
అంచనాలకు అందకుండా పరుగు తీస్తున్న పుత్తడి రేటు
210 రోజుల్లో 500 డాలర్లు పెరిగిన ఔన్స్ బంగారం ధర
గతంలో ఈ స్థాయి వృద్ధికి సగటున 1,708 రోజుల సమయం
ఆశ్చర్యపరుస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గణాంకాలు
సాక్షి, స్పెషల్ డెస్క్: పుత్తడి సరికొత్త రికార్డులు నమోదు చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ‘గోల్డెన్ డేస్’ నడుస్తున్నాయి. తొలిసారిగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం రేటు 3,000 డాలర్లు దాటింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఔన్స్ పసిడి ధర 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు.. అంటే కేవలం 7 నెలలు మాత్రమే పట్టడం. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది.
అంటే దాదాపు 4 సంవత్సరాల 8 నెలలు. దీనినిబట్టి పుత్తడి పరుగు ఏ స్థాయిలో వేగం అందుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే తదుపరి రికార్డు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. 2025లోనే ఔన్స్ ధర 4,000 డాలర్లను తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర (Gold Price) గురువారం రూ.91,650 పలికింది. ఈ నెల 19న రూ.91,950కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది.
రికార్డులే రికార్డులు..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా గణాంకాల ప్రకారం.. 2024లో బంగారం 40 కంటే ఎక్కువసార్లు సరికొత్త ఆల్–టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు మరో 16 కొత్త గరిష్టాలను చేరుకుంది. అంతర్జాతీయంగా 2005 డిసెంబర్‌లో పసిడి ఔన్స్ ధర తొలిసారిగా 500 డాలర్ల మార్కును తాకింది. ఆ తదుపరి 500 డాలర్లకు.. అంటే 1,000 డాలర్ల స్థాయిని 2008 మార్చిలో చేరుకుంది.
2011 ఏప్రిల్‌లో 1,500 డాలర్లకు, 2020 ఆగస్టులో 2,000 డాలర్లు, 2024 ఆగస్టులో 2,500 డాలర్ల మార్కును తాకింది. 500 నుంచి 1,000 డాలర్లను చేరుకోవడానికి 834 రోజులు పట్టింది. అక్కడి నుంచి 1,500 డాలర్లకు 1,132 రోజులు, 1,500 నుంచి 2,000 డాలర్లకు 3,394 రోజుల సమయం తీసుకుంది. 2,000 నుంచి 2,500 డాలర్లను అందుకోవడానికి 1,473 రోజులు పట్టింది. సురక్షితమైన ఆస్తిగా బంగారం పుత్తడి 3,000 డాలర్ల కంటే అధిక ధర వద్ధ స్థిరంగా ఉంటే అదనపు కొనుగోళ్లు ధరను మరింత ప్రేరేపించవచ్చని డబ్ల్యూజీసీ జోస్యం చెబుతోంది.
కన్సాలిడేషన్‌కూ అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారని వివరించింది. గతంలో ప్రతి అదనపు 500 డాలర్ల మార్కును చేరుకున్న తరువాత సగటున తొమ్మిది రోజుల తరువాతే పుత్తడి ధర వెనక్కి వచ్చిందని, అయితే అయిదింటిలో నాలుగు సందర్భాల్లో కొన్ని రోజుల్లోనే బంగారం అదే స్థాయి కంటే పైకి పుంజుకుందని తెలిపింది. భౌగోళిక రాజకీయ, భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు, బలహీనమైన యూఎస్ డాలర్.. వెరసి పుత్తడిలో పెట్టుబడి డిమాండ్‌కు బలమైన ప్రోత్సాహకాలను అందిస్తూనే ఉందని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది.
ధర ఎగసినా డిమాండ్ తగ్గలేదు
అధిక పసిడి ధరలు ఆభరణాల డిమాండ్‌కు ప్రతికూలతలను సృష్టించవచ్చని డబ్ల్యూజీసీ అంటోంది. ‘ఆభరణాల రీసైక్లింగ్ స్థాయిలను పెంచవచ్చు. పెట్టుబడిదారులలో కొంత లాభాల స్వీకరణకు దారితీయవచ్చు. ఈ అంశాలు బంగారం దీర్ఘకాలిక వృద్ధికి మద్దతు ఇచ్చే విస్తృత ఆర్థిక, ఆర్థిక చోదకాలను అధిగమించే అవకాశం లేదు’ అని వివరించింది. 2024లో పుత్తడి ధర 27 శాతం ఎగిసినా డిమాండ్ తగ్గలేదు. భారత్‌లో 808.8 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment