Bank Loans
-
ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు
బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను (విల్‌ఫుల్ డిఫాల్టర్) నిరోధించడానికి బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక చర్యలను చేపట్టింది. వీరి వర్గీకరణపై తుది మార్గదర్శకాలను జారీ చేసింది.ఆర్బీఐ వివరాల ప్రకారం..రుణ ఖాతాలు మొండి బకాయిగా మారిన ఆరు నెలల లోపు విల్‌ఫుల్ డిఫాల్టర్లను నిర్దిష్టంగా గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేక కమిటీ పరిశీలిస్తూ ఉండాలి. ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల ఫొటోలను ప్రచురించాలి. ఎగవేతదారుకు, అతనికి సంబంధమున్న ఏ కంపెనీకీ అదనపు రుణ సదుపాయాలను అందించరాదు. ఎగవేతదార్ల జాబితా నుంచి బ్యాంకులు సదరు వ్యక్తి పేరును తొలగించిన ఏడాది వరకు ఇది అమల్లో ఉండాలి.ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే 100 మందికి తండ్రయ్యాడు..!తాజా మార్గదర్శకాలు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) వంటి ఆర్థిక సంస్థలకు వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. బకాయి మొత్తం రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండి, రుణగ్రహీత లేదా గ్యారెంటార్ రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన పక్షంలో దాన్ని ‘విల్‌ఫుల్ డిఫాల్టర్’గా వ్యవహరిస్తారు. -
అప్పు చెల్లించని వైజాగ్ స్టీల్‌ప్లాంట్!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతుంది. జూన్ 30న బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.410 కోట్లను డిఫాల్ట్ చేసింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లకు తీవ్రనష్టం వాటిల్లినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెంటనే చర్యలు తీసుకునేలా అప్పు ఇచ్చిన బ్యాంకులు ఇంటర్క్రెడిటర్ అగ్రిమెంట్(రుణ గ్రహీతలు డిఫాల్ట్ అయితే రిస్క్ తగ్గించే ఒప్పందం)పై సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నాయి.వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు దాదాపు రూ.14,000 కోట్లు టర్మ్ లోన్లు ఉన్నాయి. రూ.15,000 కోట్లు షార్ట్ టర్మ్ లోన్లు, గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ వంటివి ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు రూ.5,000 కోట్ల కంటే ఎక్కువ టర్మ్ లోన్, రూ.4,000 కోట్ల షార్ట్ టర్మ్ లోన్, రూ.1,400 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందించింది. కెనరా బ్యాంక్ రూ.3,800 కోట్ల రుణాలు, ఇండియన్ బ్యాంక్ రూ.1,400 కోట్ల టర్మ్ లోన్ ఇచ్చింది. అయితే ఇటీవల రుణదాతలకు చెల్లించాల్సిన రూ.410 కోట్లు డిఫాల్ట్ చేయడంతో బ్యాంకులు ఇంటర్ క్రెడిట్ అగ్రిమెంట్(ఐసీఏ)పై సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంస్థ డిఫాల్ట్ అయిన నెలలోపు ఐసీఏపై సంతకం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. తద్వారా నష్టాల్లో ఉన్న కంపెనీని పునరుద్ధరించడానికి తక్షణ చర్య తీసుకోవచ్చు. అయితే 75% మంది రుణదాతలు నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ చర్య అమలు అవుతుంది.సంస్థ ఇటీవల చేసిన డిఫాల్ట్ నగదు ఇంకా సాంకేతికంగా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ) అవ్వలేదు. కానీ, ముందుజాగ్రత్త చర్యగా కొంతమంది రుణదాతలు తాము ఇచ్చిన అప్పులకుగాను సంస్థలో 15 శాతం కేటాయింపులు పూర్తి చేశారు. డిఫాల్ట్ నిర్ణయం ప్రకటించిన 90 రోజుల తర్వాత లోన్ ఖాతా ఎన్పీఏగా మారుతుంది. ఆ సమయంలో బ్యాంకులు కనీసం 15 శాతం కేటాయింపులు కలిగి ఉండేలా జాగ్రత్తపడినట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ-టాటా మోటార్స్ వివాదం.. ఢిల్లీ హైకోర్టులో విచారణఈ వ్యవహారంపై సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు స్పందిస్తూ..‘వైజాగ్‌స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నప్పటికీ సంస్థ రుణాలకు ప్రభుత్వ హామీ ఉండదు. సంస్థ ప్రస్తుతం కేవలం 30 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. దాంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. కంపెనీ కస్టమర్లు తమ చెల్లింపులు సరిగా చేయడంలేదు. దాంతో పరిస్థితి మరింత దిగజారుతోంది’ అని అన్నారు. ఇదిలాఉండగా, ఈ నెల ప్రారంభంలో ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించి, అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.620 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.63 కోట్లు కోతపెట్టింది. ఇప్పటికే ఈ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. సొంతంగా ఉక్కు గనులు కేటాయిస్తే కంపెనీ లాభాల్లోకి వెళ్తుందని అధికారులు, కార్మికులు చెబుతున్నారు. -
ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థికాభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా తయారైంది. బ్యాంకింగ్ రంగం కీలక సూచికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైనట్లు 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సత్పలితాలు ఇస్తున్నాయనడానికి డిపాజిట్లలో భారీ వృద్ధి నిదర్శనం. గత ఐదేళ్లలో డిపాజిట్లలో ఏకంగా 58.23 శాతం వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి డిపాజిట్లు రూ.3,12,642 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.4,94,690 కోట్లు.. అంటే రూ.1,82,048 కోట్లు పెరిగాయి. అన్ని రంగాలకు బ్యాంకు రుణాల మంజూరులో ఏకంగా 96.64 శాతం భారీ వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి రుణాల మంజూరు రూ.3,97,350 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.7,81,313 కోట్లకు పెరిగాయి. అంటే రుణాలు రూ.3,83,963 కోట్లు పెరిగాయి. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం పెరుగుదలకు నిదర్శనం కాగా రుణాలు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నేరుగా నగదు బదిలీని అమలు చేసింది. అలాగే బ్యాంకుల ద్వారా పేదలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎంఎస్ఎంఈలు, ఇతర వర్గాలకు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా వారి ఆదాయం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టింది. అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో రుణాల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది. ఆర్బీఐ నిబంధనలకన్నా అన్ని రంగాల్లో అత్యధికంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తోంది. వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తోంది. వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు చేయించి, వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా ప్రభుత్వం అందించిన చేయూతతో సకాలంలో రుణాలు చెల్లిస్తూ వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి క్రెడిట్ రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా దానికి మించి 157.94 శాతం నమోదైనట్లు బ్యాంకర్ల కమిటీ నివేదిక పేర్కొంది. సీడీ రేషియో అధికంగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరగుతున్నాయనే అర్ధమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. -
నారీశక్తి నూతనాధ్యాయం లిఖిస్తా
సాక్షి, న్యూఢిల్లీ/గురుగ్రామ్: ఎన్డీఏ ప్రభుత్వం మూడో దఫా కొలువుతీరడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. హ్యాట్రిక్ పాలనలో మహిళల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం పాటుపడుతుందని ప్రకటించారు. నారీశక్తి అభివృద్ధిలో నూతన అధ్యయనం లిఖిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ‘సశక్తి–నారీశక్తి’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల కష్టాలు, కన్నీళ్లను ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. మా ప్రభుత్వాలు మహిళలను ప్రతిదశలోనూ చేయి అందించిమరీ వారి అభ్యున్నతికి పాటుపడ్డాయి. మరుగుదొడ్ల లేమి, శానిటరీ ప్యాడ్ల వాడకం, వంటచెరకు వాడకంతో వంటగదుల్లో పొగచూరిన మహిళల బతుకులపై మాట్లాడిన ఏకైక ప్రధాని మంత్రిని నేనే. మహిళలందరికీ బ్యాంక్ ఖాతాలు ఉండాలని ఎర్రకోట వేదికగా పిలుపునిచ్చా’’ అని మోదీ వ్యాఖ్యానించారు. 1,000 మంది ‘నమో డ్రోన్ దీదీ’లకు డ్రోన్లు సశక్తి–నారీశక్తి కార్యక్రమంలో భాగంగా స్వయంసహాయక బృందాలకు దాదాపు రూ.8,000 కోట్ల బ్యాంక్ రుణాలను మోదీ అందజేశారు. ఈ సందర్భంగా వారిలో కొందరితో మోదీ స్వయంగా మాట్లాడారు. స్వావలంభనతో అభివృద్ధిలోకి వచి్చన వారిని మెచ్చుకున్నారు. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన–నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కార్యక్రమం మద్దతుతో లక్షాధికారులుగా మారిన ‘లఖ్పతి దీదీ’లను ఈ సందర్భంగా మోదీ సత్కరించారు. వ్యవసాయం, సాగు సంబంద పనుల్లో డ్రోన్లను వినియోగంచడంలో ఇప్పటికే తర్ఫీదు పొందిన 1,000 మంది ‘నమో డ్రోన్ దీదీ’లకు మోదీ డ్రోన్లను పంపిణీచేశారు. మూలధన సంబంధ నిధి కింద స్వయం సహాయక బృందాలకు మరో రూ.2,000 కోట్లను మోదీ పంపిణీచేశారు. ప్రతికూల మనస్తత్వానికి ప్రతిబింబం.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు సానుకూల మనస్తత్వం ఏ కోశానా లేదని మోదీ విమర్శించారు. దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వీలుగా 112 జాతీయ రహదారులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. -
Loans: రుణ పడొద్దు!
