
గత 8 ఏళ్లలో భారీ లాభాలు
18 పీఎస్‌యూలలో 15 హిట్
రక్షణ, రైల్వే రంగ స్టాక్స్ జూమ్
కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లో కేంద్ర ప్రభు త్వ రంగ సంస్థ(సీపీఎస్‌ఈ)లు లాభాల దుమ్ము రేపుతున్నాయి. గతేడాది అక్టోబర్ మొదలు విదేశీ ఇన్వెస్టర్లు భారీస్థాయిలో అమ్మకాలు చేపట్టడంతో సెకండరీ మార్కెట్లు క్షీణపథం పట్టాయి. అయినప్పటికీ గత 8ఏళ్ల కాలాన్ని పరిగణిస్తే ఐపీవోకు వచ్చిన పలు ప్రభుత్వ రంగ కౌంటర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచాయి. వివరాలు చూద్దాం..
పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా గత 8 ఏళ్లలో లిస్టయిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు(సీపీఎస్‌ఈ) జోరు చూపుతున్నాయి. కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఉన్నట్టుండి పెట్టుబడుల ఉపసంహరణకు దిగడంతో మార్కెట్లు ఏప్రిల్ తొలి వారం వరకూ క్షీణ పథంలో సాగాయి. అయితే తిరిగి ఇటీవల ఎఫ్‌పీఐల పెట్టుబడులు పెరగడంతో మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఐపీవోలు చేపట్టిన 18 సీపీఎస్‌ఈలలో 15 కంపెనీలు భారీ రిటర్నులు అందించడం గమనార్హం! వీటిలో రక్షణ, రైల్వే రంగ కౌంటర్ల హవా కొనసాగుతోంది. ఈ జాబితాలో ప్రధానంగా మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఏకంగా 3,700 శాతం లాభపడటం విశేషం!
పీఎస్‌యూ గుర్రాలు
స్టాక్ మార్కెట్ల లాభాల రేసులో పలు ప్రభుత్వ రంగ సంస్థలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. సీపీఎస్‌ఈలలో బీమా రంగ సంస్థలను మినహాయిస్తే షిప్ బిల్డింగ్, రైల్వే రంగ కౌంటర్లు రేసు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి. 2017 మే నుంచి పరిగణిస్తే ఐపీవోల ద్వారా స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టయిన మెజారిటీ సీపీఎస్‌ఈలు ఇప్పటివరకూ పెట్టుబడులు కొనసాగించిన ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. ఈ జాబితాలో మజగావ్ డాక్‌సహా.. రైల్ వికాస్ నిగమ్(ఆర్‌వీఎన్‌ఎల్), గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్(జీఆర్‌ఎస్‌ఈ), ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) 1000 శాతందాటి రిటర్నులు సాధించాయి.
ఐపీవో ధర రూ. 19
మజగావ్ డాక్ రూ. 145 ధరలో 2020లో ఐపీవోకు వచ్చింది. 2024 డిసెంబర్‌లో షేరు విభజన(రూ. 10 నుంచి రూ.5కు) చేపట్టింది. 2025 ఏప్రిల్ 28న రూ. 2,786కు చేరింది. వెరసి రూ. 5,500ను అధిగమించింది. ఈ బాటలో గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ 2018లో రూ. 118 ధరలో ఐపీవో చేపట్టింది. ప్రస్తుతం రూ. 1,750ను తాకింది. అంటే 1,370 శాతానికి మించి పరుగుతీసింది. 2017లో రూ. 432 ధరలో ఐపీవో చేపట్టి లిస్టయిన కొచిన్ షిప్‌యార్డ్ రూ. 1,502 వద్ద కదులుతోంది. 2024 జనవరిలో షేర్ల విభజన(రూ. 10 నుంచి రూ.5కు) చేపట్టింది.
600 శాతం జంప్‌చేసింది. రైల్వే రంగ కౌంటర్లలో ఆర్‌వీఎన్‌ఎల్ 2019లో రూ. 19 ధరలో ఐపీవోకు వచ్చి ప్రస్తుతం రూ. 361కు చేరింది. 1865 శాతం దూసుకెళ్లింది. 2019లో రూ. 320 పలికిన ఐఆర్‌సీటీసీ 2021 అక్టోబర్‌లో షేర్ల విభజన(రూ. 10 నుంచి రూ.2) చేపట్టింది. ప్రస్తుతం రూ. 765 వద్ద ట్రేడవుతోంది. 1,110 శాతం రాబడి సాధించింది. ఇతర కౌంటర్లలో 2018లో లిస్టయిన రైట్స్(ఆర్‌ఐటీఈఎస్), ఇర్కాన్ ఇంటర్నేషనల్ సగటున 230 శాతం లాభపడ్డాయి. 2021లో లిస్టయిన రైల్‌టెల్ రూ. 310కు చేరి 238 శాతం ఎగసింది.
600 శాతం అప్
డిఫెన్స్ రంగ కౌంటర్లలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్‌ఏఎల్), భారత్ డైనమిక్స్(బీడీఎల్), మిశ్రధాతు నిగమ్(మిధాని) సైతం వరుసగా 605%, 558 %, 227% చొప్పున లాభపడ్డాయి. 2023లో రూ. 32 ధరలో ఐపీవోకు వచి్చన ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఇరెడా) రూ. 170కు చేరడం ద్వారా 450 శాతానికిపైగా బలపడింది. హౌసింగ్, పట్టాణాభివృద్ధి కార్పొరేషన్(హడ్కో) 2017లో రూ. 60 ధరలో ఐపీవో చేపట్టి ప్రస్తుతం రూ. 226కు చేరింది. 280% రాబడి అందించింది.
రూ. 120 ఐపీవో ధరతో పోలిస్తే ఎంఎస్‌టీసీ రూ. 528ను తాకడం ద్వారా 350% పురోగమించింది. న్యూ ఇండియా అస్యూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్(ఎల్‌ఐసీ), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(జీఐసీ) మాత్రం ఐపీవో ధరతో పోలిస్తే వెనుకంజలో ఉన్నాయి. 2018 జూన్, జులైలలో న్యూ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయడం గమనార్హం.!
– సాక్షి, బిజినెస్ డెస్క్