టెల్కోలపై సుప్రీం కన్నెర్ర! | Supreme Court to hear telecom operators plea on AGR-related dues on Friday | Sakshi
Sakshi News home page

టెల్కోలపై సుప్రీం కన్నెర్ర!

Published Sat, Feb 15 2020 4:38 AM | Last Updated on Sat, Feb 15 2020 4:58 AM

Supreme Court to hear telecom operators plea on AGR-related dues on Friday - Sakshi

న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బకాయిల షెడ్యూల్‌పై ఊరట లభిస్తుందని ఆశిస్తున్న టెలికం సంస్థలకు శుక్రవారం షాకుల మీద షాకులు తగిలాయి. బాకీలు కట్టేందుకు మరికాస్త వ్యవధి లభించేలా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలంటూ టెల్కోలు వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పైగా రూ.1.47 లక్షల కోట్లు కట్టాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశించిన విధంగా బాకీలు చెల్లించకపోతే టెలికం సంస్థల అధినేతలు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది.

అటు టెలికం శాఖ (డాట్‌)కూ మొట్టికాయలు వేసింది. గత ఉత్తర్వులను పక్కన పెడుతూ బాకీల వసూలు విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దని లిఖితపూర్వక ఆదేశాలిచ్చిన డాట్‌ డెస్క్‌ ఆఫీసర్‌ ’తెంపరితనం’తో వ్యవహరించారని ఈ సందర్భంగా ఆక్షేపించింది. ఆ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించకపోతే సదరు అధికారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణ తేదీ మార్చి 17లోగా బాకీలు కట్టేయాలంటూ టెలికం సంస్థలను ఆదేశించింది. గత ఆదేశాల ఉల్లంఘనకు గాను కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో ఆయా టెల్కోల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు, డాట్‌ డెస్క్‌ అధికారి వివరణ ఇవ్వాలని సూచించింది. నిర్దేశిత గడువులోగా బకాయిలు కట్టని పక్షంలో .. ఆయా టెల్కోల ఎండీలు/డైరెక్టర్లతో పాటు డెస్క్‌ ఆఫీసర్‌ కూడా మార్చి 17న వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఏజీఆర్‌ సంబంధిత బాకీల చెల్లింపునకు మరింత సమయం ఇవ్వాలంటూ వొడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్, టాటా టెలీసర్వీసెస్‌ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రూ. 2.65 లక్షల కోట్లు కట్టాలన్న డాట్‌ నోటీసులపై తగు కోర్టులను ఆశ్రయించాలంటూ గెయిల్‌ తదితర టెలికంయేతర సంస్థలకు సూచించడంతో అవి తమ పిటిషన్‌లను ఉపసంహరించుకున్నాయి. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో దాదాపు రూ. 35,586 కోట్ల బకాయిల్లో సుమారు రూ.10,000 కోట్లు.. వారం రోజుల్లో డిపాజిట్‌ చేస్తామంటూ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది.

చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా..
దేశంలో చట్టాల అమలు జరిగే పరిస్థితే లేదా? అంటూ అత్యున్నత న్యాయస్థానం విచారణ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఏజీఆర్‌కి సంబంధించి తమ ఉత్తర్వులను నిలుపుదల చేసేలా డెస్క్‌ ఆఫీసర్‌ స్థాయి అధికారి ఆదేశాలివ్వడమేంటని కోర్టు ఆక్షేపించింది. సదరు అధికారికి నోటీసులు జారీ చేసింది. ‘సుప్రీం కోర్టు ఆదేశాలను నిలుపుదల చేసేలా ఒక డెస్క్‌ ఆఫీసరు.. ఏకంగా అకౌంటెంట్‌ జనరల్‌కు రాస్తారా? ఇది ధనబలం కాకపోతే మరేంటి? న్యాయస్థానాలతో వ్యవహరించే తీరు ఇదేనా? దేశంలో చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా? ఇవన్నీ చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఈ కోర్టులోనూ, ఈ వ్యవస్థలోనూ పనిచేయాలనిపించడం లేదు. నాకు చాలా ఆవేదనగా ఉంది.

సాధారణంగా నేను కోపగించుకోను.. కానీ ఈ వ్యవస్థ, ఈ దేశంలో జరుగుతున్నవి చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు‘ అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. డెస్క్‌ ఆఫీసర్‌ తీరుపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలిపారు. అయితే, ‘ఇలాంటి ధోరణులు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఒక డెస్క్‌ అధికారి.. ఇంత తెంపరితనంతో వ్యవహరించారంటే సుప్రీం కోర్టును మూసేద్దామా? అసలు అతనిపైనా, ఈ కంపెనీలపైనా కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? టెల్కోల రివ్యూ పిటీషన్‌ను డిస్మిస్‌ చేశాం. అయినా ఇప్పటిదాకా అవి పైసా కట్టలేదు. న్యాయవ్యవస్థ, దేశం ఏమై పోతుందా అని ఆందోళన కలుగుతోంది‘ అని మిశ్రా వ్యాఖ్యానించారు.  

మిగిలేవి రెండు సంస్థలే..: విశ్లేషకులు
టెల్కోల బకాయిలపై అత్యున్నత న్యాయస్థానం గట్టి చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనివల్ల టెలికం రంగంలో ఇక రెండే సంస్థల ఆధిపత్యం ఉండే అవకాశాలు గతంలో కన్నా మరింత పెరిగాయని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీం కోర్టు తీర్పు.. నిస్సందేహంగా టెలికం పరిశ్రమకు దుర్వార్తే. ముఖ్యంగా వొడాఫోన్‌ ఐడియా పరిస్థితి గతంలో కన్నా దారుణంగా మారనుంది‘ అని కన్సల్టింగ్‌ సంస్థ కామ్‌ ఫస్ట్‌ డైరెక్టర్‌ మహేష్‌ ఉప్పల్‌ తెలిపారు. లైసెన్సు ఒప్పందం ప్రకారం బాకీలు కట్టాల్సిన బాధ్యత టెల్కోలపై ఉందంటూ గడిచిన రెండు, మూడు పర్యాయాలు సుప్రీం కోర్టు చెప్పినందున .. శుక్రవారం వచ్చిన ఆదేశాలు అనూహ్యమైనవేమీ కావని ఆయన చెప్పారు.  

అర్ధరాత్రిలోగా కట్టండి: టెలికం శాఖ
సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో టెలికం శాఖ కదిలింది. బకాయిల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దంటూ జనవరి 23న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు దిశగా సత్వర చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించింది. దీనికి అనుగుణంగా..  శుక్రవారం అర్ధరాత్రిలోగా బకాయీలన్నీ కట్టేయాలంటూ భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా తదితర సంస్థలను ఆదేశించింది.

వివాదం ఏంటంటే...
లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల లెక్కింపునకు టెల్కోల టెలికంయేతర ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చంటూ ప్రభుత్వానికి అనుకూలంగా గతేడాది అక్టోబర్‌ 24న సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని సమీక్షించాలంటూ టెల్కోలు వేసిన రివ్యూ పిటిషన్లను జనవరి 16న కొట్టి వేసింది. జనవరి 23లోగా బాకీలు కట్టేయాలంటూ సూచించింది. దీనిపై టెల్కోలు పునఃసమీక్షకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇది తేలేలోగా బాకీల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవద్దంటూ డాట్‌ డెస్క్‌ అధికారి ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. డాట్‌ లెక్కల ప్రకారం మొత్తం 15 సంస్థలు.. కేంద్రానికి రూ. 1.47 లక్షల కోట్ల బాకీలు కట్టాల్సి ఉంది.

వొడా–ఐడియా షేరు భారీ పతనం
సుప్రీం కోర్టు ఆదేశాలతో వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) షేరు ఏకంగా 23 శాతం పతనమైంది. బీఎస్‌ఈలో రూ. 3.44 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 27 శాతం క్షీణించి రూ. 3.25 స్థాయిని కూడా తాకింది. దీంతో కంపెనీ మార్కెట్‌ వేల్యుయేషన్‌ రూ.2,988 కోట్లు తగ్గి రూ. 9,885 కోట్లకు పడిపోయింది. అటు టెలికం రంగానికి భారీగా రుణాలిచ్చిన బ్యాంకుల షేర్లపై కూడా ఈ తీర్పు ప్రతికూల ప్రభావం పడింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 4.38%, ఎస్‌బీఐ 2.41%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.77%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.5% క్షీణించాయి. క్యూ3 ఆర్థిక ఫలితాల్లో వొడాఫోన్‌ ఐడియా రూ. 6,439 కోట్ల నష్టాలు ప్రకటించడం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement