రైతు బజారులో కూరగాయలు కొంటున్న వినియోగదారులు
వికారాబాద్ అర్బన్: వికారాబాద్‌లోని రైతు బజారులో వ్యాపారులు వినియోగదారులను దర్జాగా మోసం చేస్తున్నారు. అక్కడి బోర్డుపై ఒక ధర రాసి, అమ్మే వద్ద మరో ధరతో విక్రయిస్తున్నారు. ఇదేమని అడిగితే అదంతే.. ఇష్టమైతే కొను లేకపోతే లేదు అని దబాయిస్తున్నారు అక్కడి వ్యాపారులు. ప్రతి రోజు ఇదే తరహాలో దందా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతుల స్థానంలో వ్యాపారులు చొరబడడంతోనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు ప్రతి రోజు అన్ని రకాల కూరగాయల ధరలను సూచిక బోర్డుపై రాస్తున్నట్లు చెబుతున్నారు. కానీ అక్కడికి అమ్మడానికి వచ్చిన రైతులు, వ్యాపారులు బోర్డుపై ఉన ధరలకే కూరగాయలు విక్రయించాలి. కాని అధికారులు చెబుతున్న ధరలను ఏ ఒక్క వ్యాపారి పాటించడం లేదు. ఎందుకంటే రైతు బజారులో రైతులు ఎవరూ లేరనే ధీమాతో ఇది యథేచ్ఛగా జరుగుతోంది. కొంతమంది ఇతరుల పేరుమీద ఉన్న లైసెన్స్‌ను తీసుకుని వ్యాపారం చేస్తున్నారు.
పైగా ఒకరి పేరుమీద కూరగాయలు అమ్ముకునే లైసెన్స్ ఉంటే ఇంట్లోని నలుగురు వ్యాపారం చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిజమైన రైతులు రోజు సాయంత్రం పొలం నుంచి కూరగాయలు రైతు బజారుకు తీసుకొస్తే కనీసం వారు కూర్చొని అమ్మడానికి అవకాశం ఇవ్వడం లేదు. దీంతో రైతు బజారులో కూరగాయలు అమ్ముకోవాల్సిన రైతులు రోడ్డు పక్కన, వ్యాపారులు దర్జాగా రైతు బజారులో వ్యాపారం చేసుకుంటున్నారు.
రైతు బజారులో ఇంత జరుగుతున్న పర్యవేక్షణ ఏమాత్రం లేదు. సూచిక బోర్డు మీద రాసిన ధరలకే రైతులు, వ్యాపారులు కూరగాయలు అమ్ముతున్నారా అని చూసే దిక్కులేకుండా పోయిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గతంలో రైతు బజారును రెండుగా చేశారు. ఓ వైపు వ్యాపారులని, మరో వైపు రైతులు మాత్రమే ఉండాలని మార్కెట్ అధికారులు నిర్ణయించారు.కాని రెండు వైపులు వ్యాపారులే మాకాం వేశారు.
ఇలా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు..
పట్టణంలోని రైతు బజారులో మార్కెట్ అధికారులు కిలో టమాటా రూ.20గా రాశారు. కాని వ్యాపారులు రూ.30 కిలో అమ్ముతున్నారు. పచ్చిమిర్చి బోర్డుపై కిలో రూ.30 అని రాశారు. కాని రూ.40కి అమ్ముతున్నారు. ఇలా ప్రతీ కూరగాయాలను కిలోకు రూ.10 పెంచి అమ్ముతున్నారు. అధికారులు మాత్రం బోర్డుమీద ధరలు రాసి తమపని అయిపోయిందన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment