
అప్పుల భారం, ఇతర కారణాలతో తమ ప్రభుత్వం నగదు కొరతను ఎదుర్కొంటోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్‌బీఐ నుంచి రూ.4,000 కోట్ల లోన్ తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లించగలిగామని తెలిపారు. ఇటీవల శాసనమండలిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని, నగదు కొరత దృష్ట్యా డియర్నెస్ అలవెన్స్ (డీఏ), ఇతర చెల్లింపులు ఆలస్యమైతే ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగులదేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అన్ని వాస్తవాలు, గణాంకాలను వారి ముందు ఉంచుతామని, తద్వారా చెల్లింపులపై తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని చెప్పారు. డీఏ, ఇతర ప్రయోజనాలు ఉద్యోగుల హక్కు అన్నారు.
సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కరవు
ఈ నెల 12న ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయంలో సింహభాగం ప్రతినెలా జీతాలు, పింఛన్లు, గత బీఆర్ఎస్ పాలనలో చేసిన భారీ అప్పులను తీర్చడానికి వెచ్చిస్తున్నామని తెలిపారు. దాంతో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం సవాలుగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినెలా రూ.18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం సమకూరుతుండగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల కోసం రూ.6,500 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. మరో రూ.6,500 కోట్లు బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులను తీర్చడానికి వినియోగిస్తున్నామని తెలిపారు. దాంతో ప్రభుత్వం వద్ద రూ.5,000 కోట్ల నుంచి రూ.5,500 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. సుమారు 30 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రతినెలా నిధులు అవసరమవుతాయని, వీటితో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ఆర్థిక అవసరాలు కూడా ఉన్నాయన్నారు.
రాష్ట్రాలకు ఆర్‌బీఐ అప్పులు ఇలా..
దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు చెల్లించడం వంటి ఆర్థిక బాధ్యతలను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి రుణాలు పొందవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు రుణ పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను రాష్ట్ర ఆర్థిక స్థితిని ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నిత్యం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన అవసరాలకు సంబంధించి నగదు తాత్కాలిక అసమానతలను నిర్వహించడంలో ఆర్‌బీఐ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ) ద్వారా స్వల్పకాలిక రుణాలను అందిస్తుంది. ఈ అడ్వాన్సులు రాష్ట్ర ఆదాయ, వ్యయ నమూనాల ఆధారంగా పరిమితులకు లోబడి ఉంటాయి.
ఇదీ చదవండి: ఏఐ తోడుంటే.. విజయం మీవెంటే..
బాండ్ల జారీతో మార్కెట్ రుణాలు..
ఒక రాష్ట్రం తన డబ్ల్యూఎంఏ పరిమితిని దాటితే, అది ఆర్‌బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే, దీనికి కఠినమైన షరతులు ఉంటాయి. ఆర్బీఐ ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తూ బాండ్ల జారీ వంటి మార్కెట్ రుణాల ద్వారా కూడా రాష్ట్రాలు నిధులను సమీకరించుకోవచ్చు. ఏదైనా రుణం తీసుకోవాలంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఆర్‌బీఐ రుణాలపై వడ్డీ రేట్లను క్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. కాలపరిమితితో సహా నిర్దిష్ట రీపేమెంట్ నిబంధనలు వర్తిస్తాయి. వీటిని రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment