షంగా, మరో 15 వేల మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. రోజూ 150 నుంచి 200 టన్నుల కూరగాయలను గిట్టుబాటు ధరకు విక్రయిస్తున్నారు. సగటున రోజుకు 6 లక్షల మంది వినియోగదారులు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక్కో రైతు బజార్లో రోజూ రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. బహిరంగ మార్కెట్లతో పోల్చుకుంటే 10 నుంచి 15 శాతం తక్కువ ధరలకే తాజా కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండడంతో రైతుబజార్లకు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి రైతుబజారులో అత్యాధునిక సౌకర్యాలు ప్రస్తుతం ఉన్న రైతుబజార్ల ఆధునికీకరణకు గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా రూ. 4.50 కోట్లతో ప్రతి రైతుబజారులో శిథిలమైన షెడ్ల పునరుద్ధరణ, రక్షిత తాగునీరు అందించే ఆర్వో ప్లాంట్లు, రన్నింగ్ వాటర్ సదుపాయంతో మరుగుదొడ్లు, సోలార్ రూఫ్ ప్యానల్స్, డిజిటల్ డిస్ప్లే బోర్డులు వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో శిథిలమైన రైతుబజార్లన్నీ ఆధునీకరిస్తున్నారు. ధరలు పెరిగినా, తగ్గినా మార్కెట్లో జోక్యం సీఎం యాప్ ద్వారా రోజూ బహిరంగ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను సమీక్షిస్తూ ధరలు పతనమైనా, పెరిగినా మార్కెట్లో జోక్యం చేసుకుంటూ రైతులు, వినియోగదారులకు మేలు జరిగేలా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధరలు పెరిగిన ప్రతిసారీ రైతులు, వ్యాపారుల నుంచి మార్కెటింగ్ శాఖ ద్వారా వస్తువులు కొని, వినియోగదారులకు తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. రైతులకు ఏమాత్రం నష్టం రాకుండా గిట్టుబాటు ధరకే కొంటోంది. టమాటా, ఉల్లిపాయలతోపాటు బత్తాయి, పైనాపిల్ వంటి ఉద్యాన ఉత్పత్తులను సైతం మద్దతు ధరకు కొని, రైతుబజార్లలో సబ్సిడీ రేట్లకే విక్రయించింది. ఇలా రూ.64.04 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లి, 1.28 కోట్ల విలువైన 1,425 టన్నుల టమాటా, రూ.5 కోట్ల విలువైన 4,109 టన్నుల బత్తాయి, రూ.కోటికి పైగా విలువైన పైనాపిల్‌ను రైతుబజార్లలో సబ్సిడీ ధరకే అందించింది. 75 రైతుబజార్లు స్వయం సమృద్ధి ఇప్పటివరకు రైతుబజార్లు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం పూర్తిగా మార్కెటింగ్ కమిటీలపై ఆధారపడేవి. కేంద్రం మార్కెట్ సెస్‌ను రద్దు చేయడంతో, రైతుబజార్ల నిర్వహణ, జీతభత్యాలకు ఇబ్బంది లేకుండా ప్రతి రైతుబజారు స్వయం సమృద్ధి సాధించాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రైతుబజార్ల స్టాల్స్ అద్దెలను సవరించడం, పార్కింగ్, సేంద్రీయ ఉత్పత్తులు, ఫిష్ ఆంధ్ర స్టాల్స్ ఏర్పాటు, ప్రకటన బోర్డుల ద్వారా ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకొంది. దీంతో 75 రైతుబజార్లు ఆర్ధిక పరిపుష్టి సాధించాయి. ఇప్పుడివి ఆర్థిక అవసరాల కోసం మార్కెట్ కమిటీలపై ఆధార పడాల్సిన అవసరం లేదు. కోవిడ్ సమయంలో కూడా కోవిడ్ సమయంలో రైతులు నష్టపోకూడదని, వినియోగదారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఒక రైతుబజార్‌ను 3, 4 భాగాలుగా విభజించి, ప్రజలకు మరింత చేరువలో ఏర్పాటు చేసింది. మొబైల్ రైతుబజార్లను సైతం నెలకొల్పింది. వీటి వల్ల కూరగాయలు అందుబాటులో ఉండటంతోపాటు రైతులు, వినియోగదారులను వైరస్ వ్యాప్తి నుంచి కాపాడింది. విజయవాడ అజిత్‌సింగ్ నగర్ రైతుబజారులో కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే యంత్రం ఇంకా వినియోగంలోకే రాలేదు. అయినా ఈనాడు పనిగట్టుకొని అది మూలన పడిందని రాసింది. దాదాపు అన్ని రైతుబజార్లలో మరుగుదొడ్లు నిక్షేపంగా పనిచేస్తున్నాయి. నిర్మాణం పూర్తయిన బాపట్ల, ఆరిలోవ రైతుబజార్లను ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. అయినా కళ్లుండీ కబోదిలా ఈనాడు అడ్డగోలుగా కథనం అచ్చేసింది. -
AP: రైతు బజార్ల సిబ్బందికి గుడ్‌న్యూస్.. భారీగా జీతాల పెంపు
సాక్షి, అమరావతి: రైతుబజార్ల సిబ్బంది వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న జీతాలను 23 శాతం పెంచింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100 రైతుబజార్లు ఉన్నాయి. ప్రతి రైతు బజారుకు ఓ ఎస్టేట్ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఆదాయాన్ని బట్టి కొన్నింటిలో సూపర్వైజర్లు కూడా ఉన్నారు. ఎస్టేట్ ఆఫీసర్లు లేని చోట సూపర్వైజర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రస్తుతం 75 మంది ఎస్టేట్ ఆఫీసర్లు, 28 మంది సూపర్వైజర్లు, 212 మంది సెక్యూరిటీ గార్డులు, మరో ఐదుగురు హార్టికల్చర్ అసిస్టెంట్లు (సూపర్వైజర్లు) ఉన్నారు. వీరిలో 188 మంది కాంట్రాక్టు, 132 మంది అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరి జీతాల కోసం ప్రతి నెలా రూ.57 లక్షలు, రైతు బజార్ల నిర్వహణకు మరో రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. 2021వరకు స్థానిక మార్కెట్ కమిటీలే ఈ ఖర్చులు భరించేవి. ప్రభుత్వ చర్యల ఫలితంగా 76 రైతుబజార్లు స్వయం సమృద్ధి సాధించాయి. ఏటా రూ.11.87 కోట్ల వార్షికాదాయాన్ని ఆర్జిస్తున్నాయి. మిగిలిన రైతుబజార్లు కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. కాగా, రైతుబజార్లలో రైతులు, వినియోగదారుల మధ్య వారధిలా పనిచేస్తున్న సిబ్బంది జీతాలను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జీతభత్యాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లోని రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.21 వేల నుంచి రూ.26 వేలకు, సూపర్వైజర్లకు రూ.15 వేల నుంచి రూ.18,500కు వేతనాలు పెరగనున్నాయి. మిగిలిన కార్పొరేషన్లు, పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోని రైతుబజార్లలో ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.19,500 నుంచి రూ.24 వేలకు, సూపర్వైజర్లకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెరగనున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా సెక్యూరిటీ గార్డుల వేతనం రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపును డిసెంబర్ నెల నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. చదవండి: సీఎం జగన్ కీలక ప్రకటన -
తక్కువ రేటుకే టమాటా...టమోటో ధరలకు ఏపీ ప్రభుత్వం కళ్లెం
-
సేంద్రియ పంటల విక్రయాలకు కంటైనర్ స్టోర్స్
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): రాష్ట్రంలోని రైతు బజార్ల ప్రాంగణాల్లో సేంద్రియ పంటల విక్రయాలకు కంటైనర్ స్టోర్స్ అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర రైతు బజార్ల సీఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికి సంబంధించి డీపీఆర్‌ను రూపొందించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం విశాఖలో ఎంవీపీ కాలనీ రైతు బజార్‌ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో వాటి విక్రయాలకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు చెప్పారు. కార్పొరేట్ లుక్‌తో రైతు బజార్ ప్రాంగణాల్లో విక్రయాలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నామని, ఇందులో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు వెల్లడించారు. విశాఖ జిల్లాలో 3 నుంచి 5, విజయనగరం జిల్లాలో 2 నుంచి 3 కంటైనర్ స్టోర్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే స్పందన ఆధారంగా రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు కంటైనర్ స్టోర్స్‌ను విస్తరిస్తామని చెప్పారు. -
వంట నూనెలకు రైతు బజార్లలో అదనపు కౌంటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట నూనెల ధరలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకు అమ్మాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)డాక్టర్ సమీర్ శర్మ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వంట నూనెలపై సీఎస్ అధ్యక్షతన ప్రైస్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సన్ ఫ్లవర్, వేరుశనగ, పామాయిల్ నూనెలు ఎమ్మార్పీకే ప్రజలకు అందాలని చెప్పారు. ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద వివిధ రైతు బజార్లలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, చౌక ధరల దుకాణాల్లో కూడా నూనెలు విక్రయించాలని ఆదేశించారు. స్వయం సహాయక బృందాలు, మొబైల్ వాహనాల ద్వారా కూడా నూనెలు అమ్మాలని చెప్పారు. హోల్ సేల్ డీలర్లు, మిల్లర్లు, రిఫైనరీదారులు, సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్, స్టాకిస్టులు కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్‌కు లోబడి స్టాకు పరిమితిని పాటిస్తున్నారో లేదో తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా అక్రమ స్టాకు గుర్తిస్తే దానిని స్వాధీనం చేసుకుని బహిరంగ మార్కెట్లోకి వెంటనే విడుదల చేసి తక్కువ ధరకు అమ్మాలని చెప్పారు. రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ ప్రతి రోజు సమావేశమై వంట నూనెల ధరలను సమీక్షించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, డీఎస్‌వోల నేతృత్వంలో నిఘా పెట్టి అక్రమంగా నిల్వ చేసే వారిపై 6ఎ కేసులు నమోదు చేసి స్టాకును స్వాధీనం చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్, ఈవో కార్యదర్శి గిరిజా శంకర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వంట నూనెల ధరల నియంత్రణకు కమిటీ రాష్ట్రంలో వంట నూనెల ధరలను అదుపు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సివిల్ సప్లైస్ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్, వ్యవసాయ–మార్కెటింగ్ శాఖ కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్, రాష్ట్ర సివిల్ సప్లైస్ ఎండీ, ఏపీ ఆయిల్‌ఫెడ్ ఎండీ, రైతు బజార్ల సీఈవో, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీ ఏప్రిల్ 15 వరకు ప్రతిరోజు వంట నూనెల ధరలను సమీక్షించి, సంబంధిత విభాగాల అధికారులకు సూచనలిస్తుందని పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో స్థానిక మార్కెట్లలో ధరలను పెంచాల్సిన అవసరం లేదు. అయినా కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక రేట్లకు విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. వ్యాపారులు, డీలర్ల వద్దనున్న పాత నిల్వలను పాత ధరలకే అమ్మాలని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. -
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 60 రైతుబజార్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైతుబజార్లు వస్తున్నాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా వీటి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆరు రైతుబజార్లను వినియోగంలోకి తీసుకురాగా మిగిలిన వాటిని డిసెంబర్ కల్లా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో 107 రైతుబజార్లున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ 11వేల మంది రైతులు జీవనోపాధి పొందుతున్నారు. ప్రతీరోజు 150 నుంచి 200 మెట్రిక్ టన్నుల కూరగాయలను రైతులు గిట్టుబాటు ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో రైతుబజార్లో ప్రతిరోజు రూ.20 లక్షల నుంచి రూ.40లక్షల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. బహిరంగ మార్కెట్లతో పోల్చుకుంటే తక్కువ ధరలకు నాణ్యమైన కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండడంతో రైతుబజార్లకు ప్రజలు బాగా అలవాటుపడ్డారు. ఏళ్ల తరబడి ప్రతిపాదనలు పెండింగ్ పెరుగుతున్న జనాభాకనుగుణంగా కొత్త రైతుబజార్ల ఏర్పాటు ప్రతిపాదన ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. స్థలాలు అందుబాటులో లేకపోవడం.. ఆర్థిక పరిస్థితుల సాకుతో గత ప్రభుత్వం కొత్త రైతుబజార్ల ఏర్పాటుపై దృష్టి పెట్టలేదు. ఈ నేపథ్యంలో.. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్ సర్కారు.. ఎక్కువ మందికి అందుబాటు ధరల్లో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో కొత్త రైతుబజార్లకు సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.52.02 కోట్లతో 60 రైతుబజార్లను ఏర్పాటుచేస్తోంది. వీటిలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో రాయవరం, ఆలమూరు, వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆత్మకూరు, ఆళ్లగడ్డలలో రైతుబజార్లను దివంగత మహానేత వైఎస్సార్ జయంతి రోజైన రైతు దినోత్సవం నాడు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. మిగిలిన 54 రైతుబజార్లకు కూడా శంకుస్థాపన చేశారు. ఇప్పటికే వీటి కోసం అవసరమైన స్థలాలను గుర్తించారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 16, కృష్ణాలో 10, చిత్తూరులో 8, వైఎస్సార్ జిల్లాలో 5, ప్రకాశం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో మూడేసి, అనంతపురంలో 2, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటుచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఈ రైతుబజార్ల ద్వారా కనీసం 6వేల మంది రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
రైతుబజార్లలో కొత్త దుకాణాలు
సాక్షి, అమరావతి: రైతు బజార్లకు ఎక్కువ మంది వినియోగదారులు వచ్చేలా వాటిలోనే ప్రతి చోటా బేకరీలు, ఏటీఎం, జనరిక్ మెడిసిన్, బియ్యం దుకాణాలు వంటివి ఏర్పాటు చేసేందుకు అదనపు షాపులు నిర్మించాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. మార్కెటింగ్ శాఖాధిపతులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. రైతు బజార్లలో దీర్ఘకాలంగా అద్దెలను పెంచని షాపులకు రైతులపై భారం పడకుండా హేతుబద్ధంగా అద్దెలు పెంచుకోవడంతో పాటు.. రైతు బజార్లలో బినామీ వ్యాపారుల తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు. -
రేపటి నుంచి రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని రైతుబజార్లలో శుక్రవారం నుంచి సబ్సిడీ ధరపై ఉల్లిపాయలు విక్రయించనున్నారు. అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. బుధవారం అనేక పట్టణాల్లోని రిటైల్ మార్కెట్లలో కిలో రూ.90 నుంచి రూ.100 వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లిపాయలు కొనుగోలు చేసి రైతుబజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కర్నూలు, తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లిపాయలు కొనుగోలు చేయనుంది. ఆ మార్కెట్లలో ఎంతకు కొనుగోలు చేసినా రైతుబజార్లలో కిలో రూ.40కి అమ్మాలని నిర్ణయించింది. రెండోదశలో రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయలు అమ్మడానికి చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న చెప్పారు. -
త్వరలో రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు
సాక్షి, అమరావతి: రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఉల్లిపాయల ధర కిలో రూ.70 వరకు పలుకుతోంది. భారీ వర్షాలు, వరదల వల్ల ఈ ధర ఇంకా పెరిగే అవకాశాలుండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. గతేడాది లాగానే 40 వేల హెక్టార్లలో ఉల్లి పంటను రైతులు సాగు చేసినప్పటికీ, భారీ వర్షాల వల్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి మహారాష్ట్ర, కర్నాటకలోనూ ఉండటంతో ఉల్లి కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని దిగుబడి సరిపోక.. వ్యాపారులు పలు రాష్ట్రాల నుంచి నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఉల్లి నిల్వలు లేకపోవడంతో రానున్న రోజుల్లో కిలో రూ.100 వరకు చేరుకునే అవకాశముందని మార్కెటింగ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లోని ధరలు, వస్తున్న ఉల్లి నిల్వలు తదితర అంశాలను వారు పరిశీలిస్తున్నారు. నాఫెడ్ నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా ధరల స్ధిరీకరణ నిధి నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌తో చర్చించిన తర్వాత విక్రయపు ధరపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
విశాఖలో ఇళ్ల వద్దకే కూరగాయల పంపిణీ
-
ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండాలి
సరుకులు, నిత్యావసర వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ రంగాలకు చెందిన వాహనాలను నిలిపేస్తున్నారంటూ సమాచారం వస్తోంది. దీనిపై వెంటనే డీజీపీ దృష్టి పెట్టి, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి పర్యవేక్షణలో ఉన్న ప్రతి 10 మందికీ ఒక డాక్టర్‌ను కేటాయించాలి. వీరిని పల్మనాలజిస్ట్ పర్యవేక్షించాలి. వీరి పని సాఫీగా సాగేందుకు, అనువైన సలహాలు, సూచనలు, వైద్య ప్రక్రియలపై అవగాహనకు డాక్టర్లు, స్పెషలిస్టుల మధ్య వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలి. ప్రతి 50 ఇళ్లకు చెందిన ప్రజల పరిస్థితులను ఎప్పటికప్పుడు వలంటీర్లు నమోదు చేసే విధానాన్ని నిరంతరం కొనసాగించాలి. వలంటీర్లు, ఆశా వర్కర్లు, వైద్యులకు వైరస్ సోకకుండా ప్రొటెక్షన్ సూట్లు, పరికరాలు అందించాలి. కరోనా కేసుల టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడంపైన కూడా దృష్టి పెట్టాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో ప్రజలకు సరిపడా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు తొలుత అందుబాటులోకి తేవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అవి ప్రజల సంఖ్యకు తగినట్లుగా ఉన్నాయా లేదా అనే దానిపై శాస్త్రీయంగా పరిశీలించి మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఆ తర్వాత సంతృప్తి చెందితేనే లాక్డౌన్ సడలింపు సమయం తగ్గించడంపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిపై శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరు, దాని నివారణ కోసం అందుబాటులో ఉన్న వైద్య విధానాలు, డేటా విశ్లేషణ ద్వారా చేపట్టాల్సిన ప్రణాళికపై సమావేశంలో సీఎం విస్తృతంగా చర్చించారు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, అమలవుతుండటం గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ముఖ్యమంత్రికి వివరించారు. లాక్ డౌన్ నేపథ్యంలో రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న సమయాన్ని తగ్గించాలనే అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. అనంతరం సీఎం పలు ఆదేశాలు, సూచనలు చేశారు. హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం వైద్యం – జిల్లాల్లో కోవిడ్–19 నివారణ చర్యల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే డాక్టర్లను గుర్తించి వారి సేవలను తీసుకోవాలి. – తమ సర్వే ద్వారా వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు గుర్తించిన వారిని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లి... నిర్దేశించుకున్న హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం వారికి వైద్యం అందించాలి. – విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కరోనా వైరస్ విస్తరించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ మరింత పటిష్టంగా నివారణా చర్యలు చేపట్టాలి. ఇదే సమయంలో ప్రజలకు నిత్యావసరాలు, తాగు నీరు, మందులు, పారిశుధ్యం తదితర ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలి. లాక్‌డౌన్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణ ప్రాంతాలపై మరింత దృష్టి – దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులకు సంబంధించి 10 కేసుల్లో 9 పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 1 కేసు లెక్కన నమోదవుతున్నాయని, అందుకే పట్టణ ప్రాంతాలపై మరింత దృష్టి సారిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. – కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వీలైనంత ఎక్కవ మంది వైద్యులు, సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావడంపై చర్చ. హౌస్ సర్జన్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం. – వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆక్వాకు సంబంధించి కరోనా కారణంగా ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడంపై సంబధిత అధికారులు దృష్టి సారించాలని సీఎం ఆదేశం. సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు చేసుకునే వారికి అవకాశం కల్పించాలని సూచన. – ఎవరికి కరోనా లక్షణాలు కనిపించినా ఐసోలేషన్‌లో పెట్టాలని గట్టి నిర్ణయం. – ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఆరోగ్య శాఖ మంత్రి) ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గూడ్స్, నిత్యావసర వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ రంగాలకు చెందిన వాహనాలను నిలిపేస్తున్నారంటూ సమాచారం వస్తోంది. దీనిపై వెంటనే డీజీపీ దృష్టి పెట్టి, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి పర్యవేక్షణలో ఉన్న ప్రతి 10 మందికీ ఒక డాక్టర్‌ను కేటాయించాలి. వీరిని పల్మనాలజిస్ట్ పర్యవేక్షించాలి. వీరి పని సాఫీగా సాగేందుకు, అనువైన సలహాలు, సూచనలు, వైద్య ప్రక్రియలపై అవగాహనకు డాక్టర్లు, స్పెషలిస్టుల మధ్య వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలి. ఏర్పాట్లు బాగుండాలి.. - కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎక్కడి వారు అక్కడే ఉండాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వారి బాగోగులు చూసుకుంటాయి. అయినా పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి చెందిన కొందరు కూలీలు, కార్మికులు తరలి వస్తే సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మాట్లాడాలి. - సరిహద్దుల వద్దకు వచ్చి ఆగిపోయిన వారు 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడితేనే రాష్ట్రంలోకి అనుమతివ్వాలి. అక్కడ ఉన్న మన ప్రజలకు వసతి, భోజనం అందేలా చూడాలి. - పొరుగు రాష్ట్రాల్లో ఏపీ ప్రజల బాగోగులను చూసేందుకు, ఆయా రాష్ట్రాల అధికారులు, ప్రధాన కార్యదర్శులతో సమన్వయం చేయడానికి, రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన వారి బాగోగులు (ఏర్పాట్లు, క్వారంటైన్ సదుపాయాలు) చూసుకోవడానికి ఇద్దరు ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, పీయూష్ కుమార్ల నియామకం. పర్యవేక్షణ, సమన్వయానికి ప్రతి క్యాంపునకూ ఒక రెసిడెంట్ అధికారిని నియమించాలి. ఏర్పాట్లు బాగోలేవు అనే మాట రాకూడదు. - సరిహద్దుల్లో ఉన్న కళ్యాణ మండపాలు, హోటళ్లు తదితర వాటిని గుర్తించి, శానిటైజ్ చేసి అందుబాటులోకి తీసుకురావాలి. -
దర్జాగా దోపిడీ
వికారాబాద్ అర్బన్: వికారాబాద్‌లోని రైతు బజారులో వ్యాపారులు వినియోగదారులను దర్జాగా మోసం చేస్తున్నారు. అక్కడి బోర్డుపై ఒక ధర రాసి, అమ్మే వద్ద మరో ధరతో విక్రయిస్తున్నారు. ఇదేమని అడిగితే అదంతే.. ఇష్టమైతే కొను లేకపోతే లేదు అని దబాయిస్తున్నారు అక్కడి వ్యాపారులు. ప్రతి రోజు ఇదే తరహాలో దందా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతుల స్థానంలో వ్యాపారులు చొరబడడంతోనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు ప్రతి రోజు అన్ని రకాల కూరగాయల ధరలను సూచిక బోర్డుపై రాస్తున్నట్లు చెబుతున్నారు. కానీ అక్కడికి అమ్మడానికి వచ్చిన రైతులు, వ్యాపారులు బోర్డుపై ఉన ధరలకే కూరగాయలు విక్రయించాలి. కాని అధికారులు చెబుతున్న ధరలను ఏ ఒక్క వ్యాపారి పాటించడం లేదు. ఎందుకంటే రైతు బజారులో రైతులు ఎవరూ లేరనే ధీమాతో ఇది యథేచ్ఛగా జరుగుతోంది. కొంతమంది ఇతరుల పేరుమీద ఉన్న లైసెన్స్‌ను తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. పైగా ఒకరి పేరుమీద కూరగాయలు అమ్ముకునే లైసెన్స్ ఉంటే ఇంట్లోని నలుగురు వ్యాపారం చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిజమైన రైతులు రోజు సాయంత్రం పొలం నుంచి కూరగాయలు రైతు బజారుకు తీసుకొస్తే కనీసం వారు కూర్చొని అమ్మడానికి అవకాశం ఇవ్వడం లేదు. దీంతో రైతు బజారులో కూరగాయలు అమ్ముకోవాల్సిన రైతులు రోడ్డు పక్కన, వ్యాపారులు దర్జాగా రైతు బజారులో వ్యాపారం చేసుకుంటున్నారు. రైతు బజారులో ఇంత జరుగుతున్న పర్యవేక్షణ ఏమాత్రం లేదు. సూచిక బోర్డు మీద రాసిన ధరలకే రైతులు, వ్యాపారులు కూరగాయలు అమ్ముతున్నారా అని చూసే దిక్కులేకుండా పోయిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గతంలో రైతు బజారును రెండుగా చేశారు. ఓ వైపు వ్యాపారులని, మరో వైపు రైతులు మాత్రమే ఉండాలని మార్కెట్ అధికారులు నిర్ణయించారు.కాని రెండు వైపులు వ్యాపారులే మాకాం వేశారు. ఇలా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.. పట్టణంలోని రైతు బజారులో మార్కెట్ అధికారులు కిలో టమాటా రూ.20గా రాశారు. కాని వ్యాపారులు రూ.30 కిలో అమ్ముతున్నారు. పచ్చిమిర్చి బోర్డుపై కిలో రూ.30 అని రాశారు. కాని రూ.40కి అమ్ముతున్నారు. ఇలా ప్రతీ కూరగాయాలను కిలోకు రూ.10 పెంచి అమ్ముతున్నారు. అధికారులు మాత్రం బోర్డుమీద ధరలు రాసి తమపని అయిపోయిందన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. -
నగరంలో 10 రైతుబజార్లు
ఉద్యానవన పంటలసాగు పెంచండి జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): ప్రజల సౌకర్యం కోసం నగరంలో 10 రైతుబజార్లను ఏర్పాటు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో ప్రాథమిక రంగంలో రెండంకెల అభివృద్ధి సాధించడంపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కార్పొరేషన్ అధికారులతో చర్చించి నగరంలో 10 రైతుబజార్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. రెండంకెల అభివృద్ధి సాధించాలంటే ప్రస్తుతం సాగు చేస్తున్న భూముల్లో అధిక దిగుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో పశువుల సంఖ్య, దాణ అవసరం, మరణిస్తున్న పశువులు తదితర విషయాలతో నివేదికలు సిద్ధం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. కోళ్ల పరిశ్రమలకు సంబంధించి శాస్త్రీయంగా నివేదికలు సిద్ధం చేసి అందజేయాలన్నారు. భూగర్భజల శాఖ మ్యాపింగ్ చేసిన ప్రాంతాలల్లో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యానవన పంటల సాగు, కూరగాయల సాగు, సెరికల్చర్, చెరుకు పంటల సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. మత్స్య శాఖ జేడీ సీతారామరాజు మాట్లాడుతూ కాళంగినదికి తగినంత వాటర్ డిశ్చార్జ్ లేకపోవడం వల్ల పులికాట్ సరస్సుకు వేసవికాలంలో ఫీడింగ్ లేదన్నారు. తమిళనాడు వైపు పులికాట్ సరస్సు మౌత్ ఉండడం వల్ల సముద్రపు నీరు అటువైపు వస్తుందన్నారు. సముద్ర ముఖద్వారం ఇటువైపు ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకార రైతులు అడుగుతున్నారని తెలిపారు. ఈ విషయంపై సమగ్ర నివేదికలు అందజేయాలని కలెక్టర్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఉల్లి పాట్లు
విశాఖపట్నం : రూ. 20 కే ఉల్లిపాయలు ఇస్తున్నారనే సమాచారంతో బుధవారం భారీగా మహిళలు రైతు బజారుకు చేరుకున్నారు. దాంతో మహిళల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని మహిళలకు నచ్చ చెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇంత కష్టపడి ఉల్లిపాయలు పొందాల్సి వస్తోందని పలువురు మహిళలు వాపోయారు.