Government shares
-
వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి వాటా
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా(వీఐఎల్)లో ప్రభుత్వం వాటా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. షేరు విలువ రూ. 10 లేదా ఆపై స్థిరత్వాన్ని సాధిస్తే వాటాను పొందనున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. వొడాఫోన్ ఐడియా బోర్డు రూ. 10 ముఖ విలువకే ప్రభుత్వానికి వాటాను ఆఫర్ చేసింది. ముఖ విలువకే షేర్లను పొందేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. షేరు ధర రూ. 10 లేదా అపై స్థిరత్వాన్ని సాధించాక టెలికం శాఖ(డాట్) ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి షేరు రూ. 10 దిగువనే కదులుతోంది. తాజాగా 0.5% నీరసించి రూ. 9.70 వద్ద ముగిసింది. జూలైలోనే...: వీఐఎల్‌లో ప్రభుత్వం వాటాను సొంతం చేసుకునేందుకు జూలైలోనే ఆర్థిక శాఖ ఆమోదించింది. రూ. 16,000 కోట్లమేర వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పుచేసి ప్రభుత్వానికి కేటాయించేందుకు వీఐఎల్ ఇప్పటికే నిర్ణయించుకుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. వెరసి వీఐఎల్‌లో ప్రమోటర్ల వాటా 74.99 శాతం నుంచి తగ్గి 50 శాతానికి పరిమితంకానుంది. ప్యాకేజీలో భాగంగా ఏజీఆర్ చెల్లింపులకు సంబంధించి వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు టెలికం కంపెనీలకు ప్రభుత్వం అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీకి జూన్ చివరికల్లా స్థూలంగా రూ. 1,99,080 కోట్ల రుణ భారముంది. -
వొడాఫోన్-ఐడియాలో వాటా: మాంచి ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
Govt Not Interested in Supervising Vodafone Idea Operations: భారత టెలికాం రంగంలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉన్న వొడాఫోన్-ఐడియా తన మేజర్ వాటాను కేంద్రం చేతికి అప్పగించింది. దీంతో కార్యనిర్వాహణ, కీలక నిర్ణయాలు ప్రభుత్వమే తీసుకోనుందని.. మంచిరోజులు రాబోతున్నాయంటూ కంపెనీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ తరుణంలో కేంద్రం ఆ ఆశలపై నీళ్లు జల్లింది. కంపెనీలో మేజర్ వాటా దక్కించుకున్నప్పటికీ.. వొడాఫోన్ ఐడియా కంపెనీ కార్యకలాపాల పర్యవేక్షణ, నిర్వహణలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు బోర్డు నిర్ణయాలను సైతం ప్రభావితం చేయబోదని పేర్కొంది. వొడాఫోన్-ఐడియాను ప్రభుత్వ రంగ సంస్థగా మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. బోర్డు సీటుపై ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు. నష్టాల్లో ఉన్న టెల్కో స్థిరపడిన వెంటనే.. నిష్క్రమించాలని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇక వొడాడియా ఆఫర్ చేసిన వాటాను.. ప్రభుత్వ ఈక్విటీగా మార్చే విధానంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) త్వరలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపనుందని అధికారులు వెల్లడించారు(దాదాపు ఖరారైనట్లే!). మొత్తం వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చేయగా.. రూ. 16,000 కోట్లకుగానూ 35.8 శాతం వాటాను వొడాఫోన్-ఐడియా కంపెనీ, కేంద్రానికి అప్పజెప్పేందుకు సిద్ధమైంది. దీంతో కంపెనీలో గరిష్ఠ వాటా దక్కడంతో.. మొత్తం నిర్వహణ ప్రభుత్వమే చూసుకోనుందంటూ(మరో బీఎస్ఎన్ఎల్గా మారనుందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు సైతం) కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ చేతికి మేజర్ వాటాను అప్పజెప్పడం ద్వారా లబ్ధి పొందవచ్చని భావించిన కంపెనీకి.. అధికారుల తాజా ప్రకటనతో నిరాశే ఎదురైంది. కేవలం టెలికాం సంస్కరణల ప్యాకేజీ ద్వారా లిక్విడిటీకి తీసుకురావడం, టెలికాం కంపెనీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటం లాంటి చర్యలకు మాత్రమే ప్రభుత్వం పూనుకోనుందట. ఇక ఓటింగ్ హక్కులు, PSU(పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్)గా మార్చడం, డైరెక్టర్ల బోర్డులో స్థానం పొందడంలాంటి ఆలోచనలు ప్రభుత్వానికి లేదనే స్పష్టత లభించింది. మరోవైపు ఇన్వెస్టర్లలో ధైర్యం నింపేందుకే ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.దీంతో కంపెనీ ఇక మీదట కూడా స్వతంత్రగా కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే.. కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికాం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించించింది. ఇందులో భాగంగానే టెలికం కంపెనీలు.. స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. అలా ఐడియా-వొడాఫోన్ నుంచి కేంద్రం వాటా రూపంలో ఆఫర్ అందుకుంది. సంబంధిత పూర్తి కథనం: ప్రభుత్వం చేతికి వొడాఐడియా! -
ప్రభుత్వం చేతికి వొడాఐడియా!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్ సేవల టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందుకు వీలుగా సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ ప్రణాళికలు అమలైతే వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో స్పెక్ట్రమ్ వేలం వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన వడ్డీని ఈక్విటీగా మార్పు చేసేందుకు బోర్డు నిర్ణయించినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ వడ్డీల ప్రస్తుత నికర విలువ(ఎన్పీవీ) రూ. 16,000 కోట్లుగా అంచనా వేసింది. ఈ అంశాలను టెలికం శాఖ(డాట్) ఖాయం చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్యాకేజీ ఎఫెక్ట్ కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ. 1.95 లక్షల కోట్ల రుణ భారంతో సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 1,08,610 కోట్లు, ఏజీఆర్ బకాయిలు రూ. 63,400 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఇక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలు రూ. 22,700 కోట్లుగా నమోదయ్యాయి. రూ. 10 విలువలో ఈక్విటీ కేటాయింపులకు పరిగణనలోకి తీసుకున్న 2021 ఆగస్ట్ 14కల్లా షేరు సగటు ధర కనీస విలువకంటే తక్కువగా ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రభుత్వానికి షేరుకి రూ. 10 చొప్పున కనీస విలువలో ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు డాట్ తుదిగా ధరను ఖరారు చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ కేటాయింపుతో కంపెనీ ప్రమోటర్లుసహా వాటాదారులందరిపైనా ప్రభావముంటుందని వివరించింది. వెరసి తాజా ఈక్విటీ జారీతో కంపెనీలో ప్రభుత్వానికి 35.8% వాటా లభించనున్నట్లు అంచనా వేసింది. ప్రమోటర్లలో వొడాఫోన్ గ్రూప్ 28.5%, ఆదిత్య బిర్లా గ్రూప్ 17.8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంటాయని తెలియజేసింది. ప్రభుత్వ వాటా ఇలా.. ప్రభుత్వం తమ ప్రణాళికలకు అనుగుణంగా ఈ రుణాలలో ఎంతమేర కావాలనుకుంటే అంతవరకూ ఈక్విటీకి బదులుగా ప్రిఫరెన్స్ షేర్లుగా కూడా మార్చుకునే వీలున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇవి ఆప్షనల్‌గా, లేదా కచ్చితంగా మార్పిడి లేదా రీడీమబుల్గా ఎంచుకునే సౌలభ్యమున్నట్లు వెల్లడించింది. ఎస్‌యూయూటీఐ ద్వారా లేదా ప్రభుత్వం తరఫున ఏ ఇతర ట్రస్టీ ద్వారా అయినా ప్రభుత్వం వీటిని హోల్డ్ చేసే వీలున్నట్లు కంపెనీ వివరించింది. షేరు భారీ పతనం... ప్రభుత్వానికి వాటా జారీ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు ఇంట్రాడేలో 23 శాతంవరకూ దిగజారింది. రూ. 11.50 వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి స్వల్పంగా కోలుకుని 20.5 శాతం నష్టంతో రూ. 11.80 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ 21 శాతం పతనమై రూ. 11.75 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ)లో రూ. 8,764 కోట్లు ఆవిరైంది. రూ. 33,908 కోట్లకు పరిమితమైంది. టాటా టెలీలోనూ వాటా.. వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలో భాగంగా టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వొడాఫోన్ ఐడియా బాటలో ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి కేటాయించనుంది. దీంతో టాటా టెలిలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. వడ్డీని షేర్లుగా జారీ చేసేందుకు వొడాఫోన్ ఐడియా నిర్ణయించిన వెనువెంటనే టాటా టెలి సైతం ఇదే బాటలో పయనించడం గమనార్హం! కాగా.. ఎన్పీవీ ప్రకారం దాదాపు రూ. 850 కోట్ల వడ్డీని ఈక్విటీగా కేటాయించనున్నట్లు తెలియజేసింది. బోర్డుకి చెందిన అత్యున్నత కమిటీ ఏజీఆర్ బకాయిలపై వడ్డీని పూర్తిగా ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. షేర్ల జారీకి పరిగణించే 2021 ఆగస్ట్ 14కల్లా డాట్ మార్గదర్శకాల ప్రకారం సగటు షేరు ధర రూ. 41.50గా మదింపు చేసినట్లు తెలియజేసింది. అయితే ఇందుకు తుదిగా డాట్ అనుమతించవలసి ఉన్నట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 74.36 శాతంగా నమోదైంది. మిగిలిన వాటా పబ్లిక్ వద్ద ఉంది. షేరు జూమ్... ప్రభుత్వానికి వాటా జారీ వార్తలతో టాటా టెలి కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 291 వద్ద ముగిసింది. కంపెనీ ఏజీఆర్ బకాయిలు రూ. 16,798 కోట్లుకాగా.. వీటిలో ఇప్పటికే రూ. 4,197 కోట్లు చెల్లించింది. కాగా.. గత వారం మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ అవకాశాన్ని వినియోగించుకోబోమని స్పష్టం చేసిన విషయం విదితమే. -
గంగవరం పోర్ట్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలు పూర్తి
దొండపర్తి (విశాఖ దక్షిణ): గంగవరం పోర్టు (జీపీఎల్)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) వెల్లడించింది. ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను రూ. 645 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. మరోవైపు, ఏపీఎస్ఈజెడ్లో జీపీఎల్ విలీనానికి సంబంధించిన ప్రతిపాదనకు ఇరు కంపెనీల బోర్డ్‌లు ఆమోదముద్ర వేశాయి. దీని ప్రకారం జీపీఎల్ షేరు ఒక్కింటి విలువను రూ. 120గాను, ఏపీఎస్ఈజెడ్ షేరు విలువను రూ. 754.8గాను లెక్కించారు. విలీన డీల్ బట్టి ప్రతి 1,000 జీపీఎల్ షేర్లకు గాను 159 ఏపీఎస్ఈజెడ్ షేర్లు లభిస్తాయి. జీపీఎల్లో ప్రమోటరు డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి 58.1 శాతం వాటా ఉంది. విలీనానంతరం ఏపీఎస్ఈజెడ్లో వారికి సుమారు 2.2 శాతం వాటా (4.8 కోట్ల షేర్లు) లభిస్తాయి. దీని విలువ దాదాపు రూ. 3,604 కోట్లుగా ఉంటుందని ఏపీఎస్ఈజెడ్ పేర్కొంది. కంపెనీ ఇప్పటికే విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి 31.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేయడంతో 100 శాతం వాటాలు దక్కించుకున్నట్లయ్యింది. 2022 మార్చి 31వ తేదీ నాటికి విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీఎస్ఈజెడ్ భావిస్తోంది. జీపీఎల్ కొనుగోలుతో తమ లాజిస్టిక్స్ సరీ్వసుల సామర్థ్యం మరింత మెరుగవుతుందని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీఎస్ఈజెడ్ సీఈవో కరణ్ అదానీ తెలిపారు. -
షిప్పింగ్ కార్పొరేషన్ వేటలో మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో (ఎస్సీఐ) ప్రభుత్వ వాటా కొనుగోలుకు శక్తి కలిగిన కంపెనీల జాబితాలో హైదరాబాద్‌కు చెందిన మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్టక్చర్ (ఎంఈఐఎల్) నిలిచింది. ఎంఈఐఎల్‌తోపాటు యూఎస్‌కు చెందిన సేఫ్సీ, ఎన్నారై రవి మెహరోత్రా నేతృత్వంలోని కన్సార్షియం షార్ట్ లిస్ట్ అయిన జాబితాలో ఉన్నాయి. ఎస్‌సీఐలో ప్రభుత్వ వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన ఈ మూడు కంపెనీలు టెక్నికల్, ఫైనాన్షియల్ ప్రమాణాల విషయంలో అర్హత సాధించాయి. షిప్పింగ్ కార్పొరేషన్లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 63.75% వాటాను విక్రయిస్తోంది. ఈ వాటాను దక్కించుకున్న సంస్థ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం ఆ తర్వాత మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. 1961 అక్టోబరు 2న ఏర్పాటైన ఎస్సీఐ.. భారత్‌లో అతిపెద్ద షిప్పింగ్ కంపెనీగా ఎదిగింది. సరుకు, ప్రయాణికుల రవాణా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ పెద్ద ఎత్తున బల్క్ క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ప్రొడక్ట్ ట్యాంకర్స్, కంటైనర్ వెసెల్స్, ప్యాసింజర్/కార్గో వెసెల్స్, ఎల్పీజీ, అమోనియా క్యారియర్లను సొంతంగా కలిగి ఉంది. డిసెంబరు త్రైమాసికంలో షిప్పింగ్ కార్పొరేషన్ రూ.841 కోట్ల టర్నోవర్‌పై రూ.103 కోట్ల నికరలాభం ఆర్జించింది. కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.43 % ఎగసి రూ.115.75 వద్ద స్థిరపడింది. -
బ్లూచిప్ పీఎస్‌యూల్లో ఆఫర్ ఫర్ సేల్!
న్యూఢిల్లీ: నాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ వంటి బ్లూచిప్ పీఎస్‌యూల్లో ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో షేర్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లక్ష్య సాధన కష్టతరం కానుండటంతో నాల్కో, కోల్ ఇండియా వంటి మంచి పనితీరు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓఎఫ్ఎస్ను చేపట్టాలని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం భావిస్తోంది. నేషనల్ అల్యూమినియమ్ కంపెనీ(నాల్కో), కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్ఎమ్డీసీ, ఎన్బీసీసీ(ఇండియా), భారత్ ఎలక్ట్రానిక్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్.. ఈ కంపెనీలు ఓఎఫ్ఎస్ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల్లో ప్రభుత్వానికి 52–82 శాతం రేంజ్లో వాటాలున్నాయి. అయితే ఈ కంపెనీల ఓఎఫ్‌ఎస్‌కు ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు మార్కెట్ స్థితిగతులు బాగా ఉంటేనే ఈ షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి దండిగా రాబడి రాగలదు. బీపీసీఎల్, ఎయిర్ ఇండియాల వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తికాకవపోచ్చు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యసాధనలో రూ.87,000 కోట్ల మేర కోత పడనున్నది. -
నిర్భయంగా నిర్ణయాలు తీసుకోండి
* నిష్పక్షపాతంగా వ్యవహరించండి * ప్రభుత్వ రంగ బ్యాంకర్లకు * ఆర్థిక శాఖ ఆదేశాలు న్యూఢిల్లీ: వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. అలాగే, ఇతరత్రా ఒత్తిళ్లను పట్టించుకోరాదని సూచించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల (ఎఫ్ఐ) అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండబోదని హామీ ఇచ్చింది. ఆర్థిక శాఖ సోమవారం ఈ మేరకు పీఎస్‌బీలు, ఎఫ్ఐలు, బీమా సంస్థల చీఫ్‌లకు ఆదేశాలు పంపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని అందులో పేర్కొంది. రుణం తీసుకునేవారి పలుకుబడికి, ఒత్తిడికి ప్రభావితం కారాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా పక్షపాత ధోరణితో వ్యవహరించిన పక్షంలో దానికి పూర్తి బాధ్యత వారిదే అవుతుందని స్పష్టం చేసింది. బదిలీలు, నియామకాల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని, ఆఖరికి ఆర్థిక శాఖ నుంచి సిఫార్సులు వచ్చినా పరిగణించనక్కర్లేదని పేర్కొంది. ఒకవేళ ఏదైనా ప్రత్యేక సందర్భంలో మినహాయింపునిచ్చినా అందుకు గల కారణాలను సీఎండీ స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ సూచించింది. పీఎస్బీల్లో ప్రభుత్వ జోక్యం ఉండబోదంటూ ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాఖ తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పీఎస్బీల్లో ఇప్పుడే వాటాలు విక్రయించం.. పీఎస్బీల్లో ప్రభుత్వ వాటాలు విక్రయించాల్సిన అవసరమేమీ ప్రస్తుతం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. ఇప్పుడున్న వేల్యుయేషన్లను బట్టి చూసినా.. ఇది అభిలషణీయం కాదన్నారు. 27 పీఎస్బీల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకోవాలని కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2019 ఏప్రిల్ నాటికి బాసెల్ 3 ప్రమాణాలను అందుకునేందుకు కావాల్సిన నిధులను బ్యాంకులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నందున వాటాల విక్రయ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, పీఎస్బీల్లో నిరర్ధక ఆస్తుల సమస్య ఆమోదయోగ్యం కానంత అధిక స్థాయిలో ఉందని సిన్హా చెప్పారు. 2014 సెప్టెంబర్ ఆఖరు నాటికి పీఎస్బీల్లో స్థూల ఎన్పీఏలు రూ. 2.43 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నాయి. ఇక, పీఎస్‌బీల కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదల్చుకోలేదని, ఆయా బ్యాంకుల యాజమాన్యాలు క్రియాశీలకంగా, ప్రొఫెషనలిజంతో పనిచేయాలని సిన్హా సూచించారు.