
బంగారాన్ని సాంప్రదాయకంగా సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడిగా భావిస్తారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు అస్థిరతకు లోనవుతున్న తరుణంలో బంగారంపై పెట్టుబడి ధోరణి ఇన్వెస్టర్లలో మరీ ఎక్కువైంది. బంగారం ధరలు 10 గ్రాములకు రూ .1 లక్షకు చేరువలో ఉన్నందున పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన అవకాశం అని చాలా మంది భావిస్తున్నారు. అయితే బంగారంపై పెట్టుబడులు ఎల్లప్పుడూ అద్భుతమైన రాబడిని ఇస్తాయనుకోవద్దని, బంగారం మాయలో పడొద్దని ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు నితేష్ బుద్ధదేవ్ అనే చార్టర్డ్ అకౌంటెంట్.
స్వల్పకాలిక ధోరణుల ఆధారంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని ఇన్వెస్టర్లకు సీఏ బుద్ధదేవ్ సూచించారు. గత కొన్నేళ్లుగా బంగారం బలమైన రాబడులను అందించినప్పటికీ, ఎల్లప్పుడూ అలా ఉండదని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి, బంగారం దాదాపు సున్నా రాబడిని అందించిన సుదీర్ఘ కాలం కూడా ఉంది. చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు ఈ వాస్తవాన్ని విస్మరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ లెక్కలు చూడండి..
తన హెచ్చరికకు మద్దతుగా బుద్ధదేవ్ 2012 నుండి 2019 వరకు బంగారంపై రాబడులు ఏ మాత్రం ఉన్నాయనే దానికి సంబంధించిన చారిత్రక లెక్కలను ముందుపెట్టారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో బంగారం ధరలు మరీ అంత పెద్దగా పెరిగిందేమీ లేదు. 2012లో 10 గ్రాముల బంగారం ధర రూ.31,050 ఉండగా.. 2019 నాటికి అది స్వల్పంగా పెరిగి రూ.35,220కి చేరింది. అంటే 8 సంవత్సరాలలో పెరిగింది కేవలం రూ .4,170. శాతంలో చెప్పాలంటే మొత్తం 13% రాబడి.
సగటున చూసినప్పుడు, కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు సంవత్సరానికి 1.5% కంటే తక్కువగానే ఉంది. ఇక 1992 నుంచి 2002 మధ్య కాలంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.4,334 నుంచి కేవలం రూ.4,990కి పెరిగిందని, 1.5 శాతం కంటే తక్కువ వార్షిక రాబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
2020 తర్వాత బంగారం ఎందుకు పెరిగిందంటే..
2020 తర్వాత బంగారం ధరలు అకస్మాత్తుగా పెరగడం యాదృచ్ఛికం కాదని బుద్ధదేవ్ వివరించారు. సురక్షిత ఆస్తులకు డిమాండ్‌ను పెంచిన 2019 కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనలు, కేంద్ర బ్యాంకులు దూకుడుగా బంగారం కొనుగోలు చేయడం ఇవన్నీ బంగారం నాటకీయ పెరుగుదలకు దోహదం చేశాయి.
ఈ అంశాలు మదుపర్లు బంగారం కొనుగోలుకు ఎగబడే పరిస్థితిని సృష్టించాయి, ధరలు భారీగా పెరిగాయి. కానీ సీఏ బుద్ధదేవ్ చెబుతున్నట్లుగా ప్రతి పెద్ద స్పైక్ తర్వాత సుదీర్ఘ ఫ్లాట్ లైన్ ఉంటుంది. అంటే ఇన్వెస్టర్లు బంగారం పనితీరులో బూమ్‌లతోపాటు పడిపోయే స్థితినీ అంచనా వేయాలి.
బంగారం ఇప్పటికీ మంచి పెట్టుబడేనా అంటే బుద్ధదేవ్ ప్రకారం.. పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో బంగారానికి ఎప్పటికీ విలువ ఉంటుంది. కానీ ఇది డైవర్సిఫికేషన్, హెడ్జింగ్ సాధనంగా మాత్రమే ఉంటుంది. ఈక్విటీల మాదిరిగా స్థిరమైన రాబడిని అందించదు. కాబట్టి మొత్తం పోర్ట్‌ఫోలియోలో బంగారానికి కేవలం 5% నుండి 12% కేటాయించాలని ఆయన సిఫార్సు చేస్తున్నారు.