దొండపర్తి (విశాఖ దక్షిణ): గంగవరం పోర్టు (జీపీఎల్)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్‌ఈజెడ్) వెల్లడించింది. ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను రూ. 645 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. మరోవైపు, ఏపీఎస్‌ఈజెడ్‌లో జీపీఎల్ విలీనానికి సంబంధించిన ప్రతిపాదనకు ఇరు కంపెనీల బోర్డ్‌లు ఆమోదముద్ర వేశాయి. దీని ప్రకారం జీపీఎల్ షేరు ఒక్కింటి విలువను రూ. 120గాను, ఏపీఎస్‌ఈజెడ్ షేరు విలువను రూ. 754.8గాను లెక్కించారు. విలీన డీల్ బట్టి ప్రతి 1,000 జీపీఎల్ షేర్లకు గాను 159 ఏపీఎస్‌ఈజెడ్ షేర్లు లభిస్తాయి.
జీపీఎల్‌లో ప్రమోటరు డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి 58.1 శాతం వాటా ఉంది. విలీనానంతరం ఏపీఎస్‌ఈజెడ్‌లో వారికి సుమారు 2.2 శాతం వాటా (4.8 కోట్ల షేర్లు) లభిస్తాయి. దీని విలువ దాదాపు రూ. 3,604 కోట్లుగా ఉంటుందని ఏపీఎస్‌ఈజెడ్ పేర్కొంది. కంపెనీ ఇప్పటికే విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి 31.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేయడంతో 100 శాతం వాటాలు దక్కించుకున్నట్లయ్యింది. 2022 మార్చి 31వ తేదీ నాటికి విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీఎస్‌ఈజెడ్ భావిస్తోంది. జీపీఎల్ కొనుగోలుతో తమ లాజిస్టిక్స్ సరీ్వసుల సామర్థ్యం మరింత మెరుగవుతుందని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీఎస్‌ఈజెడ్ సీఈవో కరణ్ అదానీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment