PSB
-
బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలు
బ్యాంకు మోసాలకు సంబంధించిన కేసులను మరింత సమర్థంగా, వేగంగా దర్యాప్తు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మధ్య పరస్పరం సహకారాన్ని పెంపొందించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సంస్థల మధ్య సాధారణ చర్చల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వశాఖ అంగీకరించింది.ప్రత్యేక వేదిక ఏర్పాటు..?బ్యాంకు మోసాలపై సీబీఐలో చాలా కేసులు నమోదవుతున్నాయి. వాటి దర్యాప్తులో అవసరమయ్యే కీలక సమాచారాన్ని బ్యాంకర్లు అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పూర్తి సమాచారం అందించేందుకు నిబంధనలు అడ్డుగా ఉంటాయి. అయితే ఎలాంటి కేసుల్లో ఎలాంటి సమాచారం అందించాలనే విషయంపై స్పష్టత వచ్చేందుకు సీబీఐ, బ్యాంకర్లు పరస్పరం చర్చించాల్సి ఉంది. అందుకు ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా..కేసులకు సంబంధించి సీబీఐ చేసిన అభ్యర్థనలను బ్యాంకర్లు పరిశీలించనున్నారు. బ్యాంకర్లు ఇచ్చిన సమాచారంపై భవిష్యత్తులో కస్టమర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సీబీఐ నుంచి బ్యాంకర్లకు రక్షణ ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. సీబీఐ, బ్యాంకర్ల మధ్య పరస్పరం సహకారం వల్ల ఫిర్యాదుల దాఖలుకు సంబంధించిన కార్యాచరణ అంశాలు, దర్యాప్తును క్రమం తప్పకుండా సమీక్షించడం, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సులువవడం వల్ల త్వరగా కేసులు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!అనుమతుల్లేక కేసులు పెండింగ్2018లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aలో చేసిన సవరణ ప్రకారం.. బ్యాంక్ మేనేజ్మెంట్ ఆమోదించిన తర్వాతే బ్యాంకు మోసాలపై దర్యాప్తు ఏజెన్సీ ఉద్యోగులను విచారించే అధికారం ఉంటుంది. పీఎస్‌యూ బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు ఈ నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ దర్యాప్తు సంస్థలు నేరుగా ఇన్వెస్ట్‌గేషన్ చేయాలంటే చట్టం ప్రకారం వారి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. తాజా సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు కొందరు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), విజిలెన్స్ కమిషన్ వంటి ఏజెన్సీలకు బ్యాంకు యాజమాన్యాలు తమ ఉద్యోగులపై విచారణకు అనుమతి ఇవ్వనందున వందలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఫిర్యాదు చేశాయి. -
బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా
వివిధ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్‌తో సహా ఓ ఎన్బీఎఫ్సీ సంస్థపై చర్యలు తీసుకున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది . ఏ బ్యాంకుకు ఎంత జరిమానా? 'రుణాలు, అడ్వాన్సులు: చట్టబద్ధమైన, ఇతర పరిమితులు' అలాగే 'ఇంట్రా-గ్రూప్ లావాదేవీలు, ఎక్స్పోజర్ల నిర్వహణపై మార్గదర్శకాలు' గురించి ఆర్బీఐ జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు ఎస్బీఐకి రూ. 1.3 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 'రుణాలు, అడ్వాన్స్‌లు: చట్టబద్ధమైన, ఇతర పరిమితులు', కేవైసీ మార్గదర్శకాలు, 'ఆర్బీఐ (డిపాజిట్లపై వడ్డీ) మార్గదర్శకాలు-2016'ను ఉల్లంఘించినందుకు ఇండియన్ బ్యాంక్‌కి రూ. 1.62 కోట్ల జరిమానా విధించింది. ఇక డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్‌లోని నిర్దిష్ట నిబంధనలను పాటించనందుకు గానూ పంజాబ్ & సింధ్ బ్యాంక్‌కు రూ. 1 కోటి పెనాల్టీని విధించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో మానిటరింగ్ మోసానికి సంబంధించిన ఆదేశాలలో పేర్కొన్న కొన్ని నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు గానూ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌కు రూ. 8.80 లక్షల జరిమానాను విధించినట్లు ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. -
ప్రభుత్వ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక శాఖ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) అధిపతులతో కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి వివేక్ జోషి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జన సురక్ష, ముద్రా యోజన వంటి వివిధ ఆర్థిక స్కీములను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని బీమా పథకాల్లో మరింత మందిని చేర్చే దిశగా బ్యాంకులు తమ బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లోన వీటి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జోషి సంనట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రోజంతా సాగిన ఈ సవవేశంలో పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్, హౌసింగ్ తదితర శాఖల సీనియర్ అధికారులు, నాబార్డ్ చైర్మన్, ఎన్పీసీఐ సీఈవో మొదలైన వారు కూడా పాల్గొన్నారు. స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి తదితర స్కీముల పురోగతిని సైతం ఇందులో సమీక్షించారు. -
జనవరిలో 15 రోజులు పని చేయని బ్యాంకులు, సెలవుల జాబితా ఇదే!
2023 జనవరికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు జనవరి 2023లో 15 రోజుల వరకు పని చేయవు( ఆ తేదిలలో బ్యాంకులకు సెలవు). ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు కూడా ఉన్నాయి. కనుక కస్టమర్లు జనవరిలో ఏవైనా బ్యాంకు పనులుంటే దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. జనవరి 2023లో దేశవ్యాప్తంగా బ్యాంకులు చాలా రోజులు మూసివేసి ఉంటాయి. ప్రతి నెల రెండు, నాలుగు మినహాయిస్తే తొలి, మూడవ శనివారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. సెలవుల్లో కొన్ని బ్యాంకులకు ప్రాంతీయ సెలవులుంటే..మరికొన్ని బ్యాంకులకు జాతీయ సెలవులున్నాయి. జనవరిలో ఏ తేదిన ఉన్నాయో ఓ లుక్కేద్దాం! సెలవుల జాబితా ఇదే 1 జనవరి 2023 ఆదివారం న్యూ ఇయర్ 2 జనవరి 2023 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఐజ్వాల్‌లో సెలవు 3 జనవరి 2023 ఇంఫాల్‌లో సెలవు 4 జనవరి 2023 ఇంఫాల్‌లో గణ ఎన్గయీ సందర్భంగా సెలవు 8 జనవరి 2023 ఆదివారం 12 జనవరి 2023 స్వామి వివేకానంద జన్మదినం (కోల్‌కతాలో బ్యాంకులు పని చేయవు) 14 జనవరి 2023 రెండో శనివారం 15 జనవరి 2023 ఆదివారం 16 జనవరి 2023 తిరువల్లూర్ దినోత్సవం (చెన్నైలో సెలవు) 17 జనవరి 2023 ఉజ్ఞావార్ తిరునాళ్లు సందర్భంగా చెన్నైలో సెలవు 22 జనవరి 2023 ఆదివారం 23 జనవరి 2023 నేతాజీ జన్మ దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్లో సెలవు 26 జనవరి 2023 రిపబ్లిక్ డే (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు) 28 జనవరి 2023 నాలుగో శనివారం 29 జనవరి 2023 ఆదివారం -
లాభాల బాటలో ప్రభుత్వ బ్యాంకులు.. కారణం ఇదే!
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఈ ఆర్థిక సంవత్సరంలో మొండి బాకీలను తగ్గించుకుని, రికార్డు లాభాలు నమోదు చేశాయి. రుణాలకు భారీగా డిమాండ్ నెలకొనడం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే జోరును కొనసాగించనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రైవేట్ రంగంలో స్థిరీకరణ కనిపిస్తుందని వారు తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం, సిటీబ్యాంక్ రిటైల్ పోర్ట్‌ఫోలియోను యాక్సిస్ బ్యాంక్ టేకోవర్ చేయడం 2023లో పూర్తి కానుంది. రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేటును మరో పావు శాతం పెంచి 6.25 శాతం నుంచి 6.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ తెలిపారు. ఇదే జరిగితే, బ్యాంకులు రుణాలపై పెంచినంతగా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచటం లేదు కాబట్టి వాటి లాభదాయకతకు మరింతగా తోడ్పడగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఒకసారి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ బ్యాంకింగ్ రంగంలో కొన్ని పరిణామాలు చూస్తే.. ► మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో దాదాపు 60 శాతం వాటా ఉన్న 12 పీఎస్‌బీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 32 శాతం అధికంగా నికర లాభాలు నమోదు చేశాయి. రూ. 40,991 కోట్లు ఆర్జించాయి. సెప్టెంబర్ క్వార్టర్లో పీఎస్బీలన్నింటి నికర లాభం 50 శాతం పెరిగి రూ. 25,685 కోట్లకు ఎగిసింది. ► ఇదే తీరు కొనసాగితే పీఎస్‌బీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22కు మించి లాభాలు సాధించవచ్చని అంచనా. 2021–22లో 12 పీఎస్‌బీల లాభాలు 110 శాతం పెరిగి రూ. 31,816 కోట్ల నుంచి రూ. 66,539 కోట్లకు చేరాయి. ► మొండి బాకీలను తగ్గించేందుకు, అదనపు మూలధనం ఇచ్చి బ్యాంకులను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల అభిప్రాయపడ్డారు. 2022 మార్చి ఆఖరు నాటికి మొండి బాకీలు 9.11 శాతం నుంచి 7.28 శాతానికి దిగి వచ్చాయని ఇటీవల తెలిపారు. కార్పొరేట్లు కూడా రుణాలు తీసుకోవడం పెరుగుతుండటంతో రుణ వృద్ధి మరింత పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ► ప్రైవేట్ రంగం విషయానికొస్తే యస్ బ్యాంకులోకి రెండు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు (కార్లైల్ గ్రూప్, యాడ్వెంట్) రూ. 8,896 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. చెరో 9.99 శాతం వాటా తీసుకున్నాయి. ► హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీన ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువ చేసే ఈ డీల్‌తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీ ఆర్థిక సేవల దిగ్గజంగా ఆవిర్భవించనుంది. 2023–24 రెండో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. ► వ్యాపార వృద్ధి ప్రణాళికల్లో భాగంగా సిటీబ్యాంక్ రిటైల్ వ్యాపారాన్ని రూ. 12,325 కోట్లకు కొనుగోలు చేసేందుకు యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, వినియోగదారు రుణాలు తదితర వ్యాపార విభాగాలు ఉన్నాయి. విలీనం పూర్తయితే యాక్సిస్ బ్యాంక్ వద్ద 2.85 కోట్ల పొదుపు ఖాతాలు, 1.06 కోట్ల క్రియాశీలక క్రెడిట్ కార్డులు ఉంటాయి. చదవండి: జొమాటో షాకింగ్ రిపోర్ట్: పూణె వాసి యాప్ ద్వారా రూ.28 లక్షల పుడ్ ఆర్డర్! -
బలహీనంగానే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు
న్యూఢిల్లీ: పెద్ద స్థాయిలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇంకా బలహీనంగానే ఉన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. బలహీన అసెట్లు, అధిక రుణ వ్యయాలు, అంతంత మాత్రం ఆదాయాలతో ఆయా పీఎస్‌బీల పరిస్థితి భారంగా ఉందని 2023 అంతర్జాతీయ బ్యాంకింగ్ అంచనాల నివేదికలో పేర్కొంది. ఆర్థిక సంస్థల పనితీరు మిశ్రమంగానే ఉండవచ్చని ఇందులో వివరించింది. మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు దిగ్గజ ప్రైవేట్ బ్యాంకులు తమ తమ మొండి బాకీల సవాళ్లను చాలా మటుకు పరిష్కరించుకున్నాయని, బ్యాంకింగ్ వ్యవస్థను మించి వాటి లాభదాయకత మెరుగుపడుతోందని నివేదిక పేర్కొంది. ఆర్థిక రికవరీ నేపథ్యంలో రుణ వ్యయాలు కనిష్ట స్థాయులకు తగ్గాయని తెలిపింది. బ్యాంకుల దగ్గర నిధులు పుష్కలంగా ఉండటం.. డిమాండ్ అధికంగా ఉండటం వంటి అంశాల కారణంగా రుణాల వృద్ధికి ఊతం లభించవచ్చని, కానీ డిపాజిట్ల వృద్ధి మాత్రం మందగించవచ్చని నివేదిక వివరించింది. అటు పరపతి విధానాలు కఠినతరం చేస్తుండటం, అధిక ద్రవ్యోల్బణంతో వినియోగదారులు సతమతమవుతుండటం వంటి కారణాలతో జీడీపీ వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. అయినప్పటికీ మధ్యకాలికంగా భారత ఆర్థిక వృద్ధి అవకాశాలు పటిష్టంగానే ఉంటాయని, 2024–26 ఆర్థిక సంవత్సరాల్లో 6.5–7 శాతం వృద్ధి నమోదు కావచ్చని వివరించింది. చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
కెనరా బ్యాంక్‌కు ఈజ్ 4.0 సంస్కరణల సూచీ అవార్డు
ముంబై: ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ‘ఈఏఎస్‌ఈ (ఈజ్) 4.0 సంస్కరణల సూచీ అవార్డు, 2022’ లభించింది. అత్యుత్తమ పనితీరుకు గాను 2021–22 మార్చి త్రైమాసికానికి సంబంధించి ఈజ్ అవార్డు మూడవ ర్యాంక్‌ను దక్కించుకున్న బ్యాంక్, ‘ప్రూడెంట్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషనలైజింగ్ థీమ్’ కింద మొదటి బహుమతిని కూడా అందుకుంది. ముంబైలో ఐబీఏ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చేతుల మీదుగా ఈజ్ 4.0 సంస్కరణల సూచీ అవార్డును అందుకుంటున్న బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ ఎల్వీ ప్రభాకర్‌ను చిత్రంలో తిలకించవచ్చు. దీర్ఘకాల సుస్థిర వ్యాపారవృద్ధి, డిజిటల్ సామర్థ్యాల విభాగాల్లో బ్యాంక్ చక్కటి పనితీరు కనబరుస్తున్నట్లు ప్రభాకర్ ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
మరో బాదుడు.. కెనరా బ్యాంక్ రుణ రేటు పెంపు
ఇప్పటికే ఇందన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నెలలో ద్రవ్యోల్బణం కట్టడిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుని పెంచిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో పలు బ్యాంకులు వారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలపై మరింత భారమనే చెప్పాలి. తాజాగా ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం వరకూ పెంచింది. పెంచిన రేట్లు బుధవారం(సెప్టంబర్ 7) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ పేర్కొంది. తాజా పెంపుతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు భారం కానున్నాయి. తాజా పెంపుతో ఏడాది రుణ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్, నెల వ్యవధుల ఎంసీఎల్ఆర్ 0.10% మేర పెరిగింది. -
బ్యాంకుల ప్రైవేటీకరణ.. అలా చేస్తే మంచి కన్నా చెడు ఎక్కువ: ఆర్బీఐ
ముంబై: వేగవంతంగా, ఒక్కసారిగా పెద్ద ఎత్తున చేపట్టే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ప్రైవేటీకరణ మంచికన్నా ఎక్కువ చెడు పరిణామాలకే దారితీస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులిటిన్‌లో జారీ అయిన ఆర్టికల్స్ రచయితలు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ అంగీకరించాల్సిన అవసరం లేని ఈ ఆర్టికల్ అభిప్రాయాల ప్రకారం, ఒక క్రమ పద్దతిలో మంచి, చెడులను పరిగణనలోకి తీసుకుంటూ ఆచితూచి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ప్రైవేటీకరణ జరిగితే తగిన మెరుగైన ఫలితాలను చూడవచ్చు. ఈ పక్రియ హడావిడిగా జరగడం ఎంతమాత్రం సరికాదు. ప్రభుత్వం అనుసరించే ప్రైవేటీకరణ విధానం సామాజిక లక్ష్యాన్ని నెరవేరుస్తుందో లేదో జాగ్రత్తగా పరిశీలించాలని ఆర్టికల్ సూచించింది. అందరికీ బ్యాంకింగ్‌లో భాగస్వామ్యం ప్రధాన లక్ష్యంగా విలీన పక్రియ జరగాలని సూచించింది. 2020లో కేంద్రం 10 ప్రభుత్వ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా విలీన ప్రక్రియను నిర్వహించింది. దీనితో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గింది. 2017లో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. చదవండి: Emirates Airbus A380: ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం.. మొదటిసారిగా ఆ నగరానికి! -
మీకు లోన్ కావాలా.. అది కూడా గంటలోపు.. ఇలా అప్లై చేస్తే చాలు..
ఇటీవల కాలంలో యువత చేస్తున్న ఉద్యోగాలలో వాళ్లకిచ్చే జీతం వారి జీవన విధానానికి సరిపోవడం లేదు. అందుకు కొంత మంది రెగుల్యర్ జాబ్‌తో పాటు ఫ్రీలాన్సర్‌గా చేస్తూ ఆర్జిస్తుంటే, మరి కొంతమంది పొదుపు మంత్రం పాటిస్తున్నారు. అయితే అధిక శాతం మాత్రం వారి అవసరాల కోసం ముందుస్తుగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకునేందేకు మొగ్గు చూపుతున్నారు. గతంలో లోన్ తీసుకోవాలంటే రోజుల తరబడి బ్యాంక్ చూట్లూ తిరిగి, డ్యాంకుమెంట్లు సమర్పించి, ఆపై వెరిఫికేషన్ ఇవన్నీ పూర్తి చేసి చేతికి డబ్బులు రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ రోజులు పోయాయి. మీ వద్ద కావాల్సిన డ్యాకుమెంట్లు అన్నీ ఉంటే ఒక్క రోజులోనే మీ లోన్లు మంజూరవుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ (PSB Loan in 59 Minutes) అని ఓ ప్లాట్‌ఫామ్ కూడా రూపొందించింది. మొదట్లో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం బిజినెస్ లోన్స్ మాత్రమే లభించేవి. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ లోన్, ముద్ర లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ లాంటి అనేక సేవలు అందిస్తోంది. అసలేంటి పీఎస్బీ(PSB).... ఏం పని చేస్తుంది! పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్( psbloansin59minutes.com) ప్లాట్‌ఫామ్ 2018 సెప్టెంబర్ 29న ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఇది బిజినెస్ లోన్ కేటగిరీలో 2,01,863 రుణాలు మంజూరై, రూ.39,580 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. రీటైల్ లోన్ కేటగిరీలో 17,791 రుణాలు మంజూరు కాగా, రూ.1,689 కోట్లు మంజూరు చేశాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ ప్లాట్ఫామ్లో మీరు కూడా ఎంఎస్ఎంఈ లోన్, ముద్ర లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. వ్యాపారం కోసం అయితే జీఎస్‌టిఐఎన్, జీఎస్టీ యూజర్ నేమ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డాక్యుమెంట్స్ వంటి వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలా రిజిష్టర్ చేసుకోండి: 1: PSB అధికారిక వెబ్సైట్ psbloansin59minutes.comకి వెళ్లి రిజిస్టర్‌పై క్లిక్ చేయండి 2: రిజిష్టర్ ప్రక్రియలో పేరు, ఈమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ నింపి, ‘గెట్ OTP’పై క్లిక్ చేయండి 3: మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఆ ఎంటర్ చేయండి 4: టెర్మ్స్ అండ్ కండీషన్స్ చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి అంగీకరించండి 5: అక్కడ ఉన్న కాలమ్స్ నింపిన తర్వాత ‘ప్రొసీడ్’పై క్లిక్ చేయండి 6: మీరు రిజిష్టర్ అయినా అకౌంట్‌కు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఇలా చేస్తే లోన్ వచ్చేస్తుంది.. 1: మీరు క్రియేట్ చేసిన అకౌంట్లోకి లాగిన్ అవ్వండి 2: వ్యాపారం లేదా ఎంఎస్ఎంఈ(MSME) లోన్ పొందడానికి మీ ప్రొఫైల్‌ను ‘బిజినెస్’గా ఎంచుకోండి, లేదా (పర్సనల్ లోన్ కోసం రీటైల్ ఎంచుకోండి) తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేయండి 3: ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆపై మీ వ్యాపార పాన్ వివరాలను నమోదు చేసి, 'ప్రొసీడ్'పై క్లిక్ చేయండి 4: గత 6 నెలలకు సంబంధించిన మీ GST వివరాలు, పన్ను రిటర్న్‌లు, బ్యాంక్ స్టేట్మెంట్లను నింపండి 5: మీ ITRని అప్లోడ్ చేయండి, ఇతర ముఖ్యమైన వివరాలను ఎంటర్ చేయండి 6: మీ బ్యాంక్ వివరాలను ఎంటర్ చేయండి 7: మీ వ్యాపార వివరాలను నమోదు చేయండి. అలాగే ఇప్పటికే ఉన్న ఏదైనా లోన్ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 8: మీకు OTP వస్తుంది దీని ద్వారా మీ ఈమెయిల్ వెరిఫై చేయబడుతుంది. 9: ఆ తర్వాత ఏ బ్యాంకు ఎంత వడ్డీకి రుణాలు అందిస్తున్నాయో కనిపిస్తుంది. అందులో మీరు అప్లై చేయాలనుకున్న బ్యాంక్‌తో పాటు ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీకు బ్యాంకు నుంచి ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లభిస్తుంది. చదవండి: పారిశుధ్య కార్మికులకు భారీ డిమాండ్..కిటికీ అద్దాలు తుడిస్తే చాలు ఏడాదికి కోటి రూపాయిల జీతం! -
ఇంటి ముంగిటే బ్యాంకింగ్ సేవలు
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలు (పీఎస్‌బీలు) కొత్త పుంతలు తొక్కనున్నాయి. కస్టమర్ తన పనుల కోసం బ్యాంకు శాఖ వరకు రావాల్సిన అవసరం ఉండదు. కాల్ చేస్తే చాలు.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ కస్టమర్ ఇంటికే వచ్చి కావాల్సిన పనులను చక్కబెట్టి వెళతారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కరోనా కాలంలో ఈ వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెడుతున్నాయి. ఇలా కస్టమర్ల ఇంటి వద్దే సేవలు అందించేందుకు గాను 12 ప్రభుత్వరంగ బ్యాంకులు కలసి ‘పీఎస్బీ అలయన్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోనుంది. వారి ద్వారానే బ్యాంకింగ్ సేవలను చేపట్టనున్నాయి. కరోనా వైరస్ కల్పిస్తున్న ఆటంకాల నేపథ్యంలో పీఎస్‌బీలు ఈ విధమైన ఆవిష్కరణతో ముందుకు రావడాన్ని అభినందించాల్సిందే. 12 పీఎస్‌బీల తరఫున ఒకే ప్రామాణిక నిర్వహణ విధానాన్ని పీఎస్బీ అలియన్స్ అనుసరించనుంది. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సేవలను సైతం కరస్పాండెంట్ల ద్వారా అందించనుంది. ఎస్బీఐ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంకు డిప్యూటీ సీఈవో రాజిందర్ మిరాఖుర్ను పీఎస్బీ అలియన్స్ సీఈవోగా నియమించడం కూడా పూర్తయింది. నమూనాపై కసరత్తు.. ‘‘నమూనాను ఖరారు చేసే పనిలో ఉన్నాము. వివిధ రకాల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవడం ద్వారా వారి టెక్నాలజీ, మానవవనరులను వినియోగించుకునే ఆలోచన ఉంది. లేదా సొంతంగా ఒక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా అన్ని పీఎస్‌బీల పరిధిలోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు దీన్ని వినియోగించుకునేలా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. దీనివల్ల అందరూ ఒకే వేదికపైకి వస్తారు’’ అని మిరాఖుర్ వివరించారు. అత్యతి టెక్నాలజీస్, ఇంటెగ్రా మైక్రోసిస్టమ్స్‌ను పీఎస్బీ అలయన్స్ నియమించుకుంది. రూ.14 కోట్ల మూలధనాన్ని బ్యాంకులు సమకూర్చాయి. 2010లో నిర్వహణ రిస్క్‌లను అధ్యయనం చేసేందుకు పీఎస్‌బీలు ‘కార్డెక్స్ ఇండియా’ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు దీన్నే పీఎస్బీ అలయన్స్గా పేరు మార్చడంతోపాటు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌ను మార్చి, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందులో చేర్చాయి. కార్డెక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులకు సైతం వాటా ఉండగా, వాటి వాటాలను వెనక్కిచ్చేశాయి. ‘‘పీఎస్‌బీలు అన్నీ కలసి ప్రమోట్ చేస్తున్న సంస్థ ఇది. విడిగా ఒక్కో బ్యాంకు 10 శాతానికి మించి వాటా కలిగి ఉండదు. ప్రస్తుతానికి ప్రతీ బ్యాంకు ఒక ప్రతినిధిని నియమించుకున్నాయి. రానున్న రోజుల్లో ఎంత మంది అవసరం అన్నది చూడాలి’’ అని మిరాఖుర్ చెప్పారు. ఖర్చులు ఆదా చేసుకోవడంతోపాటు ఎన్నో ప్రయోజనాలు పీఎస్బీ అలయన్స్ రూపంలో పొందొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘వనరులను చక్కగా వినియోగించుకోవచ్చు. ఉమ్మడిగా ఒకే విధమైన అవగాహన కలిగిన సిబ్బంది ఉండడం అనుకూలత. దీనివల్ల ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందొచ్చు’’ అని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ పేర్కొన్నారు. కస్టమర్ల ఇంటి వద్దే సేవలను అందించడం వల్ల బ్యాంకు శాఖలకు వచ్చే రద్దీని తగ్గించొచ్చని.. దీనివల్ల వైరస్ విస్తరణను నియంత్రించడంతోపాటు బ్యాంకు సిబ్బందికి ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టే వీలు ఏర్పడుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. కొన్ని బ్యాంకుల పరిధిలో.. ‘ప్రస్తుతం అయితే కొన్ని పీఎస్‌బీలు తమ పరిధిలోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకుని.. వారి ద్వారా కస్టమర్లకు ఇంటి వద్దే సేవలను అందిస్తున్నాయి. పీఎస్బీ అలయన్స్ ఏర్పాటుతో కరస్పాండెంట్లను అన్ని పీఎస్‌బీలు తక్కువ వ్యయాలకే వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది’ అని రాజిందర్ మిరాఖుర్ తెలిపారు. నాన్ ఫైనాన్షియల్ సేవలైన చెక్కులను తీసుకోవడం, అకౌంట్ నివేదిక ఇవ్వడం, టీడీఎస్ సర్టిఫికెట్, పే ఆర్డర్లను ప్రస్తుతానికి కస్టమర్లు ఇంటి వద్దే పొందే అవకాశం ఉంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను కూడా ఆర్డర్ చేసి ఇంటివద్దకే తెప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్ సేవల్లో నగదు ఉపసంహరణ సేవ ఒక్కటే అందుబాటులో ఉంది. నెట్ బ్యాంకింగ్ పోర్టల్, మొబైల్ యాప్, ఫోన్‌కాల్ రూపంలో ఇంటి వద్దకే సేవలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కో సేవకు రూ.88 చార్జీతోపాటు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసే చార్జీల్లో కొంత మేర కరస్పాండెంట్‌కు బ్యాంకులు చెల్లిస్తాయి. -
ఆర్థిక పునరుత్తేజంలో బ్యాంకులే ఆయుధం
ముంబై: ఆర్థిక పునరుత్తేజంలో బ్యాంకులదీ కీలక పాత్ర అని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి పీఎస్బీ అలయెన్స్ కార్యక్రమాన్ని బుధవారం ఆమె ఆవిష్కరించారు. ప్రజలకు మరింత చేరువకావడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడారు. బ్యాంకింగ్ తమ వ్యాపార కార్యకలాపాలతో పాటు ఆర్థికవృద్ధి, సంక్షేమం పట్ల కూడా దృష్టి కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. ‘‘ రుణాలు ఇవ్వడం... తద్వారా డబ్బు సంపాదించడం. ఇది మీ చట్టబద్ధమైన కార్యక్రమం. దీనిని మీరు మర్చిపోవక్కర్లేదు. మీరు మీ విధిని నిర్వహించాల్సిందే. అయితే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావడంపైనా బ్యాంకింగ్ దృష్టి పెట్టాలి’’ అని ఆమె అన్నారు. ప్రైవేటు బ్యాంకుల సహకారం అవసరం ప్రభుత్వ పథకాలు విజయవంతం కావడానికి ప్రైవేటు రంగంలోని బ్యాంకులు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని ఆర్థికమంత్రి అన్నారు. బ్యాంకుల ద్వారా అమలు జరిగే ప్రభుత్వ పథకాల వివరాలు అన్నింటినీ సిబ్బంది తెలుసుకోవాలని ఆమె అన్నారు. ‘‘పలు పథకాలను కేంద్రం మీ ద్వారానే ప్రజలకు అందిస్తుంది. అందువల్ల ఈ పథకాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవడమూ మీ బాధ్యతే. ఉద్యోగులకు సంబంధించి ప్రతి స్థాయిలో ఆయా అంశాలను తెలుసుకుంటారని భావిస్తున్నా’’ అని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా అన్నారు. తద్వారా ప్రభుత్వ పథకాలు పొందాలనుకునే ప్రజలకు బ్యాంకింగ్ మరింత చేరువవుతుందన్నారు. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకింగ్ సేవల విస్తరణకు ఉద్దేశించిన పీఎస్బీ అలయెన్స్ కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా కూడా చిత్రంలో ఉన్నారు -
బడ్జెట్లో పీఎస్బీలకు నిధుల కేటాయింపులు ఉండకపోవచ్చు
న్యూఢిల్లీ: రానున్న 2020–21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) నిధుల కేటాయింపును ప్రకటించకపోవచ్చని, బదులుగా మొండి బకాయిలు (ఎన్పీఏలు) వసూలుకు, మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ దిశగా వాటిని ప్రోత్సహించొచ్చని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకులు తమకు అనుబంధ కంపెనీల్లో, జాయింట్ వెంచర్లలో ఉన్న వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించొచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు కొన్నింటికి బీమా, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్‌కార్డుల వ్యాపారంతోపాటు ఎన్ఎస్ఈ తదితర సంస్థల్లో వాటాలు సైతం ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించనున్నారు. -
59 నిమిషాల్లోనే బ్యాంక్ రుణాలు
న్యూఢిల్లీ: ‘59 నిమిషాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) రుణాలు’ పోర్టల్ సేవలు రిటైల్ రుణాలకూ విస్తరించడం జరిగింది. రిటైల్ రుణ లభ్యతకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. గృహ, వ్యక్తిగత రుణ ప్రతిపాదనలకు ఈ పోర్టల్ ఇకపై అందుబాటులో ఉండనుంది. త్వరలో ఆటో రుణాలకు సంబంధించి కూడా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు తెలపాయి. ఇప్పటి వరకూ ఈ సేవలు లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) మాత్రమే అందుబాటులో ఉంది. 2018 నవంబర్‌లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎంఎస్ఎంఈలకు కోటి రూపాయల వరకూ ఈ పోర్టల్ ద్వారా రుణం పొందే సౌలభ్యం ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ నుంచి బ్యాంక్ అకౌంట్ల వరకూ అందుబాటులోఉన్న పలు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను పరిశీలనలోకి తీసుకుని వచ్చే డేటా పాయింట్లను అత్యుధునిక ఆల్గోరిథమ్స్ ద్వారా విశ్లేషించి తక్షణ రుణ లభ్యత కల్పించడం ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం. 2019 మార్చి 31వ తేదీ వరకూ అందిన గణాంకాల ప్రకారం- ఈ రుణాల కోసం 50,706 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 27,893 ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. -
‘59 మినిట్స్’తో రూ. 5 కోట్లు!
‘పీఎస్బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్’ వేదిక ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) రూ.5 కోట్ల వరకూ రుణాలను ఆఫర్ చేయాలని ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్‌లు ఉన్నాయి. 2018 నవంబర్‌లో ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. రూ.కోటి వరకూ ఆఫర్‌తో ఈ పథకం ప్రారంభమైంది. -
పీఎస్బీలకు తగ్గనున్న మూలధన భారం
ముంబై: మూలధన పరిరక్షణ కోసం ఉద్దేశించిన నిల్వలను (సీసీబీ) తగిన స్థాయిలో సమకూర్చుకునేందుకు మరింత గడువు లభించడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులపై (పీఎస్బీ) ఈ ఆర్థిక సంవత్సరం రూ.35,000 కోట్ల మేర భారం తగ్గుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీల మూలధన అవసరాల అంచనాలు రూ.1.2 లక్షల కోట్ల నుంచి రూ. 85,000 కోట్లకు తగ్గుతాయని వివరించింది. అయితే, బ్యాంకుల పనితీరు ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో కేంద్రమే ఈ నిధులను సమకూర్చాల్సి రావొచ్చని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. సీసీబీ విధానాన్ని 2008లో ప్రవేశపెట్టారు. దీని కింద అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వచ్చేలా సాధారణ సమయాల్లో బ్యాంకులు కొంత క్యాపిటల్ బఫర్‌ను సిద్ధం చేసుకుంటూ ఉండాలి. నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకులు 8.875% క్యాపిటల్ అడెక్వసీ రేషియోను పాటించాలి. ఇందులో సీసీబీ వాటా 1.875%. సీసీబీని వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 0.625% పెంచుకోవాల్సి ఉంది. అయితే, ఈ గడువును 2020 మార్చి దాకా పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. -
తక్షణం రూ. 1.2 లక్షల కోట్లు కావాలి!
ముంబై: అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలను పాటించే క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) రాబోయే అయిదు నెలల్లో రూ. 1.2 లక్షల కోట్ల మేర మూలధనం అవసరమవుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. పీఎస్‌బీలు బలహీన మార్కెట్ వాల్యుయేషన్స్, మొండిబాకీలతో కుదేలైన నేపథ్యంలో ఇందులో సింహభాగం భారం ప్రభుత్వమే మోయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, ఒకవేళ ప్రభుత్వం ఈ మేరకు నిధులు సమకూర్చిన పక్షంలో ఆర్థిక గణాంకాలు లెక్క తప్పే ప్రమాదముందని, ఈసారి ద్రవ్య లోటును 3.3 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కేంద్రం చేరుకోలేకపోవచ్చని నివేదికను రూపొందించిన క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. పీఎస్బీలకు రూ. 2.11 లక్షల కోట్ల అదనపు మూలధనం సమకూరుస్తామంటూ 2017 అక్టోబర్‌లో కేంద్రం ప్రకటించింది. ఇప్పటిదాకా ఇందులో రూ. 1.12 లక్షల కోట్లు సమకూర్చగా, బ్యాంకులు మరో రూ. 12,000 కోట్లు మాత్రమే మార్కెట్ల నుంచి సమీకరించుకోగలిగాయి. పనితీరు అంతంతమాత్రంగానే ఉండటం, వాల్యుయేషన్లు బలహీనంగా ఉండటం వంటి ప్రతికూలతల కారణంగా పీఎస్‌బీలు ప్రస్తుతం మార్కెట్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించుకునే పరిస్థితి లేదని కృష్ణన్ తెలిపారు. అయితే, పటిష్టమైన బ్యాంకుల్లో బలహీనంగా ఉన్న వాటిని విలీనం చేయడం ద్వారా అదనపు మూలధన అవసరాలు కొంత మేర తగ్గొచ్చని క్రిసిల్ అసోసియే ట్ డైరెక్టర్ వైద్యనాథన్ రామస్వామి చెప్పారు. మార్కెట్ల నుంచే మూలధనం సమీకరించుకునేలా మెరుగ్గా ఉన్న బ్యాంకులను ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు. రూ. 20 వేల కోట్ల సమీకరణలో ఎస్బీఐ.. కార్యకలాపాల విస్తరణ తదితర అవసరాల కోసం రూ. 20,000 కోట్లు సమీకరించనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సహా వివిధ మార్గాల్లో ఈ నిధులు సమీకరించనున్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు డిసెంబర్ 7న బ్యాంక్ షేర్హోల్డర్లు సమావేశం కానున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. -
బ్యాంకుల చీఫ్‌లతో నేడు జైట్లీ భేటీ
న్యూఢిల్లీ: వార్షిక ఆర్థిక పనితీరు సమీక్షలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చీఫ్‌లతో భేటీ కానున్నారు. మొండిబాకీలను తగ్గించుకోవడానికి తీసుకుంటున్న చర్యల పురోగతితో పాటు పలు అంశాలు ఇందులో చర్చకు వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ వృద్ధి, బాకీల రికవరీకి తీసుకుంటున్న చర్యలు, చట్టపరంగా ప్రభుత్వం అందించే తోడ్పాటు మొదలైనవి కూడా చర్చించే అవకాశం ఉందని వెల్లడించాయి.మొండిబాకీలను రాబట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న బ్యాంకులు.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇప్పటికే రూ. 36,551 కోట్లు రాబట్టాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో వసూలైన మొండిబాకీలతో పోలిస్తే ఇది 49 శాతం అధికం. మూడు పీఎస్‌బీలను (బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా, దేనా బ్యాంక్) విలీనం చేయాలంటూ ప్రత్యామ్నాయ యంత్రాంగం సిఫార్సు చేసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2017–18లో పీఎస్‌బీల నష్టాలు రూ. 87,357 కోట్ల పైచిలుకు నమోదయ్యాయి. 21 పీఎస్బీల్లో రెండు మాత్రమే (ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్) లాభాలు ప్రకటించాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ కోసం చర్యలు: జైట్లీ నిధుల కష్టాల వార్తలతో ఆర్థిక సంస్థల షేర్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇన్వెస్టర్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), మ్యూచువల్ ఫండ్స్‌కి తగింత లిక్విడిటీ ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సోమవారం స్టాక్ మార్కెట్ ప్రారంభం కావడానికి ముందు.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. రుణాలు బాకీ పడిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్‌తో పాటు లిక్విడిటీ సమస్యల వార్తలతో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్ షేర్లు కుప్పకూలడం.. వాటితో పాటు మార్కెట్లు పతనం అవుతుండటం తెలిసిందే. -
చిన్న సంస్థలకు రుణాల్లో ప్రైవేట్ బ్యాంకుల జోరు
ముంబై: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణాల మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మార్కెట్ వాటాను ప్రైవేట్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కొల్లగొడుతున్నాయి. 2016 లో ఈ విభాగానికి సంబంధించి 59.4 శాతంగా ఉన్న 21 పీఎస్‌బీల వాటా 2017 జూన్ నాటికి 55.8 శాతానికి తగ్గింది. తాజాగా 2018 జూన్ నాటికి ఇది 50.7 శాతానికి పడిపోయింది. ఆర్థిక సేవల సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్, సిడ్బి రూపొందించిన త్రైమాసిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాదిలో జూన్ దాకా ఎంఎస్ఎంఈ విభాగానికి రుణాలు 16.1 శాతం మేర పెరిగాయి. ఈ విభాగానికి పీఎస్‌బీల రుణాల వృద్ధి 5.5 శాతం, ప్రైవేట్ బ్యాంకుల వృద్ధి 23.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద ఈ విభాగానికి రుణాల విషయంలో 2017 జూన్‌లో 28.1 శాతంగా ఉన్న ప్రైవేట్ బ్యాంకుల మార్కెట్ వాటా ఈ ఏడాది జూన్ నాటికి 29.9 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 9.6 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగింది. ఎంఎస్ఎంఈలకు దూకుడుగా రుణాలిస్తున్నప్పటికీ.. ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ నాణ్యత మెరుగ్గానే కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ విభాగంలో పీఎస్‌బీల మొండిబాకీలు 14.5 శాతం నుంచి 15.2 శాతానికి పెరగ్గా, ప్రైవేట్ బ్యాంకులవి స్వల్పంగా 4 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గాయి. రుణ మంజూరుకు సంబంధించి దరఖాస్తు ప్రాసెసింగ్‌కి పట్టే టర్నెరౌండ్ సమయం (టీఏటీ) గణనీయంగా తగ్గింది. -
కార్పొ బ్రీఫ్స్...
ఎల్ అండ్ టీ: కంపెనీ ఆస్తులు, ఉద్యోగుల సంక్షేమ నిధి పరంగా నిర్వహణ లోపం చోటు చేసుకుందంటూ ఉదయ్ దీక్షిత్ అనే మాజీ ఉద్యోగి ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఈ అంశంపై కంపె నీ స్పందించింది. పిటిషనర్ వాదన నిరాధారమైనదని వ్యాఖ్యానించింది. ల్యాంకో ఇన్ఫ్రాటెక్: లిక్విడేషన్ నేపథ్యంలో కంపెనీ షేర్ల ట్రేడింగ్‌ను సెప్టెంబరు 14 నుంచి నిలిపివేస్తున్నట్టు బీఎస్ఈ ప్రకటించింది. ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్: బెంగళూరుకు చెందిన గ్రాఫిన్ సెమి కండక్టర్ సర్వీసెస్ కంపెనీలో వంద శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.93 కోట్లని, ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఈ డీల్ పూర్తవుతుందని ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ పేర్కొంది. బజాజ్ ఆటో: క్వాడ్రిసైకిల్, మూడు చక్రాల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 10 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలకు పర్మిట్ మినహాయింపులిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సీఏఐటీ: వాల్‌మార్ట్– ఫ్లిప్‌కార్ట్ డీల్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న ట్రేడర్స్ సంఘం – సీఏఐటీ (ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్) ఈ నెల 28న దేశవ్యాప్తంగా ఒక రోజు బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ‘భారత్ ట్రేడ్ బంద్’కు దాదాపు 7 కోట్ల మంది వర్తకులు మద్దతిచ్చినట్లు తెలిపింది. పాలసీబజార్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల ఆదాయాన్ని అంచనావేస్తున్నట్లు ఆన్లైన్ బీమా సర్వీసుల సంస్థ పాలసీబజార్ డాట్ కామ్ వెల్లడించింది. ఎల్ఐసీ కొనుగోలు సైతం తమ ప్లాట్‌ఫామ్ నుంచి జోరందుకున్న నేపథ్యంలో ఈ సారి ఆదాయంలో రెట్టింపు వృద్ధిని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. టాటా స్టీల్: పర్యావరణానికి మేలు చేసే నూతన స్టీల్ ఉత్పత్తి టెక్నాలజీని ఆవిష్కరించింది. నెదర్లాండ్స్‌లో పరీక్షలు పూర్తిచేసుకున్న ఈ టెక్నాలజీతో కార్బన్ డయాక్సైడ్ విడుదల సగానికి తగ్గిపోతుందని వెల్లడించింది. విస్తారా: బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో కోడ్ షేరింగ్ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌లోని పలు ప్రాంతాలలో బ్రిటీష్ ఎయిర్వేస్ సేవలను తమ సంస్థ ద్వారా పొందవచ్చని వెల్లడించింది. ఎస్బీఐ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరుగా అన్షులా కాంత్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఎస్బీఐలో డిప్యూటీ ఎండీగా విధులు నిర్వర్తించారు. పీఎన్బీ: నాన్– సీటీఎస్ (చెక్ టర్న్కేషన్ సిస్టమ్) చెక్కులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రొసెస్ చేయబోమని ప్రకటించింది. గడువు తేదీలోపుగా పాత చెక్కులను బ్యాంకుకు సమర్చించి, నూతన చెక్ బుక్‌లను పొందాల్సిందిగా కస్టమర్లకు తెలియజేసింది. -
పీఎస్బీలకు నిర్వహణ స్వేచ్ఛ ఉండాలి
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకుల స్థాయిలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకూ (పీఎస్బీ) నిర్వహణాపరమైన స్వేచ్ఛ ఉండాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జి. పద్మనాభన్ చెప్పారు. అప్పుడే మొండిబాకీలు సహా పలు సమస్యలను పీఎస్‌బీలు వాటంతట అవే పరిష్కరించుకోగలవని ఆయన తెలిపారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ పాలసీ రీసెర్చ్ (సీఈపీఆర్) నిర్వహించిన బ్యాంకింగ్ సదస్సులో శుక్రవారం పాల్గొన్న సందర్భంగా పద్మనాభన్ ఈ విషయాలు చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో పద్మనాభన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్ రంగంలో చాలా మటుకు సమస్యలు నిర్వహణపరమైన అంశాలే తప్ప యాజమాన్యపరమైనవి కావని ఆయన పేర్కొన్నారు. ‘యాజమాన్య అధికారాలపరంగా పీఎస్బీలకు కొన్ని పరిమితులు ఉన్నాయి.. అయితే వీటిని సులువుగానే పరిష్కరించుకోవచ్చు. అయితే, నిర్వహణ విషయంలో స్వేచ్ఛగా వ్యవహరించేందుకు ప్రైవేట్ రంగ బ్యాంకుల స్థాయిలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా వెసులుబాటు ఉండాలి‘ అని పద్మనాభన్ చెప్పారు. బీవోఐ విషయానికొస్తే తమ మొండిబాకీల్లో చాలా మటుకు రుణాలు ఇన్ఫ్రా రంగం నుంచి రావాల్సినవేనని ఆయన తెలిపారు. తమది లీడ్ బ్యాంక్ కాకపోయినా.. ఇవన్నీ కన్సార్షియంలో భాగంగా ఇచ్చిన రుణాలేనని, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నాయని చెప్పారు. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు రూ. 8.31 లక్షల కోట్లకు పెరిగిన సంగతి తెలిసిందే. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 21 పీఎస్బీల్లో రెండు మినహా.. 19 బ్యాంకులు ఏకంగా రూ. 87,357 కోట్ల నష్టాలను ప్రకటించాయి. విజయా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ మాత్రమే లాభాలు నమోదు చేశాయి. -
రూ. 50వేల కోట్లకుపైగా పీఎస్‌బీల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.50,000కోట్లకు పైగా నిధుల సమీకరణ ప్రణాళికలతో ఉన్నాయి. వ్యాపార వృద్ధికితోడు, నియంత్రణల పరంగా అంతర్జాతీయ నిబంధనలను చేరుకునేందుకు నిధుల సమీకరణ తలపెట్టాయి. ఎన్పీఏలు భారీగా పెరిగిపోవడంతో వ్యాపార అవసరాలకు బ్యాంకులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. 21 పీఎస్బీల్లో 13బ్యాంకుల బోర్డులు ఈక్విటీ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణకు ఆమోదం తీసుకున్నాయి. ఈ బ్యాంకుల ఉమ్మడి నిధుల సమీకరణ రూ.50వేల కోట్లకుపైగా ఉంది. సెంట్రల్ బ్యాంకు రూ.8,000 కోట్లు, కెనరా బ్యాంకు రూ.7,000 కోట్లు, బీఓబీ రూ.6,000 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.5,000 కోట్ల మేర నిధులను సమీకరించనున్నాయి. ఈ జాబితాలో ఓబీసీ, కార్పొరేషన్ బ్యాంకు, దేనా, యూకో అలహాబాద్ బ్యాంకు కూడా ఉన్నాయి. -
బ్యాంకుల్లో ప్రజల సొమ్ము పదిలమే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని (పీఎస్బీ) ప్రజల సొమ్ముకు ’అత్యంత భద్రత’ ఉంటుందని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పీఎస్బీలకు నూటికి నూరు శాతం ప్రభుత్వ మద్దతుంటుందని ఆయన చెప్పారు. 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో మంగళవారం సమావేశమైన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలియజేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో (పీఎన్బీ) దాదాపు రూ.14,000 కోట్ల కుంభకోణం సహా బ్యాంకింగ్ రంగంలో పలు స్కామ్‌లు బయటపడుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రజల సొమ్ము భద్రంగానే ఉంటుందని.. కాకపోతే భారీగా ఆదాయ పన్ను బాకీలు పడ్డ ప్రైవేట్ కంపెనీల్లోకి మళ్లిన ప్రజల నిధులు ఎంత మేర భద్రంగా ఉంటాయన్నది తాను చెప్పలేనని గోయల్ వ్యాఖ్యానించారు. మోసాలు చేసినది ప్రైవేట్ కంపెనీలే తప్ప ప్రభుత్వ బ్యాంకులు కాదన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రజల సొమ్ముకు నూటికి నూరు శాతం భద్రత ఉంటుందని భరోసా ఇస్తున్నాను. పీఎస్బీలకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. రిజర్వ్ బ్యాంక్‌కు పూర్తి అధికారాలున్నాయి.. పీఎస్‌బీలను సమర్థంగా నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్‌కి అన్ని అధికారాలు ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆర్బీఐ కోరుతున్నట్లుగా మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. పీఎస్‌బీలను నియంత్రించేందుకు తమకు మరిన్ని అధికారాలు అవసరమని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇటీవల పార్లమెంటరీ కమిటీకి తెలిపిన సంగతి తెలిసిందే. ‘రిజర్వ్ బ్యాంక్‌కి పూర్తి అధికారాలు ఉన్నాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అయినప్పటికీ, మరిన్ని అధికారాలు అవసరమైతే ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఈ విషయాలపై ఆర్బీఐ, ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకుంటాయి‘ అని గోయల్ చెప్పారు. చిన్న సంస్థలకు రుణాలపై పీఎస్‌బీల దృష్టి.. పీఎస్‌బీలు ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థలపై దృష్టి సారిస్తున్నాయని గోయల్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా నిఖార్సయిన కార్పొరేట్ కంపెనీలకు కూడా తోడ్పాటునివ్వాలని బ్యాంకులు నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ‘ఎంఎస్ఎంఈలు, నిఖార్సయిన మంచి కంపెనీల వర్కింగ్ క్యాపిటల్ తదితర రుణ అవసరాలు తీర్చడంపై మళ్లీ దృష్టి పెట్టాలని పీఎస్‌బీలు నిర్ణయించాయి‘ అని మంత్రి పేర్కొన్నారు. రెండు దశల్లో దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. తొలి దశలో రూ. 200 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల దాకా రుణాలు ఉన్న కంపెనీలను, రెండో దశలో రూ. 200 కోట్ల దాకా రుణాలున్న కంపెనీల అవసరాలను పీఎస్‌బీలు పరిశీలించి, నిర్ణయం తీసుకుంటాయని గోయల్ చెప్పారు. మళ్లీ మొండిబాకీల సమస్య తలెత్తకుండా ఈ విషయంలో బ్యాంకులు విడివిడిగా గాకుండా కన్సార్షియంగా కలిసి పనిచేస్తాయని తెలిపారు.అసెట్ రీకన్స్ట్రక్షన్ లేదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటుపై పీఎన్బీ చైర్మన్ సునీల్ మెహతా సారథ్యంలో ఏర్పాటైన సబ్ కమిటీ త్వరలో నివేదిక సమర్పించనుందని ఆయన చెప్పారు. బ్యాంకర్లతో భేటీలో మొండిబాకీలపై చర్చ.. బ్యాంకింగ్ చీఫ్‌లతో మంత్రి భేటీ సందర్భంగా బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోతున్న మొండిబాకీలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోని బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అనుబంధ బ్యాంకుల విలీనాల అనుభవాలను ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వివరించారు. బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్‌కి సంబంధించిన లోటుపాట్ల గురించి కూడా చర్చించినట్లు సమావేశం అనంతరం విలేకరులకు ఆయన తెలిపారు. -
ఉర్జిత్ పటేల్‌కు ఆర్బీఐ యూనియన్ బాసట
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) పీడిస్తున్న మొండిబాకీలు తదితర సమస్యల పరిష్కారం విషయంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తీసుకుంటున్న కఠిన చర్యలకు ఆర్బీఐ ఉద్యోగుల సంఘం మద్దతు పలికింది. బ్యాంకులను ఆర్బీఐ మరింత క్రియాశీలకంగా పర్యవేక్షించాల్సి ఉందని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ కేవలం ఆఫ్‌సైట్ సర్వేయర్‌గా ఉండిపోకుండా అప్రమత్తంగా ఉండే ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాలని అభిప్రాయపడింది. అఖిల భారత రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఈ మేరకు ఉర్జిత్ పటేల్‌కు లేఖ రాసింది. ఇటీవలే పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన ఉర్జిత్ పటేల్.. పీఎస్‌బీల నియంత్రణకు మరిన్ని అధికారాలు అవసరమని చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు, భారీగా బాకీ పడిన 40 మొండిపద్దులపై దివాలా కోర్టుకెళ్లాలన్న ఆర్బీఐ ఆదేశాలతో పీఎస్‌బీల పరిస్థితి మరింత దిగజారడంతో పాటు తమ ఉద్యోగాలకూ ముప్పు తప్పదంటూ బ్యాంక్ ఆఫీసర్ల యూనియన్లు ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో పటేల్ కఠిన వైఖరికి మద్దతుగా ఆర్బీఐ యూనియన్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిజర్వ్ బ్యాంక్‌కు ఉన్న పరిమితులను పార్లమెంటరీ స్థాయీసంఘానికి స్పష్టీకరించినందుకు పటేల్‌ను ప్రశంసిస్తూనే.. మరోవైపు, ఆర్బీఐ మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్న సంగతి కూడా యూనియన్ గుర్తు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌ను ప్రస్తావిస్తూ.. బ్యాంకుల యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, అవి ఇచ్చే నివేదికలను పూర్తిగా నమ్మొచ్చని ఆర్బీఐ గానీ భావిస్తే.. తన విధులను విస్మరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. అలా కాకుండా, రిస్క్ ఆధారిత పర్యవేక్షణ, ఆఫ్‌సైట్ నిఘా, నిర్వహణ వ్యవస్థలను ఆన్సైట్లో తనిఖీలు చేయడం వంటి త్రిముఖ వ్యూహాన్ని పాటించవచ్చని పేర్కొంది. -
రుణ వృద్ధికి ఆ నిధులు సరిపోవు!
ముంబై: కేంద్ర ప్రభుత్వం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2017 అక్టోబర్‌లో ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్లు బ్యాంకింగ్ రుణ వృద్ధికి ఎంతమాత్రం సరిపోవని మూడీస్ పేర్కొంది. ఇది కేవలం రెగ్యులేటరీ (నియంత్రణా పరమైన) మూలధన అవసరాలకు తగిన మొత్తమేనని విశ్లేషించింది. 2017–18, 2018–19లకు సంబంధించి బ్యాంకులకు కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల తాజా మూలధనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ ఏడాది బడ్జెట్లో రూ. 65,000 కోట్లు కేటాయించింది. ఈ అంశాలపై మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ అల్కా అంబరసు అభిప్రాయాల్లో ముఖ్యమైనవి చూస్తే... ళి ప్రభుత్వ రంగ బ్యాంకులు మూలధన కొరతను ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ నుంచి అదనపు క్యాపిటల్‌ను బ్యాంకింగ్ సమీకరించుకోలేకపోవడం దీనికి కారణం. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ ధరలు దాదాపు 19 శాతం తగ్గాయి. ►కేంద్రం రూ.2.11 లక్షల కోట్ల ప్యాకేజ్ని ప్రకటిస్తున్న సమయంలో బ్యాంకులు కూడా ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.58,000 కోట్లు సమీకరించుకోగలవన్న అంచనాతో ఉంది. అయితే ఇప్పటి వరకూ దాదాపు రూ.10,000 కోట్లు మాత్రమే సమీకరించుకోగలిగాయి. ► అంతర్గత మూలధన సృష్టి సామర్థ్యం ప్రభుత్వ రంగ బ్యాంకులకు గణనీయంగా పడిపోయింది. వాటి బలహీన ఫైనాన్షియల్ పరిస్థితులు దీనికి కారణం. ఇక మరోవైపు ప్రభుత్వ బాండ్ ఈల్డ్ పెరగడం బ్యాంకుల పెట్టుబడుల ఆదాయంపై ప్రభావం చూపుతోంది. ఆయా అంశాలన్నీ దీర్ఘకాలంలో బ్యాంకింగ్ మూల«ధన సమస్యలు సృష్టించేవే. భారత్ వ్యయాల తగ్గింపు తప్పదు.. ఇదిలావుండగా, ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పిత్తి (2018–19)లో 3.3 శాతానికి కట్టడి చేయడం కేంద్రానికి కీలకమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఇందుకుగాను వ్యయాలను తగ్గించే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది. ‘అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో ఉన్న చమురు ధరల నేపథ్యంలో, పెట్రోలియం, డీజిల్ ప్రొడక్ట్స్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే ఇబ్బందే. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు తగ్గుతాయి. ద్రవ్యలోటు పెరుగుతుంది. ఇది దేశ సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఒత్తిడి తెచ్చే అంశం’’ అని మూడీస్ విశ్లేషించింది. మూడీస్ గత ఏడాది 13 యేళ్లలో మొట్టమొదటిసారి భారత్ సావరిన్ రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ2’కు పెంచిన సంగతి తెలిసిందే. పీఎస్‌బీల చీఫ్‌లతో నేడు కేంద్రం భేటీ న్యూఢిల్లీ: పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ శుక్రవారం సమావేశం కానున్నారు. ఆయా బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. ముంబైలో జరిగే ఈ సమావేశాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు ప్రాంతాలకు చెందిన పీఎస్బీలకు సంబంధించి 15 మంది సీఈవోలు దీనికి హాజరు కానున్నారు. 2017–18 ఆర్థిక ఫలితాలు వెల్లడైన తర్వాత పీఎస్‌బీల చీఫ్‌లతో కేంద్రం సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరం చాలా మటుకు బ్యాంకులు భారీ నష్టాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొండిబాకీల పరిష్కారానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలో మొత్తం 11 బ్యాంకులు ఉన్నాయి. ఇందులో 7 బ్యాంకులు పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలకు చెందినవే. ఆర్బీఐ వాచ్‌లిస్ట్‌లో అలహాబాద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి. నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నాలుగో త్రైమాసికంలో ఏకంగా రూ. 13,417 కోట్లు నష్టం ప్రకటించింది. కుంభకోణానికి సంబంధించిన రూ. 14,356 కోట్ల మొత్తంలో సుమారు సగభాగం .. అంటే రూ. 7,178 కోట్లకు పీఎన్బీ ప్రొవిజనింగ్ చేసింది. మిగిలిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు త్రైమాసికాల్లో సర్దుబాటు చేయనుంది. మరోవైపు, ఎస్బీఐ సైతం జనవరి–మార్చి త్రైమాసికంలో రూ. 7,718 కోట్ల నష్టం నమోదు చేసింది. అంతక్రితం ఏడాది నాలుగో త్రైమాసికంలో నమోదైన రూ. 3,442 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు.