ప్రభుత్వం చేతికి వొడాఐడియా! | Govt set to become a shareholder in Vodafone Idea | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం చేతికి వొడాఐడియా!

Published Wed, Jan 12 2022 5:33 AM | Last Updated on Wed, Jan 12 2022 5:33 AM

Govt set to become a shareholder in Vodafone Idea - Sakshi

న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్‌ సేవల టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందుకు వీలుగా సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ ప్రణాళికలు అమలైతే వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో స్పెక్ట్రమ్‌ వేలం వాయిదాలు, ఏజీఆర్‌ బకాయిలపై చెల్లించవలసిన వడ్డీని ఈక్విటీగా మార్పు చేసేందుకు బోర్డు నిర్ణయించినట్లు వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ఈ వడ్డీల ప్రస్తుత నికర విలువ(ఎన్‌పీవీ) రూ. 16,000 కోట్లుగా అంచనా వేసింది. ఈ అంశాలను టెలికం శాఖ(డాట్‌) ఖాయం చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది.

ప్యాకేజీ ఎఫెక్ట్‌
కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్‌ వాయిదాలు, ఏజీఆర్‌ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్‌పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ. 1.95 లక్షల కోట్ల రుణ భారంతో సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్‌ బకాయిలు రూ. 1,08,610 కోట్లు, ఏజీఆర్‌ బకాయిలు రూ. 63,400 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఇక బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల రుణాలు రూ. 22,700 కోట్లుగా నమోదయ్యాయి.

రూ. 10 విలువలో
ఈక్విటీ కేటాయింపులకు పరిగణనలోకి తీసుకున్న 2021 ఆగస్ట్‌ 14కల్లా షేరు సగటు ధర కనీస విలువకంటే తక్కువగా ఉన్నట్లు వొడాఫోన్‌ ఐడియా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రభుత్వానికి షేరుకి రూ. 10 చొప్పున కనీస విలువలో ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు డాట్‌ తుదిగా ధరను ఖరారు చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ కేటాయింపుతో కంపెనీ ప్రమోటర్లుసహా వాటాదారులందరిపైనా ప్రభావముంటుందని వివరించింది. వెరసి తాజా ఈక్విటీ జారీతో కంపెనీలో ప్రభుత్వానికి 35.8% వాటా లభించనున్నట్లు అంచనా వేసింది. ప్రమోటర్లలో వొడాఫోన్‌ గ్రూప్‌ 28.5%, ఆదిత్య బిర్లా గ్రూప్‌ 17.8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంటాయని తెలియజేసింది.

ప్రభుత్వ వాటా ఇలా..
ప్రభుత్వం తమ ప్రణాళికలకు అనుగుణంగా ఈ రుణాలలో ఎంతమేర కావాలనుకుంటే అంతవరకూ ఈక్విటీకి బదులుగా ప్రిఫరెన్స్‌ షేర్లుగా కూడా మార్చుకునే వీలున్నట్లు వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ఇవి ఆప్షనల్‌గా, లేదా కచ్చితంగా మార్పిడి లేదా రీడీమబుల్‌గా ఎంచుకునే సౌలభ్యమున్నట్లు వెల్లడించింది. ఎస్‌యూయూటీఐ ద్వారా లేదా ప్రభుత్వం తరఫున ఏ ఇతర ట్రస్టీ ద్వారా అయినా ప్రభుత్వం వీటిని హోల్డ్‌ చేసే వీలున్నట్లు కంపెనీ వివరించింది.

షేరు భారీ పతనం...
ప్రభుత్వానికి వాటా జారీ వార్తల నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్‌ఈలో ఈ షేరు ఇంట్రాడేలో 23 శాతంవరకూ దిగజారింది. రూ. 11.50 వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి స్వల్పంగా కోలుకుని 20.5 శాతం నష్టంతో రూ. 11.80 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈలోనూ 21 శాతం పతనమై రూ. 11.75 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ క్యాప్‌(విలువ)లో రూ. 8,764 కోట్లు ఆవిరైంది. రూ. 33,908 కోట్లకు పరిమితమైంది.

టాటా టెలీలోనూ వాటా..
వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలో భాగంగా టాటా టెలిసర్వీసెస్‌ (మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వొడాఫోన్‌ ఐడియా బాటలో ఏజీఆర్‌ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి కేటాయించనుంది. దీంతో టాటా టెలిలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. వడ్డీని షేర్లుగా జారీ చేసేందుకు వొడాఫోన్‌ ఐడియా నిర్ణయించిన వెనువెంటనే టాటా టెలి సైతం ఇదే బాటలో పయనించడం గమనార్హం!

కాగా.. ఎన్‌పీవీ ప్రకారం దాదాపు రూ. 850 కోట్ల వడ్డీని ఈక్విటీగా కేటాయించనున్నట్లు తెలియజేసింది. బోర్డుకి చెందిన అత్యున్నత కమిటీ ఏజీఆర్‌ బకాయిలపై వడ్డీని పూర్తిగా ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. షేర్ల జారీకి పరిగణించే 2021 ఆగస్ట్‌ 14కల్లా డాట్‌ మార్గదర్శకాల ప్రకారం సగటు షేరు ధర రూ. 41.50గా మదింపు చేసినట్లు తెలియజేసింది. అయితే ఇందుకు  తుదిగా డాట్‌ అనుమతించవలసి ఉన్నట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్‌కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 74.36 శాతంగా నమోదైంది. మిగిలిన వాటా పబ్లిక్‌ వద్ద ఉంది.

షేరు జూమ్‌...
ప్రభుత్వానికి వాటా జారీ వార్తలతో టాటా టెలి కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. బీఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 291 వద్ద ముగిసింది. కంపెనీ ఏజీఆర్‌ బకాయిలు రూ. 16,798 కోట్లుకాగా.. వీటిలో ఇప్పటికే రూ. 4,197 కోట్లు చెల్లించింది. కాగా.. గత వారం మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ అవకాశాన్ని వినియోగించుకోబోమని స్పష్టం చేసిన విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement