2024లో 803 టన్నులు
పరిమాణంలో 5 శాతం పెరుగుదల
విలువలో 31 శాతం అధికం
2025లో డిమాండ్ 700–800 టన్నులు
ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక
ముంబై: పసిడి కొనుగోళ్లు, పెట్టుబడులు 2024లో పండుగలా సాగాయి. గత ఏడాది మొత్తం మీద బంగారం డిమాండ్ 802.8 టన్నులకు చేరుకుంది. పరిమాణం పరంగా 2023 సంవత్సంతో పోల్చి చూసినప్పుడు 5 శాతం పెరగ్గా, విలువ పరంగా చూస్తే ఏకంగా 31 శాతం వృద్ధి కనిపించింది. 2023లో 761 టన్నుల బంగారం కోసం భారతీయులు రూ.3,92,000 కోట్లను ఖర్చు చేయగా, 2024లో 802.8 టన్నుల కోసం ఏకంగా రూ.5,15,390 కోట్ల రూపాయలు వెచ్చించారు.
ఈ గణాంకాలతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్లూజీసీ) తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2025లో బంగారం డిమాండ్ భారత్‌లో 700–800 టన్నుల మధ్య ఉండొచ్చు. వివాహ సంబంధిత కొనుగోళ్లతో బంగారం ఆభరణాలకు డిమాండ్ కొనసాగుతుంది. దీంతో ధరల పరంగా కొంత స్థిరత్వం ఉండొచ్చు’’అని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ తెలిపారు.
తగ్గిన ఆభరణాల డిమాండ్
→ 2024లో బంగారం ఆభరణాల డిమాండ్ 2 శాతం తక్కువగా 563.4 టన్నులకు పరిమితమైంది. 2023లో ఆభరణాల డిమాండ్ 575.8 టన్నులుగా ఉంది.
→ గతేడాది జూలైలో బంగారం దిగుమతుల సుంకాన్ని తగ్గించడంతోపాటు, ఇతర మార్కెట్లతో పోలి్చతే భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేయడం సానుకూలించినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది.
→ పండుగల సీజన్‌కు కీలకమైన 2024 చివరి మూడు నెలల కాలంలో పసిడి డిమాండ్ 265.8 టన్నులుగా ఉంది. 2023 ఇదే త్రైమాసికంలో డిమాండ్ 266.2 టన్నులతో పోల్చితే మార్పు అతి స్వల్పమే.
పెట్టుబడులకు ఆకర్షణీయం
→ అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా పేరొందిన పసిడి.. 2024లో పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారింది. 2024లో బంగారంపై పెట్టుబడులు 29 శాతం పెరిగి 239.4 టన్నులకు చేరాయి. 2013 తర్వాత తిరిగి ఇదే గరిష్ట స్థాయి.
→ 2023లో బంగారం పెట్టుబడుల డిమాండ్ 185.2 టన్నులుగా ఉంది.
→ బంగారం ఈటీఎఫ్‌ల పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. దీంతో పెట్టుబడి పరంగా పసిడికి డిమాండ్ ఇక ముందూ బలంగానే కొనసాగనుంది.
జోరుగా ఆర్‌బీఐ కొనుగోళ్లు
→ 2024లో ఆర్‌బీఐ 73 టన్నుల బంగారాన్ని అదనంగా సమకూర్చుకుంది. 2023లో 16 టన్నుల కొనుగోలుతో పోలి్చతే నాలుగు రెట్లు అధికంగా గతేడాది సొంతం చేసుకుంది.
→ బంగారం రీసైక్లింగ్ పరిమాణం 2% తక్కువగా 114.3 టన్నులుగా నమోదైంది. 2023లో రీసైక్లింగ్ పరిమాణం 117.1 టన్నులుగా ఉంది.
→ బంగారం దిగుమతులు గతేడాది 4 శాతం తక్కువగా 712.1 టన్నులకు పరిమితమయ్యాయి. 2023లో దిగుమతుల పరిమాణం 744 టన్నులుగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన డిమాండ్
→ 2024లో ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 4,974 టన్నులుగా నమోదైంది. 2023లో డిమాండ్ 4,945.9 టన్నులతో పోల్చితే ఒక శాతం పెరిగింది.
→ మూడు, నాలుగో త్రైమాసికాల్లో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. సెంట్రల్ బ్యాంక్‌లు రేట్ల కోత ఆరంభించడం, అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇందుకు కారణాలుగా ఉన్నాయి.
→ సెంట్రల్ బ్యాంక్‌లు 1,044.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. 2023లో కొనుగోళ్లు 1,050.8 టన్నులుగా ఉన్నా యి.
→ పెట్టుబడులకు డిమాండ్ 25% పెరిగి 1,179.5 టన్నులకు చేరింది. 2023లో పసిడి పెట్టుబడుల డిమాండ్ 945.5 టన్నులుగా ఉంది.
→ బంగారం కాయిన్లు, బార్లకు డిమాండ్ 2023 స్థాయిలోనే 1,186 టన్నులుగా నమోదైంది.
→ 2024 మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల డిమాండ్ 11 శాతం క్షీణించి 1,877.1 టన్నులకు పరిమితమైంది. 2023లో ఇది 2,110.3 టన్నులుగా ఉంది.
→ 2025లోనూ సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌ల డిమాండ్ బలంగానే కొనసాగొచ్చని డబ్ల్యూజీసీ అంచనా.
Comments
Please login to add a commentAdd a comment