న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై రాజ్యసభలో ఎట్టకేలకు చర్చ మొదలయ్యింది. ధరాఘాతంతో జనం అష్టకష్టాలు పడుతున్నారని ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విన్నవించాయి. నిత్యావసరాల ధరల అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో బీజేపీ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. ధరల పెరుగుదల వల్ల ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని చెప్పారు.
ధరలను అదుపుచేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ద్రవ్యోల్బణం ఇప్పుడు 7 శాతంగా ఉందని, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో పెరిగినట్లుగా రెండంకెలకు చేరుకోలేదని అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పంపిణీ వ్యవస్థలు దెబ్బతిన్నాయని, చమురు మంట కొనసాగుతోందని, తద్వారా ధరలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. కేవలం మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇప్పటికిప్పుడు నియంత్రణలోకి తీసుకురావడం ఏ దేశం చేతుల్లోనూ లేదని తేల్చిచెప్పారు.
ప్రజలు విసుగెత్తిపోయారు
ధరల అంశంపై చర్చను సీపీఎం సభ్యుడు ఎళమారమ్ కరీం ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదని ఆక్షేపించారు. గత ఎనిమిదేళ్లుగా ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, జీఎస్టీ మోత, రూపాయి విలువ పతనం వంటివి పేదలను కుంగదీస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ వాపోయారు. సమస్యలను ఇప్పటికైనా గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోయారని కాంగ్రెస్ సభ్యుడు శక్తిసింహ్ గోహిల్ అన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా చెప్పారు. ఆహార ఉత్పత్తి వ్యయం గత ఏడాది కాలంలో 21 శాతం పెరిగిందని వివరించారు. రైతుల ఆదాయం పెరగడం లేదన్నారు. గిరిజనుల సమస్యలను జేఎంఎం ఎంపీ మహువా రాజ్యసభలో ప్రస్తావించారు. ధరల మంట కారణంగా మహిళల కష్టాలు రెట్టింపు అయ్యాయని కాంగ్రెస్ ఎంపీ అశోక్‌రావు ఉద్ఘాటించారు.
పన్నుల భారం పెరగలేదు: నిర్మల
ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించామని వివరించారు. జీఎస్టీ వల్ల కుటుంబాలపై పన్నుల భారం పెరగలేదన్నారు. బియ్యం, గోధుమ పిండి, పెరుగు వంటి వాటిపై అన్ని రాష్ట్రాల అంగీకారంతోనే జీఎస్టీ విధించినట్లు గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ధరలు అధికంగా ఉండేవని అన్నారు. అప్పట్లో కిలో ఉల్లిపాయల ధర రూ.100 మార్కును దాటిందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment