కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వెల్లువెత్తిన నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించిన డాక్టర్లు, వైద్యసిబ్బంది
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ వైద్యకళాశాలలో రెసిడెంట్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఆ అఘాయిత్యానికి నిరసనగా శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 వరకు 24 గంటల పాటు వైద్యసేవల బంద్‌కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునివ్వడంతో రాష్ట్రంలో అత్యవసర వైద్యసేవలు మినహా మిగిలిన సేవలు స్తంభించాయి. అన్ని జిల్లాల్లోను ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు.
ఐఎంఏ, పలు వైద్యసంఘాల ఆధ్వర్యంలో వైద్యులు, విద్యార్థిసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల వారు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలతో పాటు అనేకచోట్ల కొవ్వొత్తులతో ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. ఆర్‌జీ కర్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని ఈ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో వైద్యులపై దాడులు, అత్యాచారం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని కోరారు.
ఇందుకోసం ఓ ప్రత్యేక రక్షణ చట్టాన్ని రూపొందించాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలకు కూడా దూరంగా ఉండి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వ వైద్యులు సైతం అన్ని ఆస్పత్రుల్లో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఐఎంఏ చేపట్టిన ఈ బంద్ ఆదివారం ఉదయం 6 గంటలకు ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment