నిర్భయంగా నిర్ణయాలు తీసుకోండి | FinMin assures PSBs of non-interference in decisions, transfers | Sakshi
Sakshi News home page

నిర్భయంగా నిర్ణయాలు తీసుకోండి

Published Tue, Jan 6 2015 2:08 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

నిర్భయంగా నిర్ణయాలు తీసుకోండి - Sakshi

నిర్భయంగా నిర్ణయాలు తీసుకోండి

* నిష్పక్షపాతంగా వ్యవహరించండి
* ప్రభుత్వ రంగ బ్యాంకర్లకు
* ఆర్థిక శాఖ ఆదేశాలు

న్యూఢిల్లీ: వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. అలాగే, ఇతరత్రా ఒత్తిళ్లను పట్టించుకోరాదని సూచించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల (ఎఫ్‌ఐ) అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండబోదని హామీ ఇచ్చింది. ఆర్థిక శాఖ సోమవారం ఈ మేరకు పీఎస్‌బీలు, ఎఫ్‌ఐలు, బీమా సంస్థల  చీఫ్‌లకు ఆదేశాలు పంపింది.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని అందులో పేర్కొంది. రుణం తీసుకునేవారి పలుకుబడికి, ఒత్తిడికి ప్రభావితం కారాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా పక్షపాత ధోరణితో వ్యవహరించిన పక్షంలో దానికి పూర్తి బాధ్యత వారిదే అవుతుందని స్పష్టం చేసింది. బదిలీలు, నియామకాల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని, ఆఖరికి ఆర్థిక శాఖ నుంచి సిఫార్సులు వచ్చినా పరిగణించనక్కర్లేదని పేర్కొంది.

ఒకవేళ ఏదైనా ప్రత్యేక సందర్భంలో మినహాయింపునిచ్చినా అందుకు గల కారణాలను సీఎండీ స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ సూచించింది. పీఎస్‌బీల్లో ప్రభుత్వ జోక్యం ఉండబోదంటూ ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాఖ తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
పీఎస్‌బీల్లో ఇప్పుడే వాటాలు విక్రయించం..

పీఎస్‌బీల్లో ప్రభుత్వ వాటాలు విక్రయించాల్సిన అవసరమేమీ ప్రస్తుతం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. ఇప్పుడున్న వేల్యుయేషన్లను బట్టి చూసినా.. ఇది అభిలషణీయం కాదన్నారు. 27 పీఎస్‌బీల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకోవాలని కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2019 ఏప్రిల్ నాటికి బాసెల్ 3 ప్రమాణాలను అందుకునేందుకు కావాల్సిన నిధులను బ్యాంకులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నందున వాటాల విక్రయ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు, పీఎస్‌బీల్లో నిరర్ధక ఆస్తుల సమస్య ఆమోదయోగ్యం కానంత అధిక స్థాయిలో ఉందని సిన్హా చెప్పారు. 2014 సెప్టెంబర్ ఆఖరు నాటికి పీఎస్‌బీల్లో స్థూల ఎన్‌పీఏలు రూ. 2.43 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నాయి. ఇక, పీఎస్‌బీల కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదల్చుకోలేదని, ఆయా బ్యాంకుల యాజమాన్యాలు క్రియాశీలకంగా, ప్రొఫెషనలిజంతో పనిచేయాలని సిన్హా సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement