సాక్షి, అమరావతి: రైతుబజార్ల సిబ్బంది వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న జీతాలను 23 శాతం పెంచింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100 రైతుబజార్లు ఉన్నాయి. ప్రతి రైతు బజారుకు ఓ ఎస్టేట్ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఆదాయాన్ని బట్టి కొన్నింటిలో సూపర్‌వైజర్లు కూడా ఉన్నారు.
ఎస్టేట్ ఆఫీసర్లు లేని చోట సూపర్‌వైజర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రస్తుతం 75 మంది ఎస్టేట్ ఆఫీసర్లు, 28 మంది సూపర్‌వైజర్లు, 212 మంది సెక్యూరిటీ గార్డులు, మరో ఐదుగురు హార్టికల్చర్ అసిస్టెంట్లు (సూపర్‌వైజర్లు) ఉన్నారు. వీరిలో 188 మంది కాంట్రాక్టు, 132 మంది అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరి జీతాల కోసం ప్రతి నెలా రూ.57 లక్షలు, రైతు బజార్ల నిర్వహణకు మరో రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది.
2021వరకు స్థానిక మార్కెట్ కమిటీలే ఈ ఖర్చులు భరించేవి. ప్రభుత్వ చర్యల ఫలితంగా 76 రైతుబజార్లు స్వయం సమృద్ధి సాధించాయి. ఏటా రూ.11.87 కోట్ల వార్షికాదాయాన్ని ఆర్జిస్తున్నాయి. మిగిలిన రైతుబజార్లు కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. కాగా, రైతుబజార్లలో రైతులు, వినియోగదారుల మధ్య వారధిలా పనిచేస్తున్న సిబ్బంది జీతాలను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.
ఆ మేరకు జీతభత్యాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లోని రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.21 వేల నుంచి రూ.26 వేలకు, సూపర్‌వైజర్లకు రూ.15 వేల నుంచి రూ.18,500కు వేతనాలు పెరగనున్నాయి. మిగిలిన కార్పొరేషన్లు, పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోని రైతుబజార్లలో ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.19,500 నుంచి రూ.24 వేలకు, సూపర్‌వైజర్లకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెరగనున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా సెక్యూరిటీ గార్డుల వేతనం రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపును డిసెంబర్ నెల నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
చదవండి: సీఎం జగన్ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment