
న్యూఢిల్లీ: పసిడి నాన్ స్టాప్ ర్యాలీ చేస్తోంది. బుధవారం మరో రూ.700 లాభపడింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు 91,950కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. వివాహాల సీజన్‌కు ముందు జ్యుయలర్లు భారీ కొనుగోళ్లకు దిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. దీనికితోడు మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు ఎగిసిపడడంతో ఇన్వెస్టర్లు సైతం కొనుగోళ్లకు ముందుకు వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.700 పెరిగి రూ.91,500కు చేరుకుంది. మరోవైపు వెండి సైతం కొత్త రికార్డు నమోదు చేసింది. కిలోకి రూ.1,000 పెరగడంతో రూ.1,03,500 జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీ పసిడి కాంట్రాక్ట్ (10 గ్రాములు) రూ.288 పెరిగి రూ.89,000 మార్క్‌ను దాటేసింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో పసిడి ఔన్స్ ధర ముందురోజుతో పోల్చి చూస్తే పెద్దగా మార్పు లేకుండా 3,038 డాలర్ల వద్ద ఉంది. ఇంట్రాడేలో 3,045.39 డాలర్ల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆసియా మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర 3,052.31 డాలర్లను తాకింది.
అప్ ట్రెండ్ కొనసాగుతోంది..
బంగారం ధరలు అప్‌ట్రెండ్‌లో ఉన్నట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. ఫెడ్ పాలసీ ప్రకటన ముందు ఒక పరిధిలో ట్రేడ్ అయినట్టు చెప్పారు. యూఎస్ ఫెడ్ పాలసీ కోసం ట్రేడర్లు వేచి చూస్తున్నారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ సైతం తెలిపారు.
ఇదీ చదవండి: ఆశా వర్కర్లకు చేదోడుగా ఏఐ
ఈ ఏడాది చివరికి 4,000 డాలర్లు...
అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలకుతోడు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి కొనుగోళ్ల డిమాండ్ వంటి అంశాలతో 2025 చివరికి బంగారం ఔన్స్‌కు 4,000 డాలర్ల స్థాయిని చేరుకోవచ్చని కమోడిటీ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఇక్కడ మరో 25 శాతం మేర బంగారం ధరలు పెరిగేందుకు అవకాశాలున్నాయన్నది వారి విశ్లేషణ. ఈ ప్రకారం చూస్తే రూపాయిల్లో బంగారం 10 గ్రాములకు రూ.1.14 లక్షలకు చేరుకోవచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment