
రూ. 36,950 కోట్ల విలువైన షేర్లు జారీ
49 శాతానికి బలపడనున్న ప్రభుత్వ వాటా
న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియాలో తాజాగా ప్రభుత్వం రూ. 36,950 కోట్ల విలువైన షేర్లను సొంతం చేసుకోనుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 48.99 శాతానికి బలపడనున్నట్లు వొడాఫోన్ ఐడియా తాజాగా పేర్కొంది. ఇప్పటికే కంపెనీలో 22.6 శాతం వాటాతో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది.
ప్రమోటర్లుగా కంపెనీలో వొడాఫోన్ గ్రూప్ 14.76 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్ 22.56 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. తాజా పెట్టుబడులతో ప్రభుత్వం ప్రమోటర్ల సంయుక్త వాటాను సైతం అధిగమించనుంది.
కమ్యూనికేషన్ల శాఖ 2021 సెప్టెంబర్‌లో ప్రకటించిన టెలిరం రంగ సహాయక ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం రూ. 36,950 కోట్లను ఈక్విటీ షేర్లుగా మారి్పడి చేసుకుంటున్నట్లు వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. వెరసి కంపెనీ 30 రోజుల్లోగా ప్రభుత్వానికి 3,695 కోట్ల ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది. 2026కల్లా వొడాఫోన్ ఐడియా చెల్లించవలసిన స్పెక్ట్రమ్, స్థూల ఆదాయ సర్దుబాటు(ఏజీఆర్) విలువ రూ. 32,724 కోట్లుకాగా.. ప్రభుత్వానికి తాజాగా ఈక్విటీ జారీ చేయనుంది.