Rising prices
-
మోదీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది
న్యూఢిల్లీ: గత వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పెరుగుతున్న ధరలను అదుపు చేశామని దురహంకారపూరిత వాదనలు చేస్తూనే తీవ్రమైన ద్రవ్యోల్బణం ద్వారా ప్రజలు సంపాదించిందంతా దోచుకుంటోందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ తొమ్మిదేళ్లలో పేదరికం అంచున జీవిస్తున్న ప్రజల జీవితాలను మోదీ ప్రభుత్వం ఏమాత్రం మార్చలేకపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రతి వస్తువుపైనా జీఎస్టీ భారం పడుతోందని, సామాన్యుడి జీవితం కష్టతరంగా మారిందన్నారు. కేంద్ర మంత్రులు, ఆ పార్టీ నేతలు మాత్రం తాము ఘనకార్యాలు సాధించామంటూ ప్రచారం మొదలుపెడతారంటూ జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ‘మోదీ ప్రభుత్వం వాస్తవంగా సాధించినవి ఇవే..2014 నుంచి వాస్తవ ఆదాయాల్లో వృద్ధిరేటు– వ్యవసాయ కార్మికులకు: 0.8%, వ్యవసాయేతర కార్మికులకు: 0.2%, నిర్మాణ కార్మికులకు:–0.02%మాత్రమే. అయినప్పటికీ, 2014 నుంచి నిత్యావసర వస్తువుల ధరలు– ఎల్పీజీ:169%, పెట్రోల్:57%, డీజిల్:78%, ఆవనూనె:58%, గోధుమపిండి:56%, పాలు:51% పెరిగాయి’’అంటూ ఆయన ట్వీట్ చేశారు. అసంఘటిత రంగంలో వాస్తవ వేతనాల పెరుగుదల దాదాపు నిలిచిపోయిందంటూ వచ్చిన కథనాన్ని కూడా జైరాం రమేశ్ షేర్ చేశారు. అన్ని రంగాల ఆదాయాల్లో స్తబ్ధత నెలకొనగా గౌతమ్ ఆదానీ సంపద మాత్రం 2014 నుంచి 1,225% పెరిగిందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మే 26వ తేదీతో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. -
కళ తప్పిన బంగారం ఈటీఎఫ్‌లు.. కారణమిదే!
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022–23) పెద్దగా కలసి రాలేదు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.653 కోట్లకు పరిమితమయ్యాయి. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడం ఇందుకు కారణమని చెప్పుకోవాలి. పెట్టుబడులు తగ్గినప్పుటికీ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్టర్ల ఫోలియోలు (ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు నంబర్) మార్చి చివరికి 47 లక్షలకు పెరిగాయి. చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2022–23లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపించారు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీల దిద్దుబాటుకు లోను కాగా, డెట్ సాధనాలు ఆకర్షణీయంగా మారడం గమనించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ప్రకారం.. 2021–22లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.2,541 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ, 2022–23లో 75 శాతం తగ్గి రూ.653 కోట్లకు పరిమితయ్యాయి. 2019–20లో చూసినా కానీ రూ.1,614 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. అంతకుముందు సంవత్సరాల్లో గోల్డ్ ఈటీఎఫ్‌లు నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. గడిచిన నాలుగేళ్లలో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈక్విటీల్లోకి పెట్టుబడులు కుమ్మరించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మంచి రాబడులు వస్తుండడంతో ఈక్విటీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. బంగారం ప్రియం.. వార్షికంగా చూస్తే 2022–23లో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గడం అన్నది ఇన్వెస్టర్లు ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ పేర్కొన్నారు. ‘‘ఈక్విటీలకు ప్రాధాన్యం పెరిగినట్టు కనిపిస్తోంది. ఈక్విటీ విభాగాల్లోకి అదే పనిగా పెట్టుబడులు పెరగడం దీన్ని తెలియజేస్తోంది. రూపాయి బలహీన పడడం, యూఎస్ డాలర్ అప్ ట్రెండ్‌లో ఉండడం బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం చూపించాయి. మరింత ఖరీదుగా బంగారాన్ని మార్చేశాయి. ఇది మొత్తం మీద బంగారం ఈటీఎఫ్ పెట్టుబడులపై ప్రభావం చూపించింది’’అని కవిత కృష్ణన్ వివరించారు. మరోవైపు గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు సావరీన్ గోల్డ్ బాండ్లను నాలుగు విడతలుగా ఇష్యూ చేసింది. ఇది కూడా గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులపై ప్రభావం చూపించింది. మార్చి చివరి వారంలో బంగారం ధర 10 గ్రాములు రూ.59,400కు చేరడం తెలిసిందే. బంగారం ధరలు సానుకూలంగా ఉండడం, అదే సమయంలో ఇతర పెట్టుబడి సాధనాలు ప్రతికూల రాబడులు ఇవ్వడంతో, ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రాబడులు స్వీకరించినట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవచ్చన్న అంచనాల నేపథ్యంలో 2023లో బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ సౌకర్యస్థాయికి ఎగువన కొనసాగుతుండడం, వడ్డీ రేట్లపై సెంట్రల్ బ్యాంకుల వైఖరి, ఆర్థిక వృద్ధి అవకాశాలు బలహీనపడిన నేపథ్యంలో బంగారం ధరలు మరో 10–15 శాతం మేర ప్రస్తుత సంవత్సరంలో పెరిగే అవకాశాలున్నాయని గోపాల్ కావలిరెడ్డి అంచనా వ్యక్తం చేశారు. -
NAREDCO: రానున్న నెలల్లో ఇళ్ల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: రానున్న నెలల్లో ఇళ్ల ధరలు పెరుగుతాయని భవిష్యత్తు కొనుగోలు దారుల్లో సగం మంది భావిస్తున్నారు. రియల్టీ పోర్టల్ హౌసింగ్ డాట్ కామ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ మండలి అయిన నరెడ్కో కలసి సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించాయి. ఇందులో పాల్గొన్న వారిలో 47 శాతం మంది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. 21 శాతం మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని చెప్పగా, 16 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటామని, 15 శాతం మంది బంగారంలో పెట్టుబడి పెడతామని తెలిపారు. ‘రెసిడెన్షియల్ రియల్టీ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే హెచ్2 2022’ పేరుతో ఈ సంస్థలు సర్వే నివేదికను విడుదల చేశాయి. ఇందులో 1,000 మందికి పైగా పాల్గొన్నారు. 48 శాతం మంది భవిష్యత్తులో ధరల పెరుగుదలను అంచనా వేస్తున్నారు. 58% మంది రెడీ టు మూవ్ (ప్రవేశానికి సిద్ధంగా ఉన్న) ప్రాపర్టీల పట్ల ఆసక్తితో ఉన్నట్టు చెప్పారు. ‘‘కరోనా రెండో విడత తీవ్రత తర్వాత భారత నివా స గృహాల మార్కెట్లో డిమాండ్ వేగంగా కోలుకుంది. రుణ వ్యయాలు పెరుగుతుండడ, నిర్మాణ ముడి సరుకుల ధరలు పెరగడం, బలమైన డిమాండ్ ఇళ్ల ధరల పెరుగుదలకు దారితీశాయి’’అని హౌసింగ్ డాట్ కామ్ సీఈవో అగర్వాల్ తెలిపారు. బలంగా డిమాండ్.. పెరిగిన నిర్మాణ వ్యయాలను సర్దుబాటు చేసుకునేందుకు, లాభాల మార్జిన్లను పెంచుకునేందుకు ప్రాపర్టీల ధరలను పెంచినట్టు లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని ధృవ్ అగర్వాల్ అంచనా వేశారు. పండుగల సమయాల్లో డిమాండ్ పుంజుకోవడానికి తోడు, కన్జ్యూమర్ సెంటిమెంట్ బలంగా ఉన్నట్టు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉంటాయని ఇళ్ల కొనుగోలు దారులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని 73 శాతం మంది చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలు పరిశ్రమ రికవరీకి మద్దతుగా నిలిచినట్టు నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ తెలిపారు. సొంతింటిని కలిగి ఉండాలన్న కోరిక వినియోగదారుల్లో ఉన్నందున ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
Parliament Monsoon Session: ప్రజల ఇక్కట్లు చూడండి
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై రాజ్యసభలో ఎట్టకేలకు చర్చ మొదలయ్యింది. ధరాఘాతంతో జనం అష్టకష్టాలు పడుతున్నారని ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విన్నవించాయి. నిత్యావసరాల ధరల అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో బీజేపీ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. ధరల పెరుగుదల వల్ల ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని చెప్పారు. ధరలను అదుపుచేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ద్రవ్యోల్బణం ఇప్పుడు 7 శాతంగా ఉందని, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో పెరిగినట్లుగా రెండంకెలకు చేరుకోలేదని అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పంపిణీ వ్యవస్థలు దెబ్బతిన్నాయని, చమురు మంట కొనసాగుతోందని, తద్వారా ధరలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. కేవలం మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇప్పటికిప్పుడు నియంత్రణలోకి తీసుకురావడం ఏ దేశం చేతుల్లోనూ లేదని తేల్చిచెప్పారు. ప్రజలు విసుగెత్తిపోయారు ధరల అంశంపై చర్చను సీపీఎం సభ్యుడు ఎళమారమ్ కరీం ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదని ఆక్షేపించారు. గత ఎనిమిదేళ్లుగా ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, జీఎస్టీ మోత, రూపాయి విలువ పతనం వంటివి పేదలను కుంగదీస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ వాపోయారు. సమస్యలను ఇప్పటికైనా గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోయారని కాంగ్రెస్ సభ్యుడు శక్తిసింహ్ గోహిల్ అన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా చెప్పారు. ఆహార ఉత్పత్తి వ్యయం గత ఏడాది కాలంలో 21 శాతం పెరిగిందని వివరించారు. రైతుల ఆదాయం పెరగడం లేదన్నారు. గిరిజనుల సమస్యలను జేఎంఎం ఎంపీ మహువా రాజ్యసభలో ప్రస్తావించారు. ధరల మంట కారణంగా మహిళల కష్టాలు రెట్టింపు అయ్యాయని కాంగ్రెస్ ఎంపీ అశోక్‌రావు ఉద్ఘాటించారు. పన్నుల భారం పెరగలేదు: నిర్మల ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించామని వివరించారు. జీఎస్టీ వల్ల కుటుంబాలపై పన్నుల భారం పెరగలేదన్నారు. బియ్యం, గోధుమ పిండి, పెరుగు వంటి వాటిపై అన్ని రాష్ట్రాల అంగీకారంతోనే జీఎస్టీ విధించినట్లు గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ధరలు అధికంగా ఉండేవని అన్నారు. అప్పట్లో కిలో ఉల్లిపాయల ధర రూ.100 మార్కును దాటిందని వెల్లడించారు. -
కుమ్మక్కు ధోరణులతో పెను సవాళ్లు
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, సరఫరాపరమైన అంతరాయాలకు దారి తీసే గుత్తాధిపత్య విధానాలను అరికట్టడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కంపెనీలు కుమ్మక్కయ్యే ధోరణులను ఎదుర్కొనడం పెను సవాలుగా ఉండనుందని ఆమె తెలిపారు. దేశీయంగా డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఎగుమతులు కూడా చేసేంత స్థాయిలో భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని కొంత ఆందోళన వ్యక్తమవుతోందంటూ మంత్రి చెప్పారు. కరోనా మహమ్మారి, తూర్పు యూరప్‌లో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా కమోడిటీలు, ముడి వస్తువుల కొరత నెలకొందని, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 13వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. ‘వివిధ దశల్లో అవాంతరాలు వస్తున్నాయి. ఇవి నిజంగానే కోవిడ్ లేదా యుద్ధం వల్ల తలెత్తినవా అనే అంశాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. గుత్తాధిపత్యం లేదా రెండు సంస్థల ఆధిపత్యం వల్ల ధరలు పెరిగిపోవడం, సరఫరాపరమైన అంతరాయాలు కలగకుండా చూడాలి‘ అని మంత్రి సూచించారు. గత రెండేళ్లుగా సీసీఐ సవాళ్లను మరింత సానుకూలంగా అధిగమిస్తోందని ఆమె కితాబిచ్చారు. ‘సవాళ్లు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. కాబట్టి, ఇలాంటి వాటిని పరిష్కరించడంలో వెనుకబడి పోకుండా సీసీఐ తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ఉండాలి‘ అని పేర్కొన్నారు. -
ధరలపై మూడంచెల పోరు
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. ‘ధరాభారం లేని భారత్’పేరిట మూడంచెల పోరుకు దిగుతామని ప్రకటించింది. ‘‘తొలి దశలో కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్యులు మార్చి 31న తమ ఇళ్ల బయట ఆందోళనలు చేస్తారు. ఎల్పీజీ సిలిండర్లకు పూలదండలు వేసి చెవిటి బీజేపీ ప్రభుత్వానికి వినపడేలా డప్పులు, గంటలు మోగిస్తూ నిరసన తెలుపుతారు. తర్వాత మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 దాకా దేశవ్యాప్త ర్యాలీలు, ఆందోళనలుంటాయి. ఏప్రిల్ 2 నుంచి 4 దాకా స్వచ్ఛంద సంస్థలు, మత, సామాజిక సంస్థలు, సంక్షేమ సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ధర్నాలుంటాయి. ఏప్రిల్ 7న అన్ని రాష్ట్రాల పార్టీ ప్రధాన కార్యాలయాల్లో ‘ధరాభారం లేని భారత్’ధర్నాలు చేపడతాం’’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. మోదీ సర్కారు దేశ ప్రజలను వంచించిందని ఆయన మండిపడ్డారు. ‘‘ఐదు రాష్ట్రాల్లో ఓట్ల కోసం నాలుగు నెలలకు పైగా పెట్రో, ఎల్పీజీ, సీఎన్జీ తదితరాల ధరలను పెంచలేదు. అవి పూర్తవుతూనే వాటి ధరలను రోజూ ఎడాపెడా పెంచుతూ సామాన్యుని నడ్డి విరుస్తోంది. జనాన్ని పిండి ఖజానా నింపుకునే సూత్రం పాటిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు సమావేశమై పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో చర్చించిన మీదట దీనిపై భారీ ఉద్యమానికి నిర్ణయించాం’’అని వివరించారు. నిస్సిగ్గు దోపిడీ ఆగాల్సిందే: రాహుల్ ప్రజలను నిస్సిగ్గుగా దోచుకుంటున్న కేంద్రానికి ముకుతాడు వేయాల్సిందేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. జనం అష్టకష్టాలు పడుతుంటే రాజు బేపర్వాగా తన ప్రాసాదాన్ని అలంకరించుకుంటున్నారంటూ ప్రధాని మోదీనుద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో తేదీలు మారుతున్నా సమస్యలు మాత్రం యథాతథమంటూ సుర్జేవాలా ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ ఓవైపు జనాన్ని బాదుతూ, మరోవైపు ప్రమాణ స్వీకారాలు జరుపుకుంటోంది. పెట్రోల్, డీజిల్‌కు భారత్‌లో రోజుకో కొత్త రేటు. ఐదు రోజుల్లో నాలుగు దాడులు’’అని ధరల పెంపునుద్దేశించి విమర్శలు సంధించారు. -
రాబడి మీకోసమేనా..?
అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అన్ని రకాల పరిశ్రమలకూ ఈ సెగ గట్టిగానే తగులుతోంది. ముడి చమురు ధరలు, లోహాలు, రసాయనాలు, వంటనూనెలు ఇలా దాదాపు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. వినియోగ డిమాండ్ పెరగడం, ఉత్పత్తి, సరఫరా తగినంత లేకపోవడం దీనికి కారణంగా పేర్కొంటున్నారు. కారణాలేవైనా కానీ మన దేశంలో ద్రవ్యోల్బణం గరిష్టాల్లోనే ఉంటోంది. కనుక ఇన్వెస్టర్లు అందరూ పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ అంశాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న అంచనాలు అధిక ద్రవ్యోల్బణానికి మార్గమే అవుతుంది. గడిచిన 12 నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6 శాతంగా ఉంది. అంటే 6 శాతం రాబడినిచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసినా.. నికరంగా మీ చేతికి వచ్చేది సున్నాయే. 2009 నుంచి 2014 మధ్య ద్రవ్యోల్బణం సగటున 10.4 శాతంగా మన దేశంలో కొనసాగింది. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడుల కోసం ఇన్వెస్టర్లు మెరుగైన సాధనాలకు పెట్టుబడుల్లో చోటివ్వాలి.. బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంకులు అనుసరించే మార్గం వడ్డీ రేట్లను పెంచడం. కనుక రేట్లను పెంచే క్రమంలో బాండ్లలో పెట్టుబడులు అనుకూలం కాదు. దీనివల్ల బాండ్ల ధరలు తగ్గుతాయి. కరోనా రెండు విడతల ప్రభావంతో దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడ్డాయి. వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కనుక కొంత ఆలస్యంగా వడ్డీ రేట్లను పెంచే మార్గంలోకి వెళ్లొచ్చు. కానీ, కీలక రేట్లు పెరగకపోయినా.. ద్రవ్యోల్బణం రెక్కలు తొడుగుకుంటే మార్కెట్ ఆధారిత వడ్డీ రేట్లు (పదేళ్ల జీ–సెక్‌లు) పెరిగిపోతాయి. ఇన్వెస్టర్లు 2009–2014 మధ్య భారత ప్రభుత్వ సెక్యూరిటీలను కలిగి ఉన్నట్టయితే వారికి లభించిన రాబడి రేటు వార్షికంగా 3.2 శాతమే. వాస్తవ రాబడి మైనస్ అవుతుంది. అందుకని అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతుందనుకుంటే అటువంటప్పుడు దీర్ఘకాల ప్రభుత్వ సెక్యూరిటీలు, దీర్ఘకాలంతో కూడిన కార్పొరేట్ బాండ్లకు దూరంగా ఉండడమే మంచిది. బ్యాంకుల ఎఫ్డీ రేట్లు సార్వభౌమ బాండ్ల రేటు కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయినా కానీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఇవి చాలవు. ఈ విడత కీలక రేట్ల సవరణ విషయంలో ఆర్బీఐ వేచి చూసే ధోరణితో ఉన్నందున.. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్టు వడ్డీ రేట్లు కూడా సమీప కాలంలో పెరగకపోవచ్చు. ఆర్బీఐ గణాంకాలను పరిశీలిస్తే 2009–2014 మధ్య బ్యాంకు ఎఫ్డీ రేట్లు 8.6 శాతంగా ఉన్నాయి. మంచి రేటు కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో సగటు ద్రవ్యోల్బణం 10.4 శాతంగా ఉంది. నేడు బ్యాంకు ఎఫ్‌డీల రేట్లు 5–6 శాతం మధ్యే ఉన్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటోంది. కనుక వాస్తవంగా ఇన్వెస్టర్‌కు వచ్చే రాబడి ఏమీ ఉండదు. చిన్న మొత్తాల పొదు పథకాల్లో టైమ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్పత్ర, ఎన్ఎస్సీ రేట్లు కూడా 6–7 శాతం మధ్యే ఉన్నాయి. కనుక వాస్తవంగా వచ్చే రాబడి ఒక్క శాతం కూడా మించదు. ఈక్విటీలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొని మెరుగైన వాస్తవ రాబడులకు ఈక్విటీలు మార్గం చూపిస్తాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు బాండ్ల కంటే అధిక రాబడులనే ఇస్తున్నట్టు ఇప్పటి వరకు ఉన్న చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఈక్విటీల్లో రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలంలోనే ఈ రిస్క్‌ను అధిగమించే రాబడులకు అవకాశం ఉంటుంది. కనీసం పదేళ్లు అంతకుమించిన కాలానికి ఈక్విటీల్లో మెరుగైన రాబడులను ఆశించొచ్చు. స్వల్పకాలానికి మాత్రం స్టాక్స్‌లో రాబడులు బాండ్లను మించి, ద్రవ్యోల్బణాన్ని మించి ఉంటాయని చెప్పడానికి లేదు. ఎప్పుడూ కూడా స్టాక్స్ ధరలు ఆయా కంపెనీల వృద్ధినే ప్రతిఫలిస్తుంటాయి. పారిశ్రామిక ముడి పదార్థాలైన పెట్రోకెమికల్స్, కెమికల్స్, పారిశ్రామిక లోహాల ధరలు పెరుగుతుంటే అవి కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే పెరుగుతున్న ధరలను కంపెనీలు పూర్తి స్థాయిలో వినియోగదారులకు బదిలీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొం టాయి. కరోనా రెండో విడత నేపథ్యంలో డిమాండ్ పరిస్థితులు బలహీనంగానే ఉన్నాయి. పెరిగిపోయిన ముడి సరుకుల ధరల వల్ల కంపెనీల లాభాలపై ప్రభావం పడనుంది. కానీ, ఇదే సమయంలో కమోడిటీలను ఉత్పత్తి చేసే కంపెనీలు పెరుగుతున్న ధరల సైకిల్‌తో మంచి లాభాలను నమోదు చేసుకుంటాయి. ఇలా అధిక ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కమోడిటీలను వినియోగించేవి కాకుండా.. వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలను ఎంపిక చేసుకోవడం వల్ల అధిక లాభాలను ఆర్జించేందుకు వీలుంటుంది. బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణ సాధనంగా బంగారాన్ని పరిగణిస్తుంటారు. కానీ, మన దగ్గర ద్రవ్యోల్బణానికి హెడ్జ్ సాధనంగా బంగారానికి అంత ప్రాధాన్యం లేదు. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చిన తరుణంలో బంగారం ప్రాధాన్య సాధనంగా ఉంటోంది. భారత ఇన్వెస్టర్లకు.. అంతర్జాతీయ సంక్షోభ సమయాలు లేదా కమోడిటీల ధరల పెరుగుదల సమయంలోనే రూపాయి క్షీణత కూడా చోటు చేసుకుంటోంది. 2009–2014 కాలంలో అధిక ద్రవ్యోల్బణం సమయంలో మన దేశ ఇన్వెస్టర్లకు బంగారం మంచి రాబడులను కురిపించింది. వార్షికంగా 13.2 శాతం చొప్పున బంగారం ఈటీఎఫ్‌లు రాబడులను ఇచ్చాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుందనుకుంటే ఆ సమయంలో బంగారానికి కొంత కేటాయింపులు సహేతుకమే అవుతాయి. వివేకంతో వ్యవహరించాలి ఇటీవలే మోతీలాల్ ఓస్వాల్ సంస్థ విడుదల చేసిన నివేదికను పరిశీలించినట్టయితే.. నిఫ్టీ ఇండెక్స్‌లోని 11 కంపెనీలు పెరుగుతున్న కమోడిటీల ధరల నుంచి లబ్ధి పొందుతాయని అర్థమవుతోంది. 13 కంపెనీలపై చాలా ప్రతికూల ప్రభావం పడనుంది. మిగిలిన కంపెనీలపై ప్రభావం తటస్థంగానే ఉంటుందని తెలుస్తోంది. అధిక కమోడిటీల ధరలు ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలే ఉంటే.. ఇన్వెస్టర్లు ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలకు దూరంగా ఉండడమే మంచిదవుతుంది. దిగ్గజ కంపెనీలతో పోలిస్తే.. మధ్య తరహా, చిన్న కంపెనీలకు ఉత్పత్తుల ధరలను నిర్ణయించే శక్తి తక్కువగానే ఉంటుంది. కనుక పెరుగుతున్న తయారీ వ్యయాల ప్రభావం వాటిపైనే ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సమయంలో పెద్ద కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సురక్షితం. నిఫ్టీ లాభాల్లో కమోడిటీ కంపెనీల వాటా 36 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉన్న 2009–14 కాలంలో నిఫ్టీ–50 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్, నిఫ్టీ 500 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ వార్షికంగా 17 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఆ కాలంలో ఉన్న సగటు ద్రవ్యోల్బణం 10.4 శాతం కంటే ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇచ్చినట్టు అర్థమవుతోంది. కాకపోతే నాటికి, నేటికీ మధ్య స్టాక్స్ వ్యాల్యూషన్లలో వ్యత్యాసం ఉంది. బేర్ మార్కెట్ తర్వాత 2009లో స్టాక్స్ వ్యాల్యూషన్లు చౌకగా ఉన్నాయి. నిఫ్టీ 50పీఈ 2009 జనవరిలో 13.3 పీఈ వద్ద ఉంది. కానీ నేడు నిఫ్టీ 50 పీఈ 29వద్ద ఉంది. కనుక ఈ దశలో పెట్టుబడులకు ఎంపిక చేసుకునే కంపెనీల విషయంలో వివేకంతో వ్యవహరించాలి. ధరలను శాసించగల కంపెనీలను, పెరుగుతున్న కమోడిటీల ధరల నుంచి లబ్ధి పొందే వాటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీలు ఏ ఇతర సాధనంతో పోల్చినా దీర్ఘకాలంలోనే మెరుగైన రాబడులను ఇచ్చాయి. స్వల్ప కాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులేవనే చెప్పాలి. -
ధరల పెరుగుదలపై ఇంత నిరాసక్తతా?
గత నలభై ఏళ్లుగా రాజకీయాలను, ప్రభుత్వ విధానాలను గమనిస్తున్నవారందరికీ గుర్తుండిపోయే విషయాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా ఇంధన ధరలు ఒక పావలా పెరిగినప్పుడు, బస్సు చార్జీలు కిలోమీటరుకు రెండు నయాపైసలు పెంచినపుడు, రైలు చార్జీలు ఐదుశాతం పెరిగినపుడు, నూనెల ధరలు అయిదు రూపాయలు పెరిగినపుడు దేశం మొత్తం గగ్గోలెత్తిపోయేది. విపక్షాలన్నీ కలసికట్టుగా దేశవ్యాప్త ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించేవి. ఈ ధర్నాలు నిర్వహించడానికి కమ్యూనిస్టు పార్టీలు ముందంజలో నిలిచేవి. పెట్రోల్ ధరలు పెరగగానే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు దూరదర్శన్ వారు కెమెరాలతో చిత్రీకరిస్తుండగా కొంచెం దూరం సైకిల్ తొక్కుతూ అసెంబ్లీ భవనానికి వెళ్లేవారు. మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవారు. మరికొందరైతే తమ ఇళ్లలో లాంతర్లు వెలిగించి నిరసన తెలిపేవారు. గ్యాస్ ధర పది రూపాయలు పెరిగితే రోడ్ల మీద కట్టెలతో వంటలు చేస్తూ నిరసనలు తెలిపేవారు. ఈ ఆందోళనల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనేవారు. లాఠీ చార్జీలు జరిగినా, బాష్పవాయువు ప్రయోగించినా, బుల్లెట్లు కురిపించినా బెదిరేవారు కారు. విపక్ష నాయకులు ఆందోళనల్లో ముందుండి ఉద్యమాలను నడిపేవారు. పెంచిన ధరలు తగ్గించాల్సిందే అని ప్రతిపక్షాలు, నయాపైసా కూడా తగ్గించేది లేదని ప్రభుత్వాలు భీష్మించుకునేవి. ఎప్పుడో ఒకటోఅరో సందర్భాల్లో పెంచిన ధరలను ఒక్క శాతం తగ్గించేవి ప్రభుత్వాలు. అప్పటికే పదిశాతం ధరలు పెరిగాయనే వాస్తవాన్ని విస్మరించి తామేదో ఘనవిజ యాన్ని సాధించినట్లు, ప్రభుత్వం మెడలు వంచినట్లు విపక్షాలు సంబరపడిపోయేవి. ఇలాంటి గిమ్మిక్కులనే ఎద్దేవా చేస్తూ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ అనే సినిమాను నిర్మించారు. సినిమాలో ముఖ్యమంత్రి ఏ వస్తువు మీదైనా ధరలు పెంచాలంటే ముందుగా రూపాయి వస్తువును మూడు రూపాయలకు పెంచడం, దానిమీద ప్రతిపక్షాలు మండిపడి ఆందోళనలు చేస్తే ఒక రూపాయిని తగ్గించడం, దాంతో విపక్షాలు శాంతించి ఆందోళన విరమించడం జరిగేవి. రూపాయి వస్తువు రెండు రూపాయలు అయిందనే స్పృహ అటు ప్రజలకూ ఉండేది కాదు, విపక్షాలకూ ఉండేది కాదు. ఎపుడో నలభై ఏళ్ళక్రితం దాసరి నారాయణరావు తీసిన అలాంటి సంఘటనలు ఆ తరువాత నిజజీవితంలో కూడా కొన్ని సార్లు జరిగాయి. ఇంధనధరలను పెంచితే వెంటనే దేశవ్యాప్తంగా లారీ యజమానులు సమ్మెకు దిగేవారు. ఎక్కడి లారీలు అక్కడే స్తంభించిపోయేవి. రవాణా స్తంభించిపోవడంతో కూరగాయలు, పండ్లు చెడిపోవడం, రైతులకు కోట్లలో నష్టం వాటిల్లడం జరిగేవి. దాంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోవడం, ఆ తరువాత లారీ యజమానుల సంఘం వారు ప్రభుత్వంతో చర్చలు జరపడం, అందులో వారికేవో కొన్ని హామీలు లభించడం, ఫలితంగా సమ్మెను విరమించడం షరా మామూలుగా సాగిపోతుండేది. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతుండేది. ఉల్లిపాయల ధర పెరగడంతో కేంద్ర ప్రభుత్వాలనే దించేసిన ఉదంతాలు ఉన్నాయి మనదేశంలో. గత కొద్దికాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు దినదినప్రవర్ధమానం అవుతున్నాయి. ప్రతిరోజూ ధరలు పెంచేస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇంధనం ధరలు, గ్యాస్ ధరలు పది రూపాయలు పెంచగానే బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేసేది. బీజేపీ అగ్రనేతలు సిలిండర్లను రోడ్లమీద పెట్టి కట్టెలతో వంటలు చేసేవారు. నూనె ధరలు రెండు రూపాయలు పెరిగితే నీళ్లతో తిరగమోతలు పెడుతూ నిరసన తెలిపేవారు. మన్మోహన్ ప్రభుత్వం వంటగ్యాస్ ధరను పాతిక రూపాయలు పెంచినపుడు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ పెంచిన భారాన్ని తమ ప్రభుత్వం మోస్తుందని ప్రకటించి ప్రజలను శాంతిం పజేశారు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఆ భారాన్ని ప్రజలే భరించాల్సి వచ్చింది. ఇక కమ్యూనిస్ట్ పార్టీలైతే ప్రతిరోజూ మన్మోహన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక చోట ఆందోళనలు చేస్తూనే ఉండేది. మన్మోహన్ ప్రభుత్వం దిగిపోయాక మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం గద్దె ఎక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము ప్రదర్శించిన ధర్నాలు, ఆందోళనలను వాటంగా విస్మరించి అనునిత్యం ధరలు పెంచడమే పరమావధిగా పెట్టుకుంది. ముఖ్యంగా గత రెండేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయిదారు నెలలక్రితం ఉన్న ధరలకు దాదాపు రెట్టింపు అయ్యాయి. పప్పు దినుసులు, నూనెలు, వంట గ్యాస్ ధరలు ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతూ సామాన్యుల గుండెలను దడదడలాడిస్తున్నాయి. పెట్రోల్ ధర దాదాపు వందరూపాయలకు చేరువలో ఉన్నది. గత మూడు నెలల్లో వంట గ్యాస్ ధర రెండు వందల రూపాయల మేర పెరిగింది. నాలుగైదు నెలల క్రితం వరకూ నూట యాభై రూపాయల వరకూ సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో జమ అయ్యేది. ఇప్పుడు అదికూడా పోయింది. ఒకప్పుడు ధరలు పెంచడం అంటే బడ్జెట్ సమావేశాల్లో మాత్రమే జరిగేది. ముందుగా కేబినెట్ మీటింగ్‌లో చర్చించి పార్లమెంట్లో ప్రవేశపెట్టి పెంచేవారు. ఇప్పుడు అలాంటి సంప్రదాయాలు లేవు. ప్రతిరోజూ పెంచేస్తున్నారు. అయినా ఆశ్చర్యం! ఎక్కడా ఆందోళనలు లేవు. సమ్మెలు లేవు. ధర్నాలు లేవు. కరెంట్ చార్జీలు పెంచినా, రవాణా చార్జీలు పెంచినా, ఇంటి పన్నులు పెంచినా, కూరగాయల ధరలు పెరిగినా, ఆరోగ్యకారక మందుల ధరలు పెంచినా, ఆస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచినా కిమన్నాస్తి. ప్రజలు కానీ, పార్టీలు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. గతంలో పెరిగిన ధరలపై చెలరేగిన ఆందోళనలు, ఉద్యమాల వాతావరణం ఇప్పుడు కనిపించలేదు. విద్యార్థులతో సహా అన్ని వర్గాలూ ధరల పెరుగుదలపై, ఇతర సమస్యలపై పూర్తిగా నిరాసక్తత ప్రదర్శిస్తున్నాయి. అందుకే ప్రభుత్వాలు తమ చిత్తం వచ్చినట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా, ఇంధన ధరలు పెంచినా ఒకరోజు గుండెలు బాదుకుని మరునాడు ఎంత పెరుగుతుందా అని ఎదురు చూడటం తప్ప మరో గత్యం తరం కనిపించడం లేదు. ఇలపావులూరి మురళీ మోహనరావు వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
దిగుబడి బాగున్నా.. దిగిరాని ధరలు
కడప అగ్రికల్చర్: కూరగాయల దిగుబడులు బాగున్నా ధరలు దిగిరావడం లేదు. చిన్న హోటళ్ల వారు ఈ ధరలను చూసి కూరలను తయారు చేయడం తగ్గించారు. పచ్చళ్లను వండి పార్శిల్ చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు కిలో రూ.10–15లోపే ఉన్న కూరగాయల ధరలు రూ.30 నుంచి 60కి ఎగబాకాయి. దీంతో వినియోగదారులు వాపోతున్నారు. జిల్లాలో పంటల సాగు పెరిగినా ధరలు మాత్రం తగ్గడం లేదని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో కాస్త తక్కువగా ఉన్నా ఇతర ప్రాంతాల్లో మాత్రం అధికంగా ఉంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల్లో వరదల కారణంగా పంట దెబ్బతినడంతో అక్కడికి కూరగాయలను తరలిస్తుండడంతో మార్కెట్ కొరత కారణంగా తగ్గుతున్నాయని వ్యాపారులు సమర్ధించుకుంటున్నారు. పంటల సాగు పెరిగినా ధరలు ఎందుకు తగ్గడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. కిలో రూ.10–15 ఉన్న టమాట ధర కూడా రూ.30లకు చేరింది. మార్కెట్లో వ్యాపారులు దళారుల మాయాజాలం...: జిల్లాలో రోజుకు 5 నుంచి 6 టన్నుల కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని ఉద్యానశాఖ అధికారుల అంచనా. మార్కెట్లో కొరతను సాకుగా చూపుతూ ధరలు పెంచి వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రవాణా, ఇతర ఖర్చులు పోయినా ధరలు బాగా ఉండడంతో అక్కడికి తరలించడంతో ఆదాయం ఉంటోందని వ్యాపారులు అంటున్నారు. కూరగాయల సాగు విస్తీర్ణం హెక్టార్లలో : 4,000 జిల్లాకు అవసరమైన కూరగాయలు : 10.80 టన్నులు ప్రస్తుతం వినియోగిస్తున్నవి : 6 టన్నులు జిల్లాలో కొరత : 5 టన్నులు -
కొండెక్కిన చందమామ
ధారూరు వికారాబాద్ : రంజాన్ మాసం ప్రారంభంలో చందమామ కొండెక్కింది. కొండెక్కిన చందమామ పైన కుడివైపున పెద్ద నక్షత్రం అనుసరించడం ధరల పెరుగుదలకు సూచనగా ప్రజల భావన. కుడివైపునకు పెరిగితే ధరలు పెరుగుతాయని, ఎడమ వైపునకు పెరిగితే ధరలన్నీ తగ్గుతాయని గ్రామీణుల విశ్వాసం. చందమామ కొండెక్కింది. ఇంకా ధరలు ఏ మోతాదులో పెరుగుతాయో అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు. ఒకే నెలలో మూడుసార్లు పెట్రోల్, డీజిల్ చార్జీలు పెరగడమే ఇందుకు కారణం. గురువారం రాత్రి చందమామ కొండెక్కిన చిత్రాన్ని సాక్షి తన కెమెరాలో బంధించింది -
ధరలపై సమరం
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన ఆందోళనలు ప్రభుత్వ వైఫల్యంపై ఆగ్రహం ఏమీ కొనలేని, తినలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన జిల్లా వ్యాప్తంగా ధర్నాలు పెరుగుతున్న ధరలు పేదల బతుకులను దుర్భరం చే స్తున్నాయి... వాటిని కట్టడి చేసి ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంది.. ఫలితంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏమీ కొనలేని, తినలేని పరిస్థితి నెలకొంది. పండుగ పూట సైతం పచ్చడి మెతుకులు తప్పడం లేదు.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ.. ప్రజల తరఫున ధరల పెరుగుదలపై యుద్ధం మొదలెట్టింది. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వ వైఫలాన్ని ఎండగట్టారు. ఇప్పటికైనా సర్కారు పెద్దలు మేల్కొని ధరల నియంత్రణకు చర్యలు చేపట్టి పేదలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలను సమీకరించి పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.నగరి నియోజకవర్గ పరిధిలోని వడమాల పేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఆర్కె.రోజా ఆధ్వర్యంలో ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌రాజు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. పార్టీ నేతలు బీరేంద్రవర్మ, మల్లం రవిచంద్రారెడ్డి, రాజేంద్ర, ఎంవీఎస్ మణి, మమత తదితరులు పాల్గొన్నారు.చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి, రామసముద్రం ఎంపీపీ జరీనా, కార్యకర్తలు పాల్గొన్నారు.పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని ఐరాల మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కన్వీనర్ల ఆధ్వర్యంలో తహశీల్దార్ల కార్యాయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలమనేరులో టౌన్ కన్వీనర్ హేమంత్‌కుమార్‌రెడ్డి, రూరల్ మండల కన్వీనర్ బాలాజీరెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు ధర్నా నిర్వహించి తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.సత్యవేడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట కన్వీనర్ ఆదిమూలం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. డెప్యూటీ తహశీల్దార్ కిరణ్మయికి వినతి పత్రం సమర్పించారు. పుంగనూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.కుప్పం నియోజకవర్గపరిధిలోని రామకుప్పంలో కన్వీనర్ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో నిరసన చేపట్టారు. గంగాధర నెల్లూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట కన్వీనర్ వెంకటేశ్వర్లురెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు నిరసన తెలిపారు.చిత్తూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నగర కన్వీనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. -
ధరాభారాల పై పోరుబాట
-
ధరల పెరుగుదలపై రేపు వైఎస్ఆర్ సీపీ సమరభేరి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన నిత్యావసరాల ధరలపై వైఎస్ఆర్ సీపీ సమరభేరి మోగించింది. ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం ఏపీలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపట్టనున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పార్టీలకు అతీతంగా నిరసన తెలపాలని వైఎస్ఆర్ సీపీ పిలుపునిచ్చింది. -
ఇష్టానుసారం ధరలు...
ధరల పెరుగుదల గురించి అటు కేంద్ర ప్రభుత్వంగాని రాష్ట్ర ప్రభుత్వంగాని పట్టించుకోకపోవటంతో నిత్యావసరాల ధరలు చాపకింద నీరులా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలతో బిజీబిజీగా గడుపుతూ ఉంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసమంటూ జపాన్, సింగపూర్ పర్యటనలతో తీరిక లేకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలో దళారులు, వ్యాపారస్తులు ఎవరి ఇష్టానుసారంగా వారు నిత్యావస రాల ధరలు పెంచుకుంటూపోతున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి నప్పుడు ఆటోల నుండి ఆర్టీసీ బస్‌ల వరకు అన్ని సేవల చార్జీలు వెనువెంటనే పెంచుకుంటూ పోయారు. మరి ఇప్పుడు చమురు ధరలు అంతర్జాతీయంగా భారీస్థాయిలో పడిపోయినప్పుడు గతంలో పెంచిన ఆ సేవల ఛార్జీలను తగ్గించడానికి ప్రభుత్వాలు ఏ మాత్రం కృషి చేయడం లేదు. చమురు ధరలు పెరిగినా, తగ్గినా సేవల విషయంలో ప్రజలపై పెరిగిన ఆ భారాన్ని అలాగే ఉంచి ప్రజల్ని నిలువునా దోచుకోవడం సబబుకాదేమో... ప్రభుత్వాలు కాస్త ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మేలు చేయాలని మనవి. పి. శ్రీవాణి రామవరప్పాడు, కృష్ణా జిల్లా