
1971 నుంచి వార్షికంగా 8 శాతం ప్లస్
ఈక్విటీలతో సమానంగా రిటర్నులు
ద్రవ్యోల్బణం, బాండ్లను మించి పరుగులు
కమోడిటీలతో పోల్చితే నిలకడైన రాబడి
ఇటీవల ప్రధాన కరెన్సీలను మించిన స్పీడ్
తరతరాలుగా ప్రపంచ దేశాల ప్రజలను, కేంద్ర బ్యాంకులను ఆకర్షిస్తున్న అయస్కాంతం పసిడి! గత ఐదు దశాబ్దాలకుపైగా చరిత్రను తీసుకుంటే పసిడి తళతళలు అర్థమవుతాయ్. 1971 నుంచి చూస్తే బంగారం ప్రతీ ఏటా ఈక్విటీలతో సమానంగా సగటున 8 శాతం రిటర్నులు అందించింది!! ఈ బాటలో ఇతర కమోడిటీలతో పోల్చితే నిలకడను చూపుతూ బలాన్ని ప్రదర్శించడం విశేషం.
గత ఐదు దశాబ్దాలలో బంగారం ధరలు వార్షిక పద్ధతిన 8 శాతం చొప్పున పుంజుకున్నాయి. అంటే ఇటీవల అత్యంత ఆకర్షణీయంగా మారిన ఈక్విటీలతో సమానంగా లాభపడ్డాయి. ఇదే సమయంలో బాండ్లతో పోలిస్తే అధిక రాబడి అందించాయి. ఈ బాటలో గత రెండు దశాబ్దాలను పరిగణిస్తే అంటే గత 5, 10, 15, 20 ఏళ్లలో సైతం వీటి ధరలు పలు ఇతర ఆస్తులకంటే మెరుగ్గా రాణించాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) మదింపు ప్రకారం బంగారం ఒక వ్యూహాత్మక ఆస్తి! యూఎస్ డాలర్– గోల్డ్ కన్వరి్టబిలిటీని రద్దు చేసిన 1971 నుంచి చూస్తే యూఎస్‌తోపాటు ప్రపంచ వినియోగ ధరల ద్రవ్యోల్బణ ఇండెక్సు(సీపీఐ)లను సైతం బంగారం అధిగమించింది.
మూలధన వృద్ధి
ద్రవ్యోల్బణం 2–5 శాతం మధ్య నమోదైన గత కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే సగటున పసిడి 8 శాతం చొప్పున దౌడు తీసింది. వెరసి దీర్ఘకాలానికి ఈ విలువైన లోహం మూలధనాన్ని పరిరక్షించడమేకాకుండా పెట్టుబడి వృద్ధికీ దోహదం చేసింది. అంటే అటు పెట్టుబడి సాధనంగా.. ఇటు విలాసవంత వస్తువుగా కూడా మెరిసింది! వివిధ ఈక్విటీ ఇండెక్సులు, కమోడిటీలు, ఇతర ప్రత్యామ్నాయ ఆస్తులతో పోలిస్తే వివిధ మార్గాలలో బంగారానికి పుడుతున్న డిమాండ్ కారణంగా కొన్ని దశాబ్దాలుగా నిలకడను ప్రదర్శిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని ప్రధాన కరెన్సీలు, కమోడిటీలతో మారకాన్ని పరిగణించినా పసిడిది పైచేయే! ఈ బాటలో ఇటీవల చాలా ప్రధాన కరెన్సీలతో పోలిస్తే మెరుగైన వృద్ధిని అందుకుంది.
కారణాలున్నాయ్..
నిజానికి బంగారాన్ని గనుల నుంచి వెలికి తీస్తారు. అయితే గత రెండు దశాబ్దాలలో గోల్డ్ మైనింగ్ వార్షికంగా సగటున 1.7 శాతమే పెరగడం ధరలకు రెక్కలిస్తోంది. కాగా.. డబ్ల్యూజీసీ రీసెర్చ్ ప్రకారం ప్రతిద్రవ్యోల్బణ(డిఫ్లేషన్) పరిస్థితుల్లోనూ పసిడి మెరుగ్గానే రాణించింది. చౌక వడ్డీ రేట్లు, నీరసించిన వినియోగం, బలహీనపడిన పెట్టుబడులు, ఆర్థిక ఒత్తిళ్లు సైతం యెల్లో మెటల్‌కు డిమాండును పెంచడం గమనార్హం! 2008లో తలెత్తిన ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, తిరిగి 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా పలు దేశాలు సరళతర పరపతి విధానాలను అవలంబించాయి. ద్రవ్య లభ్యత(లిక్విడిటీ)ను భారీగా పెంచాయి. ఓవైపు కరెన్సీలు పతనంకావడం, కొనుగోలు శక్తి క్షీణించడం వంటి పరిస్థితుల్లో రక్షణ(హెడ్జింగ్)గా కేంద్ర బ్యాంకులు, ఇతర ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ బంగారంలో మదుపు చేశాయి.
ఒకే ఒక్కటి
ప్రపంచ దేశాలను కుదిపేసిన సబ్‌ప్రైమ్ సంక్షోభ కాలంలో ఈక్విటీలు, హెడ్జ్ ఫండ్స్, రియల్టీ, పలు కమోడిటీలు, ఇతర రిస్క్ ఆస్తులు విలువలో పతనమయ్యాయి. అయితే బంగారం మేలిమిగా నిలిచింది. 2007 డిసెంబర్ నుంచి 2009 ఫిబ్రవరి మధ్యకాలంలో పసిడి ధరలు 21 శాతం ఎగశాయి. ఇటీవల ఈక్విటీ మార్కెట్లు పతనబాటలో సాగిన 2020, 2022లోనూ బంగారం ధరలు సానుకూల ధోరణిలోనే సాగాయి. గత కొన్నేళ్లలో ఈక్విటీ మార్కెట్లు బుల్ పరుగు తీస్తున్న నేపథ్యంలోనూ పసిడి పోటీ పడుతోంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment