
రూ. 86,000 దగ్గరకు చేరిక
న్యూఢిల్లీ: జ్యుయలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో పసిడి పరుగు కొనసాగుతోంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో వరుసగా అయిదో సెషన్‌లో లాభపడి రూ. 86,000కు మరింత చేరువైంది. 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర మరో రూ. 500 పెరిగి రూ. 85,800కి చేరిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. జనవరి 1 నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు పసిడి ధర ఏకంగా 8 శాతం పైగా ఎగిసిందని, రూ. 6,410 మేర పెరిగిందని వివరించింది.
అటు వెండి ధరల విషయానికొస్తే అయిదు రోజుల ర్యాలీకి బ్రేక్ వేస్తూ మంగళవారం కేజీకి రూ. 500 తగ్గి రూ. 95,500కి పరిమితమైంది. మరోవైపు, టారిఫ్‌లపై అమెరికా, కెనడా, మెక్సికో మధ్య చర్చలు జరుగుతుండటంతో పసిడి ర్యాలీ కాస్త నెమ్మదించవచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వీపీ జతిన్ త్రివేది తెలిపారు. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్టు ఒక దశలో రూ. 208 తగ్గి రూ. 83,075 వద్ద ట్రేడయిందని వివరించారు. అటు అంతర్జాతీయంగాను పసిడి రికార్డు పరుగు కొనసాగుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాముల) ధర ఒక దశలో 2,876 డాలర్లకు ఎగిసింది.