సొంత కారు, అందమైన భవంతి, ఇంట్లో అన్ని రకాల సాధనాలు (మెషీన్లు).. ఎందులోనూ రాజీపడేది లేదన్నట్టుగా ఉంది నేటి యువతరం ధోరణి. ముందు పొదుపు, తర్వాతే ఖర్చు.. గతంలో మన పెద్దలు అనుసరించిన ధోరణి. ముందు ఖర్చు.. మిగిలితేనే పొదుపు అన్నట్టుగా ఉంది నేటి తీరు. ఏ అవసరం వచ్చినా ‘తగ్గేదే లే’ అన్న ధోరణి కనిపిస్తోంది. కొనుగోళ్ల నుంచి వైద్య చికిత్సల వరకు అన్నింటికీ రుణబాట పడుతున్నారు. తీర్చే సామర్థ్యం ఉంటేనే రుణం తీసుకోవాలి. ప్రాధాన్యత లేని వాటికి సైతం రుణాలను ఆశ్రయిస్తే తీర్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కారణం ఏదైనా సకాలంలో రుణం వాయిదా చెల్లించలేకపోతే, ఎదుర్కోవాల్సిన పరిణామాలు చాలానే ఉంటాయి. చివరికి ఉద్యోగ అన్వేషణకు సైతం దూరం కావాల్సి రావచ్చు. గతంలో బ్యాంకుల రుణ వృద్ధిలో కార్పొరేట్ రుణాలదే పైచేయిగా ఉండేది. మొదటిసారి 2020 (కరోనా విపత్తు కాలంలో) నవంబర్‌లో బ్యాంకుల రుణాల్లో కార్పొరేట్లను కాదని రిటైల్ రుణాలు ముందుకు వచ్చేశాయి. అప్పటి నుంచి 2023 నవంబర్ 17 నాటికి చూస్తే రిటైల్ రుణాలు 79 శాతం పెరగ్గా.. కార్పొరేట్ రుణాల్లో వృద్ధి 28 శాతానికి పరిమితమైంది. 2023లో రెండో త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లోనూ రిటైల్ రుణాల్లో వృద్ధి 15 శాతంగా నమోదైంది. రిటైల్ రుణాల్లో కన్జ్యూమర్ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం తీసుకునేవి (విలువ పరంగా) 20 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహన రుణాలు 18 శాతం వృద్ధి చెందాయి. వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునే రుణాలు 12 శాతం పెరిగాయి. ఆటో రుణాలు 13 శాతం పెరిగితే, ఇంటి రుణాలు విలువ పరంగా మైనస్ 6 శాతంగా ఉన్నాయి. వినియోగ రుణాలు ఎక్కువగా ఉంటున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, అదే సమయంలో రుణ ఎగవేతల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ రుణాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. 2023 జూలై నాటికి క్రెడిట్ కార్డ్ రుణాలు రూ.2.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం కంటే 31 శాతం పెరిగాయి. రిటైల్ రుణాలన్నీ కూడా అన్సెక్యూర్డ్. రుణ గ్రహీత చేతులు ఎత్తేస్తే అది బ్యాంకింగ్ వ్యవస్థపై భారాన్ని మోపుతుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ వ్యక్తిగత, అన్ సెక్యూర్డ్, క్రెడిట్ కార్డ్ రుణాలకు రిస్క్ వెయిటేజీ పెంచుతూ, వీటికి బ్యాంకులు మరిన్ని నిధులను పక్కన పెట్టేలా గత నవంబర్‌లో ఆదేశాలు తీసుకొచి్చంది. క్రెడిట్ స్కోర్‌కు విఘాతం తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోయినా, రుణాన్ని ఎగవేసినా అది క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా తగ్గించేస్తుంది. కరోనా అనంతరం రిటైల్ రుణాలు తీసుకోవడం గణనీయంగా పెరిగిపోగా, అదే సమయంలో అంతకుముందు తీసుకున్న రుణాలకు సంబంధించి ఎగవేతలు కూడా పెద్ద మొత్తంలోనే నమోదయ్యాయి. దీంతో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు పెద్ద మొత్తాల్లో కేటాయింపులు చేయాల్సి వచి్చంది. ఈ పరిణామాలతో చాలా మంది రుణ గ్రహీతల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడింది. నేడు ప్రతి రుణానికి సంబంధించి చెల్లింపుల చరిత్రతో క్రెడిట్ బ్యూరోలు రికార్డులను నిర్వహిస్తున్నాయి. రుణం సకాలంలో చెల్లించకపోయినా, ఎగ్గొట్టినా, సెటిల్మెంట్ చేసుకున్నా, రుణం కావాలంటూ విచారణలు చేసినా, అవన్నీ సంబంధిత వ్యక్తి పేరిట రికార్డుగా నమోదవుతాయి. వీటి ఆధారంగానే క్రెడిట్ బ్యూరోలు స్కోర్‌ను కేటాయిస్తుంటాయి. 750, అంతకుమించి క్రెడిట్ స్కోర్ ఉంటే అది మెరుగైనది. రుణం సులభంగా వస్తుంది. మెరుగైన రేటుకు వస్తుంది. 750కంటే తక్కువ ఉంటే రుణం పొందడం కష్టమవుతుంది. ఒకవేళ రుణం లభించినా, అది అధిక వడ్డీ రేటుపై తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ వాయిదాలను సకాలంలో చెల్లించాలి. నేడు దాదాపు అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ స్కోర్ ఆధారంగానే అన్సెక్యూర్డ్ రుణాలు మంజూరు చేస్తున్నాయి. తదుపరి పరిణామాలు.. బకాయి చెల్లించాలంటూ రుణగ్రహీతను రుణం ఇచి్చన సంస్థలు కోరతాయి. గడువు తీరిన 30 రోజులకూ చెల్లింపులు చేయకపోతే అప్పుడు ఆయా రుణగ్రహీతల సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తుంటాయి. 30–60 రోజుల పాటు చెల్లింపులు చేయకపోతే అది క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది. ఇక రుణ వాయిదా 60 రోజులు దాటినా చెల్లించలేని వారి క్రెడిట్ స్కోర్ మరింత తగ్గిపోతుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ వల్ల భవిష్యత్తులో రుణానికి ద్వారాలు మూసుకుపోతాయి. అత్యవసరంలో రుణం కావాల్సి వస్తే నిరాకరణ ఎదురుకావచ్చు. డిజిటల్‌గా రుణాలు ఇచ్చే సంస్థలు కనీసం ఒక్క రోజు ఆలస్యం చేసినా,ఎగవేతదారుల జాబితాలో చేరాల్సి వస్తోంది. 650–750 మధ్య స్కోర్ ఉన్న వారికి గృహ రుణం కావాలంటే, మెరుగైన స్కోర్ ఉన్న వారితో పోలిస్తే 2 శాతం అధిక రేటు చెల్లించాల్సి వస్తుంది. రూ.50 లక్షల రుణం 20 ఏళ్ల కాలవ్యవధికి కావాలంటే, తక్కువ స్కోర్ కారణంగా వడ్డీ రూపంలో అదనంగా రూ.12 లక్షల వరకు భారాన్ని మోయాల్సి రావచ్చు. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య ఈ రేటు వ్యత్యాసం మారుతుంది. రుణం ఎగ్గొట్టడం సివిల్ నేరం కిందకు వస్తుంది. రుణ గ్రహీత ఇచి్చన చెక్కుల ద్వారా వసూలు చేసుకునే చర్యలను ఆరి్థక సంస్థలు ప్రారంభిస్తాయి. గడువు ముగిసిన 90 రోజుల్లోపు కూడా రుణ గ్రహీత చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, నోటీసు వస్తుంది. 180 రోజులు (ఆరు నెలలు) ముగిసినా ఎలాంటి ఫలితం లేకపోతే అప్పుడు నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్ యాక్ట్, 1881లోని సెక్షన్ 138 కింద రుణం ఇచి్చన సంస్థ కేసు దాఖలు చేస్తుంది. చెల్లించే సామర్థ్యం ఉన్నా, చెల్లించకపోతే ఉద్దేశపూర్వక ఎగవేతదారు అనే ముద్ర పడుతుంది. సరైన కారణంతో రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు రుణం ఇచి్చన సంస్థతో చర్చలు నిర్వహించి పరిష్కారానికి, పరస్పర అంగీకారానికి రావచ్చు. హోమ్‌లోన్ లేదా ప్రాపర్టీ లోన్ లేదా బంగారంపై రుణం వంటి సెక్యూర్డ్ రుణాల్లో రుణ గ్రహీత చెల్లింపుల్లో చేతులు ఎత్తేస్తే.. తనఖాగా ఉంచిన ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తుంటాయి. అలాగే, ఆటోమొబైల్ రుణాల్లోనూ వాహనాన్ని జప్తు చేసి, చెల్లింపులకు తగినంత వ్యవధి ఇస్తాయి. అప్పటికీ చెల్లించకపోతే వాహనాన్ని వేలం వేసి రుణంలో సర్దుబాటు చేసుకుంటాయి. బ్యాంక్ జాబ్ కష్టమే! బలహీన క్రెడిట్ స్కోర్ ఉందంటూ ఉద్యోగ దరఖాస్తు తిరస్కరించే అధికారం బ్యాంకుల బోర్డులకు ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 650 క్రెడిట్ స్కోర్ ఉండాలన్న నిబంధనను ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విధించింది. బా«ధ్యతాయుత ఆరి్థక నడవడిక ఉండాలన్నది దీని వెనుక ఉద్దేశం. ఎంతో విలువైన లావాదేవీల వ్యవహారాల బాధ్యతలను బ్యాంకుల ఉద్యోగులు చూస్తుంటారు. అందుకే ఈ నిబంధన ప్రవేశపెట్టారు. అందుకే బ్యాంకు ఉద్యోగాలకు ప్రయతి్నంచే వారు మెరుగైన స్కోర్ కోసం ముందు నుంచే తగిన జాగ్రత్త చర్యలను పాటించడం మంచిది. కొన్ని బహుళజాతి సంస్థలు కూడా ఉద్యోగం కోరుతున్న వారి క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తుంటాయి. 2022 మార్చిలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం జారీ చేసిన ప్రకటనలో.. బ్యాంక్‌లు/ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తీసుకున్న ఏ రుణం చెల్లింపుల్లో అయినా విఫలం అయినట్టయితే, క్రెడిట్ కార్డ్ బకాయిలు సకాలంలో చెల్లింపులు చేయకపోతే అటువంటి వారు నియామకానికి అర్హులు కాదని స్పష్టంగా పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఉద్యోగార్థుల క్రెడిట్ రిపోర్ట్‌లను పరిశీలించడం సర్వసాధారణమని.. దీనివల్ల ఆర్థికంగా ఎంత బాధ్యతాయుతంగా ఉంటారనేది తెలుస్తుందని డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఫైబ్ హెచ్ఆర్ హెడ్ మోనికా మిశ్రా తెలిపారు. ఇది సంస్థలో మోసాలు, చోరీల అవకాశాలను తెలియజేస్తుందన్నారు. ఆర్థిక అంశాల నిర్వహణలో బాధ్యతారహితంగా ఉండే వ్యక్తి, కంపెనీ ఆరి్థక వ్యవహారాల నిర్వహణకు సరైన వ్యక్తి కాదని మిశ్రా వివరించారు. ఏ రుణంలో ప్రతికూలతలు ఎలా..? రుణం కోసం రుణం... తీసుకున్న రుణాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో మరో రుణం తీసుకుని చెల్లించే ఆలోచనలు సరికాదు. ముందు తీసుకున్న రుణంపై అధిక వడ్డీ రేటు ఉండి, చాలా తక్కువ రేటుకే మరో సంస్థ రుణం ఇవ్వడానికి ముందుకు వస్తే అప్పుడు ఆలోచించొచ్చు. తక్కువ రేటుపై రుణం తీసుకుని అధిక రేటుతో కూడిన రుణాన్ని తీర్చివేయవచ్చు. వ్యక్తిగత రుణాలపై 14–15 శాతం మేర వడ్డీ రేటు ఉంటే, మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 12 శాతానికే లభిస్తుంది. అలాంటప్పుడు పరిశీలించొచ్చు. అంతేకానీ, చెల్లింపుల సమస్య నుంచి బయటపడేందుకు మరో రుణాన్ని ఆశ్రయిస్తే సమస్యను పెంచుకున్నట్టు అవుతుంది. అలాగే, క్రెడిట్ కార్డ్‌పై 3–4 రూపాయల వడ్డీ పడుతుంది. వ్యక్తిగత రుణాన్ని తీసుకుని క్రెడిట్ కార్డ్ రుణాన్ని తీర్చివేయవచ్చు. రుణ గ్రహీత ముందున్న మార్గం రుణం తీసుకుని, చెల్లింపులు సకాలంలో చేయకపోయినా.. రుణం ఇచ్చిన సంస్థలు గౌరవప్రదంగా, పారదర్శకంగానే వ్యవహరించాలి కానీ, వేధించడం, బెదిరించడం చేయకూడదని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి తెలిపారు. రుణం 90 రోజులకు మించి చెల్లింపులు లేకపోతే, అప్పటికీ చెల్లించేందుకు 60 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూర్డ్ రుణం చెల్లించనప్పుడు, తనఖాలో ఉంచిన ఆస్తులు లేదా వాహనాలను విక్రయించగా, వచ్చే మొత్తం నుంచి రుణం మినహాయించుచుని మిగిలినది తిరిగి రుణ గ్రహీతకు ఇచ్చేయాల్సి ఉంటుంది. రుణం చెల్లించలేనప్పుడు మారటోరియం లేదా వన్‌టైమ్ పరిష్కారం కోసం డిమాండ్ చేయవచ్చు. రుణం చెల్లించలేకపోవడం వెనుక సహేతుక కారణాలు ఉంటే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సంస్థను సంప్రదించాలి. చెల్లించడానికి మరింత సమయం ఇవ్వాలని కోరొచ్చు. మీరు చెప్పిన కారణాల్లో వాస్తవికత ఉందని బ్యాంక్/ఎన్బీఎఫ్సీ భావిస్తే రుణ చెల్లింపులపై స్వల్పకాలం పాటు మారటోరియం (విరామం) కలి్పస్తాయి. లేదంటే రుణ కాల వ్యవధిని పెంచి, ఈఎంఐ మొత్తాన్ని తగ్గిస్తాయి. క్రెడిట్ కార్డు రుణం క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తం చెల్లించలేని సందర్భాల్లో, మినిమం డ్యూ (బిల్లులో నిరీ్ణత శాతం) చెల్లించినా సరిపోతుంది. ఈ మినిమం డ్యూని కూడా చెల్లించనట్టయితే ఆరు నెలలు వేచి చూసిన తర్వాత డిఫాల్ట్‌గా ఖరారు చేస్తారు. డిపాజిట్‌ను సెక్యూరిటీగా ఉంచి క్రెడిట్ కార్డు తీసుకుంటే, బకాయి పడిన సందర్భంలో డిపాజిట్‌ను రద్ధు చేసి రుణం కింద సర్దుబాటు చేసుకుంటారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పొందిన క్రెడిట్‌కార్డు అయితే, బకాయి వసూలు బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగిస్తాయి క్రెడిట్ కార్డు కంపెనీలు. రుణ గ్రహీత నుంచి రుణాన్ని రప్పించే ప్రయత్నాలను ఏజెన్సీలు చేస్తాయి. అప్పటికీ ఫలితం లేకపోతే కోర్టులో కేసు దాఖలవుతుంది. బ్యాంక్‌లు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు బ్లాక్ లిస్ట్‌ను నిర్వహిస్తుంటాయి. చెల్లింపులు చేయని వారిని బ్లాక్ లిస్ట్‌లో చేరుస్తాయి. విద్యా రుణం విద్యా రుణం ఈఎంఐ చెల్లింపులు సాధారణంగా కోర్సు ముగిసి, ఉద్యోగంలో చేరిన నాటి నుంచి మొదలవుతాయి. కానీ, కొన్ని కారణాల వల్ల కోర్స్‌లో సకాలంలో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగం రాదు. కోర్సు పూర్తి చేసినా కానీ వెంటనే అందరికీ ఉపాధి లభిస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. లేదంటే ఉద్యోగం వచి్చనప్పటికీ, అది కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వచి్చన సందర్భాల్లో రుణ ఈఎంఐ చెల్లించలేకపోతే, తదుపరి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంటనే ఉద్యోగం లభించకపోయినా, వచ్చిన ఉద్యోగం కోల్పోయినా బ్యాంకులను సంప్రదించి, పూర్తి వివరాలు తెలియజేయాలి. మరింత గడువు కోరాలి. లేదంటే బ్యాంక్‌లు నిర్ణీత కాలం పాటు వేచి చూసి మిగిలిన రుణాల మాదిరే నోటీసు జారీ ద్వారా తదుపరి చర్యలు ప్రారంభిస్తాయి. విద్యా రుణానికి సంబంధించి డిఫాల్టర్‌గా మారితే భవిష్యత్‌లో ఎన్నో రుణాలకు అవరోధంగా మారొచ్చు. రూ.4–10 లక్షల వరకు విద్యా రుణాలకు బ్యాంక్‌లు ఎలాంటి సెక్యూరిటీని కోరవు. అంతకుమించితే మరో వ్యక్తిని గ్యారంటర్‌గా, లేదా ప్రాపరీ్టని తనఖాగా ఉంచాలని కోరతాయి. సకాలంలో చెల్లించలేకపోతే గ్యారంటర్ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. వ్యక్తిగత రుణం వ్యక్తిగత రుణం వాయిదా గడువు ముగిసిన 30 రోజుల వరకు చెల్లించకపోతే డిఫాల్ట్‌గా పరిణిస్తాయి. ఇదే విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు తెలియజేస్తాయి. ఇలా వరుసగా మూడు వాయిదాల్లో విఫలమైతే అప్పుడు రుణంపై అదనపు వడ్డీ రేటును (పీనల్ ఇంటరెస్ట్) వడ్డిస్తాయి. 30 నుంచి 60 రోజుల్లోపు రుణ వాయిదాను వడ్డీ, అన్ని చార్జీలతో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్‌పై స్వల్ప ప్రభావమే పడుతుంది. 90 రోజులకు కూడా చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్‌పై ఎక్కువ ప్రభావం పడుతుంది. 180 రోజుల తర్వాత కూడా చెల్లింపులు రాకపోతే అప్పుడు రుణ గ్రహీతపై కేసులు దాఖలవుతాయి. వినియోగ రుణం కన్జ్యూమర్ ఉత్పత్తుల కోసం తీసుకునే రుణాలు, వాహన రుణాలు అయినా గడువులోపు చెల్లించకపోతే ఒకటి రెండుసార్లు నోటీసును జారీ చేస్తాయి. 30 రోజుల్లోగా చెల్లించకపోతే అప్పుడు ముందుగా సమర్పించిన చెక్కులను నగదుగా మార్చుకునే చర్యలు మొదలు పెడతాయి. చెక్కులు బౌన్స్ అయితే కోర్టులో కేసు దాఖలు చేస్తాయి. వాహనం లేదా ఉత్పత్తిని స్వా«దీనం చేసుకుంటాయి. వడ్డీసహా రుణ మొత్తాన్ని చెల్లించి సమస్య నుంచి బయటపడవచ్చు. గృహ రుణం ఇంటిపై పొందే మార్ట్గేజ్ రుణం చెల్లించకపోతే ఇంటిని కోల్పోవాల్సి వస్తుంది. గడువు ముగిసిన తర్వాత 30 రోజుల్లోపు చెల్లింపులు లేకపోతే దాన్ని డిఫాల్ట్ (బకాయిపడినట్టు)గా పరిగణిస్తారు. వరుసగా మూడు ఈఎంఐలు కూడా చెల్లించకపోతే, అప్పుడు బకాయిలను 60 రోజుల్లోగా సెటిల్ చేసుకోవాలంటే లీగల్ నోటీసు పంపిస్తాయి. ఆ గడువులోపు స్పందించకపోతే, సర్ఫేసీ చట్టం కింద ఇంటి జప్తు ప్రక్రియను మొదలు పెడతాయి. ఆ తర్వాత కూడా కొల్లేటరల్ (తాకట్టు) విలువ, వేలం తేదీ తదితర వివరాలతో ఒక నోటీసు పంపిస్తాయి. అప్పుడు స్పందించినా, బ్యాంక్‌లు పరిష్కారానికి అవకాశం ఇస్తాయి. చివరి ఆప్షన్‌గా ఇంటిని వేలం నిర్వహిస్తాయి. దీనివల్ల ఇంటిని కోల్పోవడంతోపాటు, క్రెడిట్ రిపోర్ట్‌లో కొన్నేళ్లపాటు దీని ప్రభావం కనిపిస్తుంది. -
పెరిగిన బ్యాంక్ లోన్స్.. ఆ రంగానికే ప్రాధాన్యం
ముంబై: ప్రైవేటు కార్పొరేట్ రంగానికి బ్యాంకుల రుణ వితరణ సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 14.9 శాతం పెరిగినట్టు ఆర్బీఐ డేటా వెల్లడింంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోనూ 14.7 శాతం వృద్ధి నమోదు కాగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ 11.5 శాతం చొప్పున వృద్ధి చెందడం గమనార్హం. బ్యాంకుల మొత్తం రుణాల్లో పరిశ్రమలకు ఇచ్చినవి 25 శాతంగా ఉన్నాయి. వార్షికంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో 8.6 శాతం పెరిగాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాల వృద్ధి గత ఆరు త్రైమాసికాలుగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. బ్యాంక్ రుణాల్లో వ్యక్తిగత రుణాల వాటా ఐదేళ్ల క్రితం ఉన్న 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. మహిళా రుణ గ్రహీతల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్‌లు రుణాల్లో ఎక్కువ వృద్ధిని చూపిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగిపోవడంతో, అధిక ఈల్డ్స్ వచ్చే డిపాజిట్లలోకి పెట్టుబడులు మళ్లుతున్నాయి. 6 శాతం వడ్డీలోపు డిపాజిట్లు 2022 మార్చి నాటికి 85.7 శాతంగా ఉంటే, 2023 మార్చి నాటికి 38.7 శాతానికి, సెప్టెంబర్ వరికి 16.7 శాతానికి తగ్గాయి. రేట్లు పెరగడంతో కరెంట్, సేవింగ్స్ డిపాజిట్ల కంటే టర్మ్ డిపాజిట్లలోకి ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో బ్యాంక్‌ల మొత్తం డిపాజిట్లలో టర్మ్ డిపాజిట్ల వాటా ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న 57 శాతం నుం సెప్టెంబర్ చివరికి 60 శాతానికి చేరింది. డిపాజిట్లను ఆకర్షించడంలోనూ ప్రభుత్వరంగ బ్యాంక్‌లతో పోలిస్తే ప్రైవేటు బ్యాంక్‌లే ముందున్నాయి. మొత్తం టర్మ్ డిపాజిట్లలో 44 శాతం రూ.కోటికి పైన ఉన్నవే కావడం గమనార్హం. -
ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు!
ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న డబ్బు చాలా ప్రధానం. కావలసినంత జీతాలు రానప్పుడు ఈ చిన్న పని చేయాలన్నా.. బ్యాంకుల ద్వారా లోన్స్ తీసుకోవడం అలవాటైపోయింది. చాలామందికి పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ వంటి వాటి గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో బ్యాంకులు అందించే వివిధ రకాల లోన్స్ గురించి తెలుసుకుందాం. పర్సనల్ లోన్స్ - కస్టమర్ ఆదాయం, సిబిల్ స్కోర్, తిరిగి చెల్లించే కెపాసిటీ వంటి వాటిని బేస్ చేసుకుని బ్యాంకులు ఈ పర్సనల్ లోన్స్ అందిస్తాయి. ఇలాంటి లోన్లకు ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు లోన్ తీసుకునే బ్యాంకుల మీద ఆధారపడి ఉంటాయి. హోమ్ లోన్స్ - కొత్త ఇల్లు కట్టుకోవడానికి లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి ఇలాంటి లోన్స్ పొందవచ్చు. ఇలాంటి లోన్స్ మీద బ్యాంకులు వివిధ ఆఫర్స్ అందిస్తాయి, వడ్డీలో రాయితీలు కూడా లభిస్తాయి. హోమ్ రేనోవేషన్ లోన్స్ - కొత్త ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉన్న ఇల్లుని రేనోవేషన్ చేసుకోవడానికే లేదా ఇంటీరియర్స్ డిజైన్స్ కోసం కూడా బ్యాంకులు లోన్స్ అందిస్తాయి. వెడ్డింగ్ లోన్స్ - బ్యాంకులు పెళ్లి చేసుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన లోన్స్ అందిస్తాయి. ఎందుకంటే పెళ్లి జీవితంలో ఒకేసారి చేసుకుంటారు, కొంత ఆడంబరంగా చేసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సమయంలో బ్యాంకులు అందించే వెడ్డింగ్ లోన్స్ చాలా ఉపయోగపడతాయి. శాలరీ అడ్వాన్స్ లోన్స్ - అడ్వాన్స్ శాలరీ లోన్ అనేది జీతం తీసుకునే వారికి బ్యాంకులు అందించే తాత్కాలిక లోన్స్, ఈ లోన్ వడ్డీ రేటుని నెలవారీ లేదా రోజువారీ ప్రాతిపదికన కూడా లెక్కిస్తారు. వడ్డీలు లోన్ ఇచ్చే బ్యాంకుల మీద ఆధారపడి ఉంటాయి. ఎడ్యుకేషన్ లోన్స్ - ఎడ్యుకేషన్ లోన్ అనేది పోస్ట్-సెకండరీ ఏజికేషన్ లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ఖర్చుల కోసం బ్యాంకులు అందించే లోన్స్. డిగ్రీ చదువుకునే సమయంలో ట్యూషన్, బుక్స్ ఇతర ఖర్చుల కోసం ఇలాంటి లోన్స్ పొందవచ్చు. మెడికల్ లోన్స్ - మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మీరు పొందగలిగే ఈ లోన్ హాస్పిటల్ బిల్స్, ఆపరేషన్ ఖర్చులు, ప్రిస్క్రిప్షన్ బిల్లులు, కీమోథెరపీ ఖర్చులు వంటి ఏదైనా ఇతర వైద్య సంబంధిత ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగపడతాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ లోన్స్ - సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఇలాంటి లోన్స్ లభిస్తాయి. అంతే కాకుండా డాక్టర్, ఆర్కిటెక్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ వంటి వారు సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించడానికి బ్యాంకులు ఇలాంటి లోన్స్ అందిస్తాయి. గోల్డ్ పర్సనల్ లోన్స్ - మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే లోన్ ఇది. కొంత తక్కువ వడ్డీ రేటుతో ఈ లోన్స్ పొందవచ్చు. ట్రావెల్ లోన్స్ - చదువుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి కోసం మాత్రమే కాకుండా మీ ప్రాయానాలకు కూడా కావలసిన లోన్స్ అందిస్తాయి. ఇలాంటి లోన్స్ మీ ఫ్లైట్ చార్జెస్, వసతి ఖర్చులు వంటి వాటికి ఉపయోగపడతాయి. ఇలాంటి లోన్స్ మాత్రమే కాకుండా.. పర్సనల్ లైన్ ఆఫ్ క్రెడిట్ లోన్, సెక్యూర్డ్ పర్సనల్ లోన్, యూజ్డ్ కార్ లోన్, స్మాల్ పర్సనల్ లోన్ మొదలైనవి కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం లోన్ పేరుతో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి, కాబట్టి అలంటి మోసాలు భారీ నుంచి బయటపడటానికి.. మరిన్ని ఇతర లోన్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న బ్యాంకులను సందర్శించి తెలుసుకోవచ్చు. -
తగ్గుతున్న పారిశ్రామిక రుణాలు.... వ్యక్తిగత రుణాలు పైపైకి...
బ్యాంకులు ఎక్కువగా కార్పొరేట్ రుణాల ద్వారానే అధికంగా లాభాలు సంపాదిస్తుంటాయి. అయితే గత కొంతకాలంగా బ్యాంక్ రుణాల సరళిమారుతోంది. కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీయల్ రంగానికి అధికంగా రుణాలు ఇస్తున్న బ్యాంకులు..ప్రస్తుతం వాటి వాటా తగ్గిస్తున్నాయి. అందుకు బదులుగా వ్యక్తిగత రుణాల ఇవ్వడంలో మొగ్గు చూపుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ నివేదిక ప్రకారం.. బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాల్లో దాదాపు 32.1శాతం వ్యక్తిగత రుణాలు, సర్వీస్ సెక్టార్‌కు 28.4శాతం, ఇండస్ట్రీ రంగానికి 26.2 శాతం, 13.3శాతం వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్లు వెల్లడించింది. హౌజింగ్, వెహికిల్, క్రెడిట్ కార్డు రుణాలు తగ్గిపోయాయి. గత పదేళ్లలో ఇండస్ట్రీ రంగానికి ఇచ్చే రుణాలు 46శాతం నుంచి 26శాతం మేర క్షీణించాయి. అదే వ్యక్తిగత రుణాలు మాత్రం 18శాతం నుంచి 32శాతానికి పెరిగాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల సంఖ్య పెరగడంతో అవి సర్వీస్ రంగంలో ఉన్న కంపెనీలకు ఎక్కువగా రుణాలు కల్పిస్తున్నాయి. (తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే..) ఇండస్ట్రీయల్ రంగానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం తగ్గించడంతో కార్పొరేట్ కంపెనీలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాయి. అయితే కంపెనీలు రుణ సమీకరణతో పాటు సంస్థ ఆర్థికవృద్ధిపై దృష్టి సారిస్తే మరింత ప్రయోజనం ఉంటుదని బ్యాంకింగ్ రంగ నిపుణులు వి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ కంపెనీలు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి బదులుగా డెట్‌మార్కెట్ ద్వారా నగదును పెంచుకుంటున్నాయి. తమ బ్యాలెన్స్షీట్లో నగదు ఎక్కువగా ఉన్న కొన్ని సంస్థలు రుణం తీసుకోవలసిన అవసరం ఉండడం లేదు. ఎన్బీఎఫ్సీ, బ్యాంకు నిబంధనల ప్రకారం నిరర్థక ఆస్తులకు సంబంధించిన నియామాలు మార్చడం వల్ల కూడా ఇండస్ట్రీయల్ రుణాలు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
బ్యాంకర్లతో మంత్రి హరీష్ సమీక్ష.. రుణమాఫీలపై కీలక ఆదేశం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రుణమాఫీ విషయంలో రైతులకు గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో రైతుల రుణమాఫీపై ఆర్థికమంత్రి హరీష్ రావు బ్యాంకర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతి కుమారి, వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో రైతుల రుణమాఫీపై మంత్రి హరీష్ రావు మరోసారి అధికారులతో భేటీ అయ్యారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్ష(99,999)రూపాయలలోపు రైతుల రుణాలను మాఫీ చేశారు. ఈ సందర్బంగా రుణాలు మాఫీ కాని రైతులపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ రుణమాఫీ అందేలా చూడాలని మంత్రి హరీష్ ఆదేశించారు. అలాగే, రుణమాఫీ పొందే రైతులు సమస్యలు చెప్పుకునేలా ఆయా బ్యాంకులు కూడా టోల్‌ఫ్రీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.99,999 వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాలు మేరకు.. 10.79 లక్షల రైతులకు.. రూ.6,546 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి.. ప్రతి వారం కొంత మొత్తాన్ని జమ చేస్తోన్న రాష్ట్ర సర్కార్.. ఖజానాకు వస్తోన్న ఆదాయం ప్రకారం చెల్లింపులు చేస్తోంది. ఈ మేరకు పన్నేతర ఆదాయంపై కూడా దృష్టి సారించింది. ఏది ఏమైనా సెప్టెంబర్ రెండో వారంలోగా.. ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య కోల్డ్‌వార్! -
ఎన్‌బీఎఫ్‌సీలకు భారీగా బ్యాంకు రుణాలు
ముంబై: బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీలు భారీగా నిధుల సమీకరణ చేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు జూన్‌లో 35 శాతం పెరిగి రూ.14.2 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు అంతర్జాతీయ రుణాలపై ఆ ధారపడడాన్ని తగ్గించినట్టు ఇది తెలియజేస్తోందని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2022 జూన్ నాటికి ఉన్న 8.5 శాతం నుంచి ఈ ఏడాది జూన్ నాటికి 9.9 శాతానికి పెరిగినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచి్చనందున.. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా తగ్గుతుందని అంచనా వేసింది. హెచ్డీఎఫ్సీ రుణాలు పునర్వర్గీకరణకు గురవుతాయని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు మ్యూచువల్ ఫండ్స్ డెట్ పథకాల ఎక్స్పోజర్ సై తం జూన్‌లో 14.5 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ వివరించింది. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2018 ఫిబ్రవరి నాటికి 4.5 శాతంగా ఉంటే, అది ఈ ఏడా ది జూన్ నాటికి 10 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. 2021–22 ద్వితీయ ఆరు నెలల కాలం నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు పెరుగుతూ వ స్తున్నట్టు కేర్‌రేటింగ్స్ వెల్లడించింది. కరోనా తర్వా త ఆరి్థక కార్యకలాపాలను తిరిగి పూర్తి స్థాయిలో తెరవడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. -
AP: ఆస్తి మీ హక్కు.. తనఖా పెట్టుకోవచ్చు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షలకు పైబడి విలువ చేసే ఇల్లు ఉండి కూడా పిల్లల పెద్ద చదువుల కోసమో, ఇంకే పెద్ద అవసరానికైనా ఆ ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందే అవకాశం లేక ఇబ్బందులు పడే లక్షలాది మధ్య తరగతి ప్రజల కష్టాలు తీరబోతున్నాయి. వైఎస్సార్ జగనన్న భూ హక్కు – భూ రక్ష కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల యజమానులందరికీ వారి ఆస్తి యాజమాన్య హక్కు పత్రాల (ప్రాపర్టీ కార్డులు)ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. ఈ పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవడానికి బ్యాంకులను సైతం ప్రభుత్వం తాజాగా ఒప్పించింది. ఈ పత్రాల డిజైన్‌ను కూడా రుణాలు సులభంగా లభించేలా రూపొందించారు. ఈ హక్కు పత్రాలను అవసరమైన వారు నచ్చిన బ్యాంకులో తనఖా పెట్టుకొనేందుకు గతనెల 27న జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో రాష్ట్ర బ్యాంకర్ల సమాఖ్య ఆమోదం తెలిపింది. ఈ సమాచారాన్ని రాష్ట్ర బ్యాంకర్ల సమాఖ్య కోఆర్డినేటర్ నాలుగు రోజుల క్రితం రాష్ట్ర పరిధిలోని అన్ని బ్యాంకుల కంట్రోలింగ్ అథారిటీలకు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు పంపారు. గ్రామాల్లో వారసత్వంగా వచ్చే ఈ ఇళ్లకు నిర్దిష్ట అధికారిక హక్కు పత్రాలు ఉండవు. అందువల్ల ప్రభుత్వం తాజాగా ఇచ్చే ప్రాపర్టీ కార్డులను తనఖా పెట్టుకునే సమయంలో ఆ ఆస్తి లింకు డాక్యుమెంట్ల కోసం ఒత్తిడి చేయవద్దని ఎస్ఎల్బీసీ కోరింది. సంబందిత ఆస్తికి రిజి్రస్టేషన్ శాఖ అధికారికంగా సూచించే మార్కెట్ విలువ ఆధారంగా తనఖా విలువ లెక్కగట్టుకోవచ్చని తెలిపింది. తొలి దశలో లక్షన్నరకు పైగా హక్కు పత్రాలు రాష్ట్రవ్యాప్తంగా 17,461 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్లు, దొడ్లు, ఖాళీ స్థలాలన్నింటికీ వైఎస్సార్ జగనన్న భూ హక్కు– భూ రక్ష కార్యక్రమంతో ప్రభుత్వం యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తోంది. దాదాపు 11,150 గ్రామాల పరిధిలోని గ్రామ కంఠాల ఇళ్ల సర్వే కూడా చేపట్టింది. 294 గ్రామాల్లో సర్వే దాదాపు పూర్తయింది. ఒక్కో ఆస్తికి (ఇల్లు లేదా దొడ్డి లేదా ఖాళీ స్థలం వారీగా) యాజమాన్య హక్కు పత్రాల నిర్ధారణ చేసే ఫైనల్ ఆర్వోఆర్ నోటిఫికేషన్ జారీ కూడా పూర్తయినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. వీటిలో 262 గ్రామాల్లో శుక్రవారం నాటికి 1,22,943 ప్రాపర్టీ కార్డులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మిగిలిన 32 గ్రామాల్లో హక్కు పత్రాలు కూడా త్వరలో సిద్ధమవుతాయని వెల్లడించారు. మొత్తంగా 294 గ్రామాల్లో లక్షన్నర వరకు ప్రాపర్టీ కార్డులు సిద్ధమైనట్లేనని తెలిపారు. వీటిలో 42 గ్రామాల్లో యజమాన్య హక్కు పత్రం నమూనా కాపీని సంబంధిత యజమానులకు ఇప్పటికే అందజేసినట్టు చెప్పారు. అక్టోబరు 2న పండుగలా పంపిణీ అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున 300 – 350 గ్రామాల పరిధిలోని అన్ని ఇళ్లు, దొడ్లు, ఖాళీ స్థలాల వారీగా యజమానులకు హక్కు పత్రాల పంపిణీని పండుగలా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా వీటిని పంపిణీ చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ప్రాపర్టీ కార్డుల ముద్రణ టెండర్లకు కూడా ఏర్పాట్లు చేశారు. -
పొదుపు మహిళల రుణాల వడ్డీ రేపు జమ
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లిస్తే ఆ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. వరుసగా నాలుగో ఏడాది కూడా ప్రభుత్వమే భరించి, ఆ వడ్డీ డబ్బులను శుక్రవారం నేరుగా మహిళల ఖాతాలలో జమ చేయనుంది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నాలుగో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల మంది మహిళలకు సంభంధించిన 10 లక్షల రుణ ఖాతాల వడ్డీ మొత్తం రూ.1,353.76 కోట్లను ప్రభుత్వం ఆ మహిళలకు అందజేయనుంది. ఈ లబ్ధిదారులు 9,48,122 సంఘాలకు చెందిన వారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి గ్రామంలో లబ్దిదారులైన వేలాది మంది మహిళల సమక్షంలో బటన్ నొక్కి వడ్డీ డబ్బును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా.. ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారు. దీంతో అప్పట్లో పొదుపు సంఘాల మహిళలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందులు పడ్డారు. వైఎస్ జగన్తన సుదీర్ఘ పాదయాత్రలో పొదుపు సంఘాల మహిళల ఇబ్బందులు గుర్తించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 2019 ఎన్నికలు జరిగిన నాటికి పొదుపు సంఘాలకు సంబంధించి మహిళలకు ఉండే బ్యాంకు అప్పులను నాలుగు విడతల్లో చెల్లించేందుకు వైఎస్సార్ ఆసరా పథకం తీసుకొచ్చారు. రుణాలు సకాలంలో చెల్లించే మహిళలకు వడ్డీ డబ్బును ప్రభుత్వమే భరించేలా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికీ జీవం పోశారు. ముఖ్యమంత్రి కార్యక్రమం ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అమలాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి జనుపల్లి గ్రామానికి వెళ్తారు. జనుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబి్ధదారులకు నిధులు విడుదల చేస్తారు. అనంతరం తాడేపల్లికి తిరుగు పయనమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. గత మూడు విడతలతో కలిపి రూ.4,969 కోట్లు 2019 నుంచి ఇప్పటికే వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలకు పొదుపు సంఘాల మహిళల రుణాల వడ్డీ మొత్తాలను ప్రభుత్వమే భరించింది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ. 3615.29 కోట్లను లబ్ధిదారులకు అందజేసింది. నాలుగో విడత కూడా కలిపితే మొత్తం రూ. 4969.05 కోట్లు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారానే అందజేసినట్టు అవుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. మరోవైపు తొలి ఏడాది 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా అందజేసిన లబ్ధిదారుల సంఖ్య కంటే నాలుగో ఏడాది లబ్ధి పొందే వారి సంఖ్య 20 లక్షల వరకు పెరిగినట్టు అధికారులు తెలిపారు. 2019–20లో 7.81 లక్షల సంఘాలకు చెందిన దాదాపు 81.52 లక్షల మంది మహిళలకు సంబంధించిన రుణాలపై రూ. 1,257.99 కోట్లు వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం భరించింది. ప్రస్తుత నాలుగో ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్య 1.05 కోట్లకు, సంఘాల సంఖ్య 9,48,122 పెరిగింది. వడ్డీ మొత్తం కూడా రూ. 1,353.76 కోట్లకు పెరిగింది. నాలుగో విడతలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 83.86 లక్షల మంది రూ.1002.31 కోట్ల మేర లబ్ధి పొందనుండగా.. పట్టణ ప్రాంతాలకు చెందిన 21.26 లక్షల మంది మహిళలు రూ. 351.45 కోట్లు లబ్ధి పొందనున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 5.92 లక్షల మంది మహిళలు రూ. 69.50 కోట్లు లబ్ధి పొందనున్నారని అధికారులు వెల్లడించారు. -
రూ.25 లక్షల కోట్లకు పైగా రుణాలు.. ఎవరా 10 మంది?
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా సేద్యాన్ని నమ్ముకున్న కోట్ల మంది వ్యవసాయదారులకు బ్యాంకులు అందించిన రుణాలు దాదాపు రూ.20 లక్షల కోట్లు కాగా టాప్ టెన్ కార్పొరేట్లు / ప్రముఖ సంస్థలకు ఏకంగా రూ.25 లక్షల కోట్లకు పైగా రుణాలిచ్చాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని వెల్లడించినప్పటికీ, ఆ పది మంది కార్పొరేట్లు / సంస్థలు ఎవరనేది మాత్రం రహస్యంగానే ఉంచారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆ వివరాలను వెల్లడించలేమని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న టాప్ టెన్ కార్పొరేట్ రుణ గ్రహీతల వివరాలను తెలియచేయాలని లోక్‌సభలో ఎంపీ మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ సమాధానం ఇచ్చారు. టాప్ టెన్ కార్పొరేట్లు గతేడాది సెప్టెంబర్ వరకు రూ.25,43,208 కోట్ల మేర రుణాలు పొందినట్లు తెలిపారు. ఆర్బీఐ చట్టం 1934 రుణ గ్రహీతల వారీగా క్రెడిట్ వివరాలు వెల్లడించటాన్ని నిషేధించినట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు గ్రూపులు, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకుల నుంచి పది మంది కార్పొరేట్లు రుణాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 14 కోట్ల మంది రైతులు.. దేశంలో 14 కోట్ల మంది రైతులకు వచ్చే ఆర్థిక ఏడాది రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను లక్ష్యంగా నిర్దేశించినట్లు బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.18 లక్షల కోట్లుగా ఉంది. ఒక పక్క దేశంలో వ్యవసాయం చేసే 14 కోట్ల మంది అన్నదాతలకు అందించే రుణాలు రూ.20 లక్షల కోట్లు కాగా కేవలం పది మంది కార్పొరేట్లకు ఏకంగా రూ.25.43 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయడం గమనార్హం. రైతులు సకాలంలో రుణాలు చెల్లించకుంటే ఆస్తుల జప్తు లాంటి చర్యలకు దిగుతున్న బ్యాంకులు కార్పొరేట్ సంస్థలను మాత్రం ఉపేక్షిస్తున్నాయనే అభిప్రాయం సాధారణ ప్రజల్లో పెరిగిపోతోంది. -
సిబిల్ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు!
ప్రస్తుత రోజుల్లో రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే లోన్లు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించేది సిబిల్ స్కోరు. ఇందులో మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వీటితో పాటు పాత, లేదా ప్రస్తుత రుణ వివరాలు వంటి సమాచారం మొత్తం ఉంటుంది. అందుకే బ్యాంకులు, లోన్లు మంజూరు చేసే ప్రైవేటు కంపెనీలు సిబిల్ స్కోరును ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటాయి. అంతేకాదు మనకు రుణాలు మంజూరు కావడంతో సిబిల్ స్కోరు కీలకంగా కూడా వ్యవహరిస్తుంది. సాధారణంగా సిబిల్ స్కోర్ 0 నుంచి 900 వరకు ఉంటుంది. మనం లోన్లు పొందాలంటే ఈ స్కోరు 700 కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు రుణాల మంజూరు సులభంగా జరుగుతాయి. కొన్ని కారణంగా వల్ల ఒక్కోసారి ప్రజలకు తెలియకుండానే ఈ సిబిల్ స్కోరు తగ్గుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సిబిల్ స్కోరును పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఆ అవేంటో చూద్దాం. స్కోరు ఇలా పెంచుకోండి క్రెడిట్ కార్డ్ యూజర్లు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.. ఆ కార్డు పూర్తి క్రెడిట్ పరిమితిని వాడకూడదు. మీ మొత్తం క్రెడిట్ పరిమితిలో 30% కంటే ఎక్కువ లోన్ తీసుకోకూడదు. ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీటితో పాటు మీరు లోన్ రీపేమెంట్ తక్కువ కాలం ఎంచుకోకండి. సరైన సమయంలో చెల్లంచని పక్షంలో స్కోరు తగ్గే అవకాశం ఉంది. మీరు ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకుంటే, తక్కువ EMIలను చెల్లించాలి. ఇంకా అలాగే, దాని సాధారణ చెల్లింపు మీకు చాలా సులభం అవుతుంది. మీ ఆదాయంలో క్రెడిట్ రీపేమెంట్ వాటా అనేది తక్కువగా ఉంటుంది. ఇక మీ ఆదాయం లోన్ మొత్తం కంటే ఎక్కువ కానట్లయితే, మీరు దీర్ఘకాలిక లోన్ చెల్లింపు ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీ సిబిల్ రేటింగ్‌ను పెంచుకోవచ్చు. ఒకేసారి చాలా రుణాలు తీసుకోవడం మీ క్రెడిట్ రేటింగ్‌పై నెగిటివ్ మార్క్ పడుతుంది. ఎక్కువ రుణాలు తీసుకుంటే వాటి వాయిదాలను సకాలంలో చెల్లించడం చాలా కష్టమవుతుంది. ఇది మీ CIBIL స్కోర్‌పై ఖచ్చితంగా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలో మీరు సులభంగా తిరిగి పేమెంట్ చేయగల రుణం మాత్రమే తీసుకోవాలి. ఇక మీరు కొత్త రుణం తీసుకోబోతున్నట్లయితే, దానికి ముందు ఏదైనా బకాయిలు ఉంటే చెల్లించడం ఉత్తమం. ఎందుకంటే ఇది మీ మొత్తం ఆదాయంలో రుణ చెల్లింపు వాటాను తగ్గిస్తుంది. మీ ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడంలో కనుక ఖర్చు చేస్తుంటే, బ్యాంకు మీకు కొత్త లోన్ ని సులభంగా ఇవ్వడానికి ఇష్టపడదు. చదవండి: అమెజాన్ ఆఫర్: ఇలా చేస్తే రెడ్మీ ఏ1 స్మార్ట్‌ఫోన్ రూ.1000లోపు సొంతం చేసుకోవచ్చు! -
బ్యాంకు రుణాల్లో 17% వృద్ధి
ముంబై: బ్యాంకు రుణాలు సెప్టెంబర్ త్రైమాసికంలో 17.2 శాతం వృద్ధిని చూశాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 7 శాతంతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరగడం ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడడాన్ని తెలియజేస్తోందని ఆర్బీఐ ప్రకటించింది. ‘‘రుణాల్లో వృద్ధి అన్ని విభాగాల్లోనూ ఉంది. అన్ని రకాల జనాభా వర్గాల్లో, బ్యాంకుల్లో రెండంకెల వార్షిక వృద్ధి నమోదైంది’’అని తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు సంబంధించి త్రైమాసికం వారీ డిపాజిట్లు, రుణ గణాంకాలను ఆర్బీఐ సోమవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) బ్యాంకుల రుణాల్లో వృద్ధి 14.2 శాతంగా నమోదైన విషయాన్ని ప్రస్తావించింది. క్రితం త్రైమాసికంతో పోల్చి చూసినా, అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినా రుణాల్లో మంచి వృద్ధి కనిపిస్తోంది. దండిగా డిపాజిట్లు.. ఇక బ్యాంకుల డిపాజిట్లు సెప్టెంబర్ త్రైమాసికంలో 9.2 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి బ్యాంకుల డిపాజిట్లు సగటున 9.5–10.2 శాతం మధ్య వృద్ధి చెందుతున్నాయి. విదేశీ బ్యాంకులు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు రంగ బ్యాంకులే అధిక డిపాజిట్లను ఆకర్షిస్తున్నాయి. టర్మ్ డిపాజిట్లలో 10.2 శాతం వృద్ధి కనిపించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో టర్మ్ డిపాజిట్లు 6.4 శాతమే పెరగడం గమనించాలి. ఇక కరెంట్ డిపాజిట్లు 8.8 శాతం, సేవింగ్స్ డిపాజిట్లు 9.4 శాతం వృద్ధి చెందాయి. ఏడాది క్రితం ఇవి 17.5 శాతం, 14.5 శాతం చొప్పున వృద్ధిని చూశాయి. మొత్తం డిపాజిట్లలో సేవింగ్స్ డిపాజిట్లు 2019 జూన్ నాటికి 32.4 శాతంగా ఉంటే, 2022 జూన్ నాటికి 35.2 శానికి పెరిగాయి. తదుపరి సెప్టెంబర్ త్రైమాసికంలో 34.7 శాతానికి పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా క్రెడిట్–డిపాజిట్ రేషియో 74.8 శాతానికి మెరుగుపడింది. రుణ వృద్ధి పటిష్టం 2022–23పై ఫిచ్ అంచనా భారత్ బ్యాంకింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 11.5 శాతం పటిష్ట రుణ వృద్ధితీరును నమోదుచేస్తుందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ అంచనావేసింది. రుణ వృద్ధికి అధిక వడ్డీరేట్లు అడ్డంకి కాబోవని కూడా స్పష్టం చేసింది. భారీ రుణ వృద్ధి వల్ల నికర ఆదాయాలు ప్రత్యేకించి నికర వడ్డీ మార్జిన్లు పటిష్టంగా ఉంటాయని వివరించింది. ‘‘2021–22లో బ్యాంక్ రుణ వృద్ధి 11.5 శాతం. 2022–23లో ఈ రేటు 13 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. కోవిడ్ తదనంతరం సానుకూల పరిస్థితులు, చక్కటి జీడీపీ వృద్ధి రేటు వంటి అంశాలు రిటైల్, వర్కింగ్ క్యాపిటల్ రుణాలకు డిమాండ్ పెంచుతుందని భావిస్తున్నాం’’ అని ఈ ఒక ప్రకటనలో వివరించింది. 2022–23లో దేశ జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందని ఫిచ్ అంచనా. కాగా, బ్యాంకింగ్ డిపాజిట్లు 2022–23లో 11 శాతం పెరుగుతాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంల్లో రుణ వృద్ధి కొంత మందగిచ్చవచ్చని ఫిచ్ అంచనా వేస్తోంది. ‘‘డిపాజిట్ రేట్లు పెరగడం బ్యాంకుల వడ్డీ మార్జిన్లపై ప్రభావితం చూపవచ్చు. అయితే నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడం బ్యాంకులకు ఇక్కడ కలిసి వచ్చే అంశం. ఈ రెండింటి మధ్య సమతౌల్యం ఉంటుంది’’ అని ఫిచ్ విశ్లేషించింది. -
ప్రాసెసింగ్ చార్జీలొద్దు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల పేరిట మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై బ్యాంకులు ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయకుండా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం బుధవారం రిజర్వు బ్యాంకు అప్ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మహ్మద్ ఇంతియాజ్ బుధవారం ముంబయిలోని రిజర్వు బ్యాంక్ ప్రధాన కార్యాలయంలోని ఛీప్ జనరల్ మేనేజర్, హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయ జనరల్ మేనేజర్‌తో పాటు రాష్ట్ర బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) కన్వీనర్లకు వేర్వేరుగా లేఖ రాశారు. రుణం ఇచ్చే బ్యాంకును బట్టి ప్రస్తుతం పొదుపు సంఘాల రుణ మొత్తంపై 0.5 శాతం నుంచి 1.2 శాతం దాకా ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం పొదుపు సంఘాల మహిళలకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇచ్చే వెసులు బాటు ఉంది. అంటే, మహిళలు రూ.20 లక్షల రుణం తీసుకుంటే సుమారు రూ.20 వేలు ప్రాసెసింగ్ ఫీజు పేరిట బ్యాంకులు మినహాయించుకుంటున్నాయి. పొదుపు సంఘాలు తీసుకునే రుణాల్లో అత్యధికులు పేద కుటుంబాలకు చెందిన వారే కావడంతో ఈ తరహా ప్రాసెసింగ్ చార్జీలు వారికి భారంగా తయారవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ ద్వారా ఆర్బీఐ దృష్టికి తీసుకొచ్చింది. ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలతో పాటు డాక్యుమెంటేషన్ చార్జీలు, ఇతర అడహాక్ చార్జీలు సైతం బ్యాంకులు వసూలు చేయకుండా అన్ని బ్యాంకులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్బీఐని ప్రభుత్వం కోరింది. రుణాల చెల్లింపులో దేశంలోనే ప్రథమ స్థానం పొదుపు సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరాతో పాటు సకాలంలో రుణాలు చెల్లించే వారికి సున్నా వడ్డీ పథకం అమలు వంటి చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలలో 99.5 శాతం సకాలంలో చెల్లిస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల చెల్లింపుల్లో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దీంతో బ్యాంకులు కూడా మహిళా పొదుపు సంఘాల గరిష్ట పరిమితి మేరకు రుణాలు ఇస్తున్నాయి. మరో పక్క.. రాష్ట్రంలో పొదుపు సంఘాల పేరిట ప్రస్తుతం రూ.30 వేల కోట్ల పైబడి మహిళలు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఉన్నారు. అందులో ఎప్పటికప్పుడు కిస్తీ ప్రకారం పాత రుణాల చెల్లింపులు పూర్తి కాగానే, తిరిగి కొత్తగా ఏటా రూ.15 వేల కోట్లు రుణాలు పొందుతున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకుల స్పందన ► పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై రూ.2.5 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీలను మినహాయిస్తూ ఆర్బీఐ గతంలోనే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల కిత్రం వరకు మన రాష్ట్రంలోనూ అత్యధిక సంఘాలు ఈ పరిమితి మేరకే బ్యాంకుల నుంచి రుణాలు పొందే పరిస్థితి ఉండింది. ► అయితే, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో అత్యధిక పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి రూ.10 లక్షలకు పైబడే రుణాలు పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్ చార్జీ భారంగా మారింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టి రాగానే.. గత రెండేళ్లగా జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశాలన్నింటిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకొచ్చింది. ► ఫలితంగా రూ.10 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీలను మినహాయిస్తూ యూనియన్ బ్యాంకు (గతంలో ఆంధ్రా బ్యాంకు) 2021 సెప్టెంబర్ 1వ తేదీన అన్ని బ్రాంచ్‌లకు ఆదేశాలు జారీ చేంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా 2021 ఆగస్ట్ 23వ తేదీన అదే తరహా ఉత్తర్వులిచ్చింది. ► సకాలంలో చెల్లింపులు జరుగుతుండడంతో ఇప్పుడు బ్యాంకులు రూ.20 లక్షల దాకా సంఘాల పేరిట రుణాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా రూ.20 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీల మినహాయింపు విషయాన్ని ప్రస్తావించారు. ఆ అంశాన్ని సమావేశ మినిట్స్‌లో ఉదహరించి, అన్ని బ్యాంకులకు ఆదేశాలివ్వాలంటూ సూచన చేశారు. ► రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు (అప్కాబ్) ఇప్పటికే రూ.20 లక్షల వరకు పొదుపు సంఘాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు వసూలును పూర్తిగా మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసిందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
AP: రైతులకు పుష్కలంగా రుణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడేళ్లుగా అన్నదాతలకు పుష్కలంగా వ్యవసాయ రుణాలు మంజూరవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీని క్రమం తప్పకుండా చెల్లిస్తుండటంతో రైతులకు అవసరమైన వ్యవసాయ రుణాలను బ్యాంకులు విరివిగా మంజూరు చేస్తున్నాయి. ఏడాదికేడాదికి రైతుల సంఖ్యతో పాటు రుణాల మంజూరులో పెరుగుదల ఉంది. గత మూడేళ్లలో అంటే 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు 307.20 లక్షల మంది రైతులకు రూ.4,37,828 కోట్ల వ్యవసాయ రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాల మంజూరు లక్ష్యం రూ.97,197 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.85,346 కోట్ల రుణాలను 48.49 లక్షల మంది రైతులకు బ్యాంకులు మంజూరు చేశాయి. మరో పక్క రాష్ట్రంలో కౌలు సాగుదారులకు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పంట సాగుదారు హక్కుల చట్టం–2019ను తీసుకువచ్చింది. ఈ చట్టం కింద పంట సాగుదారుల హక్కు పత్రాలు పంపిణీ చేస్తోంది. వాస్తవ సాగుదారులకు సీసీఆర్సీ పత్రాలు జారీ చేయడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడానికి ఆర్బీకేల్లోని సిబ్బంది సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు 4.75 లక్షల మంది కౌలు రైతులకు రూ.3595.02 కోట్ల మేర బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. వీలైనంత ఎక్కువ మంది కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్యాంకర్ల సమావేశాల్లో ఈ విషయంపై సీఎంతో పాటు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. గత సర్కారు.. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని మోసం చేయడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి రుణాలు పొందలేకపోయిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఆ పరిస్థితి పూర్తిగా మార్చేసి, రైతులకు మేలు చేసే పలు నిర్ణయాలు తీసుకుంది. -
Sakshi Cartoon 22-09-2022
ఇక మన పని స్టార్ట్ చేద్దాం! బ్యాంకులో రుణం తీసుకొని నువ్వు లండన్ వెళ్లు.. నేను అమెరికా వెళ్తా.. నువ్వేమో సింగపూర్.. అతను దుబాయ్! -
ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?
పేదలకు అత్యవసరమైన ఉచితాలను ‘పప్పు బెల్లాలు’ అంటూ చాలామంది గగ్గోలు పెడుతుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు అందుతున్న రాయితీల గురించి ఎవరూ మాట్లాడరు. వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని చాలామంది ఆక్షేపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ పన్నులు తగ్గించడం అనేది ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని వీరే తప్పుడు సూత్రాలు వల్లిస్తున్నారు. గత అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను మాఫీ చేసినట్లు కేంద్రప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. అత్యంత సంపన్నుల జేబుల్లో డబ్బును తేరగా పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వం మరింతగా పెరిగింది. సంపన్నులకు యాభై సంవత్సరాలుగా లభిస్తున్న పన్ను రాయితీలు ఏమాత్రం తగ్గడం లేదని ఒక అధ్యయనాన్ని ఉల్లేఖిస్తూ ‘బ్లూమ్‌బెర్గ్’లో ఒక కథనం ప్రచురితమైంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన ఇద్దరు పరిశోధకులు అధునాతనమైన గణాంక విధానాన్ని ఉపయోగించడమే కాకుండా, 18 పురోగామి ఆర్థిక వ్యవస్థలు అనుసరించిన విధానాలను పరిశీలించారు. సాక్ష్యాధారాలు లేకుండా అనుభవపూర్వకంగా చాలామంది ఇంతకాలంగా చెబుతున్నదాన్ని వీళ్లు ససాక్ష్యంగా నిరూపించారు. అనేకమంది భారతీయ ఆర్థికవేత్తలు కార్పొరేట్ పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని సమర్థించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఇద్దరు పరిశోధకుల అధ్యయనం (కొద్దిమంది ఇతరులు కూడా) స్పష్టంగా ఒక విషయాన్ని బయటపెట్టింది. పన్ను రాయితీ అనేది ఆర్థిక పురోగతికి సహాయం చేయలేదు. అది మరిన్ని ఉద్యోగావశాలను కూడా కల్పించలేదు. డబ్బును తేరగా అత్యంత సంపన్నుల జేబుల్లో పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వాన్ని మరింతగా పెంచడంలో పన్ను రాయితీ సాయపడింది. భారతదేశంలో రైతులతో సహా పేదలకు అందిస్తున్న ఉచితాలను ‘పప్పు బెల్లాల’ సంస్కృతి అంటూ ఎన్నో వార్తాపత్రికల కథనాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకు అంది స్తున్న భారీ స్థాయి ఉచితాల గురించి ఇవి ఏమాత్రం ప్రస్తావించడం లేదు. కొద్దిమంది వ్యాఖ్యాతలను మినహాయిస్తే– మాఫీలు, ట్యాక్స్ హాలిడేలు, ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను తగ్గింపులు వంటి కార్పొరేట్ సబ్సిడీల విస్తృతి, స్వభావాన్ని చాలామంది దాచిపెడుతున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ‘ఫలితం ఇవ్వని ఉచితాలు’ అంటూనే, ఆ మాటకు అర్థమేమిటో స్పష్టంగా నిర్వచించలేక పోయినప్పటికీ, భారత్‌లో కార్పొరేట్ పన్నుల తగ్గింపు కూడా ఈ విభాగంలోనే చేరతుందని అంతర్జాతీయ అధ్యయనాలు తెలుపు తున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జెఫ్రీ సాచెస్ను గతంలో ఒక ప్రశ్న అడిగారు. పారిశ్రామిక ఉత్పత్తిని ఏమాత్రం పెంచనప్పుడు లేదా అదనపు ఉద్యోగాలను సృష్టించలేకపోయినప్పుడు కార్పొరేట్లకు భారీస్థాయి పన్ను తగ్గింపు ద్వారా ఏం ఫలితం దక్కింది అని ప్రశ్నించారు. పన్ను రాయితీల ద్వారా ఆదా అయిన డబ్బు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జేబుల్లో పడిందని ఆయన క్లుప్త సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో కేంద్ర బ్యాంకులు వాస్తవంగా అత్యంత ధనవంతుల జేబుల్లోకి చేరేలా అదనపు డబ్బును ముద్రించాయి. 2008–09 కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో పరిమాణాత్మక సడలింపు అనే పదబంధాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఈ పేరుతో ధనిక దేశాలు 25 లక్షల కోట్ల డాలర్ల అదనపు డబ్బును ముద్రించాయి. తక్కువ వడ్డీరేటుతో, అంటే సుమారు రెండు శాతంతో ఫెడరల్ బాండ్ల రూపంలో ఆ సొమ్మును సంపన్నులకు జారీ చేశాయి. ఈ మొత్తం డబ్బును వాళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో మదుపు చేశారు. అందుకే ఆ కాలంలో బుల్ మార్కెట్లు ఎలా పరుగులు తీశాయో చూశాం. మోర్గాన్ స్టాన్లీకి చెందిన రుచిర్ శర్మ ఒక వ్యాసంలో కరోనా మహమ్మారి కాలంలో జరిగిన తతంగంపై రాశారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 9 లక్షల కోట్ల డాలర్ల నగదును అదనంగా ముద్రించారనీ, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపన ప్యాకేజీలను అందించడమే దీని లక్ష్యమనీ చెప్పారు. కానీ ఉద్దీపన ప్యాకేజీల కోసమని కేటాయించిన ఈ మొత్తం నగదు స్టాక్ మార్కెట్ ద్వారా అత్యంత సంపన్నుల జేబుల్లోకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఈ భారీమొత్తం ఏ రకంగా చూసినా ఉచితాల కిందకే వస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కల్లోల పరిస్థితుల్లో ఉన్న 2008–09 కాలంలో భారతదేశంలో 1.8 లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక ఉద్దీపన పేరుతో పరిశ్రమ వర్గాలకు అందుబాటులో ఉంచారు. ఈ భారీ ప్యాకేజీని ఒక సంవత్సరం తర్వాత ఉపసంహరించుకోవాలి. కానీ ఒక వార్తా నివేదిక ప్రకారం, ప్రభుత్వంలో ఎవరో ‘నల్లాను ఆపేయడం’ మర్చిపోయారు. దీని ఫలితంగా ఉద్దీపన కొనసాగుతూ వచ్చింది. మరో మాటల్లో చెప్పాలంటే, ఆ తర్వాత పదేళ్ల కాలంలో భారత పరిశ్రమ దాదాపుగా రూ. 18 లక్షల కోట్ల డబ్బును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అందుకుంది. దీనికి బదులుగా ఈ మొత్తాన్ని వ్యవసాయ రంగానికి అందుబాటులోకి తెచ్చి ఉంటే, ప్రధానమంత్రి కిసాన్ పథకంలో భాగంగా మన రైతులకు యేటా ఒక్కొక్కరికి 18 వేల రూపాయల మేరకు అదనంగా ప్రత్యక్ష నగదు మద్దతు కింద అంది ఉండేది. సెప్టెంబర్ 2019లో భారత పరిశ్రమకు మరోసారి రూ. 1.45 లక్షల కోట్ల పన్నులను ప్రభుత్వం తగ్గించింది. చాలామంది ఆర్థిక వేత్తలు గ్రామీణ డిమాండును ప్రోత్సహించడం కోసం ఆర్థిక ఉద్దీపనను అందించాలని కోరుతున్న సమయంలో మళ్లీ కార్పొరేట్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కరుణించింది. దాదాపు రూ.2.53 లక్షల కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని ఆర్థికవేత్తలు ఆరోపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం వల్ల ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. గత అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను కొట్టేసినట్లు ప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు సగటు మనిషిని చేరుకోలేదు. సంపన్నులు మాత్రమే వాటినుంచి లబ్ధిపొందారు. ఇది సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. వ్యవసాయ రుణాలను మాఫీచేసినప్పుడు బ్యాంకులు తమకు రావలసిన అసలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేసి మరీ తీసుకుంటాయి. కానీ కార్పొరేట్ రుణాలను మాఫీ చేసినప్పుడు బ్యాంకులు పైసా డబ్బును కూడా వసూలు చేయలేక దెబ్బతింటాయి. దేశంలో రుణాలు చెల్లించే సామర్థ్యం ఉండి కూడా ఎగవేస్తున్న సంస్థలు 10 వేల వరకు ఉంటాయి. రెండు వేలమంది రైతులు తీసుకున్న రుణాలను చెల్లించలేదని జారీ చేసిన అరెస్టు వారెంట్లను కొన్ని నెలలక్రితం పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ ఉద్దేశ పూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారిని మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. మునుపటి ప్రణాళికా సంఘం సబ్సిడీపై కార్యాచరణ పత్రాన్ని రూపొందించింది. న్యూఢిల్లీలో ఎకరాకు రూపాయి చొప్పున 15 ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి సబ్సిడీల పేరిట అప్పనంగా ధారపోశారని ఇది బయటపెట్టింది. ఐటీ రంగంతో సహా ప్రైవేట్ ఆసుపత్రులు, పరిశ్రమలకు తరచుగానే చదరపు మీటరుకు ఒక రూపాయి చొప్పున భూమిని ధారపోస్తున్నారు. అదే సమయంలోనే మౌలిక వసతుల కల్పనకు, వడ్డీ, మూలధనం, ఎగుమతులతో పాటు విద్యుత్, నీరు, ముఖ్యమైన సహజ వనరులకు కూడా సబ్సిడీలు అందిస్తున్నారు. ఇవి చాలవన్నట్లుగా పలు రాష్ట్రాలు నూరు శాతం పన్ను మినహాయింపు, ‘ఎస్జీఎస్టీ’ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. ఈరకంగా కార్పొరేట్ ఇండియా కూడా భారీ సబ్సిడీలు, ఉచితాల మీదే ఎలా బతుకీడుస్తోంది అనేది అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. దీంతో అమూల్యమైన వనరులు హరించుకుపోతున్నాయి. పేదలకు కొద్ది మొత్తం ఉచితాలు మిగులుతున్నాయి. - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఆ లోన్ తీసుకున్నవారికి భారీ షాక్.. .. ప్చ్, ఈఎంఐ మళ్లీ పెరిగింది!
దేశంలో ద్రవ్యోల్పణాన్ని కట్టడి చేసేందుకు ఇటీవల ఆర్బీఐ రెపో రేటుని పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పలు బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచే పనిలో పడ్డాయి. తాజాగా ప్రముఖ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. హోమ్ లోన్స్‌పై ఉన్న రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ రుణాల బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. కాగా పెంచిన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు ఆగస్టు 9 నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ నెలలో ఇది రెండవ పెంపు కావడం గమనార్హం. మూడు నెలల్లో హెచ్‌డిఎఫ్‌సి చేపట్టడం ఇది ఆరోసారి. మే 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం రేటు 140 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో గృహ రుణాలు తీసుకున్న కస్టమర్ల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. మే నుంచి ఆర్బీఐ ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్ల పెంపుదలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరోసారి సెప్టెంబరుతో పాటు డిసెంబర్లో కూడా ఆర్బీఐ సమావేశం కానుంది. ఏది ఏమైనా భారం మాత్రం తప్పట్లేదని సామన్య ప్రజలు వాపోతున్నారు. మూడు నెలల కాలంలోనే ఆర్పీఎల్ఆర్ (RPLR) చాలా అధికంగా పెరగడంతో హోం లోన్స్ తీసుకున్న వారు అధిక ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోంది. చదవండి: Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు? -
పెరుగుతున్న వడ్డీ రేట్లు.. భారం తగ్గించుకోవాలంటే ఇలా చేయండి!
సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే ప్రక్రియలో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.40 శాతాని చేరింది. మే నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడో సారి రెపో రేటును పెంచింది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో రెపో రేటు 140 బేసిస్ పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం పెంచిన రెపో రేట్ల ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది. ఆగస్టు 5న ఆర్బీఐ రెపో రేటు పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా ఇతర బ్యాంకులు రుణ రేట్లను పెంచాయి. అయితే కొన్ని నిబంధనలను పాటించడం ద్వారా కస్టమర్లపై పడే వడ్డీ భారాన్నీ తగ్గించుకోవచ్చు. ఈఎంఐ( EMI) లేదా లోన్ కాలపరిమితిని పెంచాలా? పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. ప్రస్తుతం హోమ్ లోన్ తీసుకొని కస్టమర్లు వారి ఈఎంఐ కాలాన్ని పెంచుకోవడం, లేదా మీ లోన్ కాలపరిమితిని పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే లోన్ టెన్యూర్ పెంచుకుంటే మీ ఈఎంఐ పెంపు ఆప్షన్ కంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ లోన్ ప్రీపేమెంట్ వడ్డీ భారాన్ని తగ్గింపు కోసం కస్టమర్లు ముందస్తు చెల్లింపు చేయవచ్చు. అనగా తమ హోమ్లోన్లను ముందస్తుగా చెల్లించాలి. వడ్డీ వ్యయం తగ్గించుకునేందుకు లోన్ కాలపరిమిత తగ్గింపు ఆప్షన్ ఎంచుకోవాలి. అంతేకాకుండా రెగ్యులర్ ప్రీపేమెంట్ వల్ల బకాయి ఉన్న లోన్ మొత్తం గణనీయంగా తగ్గుతుంది. అకౌంట్ ట్రాన్స్ఫర్ తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం మరో ఆప్షన్. అర్హత ఉన్న రుణగ్రహీతలు తమ హోమ్ లోన్లను ప్రస్తుతం ఉన్న బ్యాంక్ కంటే తక్కువ వడ్డీ రేట్లు అందించే ఇతర బ్యాంకుకు మార్చుకునే వెసలుబాటు ఉంది. అయితే ఈ ప్రక్రియకు అదనపు ఖర్చులు అవుతాయని గుర్తుంచుకోండి. లోన్ తీసుకున్న కస్టమర్లు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకునే ముందే వారికి ఎదురయ్యే లాభనష్టాలను చెక్ చేసుకోవడం మంచిది. చదవండి: అధ్యక్షా.. బాస్ అంటే ఇట్టా ఉండాలా.. అదిరిపోయే జీతం, బోలెడు బెనిఫిట్స్ కూడా.. -
రైతన్నలకు విరివిగా రుణాలు.. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ముందుకొస్తున్న బ్యాంకర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ చొరవతో చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకులు విరివిగా రుణాలు అందచేస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది సెప్టెంబర్ వరకు కొత్తగా 12.74 లక్షల మంది చిన్నకారు రైతులకు, 7.81 లక్షల మంది సన్నకారు రైతులకు బ్యాంకులు కొత్తగా రూ.56,256.90 కోట్ల మేర వ్యవసాయ రుణాలను మంజూరు చేశాయి. చిన్న కారు రైతులకు రూ.40,787.50 కోట్లు, సన్నకారు రైతులకు రూ.15,469.40 కోట్లు రుణాలు కొత్తగా మంజూరయ్యాయి. దీంతో చిన్న, సన్నకారు రైతులకు మంజూరైన మొత్తం రుణం రూ.1,48,085.14 కోట్లకు చేరుకుంది. అంతకు మించి రుణాలు.. మొత్తం రుణాల్లో బ్యాంకులు చిన్న, సన్నకారు రైతులకు 9 శాతం మేర ఇవ్వాలని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తుండగా రాష్ట్రంలో అంతకు మించి 27.76 శాతం మేర మంజూరు కావడం గమనార్హం. సకాలంలో పంట రుణాలను చెల్లించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ రాయితీని అమలు చేస్తోంది. సక్రమంగా చెల్లిస్తుండటంతో బ్యాంకులు కూడా రైతులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. పంటలు వేసిన రైతులందరి వివరాలను ఆర్బీకేల ద్వారా సేకరించి బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ప్రకారం 2019 వరకు టీడీపీ హయాంలో, ఆ తరువాత గతేడాది సెప్టెంబర్ వరకు చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకు రుణాల మంజూరు వివరాలు ఇవీ.. -
మీకు తెలియకుండా.. మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా!
మీకు తెలియకుండా లేకుండా.. మీ పేరు మీదు ఇంకెవరైనా పర్సనల్ లోన్, కన్జ్యూమర్ లోన్ తీసుకుంటున్నారా? ఎస్. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా.. అక్షరాల ఇది నిజం. ఇటీవల కాలంలో అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా పాన్ కార్డ్‌ల సాయంతో వారి పేరు మీద వేరే వాళ్లు బ్యాంకులు లేదంటే ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇలా సీక్రెట్‌గా తీసుకునే లోన్ల కారణంగా నేరస్తుల రుణాల్ని బాధితులు చెల్లించడమో,లేని పక్షంలో కోర్ట్‌ను ఆశ్రయించడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటి వల్ల ఆర్ధిక ఇబ్బందులతో పాటు డబ్బులు కట్టకుండా ఎగ్గొడుతున్నారనే అపవాదు మోయాల్సి ఉంటుంది. రహస్యంగా లోన్ మరి ఎలాంటి సందర్భాల్లో మీకు తెలియకుండా మీ పేరుమీద రహస్యంగా లోన్లను తీసుకోవచ్చంటే? బహిరంగంగా లేదంటే,సీక్రెట్‌గా బ్యాంక్‌ల నుంచి, ఆర్ధిక సంస్థల నుంచి ఈజీగా లోన్లు తీసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.ఎలా అంటే? ఉదాహరణకు మనం తీసుకునే లోన్లకు పాన్ నెంబర్ లింకై ఉంటుంది. ఆ పాన్ నెంబర్‌తోనే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా లోన్లను పొందవచ్చు. నేరస్తులు చట్టబద్దంగానే అస్సలు మీతో సంబంధం లేకుండా బ్యాంక్ నుంచి వారికి కావాల్సిన రుణాల్ని పొందే అవకాశం ఉంటుంది. అలాంటి లోన్లకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి అలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలంటే. క్రెడిట్ స్కోర్ చెక్ చేయండి బ్యాంక్‌ల నుంచి లోన్ తీసుకుంటే తప్పని సరిగా సంబంధిత డాక్యుమెంట్లకు పాన్ నెంబర్‌ను జత చేస్తారు. మీ పాన్ నెంబర్ సాయంతో సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే..మీరు ఎప్పుడు? ఎక్కడ? లోన్ తీసుకున్నారు. ఎంత చెల్లించారు. ఇంకా ఎంత చెల్లించాలి అనే విషయాలన్నీ బయటకొస్తాయి. మీరు కాకుండా ఇంకెవరైనా మీ పేరు మీద లోన్ తీసుకుంటే అలాంటి మోసాల్ని ఈజీగా గుర్తించొచ్చు. అదే జరిగితే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జరిగిన మోసంపై ఫిర్యాదు చేయాలంటే! ఇటీవల ఓ బాధితుడు (పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు) తనకు తెలియకుండా తనపేరు మీద లోన్ తీసుకున్నట్లు గుర్తించాడు. ఆ సమయంలో తన క్రెడిట్ స్కోర్ 776 నుంచి 830కి పెరిగింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంక్ లోన్‌కు పాన్ నెంబర్‌ను డీయాక్టీవ్ చేసినట్లు తెలిపాడు. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. తనకు జరిగిన మోసంపై బ్యాంకు అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులు మిమ్మల్ని నమ్మవ్! కొన్ని సందర్భాల్లో బ్యాంకులు మీ ఫిర్యాదును నమ్మే సాహసం చేయవు. అలాంటప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. అక్కడ న్యాయం జరగలేదంటే కోర్ట్లు లేదా స్థానిక సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయోచ్చు. క్రెడిట్ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి. వాళ్లు చెక్ చేసి మీ సిబిల్ స్కోర్ తగ్గింపు,పెంచే విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, సిబిల్ స్కోర్ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. చదవండి👉 ధరలు పెరిగితే ధనవంతులకే నష్టం - కేంద్ర ఆర్థిక శాఖ -
దేశానికి ఏపీ మార్గదర్శకం
తిరుపతి అర్బన్: దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోందని జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధి శ్రేయమంజుధా అన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం బుధవారం తిరుపతి డీఆర్డీఏ కార్యాలయంలో పొదుపు సహకార సంఘాలకు చెందిన ఎస్టీ మహిళలతో సమావేశమైంది. ఈ సందర్భంగా శ్రేయమంజుధా మాట్లాడుతూ.. తాము దేశంలోని అనేక రాష్ట్రాల్లో పర్యటించామని, చాలాచోట్ల మహిళా సంఘాలు బ్యాంక్ రుణాలు తీసుకోవడంతోనే సంఘాల పని పూర్తయినట్లు భావిస్తున్నాయని చెప్పారు. ఏపీలో మహిళలకు బ్యాంక్ రుణాలతోపాటు వైఎస్సార్ బీమా, జగనన్న తోడు, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత వంటి పథకాలు వర్తింపచేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల ఆర్థికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. పొదుపు సంఘాల ద్వారా వచ్చే రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వచ్చే నగదుతో మహిళలు వ్యాపారులుగా మారడం పలు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఏపీ మహిళాభివృద్ధికి, వారి జీవనోపాధికి తీసుకుంటున్న చర్యలను కేంద్రానికి నివేదించి ఇలాంటి పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తే బాగుంటుందనే సూచనలు సైతం చేస్తామని చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధులు కరిమైనాన్, మాన్‌కే ధవే మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. డీఆర్డీఏ జిల్లా ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభావతి, డీఆర్డీఏ అధికారి ధనుంజయరెడ్డి ఉన్నారు. -
మహిళా సంఘాల తరహాలో వృద్ధుల సంఘాలు
సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాల మాదిరే ఇప్పుడు కొత్తగా వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సంఘాలకు ‘ఎల్డర్లీ స్వయం సహాయక సంఘాలు (ఈఎస్హెచ్జీ)’గా పేరు పెట్టారు. మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఆర్థికసాయం అందజేసినట్లే ప్రభుత్వం వృద్ధుల సంఘాలకు కూడా రెండేళ్లపాటు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.50 వేలు ఇవ్వనుంది. రెండేళ్ల తర్వాత ప్రస్తుతం మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నట్లే వృద్ధుల సంఘాలకు బ్యాంకు రుణాలను ఇప్పించే అవకాశం ఉంది. ఈ వృద్ధుల సంఘాల్లో.. 60 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు ఒకే సంఘంలోనే సభ్యులుగా కొనసాగవచ్చు. అయితే.. పురుషులు, మహిళల వేర్వేరు సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తారు. ఒక సంఘంలో కనీసం పదిమంది, గరిష్టంగా 20 మంది సభ్యులుగా కొనసాగవచ్చు. కొండ ప్రాంతాలతోపాటు ఇతర గిరిజన ప్రాంతాల్లో అత్యంత వెనుకబాటుతనంతో ఉండే 12 కులాలకు చెందిన వారైతే కనీసం ఐదుగురితోనే సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 15 మండలాల్లో వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత దశలో క్రమంగా రాష్ట్రమంతా ఈ కార్యక్రమాలను విస్తరించనున్నారు. మూడు విభాగాలుగా.. సంఘాల ఏర్పాటుకు వృద్ధులను మూడు విభాగాలుగా విభజించారు. 1. తమ వ్యక్తిగత పనులు సొంతంగా చేసుకుంటూ, జీవనోపాధి కోసం ఇతర పనులు కూడా చేసుకునేవారు. 2. తమ పనులు మాత్రమే చేసుకుంటూ, ఇంకేమీ చేయలేని వారు. 3. వ్యక్తిగత పనులకు వేరే వాళ్లపై ఆధారపడే స్థితిలో ఉన్న వారు ► ప్రస్తుతం ప్రయోగాత్మకంగా మొదటి రెండు విభాగాల వారితో మాత్రమే సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ సంఘాల ఏర్పాటు ఎందుకంటే.. ► వృద్ధాప్యంలో కూడా వారు సమాజంలో గౌరవంగా జీవించేహక్కును ప్రోత్సహించడం. ► కుటుంబ ఇబ్బందుల కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారి మనసు బాగుండేలా సంఘ సభ్యులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడాన్ని ప్రోత్సహించడం. ► వృద్ధాప్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలపై పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా వారిలో అవగాహన పెరిగేలా చూడటం. సాయం ఇలా.. ► వృద్ధులు సొంత ఆదాయం పెంచుకోవడానికి ఆసక్తి చూపితే వారికి ఆసక్తి ఉన్న అంశంలో శిక్షణ ఇచ్చి ముందుకెళ్లేందుకు సంఘాల వారీగా బ్యాంకు రుణం ఇప్పించే అవకాశం ఉంది. ► సంఘం ఏర్పాటు చేసినప్పుడు రూ. 5 వేలు, తర్వాత సభ్యులకు శిక్షణ కార్యక్రమాల సమయంలో రూ.5 వేలు, తొలి ఏడాది పెట్టుబడిగా మరో రూ.15 వేలు, రెండో ఏడాది రూ.25 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. 15 మండలాల్లో 3,017 సంఘాలు మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు కార్యకలాపాలను పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 15 మండలాల్లో వృద్ధుల సంఘాల ఏర్పాటు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. ఆ 15 మండలాల్లో ఈ ఏడాది ప్రాథమికంగా 3,017 సంఘాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికే 1,048 సంఘాలు ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు ప్రక్రియలో పాల్గొనే గ్రామ సమాఖ్య అసిస్టెంట్ (వీవోఏ)ల ద్వారానే వృద్ధుల సంఘాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది. వృద్ధుల సంఘాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో బాధ్యులుగా ఉన్న ఒక్కొక్కరికీ శిక్షణ ఇవ్వగా, ఆ తర్వాత స్థాయిలో ఎంపికచేసిన మండల సెర్ప్ సిబ్బందికి, ఆయా మండలాల పరిధిలోని గ్రామ సమాఖ్యల సిబ్బందికి, వీవోఏలకు ప్రభుత్వం ఒక దశ శిక్షణను కూడా పూర్తిచేసింది. గ్రామాల్లో వీవోఏలు వృద్ధులను కలిసి సంఘాల ఏర్పాటు ఉద్దేశం వివరించి, సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు.