‘విడ్డూరంగా షర్మిల మాటలు.. ముమ్మాటికీ అది తప్పుడు ప్రచారమే’ | YSRCP Rachamallu Siva Prasad Reddy Slams Sharmila Over Gautam Adani Issue, Check Out For More Details | Sakshi
Sakshi News home page

‘విడ్డూరంగా షర్మిల మాటలు.. ముమ్మాటికీ అది తప్పుడు ప్రచారమే’

Published Thu, Nov 28 2024 2:33 PM | Last Updated on Thu, Nov 28 2024 3:00 PM

YSRCP Rachamallu Siva Prasad Reddy Slams Sharmila Over Adani Issue

వైఎస్సార్ జిల్లా, సాక్షి: అదానీ వ్యవహారంతో గత ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పత్రికల్లో వస్తున్న వార్తల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదని అన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి. గురువారం ఈ అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలపైనా మండిపడ్డారు.

‘‘అదానీ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో జగన్ కు లంచాలు ముట్టాయంటూ షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అదానీ కంపెనీ విద్యుత్ ను కేంద్ర ప్రభుత్వానికి అమ్మితే.. కేంద్ర ప్రభుత్వ సంస్థ  సెకి ద్వారా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో అదానీ లంచం ఎందుకిస్తారు.? అదానీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు.

.. షర్మిల పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తుంది. రాజకీయాలను అడ్డు పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చు కోవాలనుకుంటున్నారు. అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అని చార్జిషీట్ లో ఉంటే.. ఏకంగా జగన్‌కు 1,750 కోట్లు లంచం ఇచ్చారని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. జగన్‌ హయాంలో రాష్ట్రానికి తక్కువతో విద్యుత్ కొని ఆదా చేస్తే తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు, షర్మిలకు దమ్ముంటే నరేంద్ర మోదీని ప్రశ్నించాలి. 

.. గడచిన 6 నెలల్లో కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్న శివప్రసాద్‌రెడ్డి..  అబద్ధాలను అస్త్రాలుగా చేసుకుని పాలిస్తూ ఏపీ ప్రజలను గాలికి వదిలేశారన్నారు. ‘‘నాడు కేబినెట్ చర్చల అనంతరం 2.49 పైసలకే మన ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేసింది. కానీ, ఇప్పుడు రామోజీరావు కొడుకు, రాధాక్రిష్ణలు, షర్మిల, టీడీపీ నేతలు పక్కనే ఉండి చూసినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గతంలో ఇదే సెకి ద్వారా రూ 5.30 పైసలతో  విద్యుత్ కొనుగోలు చేసింది’’ అని శివప్రసాద్‌రెడ్డి గుర్తు చేశారు.

అమెరికా కేసులో జగన్ పేరుందని దుష్ప్రచారం చేస్తున్నారు.. అక్కడ వేసిన చార్జ్ షీట్ లో ఎక్కడా జగన్ పేరూ లేదు.. ఏపీ ప్రభుత్వం పేరూ లేదు అని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాన్ని పూర్తిగా మట్టుపెట్టాలని ప్రశ్నించే గొంతును నొక్కేందుకు వీళ్లు చట్టాలు తెస్తున్నారు. ప్రజల సమస్యలను మేం మాట్లాడుతున్నాం అని నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కూడా పీడీ యాక్ట్ పెడతారా? అని ప్రశ్నించారాయన.

.. చెవిరెడ్డి చేసిన నేరం ఏంటి? ఓ ఆడపిల్ల కుటుంబాన్ని పరామర్శిస్తే కేసు పెడతారా?. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వారికి అండగా నిలవవద్దని మీరు ఇలాంటి కేసులు పెడుతున్నారా?. మీరు మాత్రం ప్రతి రోజూ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడొచ్చు.. మేం పేదల పక్షాన నిలిస్తే కేసులు పెడతారా? అని శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement