ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుతోపాటు ఎల్లోమీడియా మొత్తానికి అక్కసు ఉందన్నది జగమెరిగిన సత్యం. అయితే ఈ అక్కసు, ద్వేషాల్లో వారు ప్రధాని మోదీని భ్రష్టుపట్టించేందుకూ వెనుకాడటం లేదు. ఎలాగంటారా? అదానీపై అమెరికా కోర్టు పెట్టిన ముడుపుల కేసే ఉదాహరణ. ఒకపక్క చంద్రబాబేమో ఈ కేసులు ఆంధ్రప్రదేశ్‌కు అప్రతిష్ట తీసకొచ్చాయని వ్యాఖ్యానిస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మోదీని నిందిస్తోంది.
ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ కూడా కాంగ్రెస్ మాటలకు వత్తాసు పలుకుతున్నట్లుగా జగన్‌పై ఆరోపణలు గుప్పించడం మోదీని భ్రష్టుపట్టించడమే అవుతుంది. అదానీపై వచ్చిన ఆరోపణలలో నిజమని నమ్మితే చంద్రబాబు కూడా మోదీని నేరుగా తప్పు పట్టాలి కదా! ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పాలి కదా! అలా కాకుండా జగన్‌పై విమర్శలు చేస్తూ మోదీకి చికాకు కలిగించారు. ఈ విషయం కేంద్రంలోని బీజేపీ పెద్దలకు అర్థమవుతోందో లేదో!
ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (సెకి) చేసుకున్న ఒప్పందానికి సంబంధించి అవినీతి జరిగిందన్నది టీడీపీ, ఎల్లో మీడియా ఆరోపణ. తన సోలార్ పవర్‌కు ఆర్డర్లు పొందడానికి అదానీ ఆయా రాష్ట్రాలలో లంచాలు ఇచ్చారని అమెరికా పోలీసులు పెట్టిన అభియోగాల ఆధారంగా వీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపినట్లు కనిపించలేదు.
ప్రముఖ న్యాయ కోవిదులు ముకుల్ రోహ్తగి, మహేష్ జెఠ్మలానీలు ఇదే వ్యాఖ్య చేశారు. అదే టైమ్ లో ఐదు రాష్ట్రాలు సెకీతో ఒప్పందం కుదుర్చుకుని విద్యుత్ తీసుకోవడానికి సిద్ధపడితే, ఆ రాష్ట్రాలలో కూడా ముడుపులు ఇచ్చారని అంటూనే అమెరికా పోలీసులు ఒక్క ఏపీ పేరునే ప్రస్తావించడం అనుమానాస్పదంగా ఉంది. ఈ రాష్ట్రాలు అసలు అదానీతో ఒప్పందమే చేసుకోలేదు. ఏపీకి సంబంధించిన జగన్ ప్రత్యర్థులు ఎవరైనా అమెరికా పోలీసులను కూడా ప్రభావితం చేశారా అన్న సందేహం వస్తుంది. అదానీ ప్రధాని మోదీకి సన్నిహితుడు కావడంంతో అంతర్జాతీయ సంస్థలు ఏమైనా దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇలాంటి కుట్రలు చేశాయా? అన్న డౌటు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
జగన్‌పై విమర్శలు చేస్తే అవి మోదీకి, అదానీకి తగులుతాయన్న సంగతి చంద్రబాబు నాయుడు తెలియదా! సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఏమైనా ప్రైవేటు సంస్థా? కాదు కదా! కేంద్రానిది. వారు దానీ కంపెనీ నుంచో, మరో కంపెనీ నుంచో పవర్ కొని ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తే వీరికి వచ్చిన కష్టం ఏమిటి? రాష్ట్రానికి విద్యుత్ యూనిట్ రూ.2.49లకే రావడం మేలా? కాదా? అన్నది చెప్పకుండా జగన్ పై బురద వేయడం వల్ల అది ఆయనపైనే పడుతుందా? ఆటోమాటిక్ గా అదానీతోపాటు, మోదీపై కూడా పడుతుంది కదా! చంద్రబాబు ఉద్దేశం అదే అయినా, లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా భావన అదే అయినా, ధైర్యంగా నేరుగానే ఆ మాట చెప్పి ఉండవచ్చు. జగన్‌తోపాటు వారిద్దరిపై కూడా ధ్వజమెత్తి ఉండవచ్చు.
అలా ఎందుకు చేయడం లేదు? ఈ నేపథ్యంలో జగన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు క్షమాపణ డిమాండ్‌తో రూ.వంద కోట్ల పరువు నష్టం పరిహారం కోరుతూ నోటీసు పంపించారు. అయినా ఈ మీడియా అడ్డగోలు కథనాలు ఆపకపోవడం గమనార్హం. ప్రస్తుతం థేపీలో పెరుగుతున్న విద్యుత్ ఛార్జీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవి ఈ యాగీ చేస్తున్నాయి. తన ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల ఏడాదికి రూ.నాలుగు వేల కోట్ల చొప్పున పాతికేళ్లకు ఏపీకి రూ.లక్ష కోట్లు ఆదా అయిందని, అదంతా సంపదేనని జగన్ అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం రూ.ఐదు నుంచి రూ.ఆరులకు సౌర, పవన విద్యుత్తును కొనుగోలు చేస్తామని ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఏపీకి రూ.85 వేల కోట్ల భారం పడిందని జగన్ చెప్పారు.
ఈ విషయాలకు ఈనాడు నేరుగా సమాధానం ఇవ్వకుండా చంద్రబాబు టైమ్ లో చేసిన ఒప్పందాలను ఈ ఒప్పందంతో పోల్చరాదనే పిచ్చి వాదన చేసింది. ఇందులోనే వారి డొల్లతనం బయటపడింది. అంత అధిక ధరలకు చంద్రబాబు ప్రభుత్వం పాతికేళ్లకు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఈనాడు రామోజీరావుకు తెలుసు కదా! అయినా అప్పట్లో ఈనాడు ఎందుకు ఆ ఒప్పందాలను వ్యతిరేకించలేదు.
రూ.2.49లకే యూనిట్ విద్యుత్ కొంటేనే రూ.1750 కోట్ల లంచం ఇచ్చే అవకాశం ఉంటే అంతకు రెట్టింపు ధరకు పాతికేళ్లపాటు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఉంటే ఇంకెంత ముడుపులకు అవకాశం ఉండి ఉండాలి? పైగా జగన్ ప్రభుత్వం ఆ పీపీఏలను రద్దు చేయాలని తలపెడితే అప్పుడు ఇదే ఎల్లో మీడియా, చంద్రబాబు రద్దు చేయరాదని, పెట్టుబడులు రావంటూ ఎందుకు వాదించారు? దీంట్లో వారి ఇంటరెస్టు ఏమిటి? వారు ప్రచారం చేసినదాని ప్రకారం సెకీతో జగన్ ప్రభుత్వం ఒప్పందం వల్ల లక్ష కోట్ల భారం పడాలి.అది నిజమే అనుకుంటే అది ఎవరు చేస్తున్నట్లు. కేంద్ర ప్రభుత్వమే కదా! అంటే మోదీ ప్రభుత్వ చర్య వల్ల ఏపీకి లక్ష కోట్ల నష్టం వస్తోందని ఎందుకు రాయలేదు! సెకీ అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ ఛార్జీలను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ గురించి ఎందుకు ఈనాడు మీడియా సమాధానం ఇవ్వలేకపోయింది. అది నిజమా? కాదా? దానివల్ల ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకు కేంద్రం ఏపీకి విద్యుత్ సరఫరా చేయడానికి ముందుకు వచ్చిందన్న వాస్తవాన్ని ఎందుకు కప్పిపుచ్చారు. అలాగే గుజరాత్‌లో రూ.1.99లకే యూనిట్ విద్యుత్ వస్తోందని ఈనాడు ప్రచారం చేసింది.
ఇక్కడ మాత్రం అతి తెలివిగా అక్కడ నుంచి ఏపీకి తరలించడానికి అయ్యే వీలింగ్ ఛార్జీల ఖర్చు మరో రెండు రూపాయల గురించి మాత్రం కప్పిపుచ్చింది. ఇది వీళ్ల దిక్కుమాలిన జర్నలిజం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారనో, లేక తానే కనిపెట్టినట్లో ఏడు గంటలలోనే సెకీతో ఒప్పందం చేసుకున్నారని ఈనాడు పచ్చి అబద్దం ప్రచారం చేసినట్లు జగన్ డాక్యుమెంట్ల సహితంగా వివరిస్తే, దాని మీద తేలుకట్టిన దొంగ మాదిరి వ్యవహరించింది. తమిళనాడు, ఒడిషా, చత్తీస్‌గడ్, జమ్ము-కశ్మీర్ రాష్ట్రాలు సెకి నుంచి రూ.2.61లకు కొనుగోలు చేస్తే, దానిని ఎందుకు ఈ మీడియా చెప్పడం లేదు! పోనీ సెకితో కాకుండా అదానితో జగన్ ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకుందని చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని ఆధారాలతో చూపించాయా? తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం సెకీతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే కేంద్రం నుంచి వచ్చే రూ.2800 కోట్ల ప్రోత్సహానికి గండి పడుతుందట. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి చెప్పారని ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. అంటే ఈ ఒప్పందం మంచిది అనే కదా!
తమ చేతిలో మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు రాసేసి బురద చల్లితే సరిపోతుందని అనుకుంటే సరిపోదు. వీరు జగన్ మీద బురద చల్లామని అనుకుంటున్నారు కాని, అది పడుతోంది మోదీపైన.ఎల్లో మీడియా కాని, టీడీపీ నేతలు పార్టీ ఆపీస్‌లో కూర్చుని ఎలాంటి వికృత ప్రచారం చేశారు! అమెరికా కేసులో జగన్ పేరు ఉన్నట్లు, ఆ పోలీసులు ఇండియాకు వచ్చి అరెస్టు చేసేస్తున్నట్లు, చివరికి అక్కడ జైలు కూడా రెడీ చేసినట్లు ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారు. ఇలా చేసినందుకు వారు సిగ్గు పడడం లేదు.
అందులో ఏమాత్రం నిజం ఉన్నా అదానీ ముందుగా జైలుకు వెళతారని కదా? అని టీడీపీ వారు చెప్పాల్సింది.విచిత్రం ఏమిటంటే ఏపీ బీజేపీ నేతలు కొందరు చంద్రబాబుకే ప్రధాన్యత ఇస్తూ, మోదీపై బురద వేస్తున్నా కనీసం ఖండించ లేదు. గతంలో జగన్ పై సీబీఐ అక్రమ కేసులు పెట్టినట్లుగానే ఇప్పుడు అమెరికాలో కూడా పోలీసులు పిచ్చి అభియోగాలు మోపారా అన్న సందేహాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో సిమెంట్ కంపెనీకి నీరు ఇస్తే అది క్విడ్ ప్రోకో అని, పరిశ్రమకు భూమి ఇస్తే, అందులో నేరం ఉందని.. ఇలా జగన్ పై తప్పుడు కేసులు పెట్టారు.
ఆ కేసుల వల్ల ఎపికి తీరని నష్టం జరిగింది. కొత్త పరిశ్రమలు రాకుండా పోయాయి.సోనియా గాంధీ, చంద్రబాబులతో పాటు అప్పటి సీబీఐ అధికారులు దీనికి కారణం అని భావిస్తారు. ఇప్పుడు కూడా సెకీ ఒప్పందంపై అనవసర వివాదం సృష్టించి దేశానికి, అందులోను ఏపీకి నష్టం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒప్పందాన్ని రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీపై కేసు పెట్టే ధైర్యం చంద్రబాబు ప్రభుత్వం చేయవచ్చు కదా!అలా ఎందుకు చేయడం లేదు. పరోక్షంగా మోదీని గబ్బు పట్టిస్తూ, ఇంకో వైపు ఆ అగ్రిమెంట్ ను ఎందుకు కొనసాగిస్తున్నారన్న దానికి సమాధానం దొరకదు. ఈనాడు అధినేత దివంగత రామోజీకి పద్మ విభూషణ్ బిరుదు ఇప్పిస్తే, దానికి రిటర్న్ గిఫ్ట్ గా ప్రధాని మోదీకి ఆయన కుమారుడు కిరణ్ బురద రాస్తున్నట్లు అనిపిస్తుంది.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment