బ్యాంకులకు టోకరా
‘నకిలీ’లు బ్యాంకులకే కన్నం వేశారు. బోగస్ పాస్‌పుస్తకాలతో బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టారు. సర్కారు స్థలాలను తనఖా పెట్టి కొందరు.. లేని భూమిని పట్టాదారు పుస్తకాల్లో చూపించి మరికొందరు.. దొంగ పాస్‌పుస్తకాలు, ఫోర్జరీ సంతకాలతో ఇంకొందరు బ్యాంకులకు టోకరా కొట్టారు. బ్యాంకర్ల హస్తలాఘవం.. రెవెన్యూ సిబ్బంది అండదండలతో గుట్టుగా సాగిన ఈ అవినీతి పరంపర వెలుగులోకి వస్తోంది. జిల్లాలో దాదాపు రూ.5 కోట్ల మేర కుంభకోణంజరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన యంత్రాంగం.. ఈ బాగోతంపై లోతుగా విచారణ జరపాలని నిర్ణయించింది.
- బోగస్ పాస్‌పుస్తకాలతో రూ.5 కోట్ల మేర కుచ్చుటోపీ
- అధికారుల విచారణతో వెలుగులోకి అక్రమాల చిట్టా
- బ్యాంకర్ల హస్తం.. రెవెన్యూ సిబ్బంది చేతివాటం
సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: గతంలో పహాణీ, పట్టా పాస్‌పుస్తకాలను అట్టిపెట్టుకొని బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు దొంగ పాస్‌పుస్తకాలను సృష్టించి సర్కారీ స్థలాలను రికార్డుల్లోకెక్కించి బ్యాంకర్లను తప్పుదోవ పట్టించారు. రుణగ్రహీత దరఖాస్తును నిశితంగా పరిశీలించకుండా.. క్షేత్రస్థాయిలో భూమి స్థితిగతులను తెలుసుకోకుండా రుణాలివ్వడంతో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. ఇటీవల ఈసీలు, ఆన్‌లైన్ పహాణీలను తప్పనిసరి చేయడంతో ఈ అవినీతి గుట్టు బయటపడింది.
ఇప్పటికే యాచారం, మర్పల్లి, మంచాల, మోమిన్‌పేట, షాబాద్, గండేడ్, ధారూరు తదితర మండలాల్లో నకిలీ పాసు పుస్తకాలతో బ్యాంకులను మోసగించినట్లు రెవె న్యూ, బ్యాంకు యాజమాన్యాలు గుర్తించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన నకిలీ పాసు పుస్తకాల రాకెట్‌ను తలదన్నెలా జిల్లాలోనూ ‘బోగస్’ చిట్టా బహిర్గతమవడం అధికారవర్గాలను విస్మయపరుస్తోంది.
తిలాపాపం.. తలా పిడికెడు!
నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందడమే కాకుండా.. రుణ మాఫీ కూడా వర్తింపజేయడంతో సర్కారు ఖజానాకు భారీగా చిల్లు పడింది. బోగస్ పట్టాల సృష్టిలో రెవెన్యూ సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తహసీల్దార్/ ఆర్డీఓ కార్యాలయాల నుంచి తస్కరించిన పాస్‌పుస్తకాల్లో ఫోర్జరీలతో బినామీలను సృష్టించి బ్యాంకులకు టోపీ పెట్టారు. బ్యాంకర్లు కూడా పాస్ పుస్తకాలు అసలువా? నకిలీవా అనేది తేల్చుకోకపోవడం.. రికార్డుల్లో నమోదైన భూమిపై క్షేత్రస్థాయిలో తెలుసుకోకపోవడం నిధుల దుర్వినియోగానికి దారి తీసింది. అంతేకాకుండా మీ-సేవ కేంద్రాల్లో రికార్డులను ట్యాంపరింగ్ చేసి వాటి ద్వారా రుణాలు తీసుకున్న విషయాన్ని కూడా బ్యాంకర్లు పసిగట్టలేకపోయారు. రుణ వితరణలో దళారీల ప్రమేయం కూడా తోడు కావడంతో రుణాలు అనర్హుల పాలయినట్లు తెలిసింది.
నకి‘లీలలు’ మచ్చుకు కొన్ని..
- యాచారం మండలం నక్కర్తమేడిపల్లి, పల్లె చెల్కతండా, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి, మొండిగౌరెల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను పాస్‌పుస్తకాల్లో చూపి.. బ్యాంకులను మోసం చేశారు. ఇప్పటికే దాదాపు 150 మంది నకిలీ పాసుపుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తేలింది. ఈ తతంగంలో ఆరుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
- మంచాల మండలం బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకులో నకిలీ పాస్‌బుక్కులతో పెద్ద సంఖ్యలో బినామీ రైతులు రుణాలు పొందగా.. ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీకి సైతం అర్హుల య్యా రు. గ్రామపంచాయతీలో అర్హుల వివరాలను ప్రదర్శించిన సమయంలో అనర్హుల చిట్టా బయటపడింది. దీంతో స్థానిక రెవెన్యూ యంత్రాంగం పట్టాదారు పుస్తకాల జారీపై పూర్తిస్థాయి విచారణకు ఉపక్రమించింది.
- మోమిన్‌పేట మండలం చిట్టెంపల్లి, రాళ్లడుగుపల్లి, ఎన్కెపల్లి, మోమిన్‌పేట, మర్పల్లి మండలం మొగిలిగుండ్ల, కోంశెట్టిపల్లి, కోటమర్పల్లి గ్రామాల్లో 25 మంది ఖాతాదారులు బోగస్ పీటీ బుక్కులతో బుధేరా కార్పొరేషన్ బ్యాంకు నుంచి లక్షలాది రూపాయలను రుణంగా పొందారు.
- పరిగి మండల పరిధిలోని రంగాపూర్, మాదారం, రాఘవాపూర్, లఖ్నాపూర్, నస్కల్, సయ్యద్‌మల్కాపూర్, మల్లెమోనిగూడ, గండేడ్ మండలంలో రెడ్డిపల్లి, బల్సుర్‌గొండ, బల్సుర్‌గొండ తండా, కొండాపూర్‌లలో, దోమ మండల పరిధిలోని గూడూరు, పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల, తిర్మలాపూర్, తదితర గ్రామాల్లోని భూములకు సంబంధించి పలువురు రైతులు వెయ్యి ఎకరాలపై బినామీలు పాసుపుస్తకాలు సమర్పించి దాదాపు రూ.3కోట్ల మేర రుణాలు పొందారు. ఈ తంతును గుర్తించిన అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.