నగరంలో 10 రైతుబజార్లు
-
ఉద్యానవన పంటలసాగు పెంచండి
-
జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట): ప్రజల సౌకర్యం కోసం నగరంలో 10 రైతుబజార్లను ఏర్పాటు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో ప్రాథమిక రంగంలో రెండంకెల అభివృద్ధి సాధించడంపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కార్పొరేషన్ అధికారులతో చర్చించి నగరంలో 10 రైతుబజార్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. రెండంకెల అభివృద్ధి సాధించాలంటే ప్రస్తుతం సాగు చేస్తున్న భూముల్లో అధిక దిగుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో పశువుల సంఖ్య, దాణ అవసరం, మరణిస్తున్న పశువులు తదితర విషయాలతో నివేదికలు సిద్ధం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. కోళ్ల పరిశ్రమలకు సంబంధించి శాస్త్రీయంగా నివేదికలు సిద్ధం చేసి అందజేయాలన్నారు. భూగర్భజల శాఖ మ్యాపింగ్ చేసిన ప్రాంతాలల్లో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యానవన పంటల సాగు, కూరగాయల సాగు, సెరికల్చర్, చెరుకు పంటల సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. మత్స్య శాఖ జేడీ సీతారామరాజు మాట్లాడుతూ కాళంగినదికి తగినంత వాటర్ డిశ్చార్జ్ లేకపోవడం వల్ల పులికాట్ సరస్సుకు వేసవికాలంలో ఫీడింగ్ లేదన్నారు. తమిళనాడు వైపు పులికాట్ సరస్సు మౌత్ ఉండడం వల్ల సముద్రపు నీరు అటువైపు వస్తుందన్నారు. సముద్ర ముఖద్వారం ఇటువైపు ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకార రైతులు అడుగుతున్నారని తెలిపారు. ఈ విషయంపై సమగ్ర నివేదికలు అందజేయాలని కలెక్టర్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.