న్యూఢిల్లీ: ప్రస్తుతం అమలు చేస్తున్న సంస్కరణలతో నిజాయితీగల రుణగ్రహీతలు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) నుంచి రుణాలు పొందడం సులభం కాగలదని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. నిజాయితీకి పెద్ద పీట వేయడమనేది ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రక్రియ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆయన చెప్పారు. కచ్చితంగా అవసరం ఉండి, నిజాయితీగా వ్యవహరించే రుణగ్రహీతలకు ఏ ఆటంకాలూ లేకుండా రుణాలు లభించేలా చూడటం ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
‘‘జీఎస్‌టీ రిటర్నులు, వివిధ ఫైనాన్షియల్ టెక్నాలజీ సాధనాలు రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా రుణమివ్వటంపై బ్యాంకులు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. మదింపు ప్రక్రియ కఠినతరం చేయడం వల్ల రుణాలను రాబట్టుకునే ప్రక్రియ మెరుగుపడుతుంది’’ అని కుమార్ వివరించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏకంగా రూ. 8 లక్షల కోట్ల మేర మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొండిబాకీలతో కుదేలైన పీఎస్‌బీలను గట్టెక్కించేందుకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం రూ. 88,139 కోట్ల మేర అదనపు మూలధనాన్ని అందిస్తోంది. అయితే, నిర్దేశిత సంస్కరణలు అమలు చేయడాన్ని బట్టి కేటాయింపులు ఉంటాయంటూ షరతు విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment