న్యూఢిల్లీ: రానున్న నెలల్లో ఇళ్ల ధరలు పెరుగుతాయని భవిష్యత్తు కొనుగోలు దారుల్లో సగం మంది భావిస్తున్నారు. రియల్టీ పోర్టల్ హౌసింగ్ డాట్ కామ్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ మండలి అయిన నరెడ్కో కలసి సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించాయి. ఇందులో పాల్గొన్న వారిలో 47 శాతం మంది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. 21 శాతం మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని చెప్పగా, 16 శాతం మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంటామని, 15 శాతం మంది బంగారంలో పెట్టుబడి పెడతామని తెలిపారు.
‘రెసిడెన్షియల్ రియల్టీ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే హెచ్2 2022’ పేరుతో ఈ సంస్థలు సర్వే నివేదికను విడుదల చేశాయి. ఇందులో 1,000 మందికి పైగా పాల్గొన్నారు. 48 శాతం మంది భవిష్యత్తులో ధరల పెరుగుదలను అంచనా వేస్తున్నారు. 58% మంది రెడీ టు మూవ్ (ప్రవేశానికి సిద్ధంగా ఉన్న) ప్రాపర్టీల పట్ల ఆసక్తితో ఉన్నట్టు చెప్పారు. ‘‘కరోనా రెండో విడత తీవ్రత తర్వాత భారత నివా స గృహాల మార్కెట్‌లో డిమాండ్ వేగంగా కోలుకుంది. రుణ వ్యయాలు పెరుగుతుండడ, నిర్మాణ ముడి సరుకుల ధరలు పెరగడం, బలమైన డిమాండ్ ఇళ్ల ధరల పెరుగుదలకు దారితీశాయి’’అని హౌసింగ్ డాట్ కామ్ సీఈవో అగర్వాల్ తెలిపారు.
బలంగా డిమాండ్..
పెరిగిన నిర్మాణ వ్యయాలను సర్దుబాటు చేసుకునేందుకు, లాభాల మార్జిన్లను పెంచుకునేందుకు ప్రాపర్టీల ధరలను పెంచినట్టు లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని ధృవ్ అగర్వాల్ అంచనా వేశారు. పండుగల సమయాల్లో డిమాండ్ పుంజుకోవడానికి తోడు, కన్జ్యూమర్ సెంటిమెంట్ బలంగా ఉన్నట్టు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉంటాయని ఇళ్ల కొనుగోలు దారులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని 73 శాతం మంది చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలు పరిశ్రమ రికవరీకి మద్దతుగా నిలిచినట్టు నరెడ్కో ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ తెలిపారు. సొంతింటిని కలిగి ఉండాలన్న కోరిక వినియోగదారుల్లో ఉన్నందున ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment