Revenue staff
-
తహసీల్దార్లకు మినహాయింపు..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల బదిలీల నుంచి తహసీల్దార్లను మినహాయించనున్నారు. ఈ బదిలీల విషయంలో స్పష్టత ఇస్తూ కేంద్రఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో కేవలం ఆర్డీఓ స్థాయి వరకే బదిలీలు జరుగుతాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న, లేదా సొంత జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని (తహసీల్దార్ స్థాయి వరకు) బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు పెద్దఎత్తున తహసీల్దార్ల బదిలీలు ఈ నెలలోనే జరిగాయి. అయితే, సొంత జిల్లా కాకుండా, సొంత లోక్‌సభ సెగ్మెంట్‌ను పరిగణనలోకి తీసుకొని.. ఆ సెగ్మెంట్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఇటీవల మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ దాదాపు కసరత్తు పూర్తి చేసింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధి ప్రకారం చూస్తే.. రాష్ట్రంలోని దాదాపు 600 మంది తహసీల్దార్లను మళ్లీ బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా, తాజాగా ఈసీ జారీ చేసిన ఆదేశాలతో తహసీల్దార్ల బదిలీలకు రెండోసారి జరిపిన కసరత్తు నిలిచిపోయే అవకాశాలున్నాయని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి. ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్ఓ) స్థాయి వరకే బదిలీలు చేయాల్సి ఉంటుందని, లోక్‌సభ ఎన్నికలకు ఆర్‌ఓలుగా జిల్లా కలెక్టర్లు, ఏఆర్ఓలుగా రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీఓ) వ్యవహరిస్తారని, ఆ స్థాయి వరకే బదిలీలుంటాయని అంటున్నాయి. దీంతో తహసీల్దార్ల బదిలీలు నిలిచిపోతాయని, ప్రస్తుతం జరిగిన బదిలీల మేరకు తహసీల్దార్లు సర్దుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈసీకి సీఎస్ లేఖ కాగా, సొంత లోక్‌సభ సెగ్మెంట్లోని రెవెన్యూ సిబ్బందిని బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, లేదంటే తమను ఈ బదిలీల నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈసీకి లేఖ రాసినట్టు సమాచారం. లోక్‌సభ నియోజకవర్గ నిబంధన ప్రకారం రెవెన్యూశాఖలోని 60 శాతం మంది సిబ్బందికి బదిలీలు చేయాల్సి వస్తోందని ఆ లేఖలో ఆమె వెల్లడించినట్టు తెలిసింది. తాజాగా ఈసీ జారీ చేసిన వివరణ నేపథ్యంలో తహసీల్దార్ల మలి బదిలీల ప్రక్రియ నిలిచిపోనుండగా, దాదాపు 40 మంది ఆర్డీఓలకు స్థానచలనం కలుగుతుందని, ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడుతాయని రెవెన్యూవర్గాల ద్వారా తెలిసింది. -
బయోమె‘ట్రిక్’తో బియ్యం మాయం
సాక్షి, కామారెడ్డి: బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. అడ్డూఅదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతోంది. కరోనా నేపథ్యంలో రేషన్ సరుకుల పంపిణీకి బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేయడంతో బియ్యం దొంగలకు వరంగా మారింది. ఫలితంగా రెవెన్యూ సిబ్బందిని మచ్చిక చేసుకుని అక్రమాలకు తెరలేపారు. ఇతర జిల్లాలకు చెందిన లబ్ధిదారులకు సంబంధించిన బియ్యాన్ని కాజేస్తున్న వైనం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. లబ్ధిదారుల ఆహార భద్రత కార్డుల నంబర్లను సేకరించి రెవెన్యూ సిబ్బంది సహకారంతో బియ్యాన్ని దారి మళ్లించారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో కొందరు డీలర్లు మహబూబాబాద్, భద్రాద్రి, మంచిర్యాల జిల్లాలకు చెందిన లబ్ధిదారుల పేరిట పెద్ద ఎత్తున బియ్యాన్ని తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఎల్లారెడ్డి పట్టణంలో ఒక రేషన్ దుకాణం, బాన్సువాడ పట్టణంలో రెండు దుకాణాలు, బీర్కూర్ మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్, దామరంచ గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. దీంతో ఆరుగురు డీలర్లతో పాటు సహకరించిన వీఆర్వో, వీఆర్ఏలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఐదుగురు వీఆర్ఏలను, ఒక వీఆర్వోను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దుర్వినియోగం ఈ దందా ఇతర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. ఆహార భద్రత కార్డుల ద్వారా పేదలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తుండగా.. అక్రమాలకు అలవాటు పడిన కొంత మంది రేషన్ డీలర్లు, మాఫియా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతూ తమ దందాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తాజాగా కరోనా కాలాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకుని కొత్త దారులు వెతికారు. బయోమెట్రిక్‌కు బదులు రెవెన్యూ సిబ్బంది ఆథరైజేషన్‌తో సరుకులు పంపిణీ చేస్తుండటంతో సిబ్బందిని మచ్చిక చేసుకుని లబ్ధిదారుల బియ్యాన్ని మింగేస్తున్నారు. అది కూడా ఇతర జిల్లాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను సేకరించి వారికి సంబంధించిన నెలనెలా మిగిలిపోతున్న బియ్యాన్ని మింగేశారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం దుర్వినియోగమైనట్టు తెలుస్తోంది. అక్రమాలకు హైదరాబాద్‌తో లింకు..! పొరుగు జిల్లాల లబ్ధిదారులకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేసే మాఫియాకు హైదరాబాద్‌తో లింకు ఉన్నట్టు తెలుస్తోంది. బియ్యం మాఫియా ఎంచుకున్న కొన్ని రేషన్ దుకాణాల ద్వారా అక్కడి సిబ్బందిని మేనేజ్ చేసుకుని ఇతర జిల్లాల లబ్ధిదారుల పేరుతో బియ్యాన్ని కాజేస్తోంది. దీనికి హైదరాబాద్‌లోని మాఫియా, యంత్రాంగం అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. లబ్ధిదారుల ఆహార భద్రత కార్డుల నంబర్లు రాజధాని నుంచే డీలర్ల వాట్సాప్‌లకు వచ్చినట్లు సమాచారం. కామారెడ్డి జిల్లాలో అక్రమాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పౌరసరఫరాల అధికారులు ఇతర జిల్లాలపై దృష్టి సారించారు. -
ప్రభుత్వ భుములను కొట్టేసిన రెవెన్యూ సింబ్బంది
-
ఏమైతదో ఏమో.. కిటికీలో నుంచే దరఖాస్తులు
ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు దరఖాస్తులను కిటికిలో నుంచే తీసుకుంటున్నారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారిని లోపలికి అనుమతించడం లేదు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య అనంతరం కార్యాలయం సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. వారం తర్వాత విధుల్లోకి చేరిన రెవెన్యూ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ బాధితులను లోపలికి పిలిస్తే గేటు వద్ద వారిని వీఆర్ఏలు తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. -
దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి
సాక్షి, టెక్కలి: శ్రీకాకుళం మండలం పరిధిలో అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకోవాలని ప్రయత్నించిన వీఆర్ఓలపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీఆర్ఓ, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు టెక్కలి ఆర్డీఓ ఎస్.భాస్కర్‌రెడ్డికి వినతిపత్రం గురువారం అందజేశారు. భైరి, కరజాడ, బట్టేరు, పొన్నాం, నైరా ప్రాంతంలో రాత్రి సమయంలో అక్రమ ఇసుక మాఫియాను అడ్డుకోవాలని ప్రయత్నించిన వారిపై దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే కొన్ని సందర్భాల్లో విధులు చేపడుతున్న వీఆర్ఓ లకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి నందిగాం: ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న వీఆర్వోలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని వీఆర్వో సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్న వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వర్రావు లకు సంఘీభావంగా మధ్యాహ్నం భోజన సమయంలో స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్ పరిధిలోని నైరా వద్ద గురువారం రాత్రి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన వీఆర్వోలపై దాడి చేయడం హేయమైన చర్యన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం తగదని హితవు పలికారు. అలాగే దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో వీఆర్వోలు సురేష్, అప్పన్న, మురళీ, రాంజీ, వైకుంఠరావు, ఖగేశ్వర్రావు, కృష్ణారావు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ అధికారులపై దాడి
అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. మీ అంతు చూస్తామని బెదిరించారు. నిర్మాణం జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. రెవెన్యూ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారు. అయినా అధికారులు భయపడకుండా అక్రమంగా వేసిన భారీ షెడ్‌ను ధ్వంసం చేశారు. ఆక్రమణలకు పాల్పడడంతో పాటు దాడికి పాల్పడ్డ టీడీపీ నేత కుటుంబంపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. మధురవాడ(భీమిలి): టీడీపీ నేత, మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు కుటుంబ సభ్యులు విశాఖ రూరల్ మండలం పరదేశిపాలెం రెవెన్యూ సర్వే నెంబరు 109 మారికవలసలోని ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేసిన భారీషెడ్‌ను రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. ఈ క్రమంలో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిర్మాణం తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఒంటిపై డీజిల్ పోసుకుని మాజీ కార్పొరేటర్ భార్య బెదిరింపులకు దిగారు. అతని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు నోటికొచ్చినట్లు తిడుతూ వీఆర్వో అప్పారావును తోసేశారు. దీనిపై టీడీపీ నేత మన్యాల సోంబాబు, అతని కుమారుడు, కుటుం బ సభ్యులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసుతో పాటు వి«ధి నిర్వహణలో ఉద్యోగులను అడ్డగించి, దాడికి దిగిన నేరాలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని విశాఖ రూరల్ మండల తహసీల్దారు శేషగిరిరావు చెప్పారు. అంతేకాకుండా ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లి పశువుల పాక పేరుతో కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని భారీ షెడ్ వేసిన విషయాన్ని వివరిస్తామన్నారు. ఇదీ వ్యవహారం సర్వే నెంబరు.109లో తన పాఠశాలను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి సదరు వ్యక్తి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రయత్నాలపై పలు దఫాలుగా సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురితం కావడంతో ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు చెక్ పెడుతున్నారు. తాజాగా ఇదే సర్వే నెంబరులో పశువుల పాక నిర్మాణం కోసమని హైకోర్టు అనుమతి తెచ్చుకుని పక్కనే ఉన్న సుమారు రూ. 5కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేసేందుకు సుమారు 400గజాల విస్తీర్ణంలో భారీ షెడ్ నిర్మాణానికి ఉపక్రమించారు. దీనిపై సోమవారం సాక్షి దినపత్రికలో ‘అడ్డకునేదెవరు?’ అనే శీర్షికన కథనం ప్రముఖంగా ప్రచురితమైంది. దీనిపై విశాఖ రూరల్ మండల తహసీల్దారు శేషగిరిరావు స్పందించారు. ఆయన ఆదేశాలు మేరకు ఇన్చార్జ్ ఆర్ఐ సత్యనారాయణ, వీఆర్వో కె. అప్పారావు పరిశీలన చేసి ఇక్కడ నిర్మాణం జరుగుతున్న భారీ షెడ్‌కు ఏ రకమైన కాగితాలు లేక పోవడంతో షెడ్‌ను నేల మట్టం చేశారు. అధికారులు ఏమన్నారంటే.. ఇక్కడ మన్యాల సోంబాబు తన తల్లి పేరుతో కోర్టు నుంచి పశువుల పాక నిర్మాణానికి అనుమతి తెచ్చి నిర్మాణం చేశారు. అది కాకుండా పక్కనే ఉన్న కోట్లు విలువ చేసే 45 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు మరో భారీ షెడ్ నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా పంచనామా చేస్తుండగా వాచ్మెన్ ఆధార్ కార్డు కోసం షెడ్లోకి వెళ్లిని సిబ్బందిని టీడీపీ నాయకుడు కుటుంబ సభ్యులు గృహనిర్భందం చేశారు. ఇదేమని ప్రశ్నించిన వీఆర్వో అప్పారావును బెదిరించారు. ఇతర రెవెన్యూ సిబ్బందిపైనా బెదిరింపులకు దిగి, దాడికి యత్నించారు. -
అక్రమ కట్టడాల కూల్చివేత
చిత్తూరు,రేణిగుంట: మండలంలోని తూకివాకం పంచాయతీ ఎర్రమరెడ్డిపాళెం సమీపంలో అక్రమంగా నిర్మించిన 28ఇళ్లను బుధవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో కిరణ్ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. సర్వే నంబర్ 506–1లోని 1.28 ఎకరాల వాగు పోరంబోకు స్థలంలో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లు, షెడ్లను తొలగించారు. బాధితులు అడ్డుకుని, తమ ఆక్రోశించినా అధికారులు పట్టించుకోలేదు. పోలీసు బందోబస్తు నడుమ జేసీబీ సాయంతో ఇళ్లను కూల్చివేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వంక పోరంబోకు స్థలంలో ఇళ్లను నిర్మించడంతోనే తాము జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో కూల్చివేతకు పూనుకున్నట్లు విచారణాధికారి కిరణ్ చెప్పారు. అయితే పేదలు నిర్మించుకున్న రెండు సెంట్ల స్థలమే మీకు కనిపిస్తుందా...? అంటూ స్థానికులు రెవెన్యూ సిబ్బందిపై ఎదురుతిరిగారు. ఒక దశలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడే ఉన్న పోలీసులు స్థానికులను వారించారు. తహసీల్దార్ మాధవక్రిష్ణారెడ్డి, ఆర్ఐలు ఈశ్వర్, వసంత్, వీఆర్వో, వీఆర్ఏలు సుమారు 20మంది ఈ పనులను పర్యవేక్షించారు. అయితే తాము రూ.10 వడ్డీతో అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయొద్దని, రెండు రోజులు గడువు ఇస్తే తామే నిర్మాణాలను తొలగించి రేకులు, తలుపులు, సిమెంటు రాళ్లను తీసుకెళ్తామని బాధితులు విజ్ఞప్తి చేసినా అధికారులు ఖాతరు చేయలేదు. విషయం తెలుసుకున్న మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి, యోగేశ్వరరెడ్డి, సీపీఎం నేతలు నరసింహారెడ్డి, సెల్వరాజ్ అక్కడకు చేరుకుని బాధితుల పక్షాల అధికారులతో మాట్లాడారు. అయితే ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఆగదని, అయితే బాధితుల్లో అర్హులైన పేదలుంటే వారు అర్జీలు ఇస్తే న్యాయం చేస్తామని విచారణాధికారి హామీ ఇచ్చారు. దీంతో చేసేది లేక స్థానికులు వెనుతిరిగారు. ఆత్మరక్షణలో రెవెన్యూ సిబ్బంది గత మూడు నెలల్లోనే అక్రమ కట్టడాలు నిర్మించినట్లు షార్ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా తెలుస్తోందని భావించిన విచారణాధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రేణిగుంట రెవెన్యూ సిబ్బంది ఆత్మరక్షణలో పడ్డారు. గత తహసీల్దార్ హయాంలో ఇచ్చిన అనుభవ ధ్రువపత్రాలతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో కొందరు వీఆర్వోలు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఎన్నికలకు ముందు అనధికారిక కట్టడాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ కట్టడాలకు కొందరు వీఆర్వోలు పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని, ప్రస్తుతం ఇళ్లు కూల్చేయడంతో బాధితులు వారిని శాపనార్థాలు పెడుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. గతంలో అనుభవ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసినప్పటికీ ఎక్కడైనా ఫిర్యాదులొస్తే రెవెన్యూ సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే గత నాలుగు నెలలుగా కొందరు వీఆర్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాలకు ఊతమిచ్చి రూ.లక్షల్లో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీంతోనే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఇళ్ల నిర్మాణాలు ఇటీవల కాలంలోనే జరిగినట్లు అధికారులు ధ్రువీకరించుకున్నారు. అయితే ఈ అక్రమాల వెనుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, అందరిపైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన అక్కడున్న సిబ్బందిని హెచ్చరించడంతో కొంతమంది టెన్షన్‌కు గురవుతున్నట్టు సమాచారం. పలు ప్రయాసలకోర్చి నిర్మించుకున్న పేదలు మాత్రం బలిపశువులైపోగా, ఆమ్యామ్యాలకు పాల్పడిన వారు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. ఈ అక్రమ కట్టడాల కూల్చివేత మిగిలిన చోట్ల కొనసాగుతుందన్న సంకేతాలు అందడం పలువురిలో గుబులు రేపుతోంది. ఇళ్ల కూల్చివేత బాధితుల రాస్తారోకో మండలంలోని ఎర్రమరెడ్డిపాళెంలో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో బాధితులు బుధవారం సాయంత్రం హైవేపై రాస్తారోకో చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ పేదల నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేసిన ఏవో కిరణ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బలప్రయోగంతో ఇళ్లను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకివాకం మాజీ సర్పంచ్ భాస్కర్‌యాదవ్ ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. గాజులమండ్యం పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు. -
‘రద్దు’పై ఐక్య ఉద్యమాలు జేఏసీగా ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ శాఖను స్వతంత్రంగా, ఇప్పుడున్న విధంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తే ఎదుర్కొనేందుకు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం సీసీఎల్ఏ కార్యాలయ ఉద్యోగులు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, వీఆర్వో, వీఆర్ఏ సంఘాలన్నింటినీ కలుపుకొని ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని రెవెన్యూ భవన్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ అత్యవసర సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖ విషయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో శాఖ భవిష్యత్తు, సీఎం కేసీఆర్ చెబుతున్న కొత్త రెవెన్యూ చట్టంపై చర్చించేందుకు ఉద్యోగులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెవె న్యూ శాఖను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యోగ సంఘాల అభి ప్రాయాలు తీసుకున్నారు. జేఏసీగా ముందుకెళ్లడంతోపాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బుధవారం కలిసి పరిస్థితిని కూలంకషంగా వివరించాలని, ఆయన్ను కలిశాకే భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించారు. ప్రతి శాఖలోనూ అవినీతి.. తెలంగాణను అవినీతిరహితంగా మార్చాలంటే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తే సరిపోతుందా అని నేతలు ప్రశ్నించారు. ‘ఏ శాఖ లో అవినీతి లేదు? అన్ని శాఖల్లో అవినీతి, అలసత్వ ఉద్యోగులు ఉన్నారు’ అని పేర్కొన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పని చేశారని పొగిడి నెల జీతం బోనస్‌గా ఇచ్చిన సీఎం.. ఇప్పుడు మమ్మల్ని బద్నామ్ చేయడం ఎంత వరకు భావ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 94 శాతం రికార్డులను నవీకరించినా ఒక్క రైతు నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులపై నిందలు మోపడం దారుణమని వ్యాఖ్యానించారు. ‘మనిషి జననం నుంచి మరణం వరకు రెవెన్యూశాఖదే కీలక పాత్ర. ఇది ముఖ్యమంత్రికి తెలియంది కాదు. ఎన్నో సేవలు చేస్తున్న రెవెన్యూ శాఖను అవినీతి శాఖగా చిత్రీకరించడం శోచనీయం’ అని ఉద్యోగ సంఘాల నేతలు వాపోయారు. కొన్ని శాఖలు తెలంగాణ కోసం అదనంగా 2 గంటలు పనిచేస్తామని చెప్పి కేవలం రెండు గంటలే పనిచేస్తున్నా కన్నెత్తిచూడకుండా నిరంతరం పాలనా వ్యవహారాల్లో తలమునకలయ్యే రెవెన్యూ శాఖను రద్దు చేసే ఆలోచన చేయడమేమిటని ప్రశ్నించారు. రెవెన్యూశాఖ పరిరక్షణ జేఏసీ ఏర్పాటు రెవెన్యూ శాఖ పరిరక్షణ కోసం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో జేఏసీ చైర్మన్‌గా వంగా రవీందర్‌రెడ్డి (ట్రెసా), సెక్రటరీ జనరల్స్‌గా గరిక ఉపేందర్‌రావు (వీఆర్వోల సంక్షేమ సంఘం), గోల్కోండ సతీష్ (వీఆర్వోల సంఘం), కో చైర్మన్‌గా విజయరావు (వీఆర్వోల సంక్షేమ సంఘం), రమేశ్ బహదూర్ (డైరెక్ట్ రిక్రూటీ, వీఆర్ఏ సంఘం), రాజయ్య (వీఆర్ఏల సంఘం), కోశాధికారిగా నారాయణరెడ్డి (ట్రెసా), కన్వీనర్‌గా చంద్రమోహన్ (డిప్యూటీ కలెక్టర్ల సంఘం)లను ఎన్నుకున్నారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలను స్వాగతించాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం సరికాదు... సమగ్ర భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకురావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మంచిదే. కానీ కొత్త చట్టం పేరిట రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఆలోచన సరికాదు. రెవెన్యూ పనులను ప్రైవేటుకు అప్పగిస్తే వ్యతిరేకిస్తాం. భూ సమగ్ర సర్వే చేసి హద్దు రాళ్లు నాటిన తర్వాతే ప్రక్షాళన చేస్తే రెవెన్యూ సమస్యలకు ఆస్కారం ఉండేది కాదు. భూమి ఒకరిది, రికార్డులో మరొకరిది ఉన్న కేసులు చాలా ఉన్నాయి. నిపుణుల కమిటీ వేసి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తే రెవెన్యూ వివాదాలకే తావుండేది కాదు. ధరణి వెబ్‌సైట్‌ను తహసీల్దార్ ఫ్రెండ్లీగా మార్చాలి. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘టాస్’ను వ్యతిరేకిస్తున్నాం. దాని వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయి. మంత్రులకు సర్వాధికారాలు ఇవ్వడం సీఎం ఇష్టం. కలెక్టర్లకు అధికారాలు ఇవ్వడం వల్ల అందరికీ లాభం జరుగుతుంది. – వంగా రవీందర్ రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
నల్లగొండకు అత్యధికం... వరంగల్ అర్బన్‌కు అత్యల్పం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ సిబ్బంది కేటాయింపుపై స్పష్టత వచ్చింది. కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాల్లో (ములుగు, నారాయణపేట మినహా) అవసరమైన రెవెన్యూ సిబ్బందిని నిర్ధారిస్తూ సర్క్యులర్ విడుదలైంది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్, సర్వే సెటిల్మెంట్స్ కమిషనర్ కార్యాలయాలకు ఈ సర్క్యులర్ ఇప్పటికే చేరింది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, మండల కార్యాలయాల్లో కలిపి మొత్తం 9,891 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉంది. జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వో), డిప్యూటీ కలెక్టర్లు (ఆర్డీవో), అడ్మినిస్ట్రేటివ్ అధికారులు/తహశీల్దార్లు, సీనియర్ స్టెనోగ్రాఫర్స్, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, రికార్డ్ అసిస్టెంట్లు, డ్రైవర్, జమేదార్లు, ఆఫీస్ సబార్డినేట్లు, చౌకీదార్లు, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు, ఉపగణాంక అధికారులు, మండల సర్వేయర్లు, మండల ప్రణాళిక, గణాంక అధికారులు, చైన్మెన్లు.. ఇలా మొత్తం 18 కేటగిరీల్లో సిబ్బందిని పంపిణీ చేశారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాకు 482 మందిని కేటాయించగా, అత్యల్పంగా వరంగల్ అర్బన్ జిల్లాకు 200 మందిని కేటాయించారు. ఇక హైదరాబాద్‌కు 289 మందిని కేటాయించారు. కొత్త జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు 2016లో ఇచ్చిన జీవో నంబర్ 157 ద్వారా మంజూరు చేసిన 284 పోస్టులను కూడా ఇందులో కలిపినట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బంది పంపిణీపై కలెక్టర్లు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. జిల్లాకో డీఆర్వో: రాష్ట్రంలోని 31 జిల్లాలకు 31 మంది డీఆర్వోలను కేటాయించారు. రంగారెడ్డి (5), కామారెడ్డి (4), నల్లగొండ, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు ముగ్గురు చొప్పున, వనపర్తి, గద్వాల, వరంగల్ (అర్బన్), రాజన్నసిరిసిల్ల జిల్లాలకు ఒక్కరు చొప్పున ఆర్డీవోలను కేటాయించారు. మిగిలిన జిల్లాలకు ఇద్దరు ఆర్డీవోలను మంజూరు చేశారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, ఒక జమేదార్ పోస్టును ఇచ్చారు. తహశీల్దార్ స్థాయి అధికారులను అత్యధికంగా నల్లగొండ (40), రంగారెడ్డి (38) జిల్లాలకు కేటాయించారు. అత్యల్పంగా వరంగల్ అర్బన్ (18), గద్వాల (19)కు మంజూరు చేశారు. ఒక్కో మండలానికి ఒకరు చొప్పున సర్వేయర్లు, మండల గణాంక అధికారులను కేటాయించారు. ఒకరి నుంచి నలుగురు వరకు అదనంగా చైన్మెన్లను ఒక్కో మండలానికి మంజూరు చేశారు. దాదాపు ప్రతి జిల్లాకు నాలుగు రికార్డు అసిస్టెంట్ పోస్టులను కేటాయించగా, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాలకు ఐదుగురు చొప్పున, వనపర్తి, గద్వాల, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ముగ్గురు చొప్పున కేటాయించారు. రంగారెడ్డిలో మాత్రం అత్యధికంగా ఏడుగురు రికార్డు అసిస్టెంట్లు ఉండనున్నారు. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు, ఉపగణాంక అధికారులను కేటాయించారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాలకు మూడు, రంగారెడ్డికి 5 చొప్పున పోస్టులు మంజూరు చేశారు. -
కొక్కొక్కో.. కోట్లు
సాక్షి, నెట్వర్క్: తూర్పుగోదావరి జిల్లాలో జూదరాయుళ్లు చెలరేగిపోయారు. సుమారు 400 బరులకు పైగా ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం నుంచి జూదప్రియులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పండుగ మూడు రోజులు రూ.800 కోట్లకుపైగా కోడి పందేలు జరిగాయని అంచనా. ఒకప్పుడు ఊరి పొలిమేరలకు, కొబ్బరి తోటలకు పరిమితమైన పందేలు ఇప్పుడు మెయిన్ రోడ్లకు దగ్గరగా బహిరంగంగానే సాగాయి. యు.కొత్తపల్లిలో అయితే పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే పందేలు జరిగాయి. డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం మండలం ఆర్.బి.కొత్తూరులో పండుగ మూడు రోజులు రూ.5 కోట్ల మేర, పనసపాడు– తిమ్మాపురం సరిహద్దులో రూ.10 కోట్ల మేర, తుని నియోజకవర్గం తేటగుంటలో రూ.మూడు కోట్ల మేర పందేలు నడిచాయి. జగ్గంపేట మండలం మర్రిపాకలో పందేలు చూసేందుకు వచ్చినవారి నుంచి రూ.300 చొప్పున నిర్వాహకులు వసూలు చేయడం గమనార్హం. పందేనికి కనీస ధర రూ.30 వేలుగా నిర్ణయించారు. కిర్లంపూడి, వేళంక, కాట్రేవుల పల్లెలో భారీ పందేలు జరిగాయి. పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ సొంత గ్రామం పి.దొంతముర్రులో రూ.మూడు కోట్లు, ఇసుకపల్లి, పిఠాపురంలలో రూ.ఆరు కోట్ల మేర పందేలు సాగాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 25 కోట్ల మేర పందేలు జరిగాయని తెలుస్తోంది. అల్లవరం మండలం గోడి, గోడిలంక, అల్లవరం, రెళ్లుగడ్డ, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, చల్లపల్లి, గొల్లవిల్లి, భీమనపల్లిలో అడ్డూ అదుపులేకుండా పందేలు జరిగాయి. కోడి పందేలకు తోడు పలుచోట్ల అశ్లీల నృత్యాలను నిర్వహించారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప సొంత మండలం ఉప్పలగుప్తంలో గొల్లవిల్లి, భీమనపల్లిలో అశ్లీల నృత్యాలను నిర్వహించడం గమనార్హం. మినీ స్టేడియాలను తలపించిన బరులు పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేల కోసం ఏర్పాటు చేసిన బరులతోపాటు వాటి పక్కనే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టు షాపులు వెలిశాయి. ఫలితంగా బరులు జాతరలను తలపించాయి. జిల్లాలో రూ.700 కోట్ల మేర పందేలు సాగాయి. కోడిపందేలు, పేకాటల్లో రూ.కోట్లు చేతులు మారితే గుండాట, కోతాటల్లో రూ.లక్షలు, రూ.వేలు చేతులు మారాయి. ఒక్కో కోడి పందెం కనీసం రూ.25 వేల నుంచి గరిష్టంగా రూ.25 లక్షల వరకు సాగింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. నిర్వాహకుల నుంచి భారీగా వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు మూడురోజులూ పందేలు జరిగే ప్రాంతాల వైపు రాకపోవడం గమనార్హం. బరుల వద్దే మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లాలో 30 వరకూ పెద్ద బరులు ఏర్పాటు చేయగా.. మరో 200 వరకూ చిన్న బరులు సిద్ధం చేశారు. ఆయా ప్రాంతాల్లో మినీ స్టేడియాలను తలపించేలా భారీ షామియానాలు, వీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో ఏర్పాటు చేసిన పందేలకు తెలంగాణ నుంచి కూడా జూదరులు భారీగా తరలివచ్చారు. లక్షల్లో పందేలు జరిగాయి. కామవరపుకోట మండలం రావికంపాడు అడ్డరోడ్డు వద్ద మంగళవారం రాత్రి కోతాట, గుండాట ఆడుతున్న వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. పోలవరం నియోజకవర్గంలో 7 మండలాల్లో సుమారు 45 బరుల్లో కోడిపందేలు నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంలో కోడిపందేల్లో భాగంగా జరిగిన కొట్లాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. నరసాపురం నియోజకవర్గంలో విచ్చలవిడిగా కోడిపందేలు, పేకాట, గుండాట సాగాయి. నరసాపురం పట్టణంలో రోడ్డు పక్కన తోపుడుబళ్లపై పెట్టి మరీ గుండాట ఆడించారు. టీడీపీ నేతలు దగ్గరుండి నిర్వహించడంతో పోలీసులు కన్నెత్తి చూడలేదు. మార్టేరులో ఫ్లడ్‌లైట్ల వెలుగులో కోడిపందేలు నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలో 16 చోట్ల బరులు ఏర్పాటు చేశారు. విజయవాడలో విచ్చలవిడిగా కోతముక్కాట కృష్ణా జిల్లాలో రూ.500 కోట్ల మేర కోడి పందేలు సాగాయని అంచనా. జిల్లావ్యాప్తంగా బహిరంగంగానే కోడిపందేలు, గుండాట, పేకాట జరిగాయి. కంకిపాడు, ముసునూరు, బాపులపాడు, మచిలీపట్నం, గుడివాడ, నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, మైలవరం, గన్నవరం, పామర్రు మండలాల్లో భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా విజయవాడ నగరంలోని ప్రముఖ హోటళ్లలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో కోతముక్కాట విచ్చలవిడిగా సాగింది. ఒక్కో కోసుకు రూ.లక్ష చొప్పున పందేలు జరిగాయి. సంక్రాంతి మూడు రోజుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా. గుంటూరు జిల్లాలో కూడా రూ.350 కోట్ల మేర కోడి పందేలను నిర్వహించినట్టు తెలుస్తోంది. రేపల్లె రూరల్ మండలంలోని బొబ్బర్లంక, గుడ్డికాయలలంక, నిర్మల్ నగర్, చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, బలుసులపాలెం, నిజాంపట్నం మండలం అడవులదీవి, దిండి, కొత్తపాలెం, తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం కొత్తబొమ్మువానిపాలెం పుష్కరఘాట్ల వద్ద అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో పందేలు సాగాయి. కోడి పందేలకు అనుబంధంగా గుండాట, కోతముక్క, చక్రం ఆటలు జరిగాయి. కొత్తబొమ్మువానిపాలెంలో తెనాలి టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ దగ్గరుండి మరీ కోడిపందేలు నిర్వహించారు. గతేడాది కోడి పందేల కేసులు కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెరవెనుకే ఉండి ఫోన్ ద్వారా అన్నీ తానై పర్యవేక్షించారు. విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా భీమిలి–విజయనగరం సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు సాగగా యలమంచలి, పాయకరావుపేట, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలో మారుమూల ప్రాంతాల్లో పందేలు సాగాయి. జిల్లావ్యాప్తంగా రూ.80 కోట్ల మేర పందేలు కాశారు. విజయనగరం జిల్లాలో జూదంతోపాటు కోడి, పొట్టేలు పందేల కోసం రూ.70 కోట్ల వరకు ఖర్చు చేశారు. పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే చిందులు ‘ఏం తమాషాగా ఉందా? కోళ్లు ఎలా పట్టుకెళతావు? కోళ్లకు కత్తులేమైనా కట్టామా? జూదమేమైనా ఆడిస్తున్నామా? మీరు వాంటెడ్‌గా చేస్తున్నారు.. చాలా ఎగస్ట్రాలు చేస్తున్నారు. పో... వెళ్లిపో.. మీ డీఎస్పీని రమ్మను’ అంటూ గుంతకల్లు టూటౌన్ ఏఎస్ఐ తిరుపాల్‌పై అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ చిందులు తొక్కారు. బుధవారం పాత గుంతకల్లు ఏరియా అంకాలమ్మ ఆలయ సమీపంలోని పార్కులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక టీడీపీ నేతలు కొందరు కోడి పందేలు నిర్వహించారు. ఈ సమాచారం టూటౌన్ పోలీసులకు చేరడంతో ఏఎస్ఐ తిరుపాల్, కానిస్టేబుల్ శ్రీనివాసులు, ఇతర పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పందేపు కోళ్లను స్టేషన్‌కు తరలిస్తుండగా.. ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అడ్డుకొని పోలీసు సిబ్బందిపై బూతు పురాణం అందుకున్నారు. ‘ఏం తమాషాలు చేస్తున్నారా? సంప్రదాయాలను కాపాడాల్సిందిపోయి అడ్డుకుంటారా?’ అంటూ కోపంతో ఊగిపోయారు. పోలీసుల నుంచి బలవంతంగా కోళ్లను తీసుకుని మళ్లీ పందేలు నిర్వహించడం గమనార్హం. -
చుక్కలు చూపుతున్న ‘ధరణి’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు రూపొందించిన ‘ధరణి’వెబ్సైట్ రెవెన్యూ సిబ్బందికి చుక్కలు చూపెడుతోంది. పాస్ పుస్తకాల జారీలో జరిగిన తప్పుల సవరణకు వెబ్సైట్ సహకరించడం లేదని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. ఖాతా నంబర్లు, సర్వే నంబర్లు ధరణి పోర్టల్‌లో కనపడటం లేదని, అవసరం లేని వాటికి పాస్ పుస్తకాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఒక్క ఖాతాను నమోదు చేసేందుకు నాలుగు దశల్లో బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తుండటంతో చాలా సమయం వృథా అవుతోందని పేర్కొంటున్నారు. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి వస్తోందని, దీనివల్ల ఇతర రెవెన్యూ పనులు పెండింగ్‌లో పడిపోతున్నాయని వారంటున్నారు. దీంతో భూ రికార్డుల సవరణ పనులు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. ఈనెల మొదట్లోనే ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, ధరణి పోర్టల్‌లో మార్పులు చేయాలని కోరినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ధరణి వెబ్సైట్ ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులివే: - తప్పులు సరిచేయడం కోసం కొన్ని సర్వే నంబర్లను వెబ్సైట్లో నమోదు చేసినా అవి కనిపించడం లేదు. - ప్రతి రైతు ఖాతాపై డిజిటల్ సంతకం చేయాలంటే ఆ రైతు ఆధార్ నంబర్ తప్పనిసరి. ఆధార్ నంబర్లు గతంలో ఇవ్వని వారు, ఫొటోలు లేని రైతులు వారి ఆధార్ నంబర్లు, ఫొటోలు మీ సేవా కేంద్రాల్లో అప్లోడ్ చేయించినా ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు. దీంతో డిజిటల్ సంతకాలు ఆగిపోతున్నాయి. - ప్రతి ఎంట్రీకి తహసీల్దార్లు రెండుసార్లు బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తోంది. ఎంట్రీకి ముందు, తర్వాత నిర్ధారణ కోసం రెండుసార్లు బయోమెట్రిక్ ఇస్తున్నారు. ప్రతి ఎంట్రీకి డేటాఎంట్రీ ఆపరేటర్, సీనియర్ అసిస్టెంట్, నాయిబ్ తహసీల్దార్, తహసీల్దార్ డిజిటల్ సంతకాలు చేయాలి. ఇన్నిసార్లు బయోమెట్రిక్ అవసరం లేదని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ఖాతాను నిర్ధారించే సమయంలో వీఆర్వో, తహసీల్దార్ బయోమెట్రిక్ ఇస్తే సరిపోతుందన్నది వారి అభిప్రాయం. - ఒక పట్టాదారుకు ఒక ఖాతాలో రెండు సర్వే నంబర్లు ఉండి.. అందులో ఒక సర్వే నంబర్లో ఇంటి స్థలం, మరో సర్వే నంబర్లో వ్యవసాయ భూమి ఉంటే ఒక సర్వే నంబర్‌కు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకం అవసరమవుతుంది. కానీ డిజిటల్ సంతకం కోసం ఆ ఖాతా నంబర్‌ను నమోదు చేస్తే రెండు సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. రెవెన్యూ సిబ్బంది బయోమెట్రిక్ ఇచ్చిన వెంటనే ఇంటి స్థలం ఉన్న సర్వే నంబర్‌కు కూడా డ్రాఫ్ట్ పాస్ పుస్తకం కనిపిస్తోంది. దీంతో తహసీల్దార్లు ఆ రైతు ఖాతాపై డిజిటల్ సంతకం చేయలేకపోతున్నారు. - ధరణి వెబ్సైట్ ద్వారా భూముల మ్యుటేషన్ అవకాశం కూడా కల్పించారు. అయితే ఒక భూమిపై ఎక్కువ కొనుగోలు లావాదేవీలు జరిగినప్పుడు కేవలం మొదట రిజిస్ట్రేషన్ జరిగిన కొనుగోలు లావాదేవీలో ఉన్న వ్యక్తి పేరు మాత్రమే కనిపిస్తోంది. ఆ తర్వాత లావాదేవీల వివరాలు కనిపించడం లేదు. - ధరణి పోర్టల్ నెట్వర్క్, సర్వర్ కూడా చాలా తక్కువ వేగంతో పనిచేస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లోని ఇంటర్నెట్ కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో సకాలంలో డేటా ఎంట్రీ కావడం లేదు. - డిజిటల్ సంతకం చేసే ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోంది. సాంకేతిక కారణాల వల్ల డిజిటల్ సంతకం చేసే క్రమంలో అనేక తప్పులు వస్తున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ రైతుల ఖాతా నంబర్లను నమోదు చేసిన క్రమంలో ఏదైనా తప్పులు వస్తే వాటిని సరిచేసే అవకాశం సీనియర్ అసిస్టెంట్లు, నాయిబ్ తహసీల్దార్లకు ఇవ్వాలని రెవెన్యూ సిబ్బంది కోరుతున్నారు. - మిగిలిన సర్వే నంబర్లు నమోదు చేసే అవకాశం ధరణి పోర్టల్‌లో కల్పించారు. అయితే ఒక సర్వే నంబర్లో మిగిలి పోయిన సబ్ సర్వే నంబర్లను నమోదు చేసేందుకు ప్రాథమిక సర్వే నంబర్ కనిపించడం లేదు. - డిజిటల్ సంతకం చేసేందుకు ఒక ఖాతాలోని అన్ని సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. అదే ఖాతాలోని ఇంటి స్థలాలు, వివాదాస్పద భూములు, అమ్ముకున్న భూముల వివరాలు కూడా కనిపిస్తున్నాయి. -
ఎవరడ్డుకుంటారో చూస్తా!
ద్వారకాతిరుమల: ప్రభుత్వ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న మహిళా తహసీల్దారు ముందు ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు. తవ్వకాలను ఎవరడ్డుకుంటారో చూస్తా.. పనులు కానివ్వండంటూ రెవెన్యూ అధికారుల ముందే అతడు హడావిడి చేశాడు. ఇంత ధీమాగా అతడు హల్చల్ చేయడానికి కారణం అతను వెనకున్న టీడీపీ నేతలేనని తెలుసుకున్న తహసీల్దారు చివరకు వెనక్కి తగ్గారు. వివరాలు ఇవి.. ద్వారకాతిరుమల మండలం రాళ్లకుంట గ్రామంలోని సర్వే నంబర్ 91/1ఎ లోని 19 సెంట్ల బండిదారిలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మండల యూత్ అధ్యక్షుడు గుర్రాల లక్ష్మణ్ తహసీల్దారు టీడీఎల్ సుజాతకు బుధవారం ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తవ్వకం పనులను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. జేసీబీ, ట్రాక్టర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో రాళ్లకుంటకు చెందిన చుక్కా నాని అక్కడికి చేరుకుని పనులు తానే చేయిస్తున్నానంటూ తహసీల్దారుకు చెప్పాడు. అంతటితో ఆగకుండా ఫిర్యాదు చేసింది ఎవరంటూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడటం ప్రారంభించాడు. దీంతో నానికి, ఫిర్యాదుదారుడైన లక్ష్మణ్‌కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో అక్కడికి కొందరు టీడీపీ నాయకులు చేరుకున్నారు. దీంతో నాని తహసీల్దారును సైతం లెక్కచేయకుండా పనులను ఎవరు అడ్డగిస్తారో రండి చూస్తానంటూ సవాల్ విసిరాడు. కలెక్టరొచ్చినా భయపడేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. అప్పటికే నియోజకవర్గ ముఖ్య నేత నుంచి తహసీల్దారుకు ఫోన్ రావడంతో ఆమె చేసేది లేక వెనక్కి తగ్గారు. మొక్కుబడి జరిమానాలతో సరి రాళ్లకుంటలో నిర్మిస్తున్న వేబ్రిడ్జికి, ఓ రియల్ ఎస్టేట్ భూమి మెరకకు ఈ మట్టిని తోలుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఒక జేసీబీతోపాటు 9 ట్రాక్టర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. టీడీపీ నేతల ఒత్తిడి కారణంగా తహసీల్దారు జేసీబీతో పాటు, ఒక ట్రాక్టరును మాత్రమే లెక్కలో చూపారు. అక్రమంగా మట్టి తవ్వినందుకు జేసీబీకి రూ.10 వేలు, ఒక ట్రాక్టరుకు రూ.5 వేలు జరిమానా విధిస్తున్నట్టు తహసీల్దారు సుజాత విలేకర్లకు తెలిపారు. -
కలెక్టరమ్మ మాటతీరు మార్చుకో..
సాక్షి, వనపర్తి/వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతుబంధు పథకం, భూరికార్డుల ప్రక్షాళన విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులపై కలెక్టర్ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. దీంతో జిల్లా రెవెన్యూ ఉద్యోగులు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాలు మూసివేసి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో వనపర్తి కలెక్టర్ నోటి దురుసు, సస్పెన్షలపై ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చిన ప్రజలు అధికారులు లేకపోవటంతో వెనుదిరిగారు. సస్పెన్షన్‌పై రచ్చ కలెక్టర్ శ్వేతామహంతి బుధవారం రాత్రి శ్రీరంగాపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, వీఆర్ఓ వెంకటరమణలపై రైతుబంధు పథకంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించక పోవడం, చెక్కుల కంటే పాస్‌పుస్తకాలు తక్కువగా పంపిణీ చేయటం ఏంటని ఆగ్రహించారు. అలాగే ఆదివారం ప్రత్యేక పనిదినం విధులు నిర్వహించలేదని వీఆర్ఓ వెంకటరమణపై ఒకేసారి ఒకే మండలంలో ముగ్గురు రెవెన్యూ అధికారులపై చర్యలకు ఆదేశించారు. అలాగే ఐదు రోజుల క్రితం ఆత్మకూరు జూరాల వీఆర్ఓ, గోపాల్పేట మండలం బుద్దారం వీఆర్ఓలను కూడా వేటు వేసినట్టు సమాచారం. ఆ సందర్భంగా కలెక్టర్ అధికారులను దుర్భాషలాడినట్లు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి కలెక్టర్‌పై విమర్శలు వస్తున్నాయి. పనిలో వెవకబడిన వారిపై కఠినంగా వ్యవహరించడంతో కొందరు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. గతంలో విద్యాశాఖలో ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది. అప్పట్లో ఉపాధ్యాయులంతా ఏకతాటిపైకి వచ్చి ఆందోళనకు దిగటంతో కలెక్టర్ వెనక్కి తగ్గారు. ఒక్కటైన రెవెన్యూ ఉద్యోగులు కలెక్టర్ తీరు బాగాలేదంటూ జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరు ఏకమై నిరసన బాట పట్టారు. జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమైనప్పటినుంచి రెవెన్యూ ఉద్యోగులు నిర్విరామంగా పని చేస్తున్నారు. సెలవులు తీసుకునే అవకాశం కూడా లేకపోవటంతో పనివత్తిడికి గురయ్యారు. అయినప్పటికీ ఇతర జిల్లాలతో పాటుగా ప్రోగ్రెస్ సాధించామని వారి వాదన. ఆరునెలలుగా పది మందికిపైగా రెవెన్యూ సిబ్బందిపై వేటు పడిందని, ఎప్పుడు ఎవరు కలెక్టర్ ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందోనన్న భయంతో పని చేయాల్సి వస్తుందని అంటున్నారు. కలెక్టర్ నోటి దురుసు, అన్యాయంగా సస్పెన్షన్లపై నిరసన చేస్తున్నట్లు బ్యానర్ తయారు చేయించి ధర్నాకు దిగారు. నిరసనలో భాగంగా తహసీల్దార్ శ్రీనివాస్‌రావు కంటతడి పెట్టారు. ఎన్నో ఏళ్లుగా రాత పూర్వకంగా ఉన్న రికార్డులను కంప్యూటరీకరణ చేస్తుండటంతో అవగాహన లేక తప్పులు దొర్లాయని, వాటికి రెవెన్యూ సిబ్బందిని బాధ్యులుగా చేయడం సరైంది కాదని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖండించారు. కలెక్టర్ తీరు మార్చుకోవాలని, సస్పెన్షన్‌కు గురైన వారిని విధుల్లో చేర్చుకోవాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇదిలాఉండగా ఒకేసారి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులు మానేసి నిరసన చేపట్టడంతో ఈ విషయం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. వెలవెలబోయిన కార్యాలయాలు రెవెన్యూ ఉద్యోగుల మూకుమ్మడి నిరసనతో జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాలు అధికారులు లేక వెలవెలబోయాయి. దీంతో వివిధ పనుల కోసం గ్రామీణ ప్రాంతాల వచ్చిన రైతులు, విద్యార్థులు అధికారులు లేక అసౌకర్యానికి గురయ్యారు. -
డబ్బుంటే సుబ్బారావు.. లేకుంటే సుబ్బిగాడు!
ఒంగోలు అర్బన్: నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెవెన్యూ విభాగం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నగర పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలకు పన్నులు విధిచండం.. పన్నుల్లో మార్పులు, అనధికారిక భవనాలకు విధించే పన్నులు.. తదితర పనుల్లో రెవెన్యూ విభాగం ఆర్ఐలు, రెవెన్యూ విభాగం బాధ్యతలు చూస్తున్న అసిస్టెంట్ కమిషనర్, ఇతర సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైసలివ్వందే ఫైలు కదిలే పరిస్థితి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత ఆదాయాలే లక్ష్యంగా రెవెన్యూ విభాగం సిబ్బంది నగరపాలక ఖజానాకు గండి కొడుతున్నారు. గజిట్ ప్రకారం కేటాయించిన జోన్ల్లో ఇష్టానుసారంగా బహుళ అంతస్థులకు కొలతల్లో అవకతవకలు చేసి భారీగా తగ్గించి పన్నులు విధిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కుళాయి కనెక్షన్లు, కరెంటు కనెక్షన్ల కోసం క్రయ విక్రయాలు జరిపిన డీకే పట్టాలకు ఎటువంటి ఆస్తి హక్కు కల్పించకుండా మౌలిక వసతుల కోసం విధించాల్సిన సూపర్స్ట్రెక్చర్ (ఎస్ఎస్) ట్యాక్సుల సైతం నిలిచిపోతున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ చాంబర్లో వందల కొద్ది దస్త్రాలు పేరుకుపోతున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ పనితీరుపై కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. భవన అనుమతులు పొందిన భనాలకు సంబంధించి నిర్మించిన ఎక్స్ట్రా ఫ్లోర్లకు సైతం పన్నులు విధించకుండా పక్కన పెడుతున్నారు. ప్లాన్ లేకుండా నిర్మించిన భవనాలైనా, అనుమతులు మీరి నిర్మించిన భవనాలకైనా నూరుశాతం పన్ను అదనంగా విధించాలి. అయితే మామూళ్లకు అలవాటుపడిన రెవెన్యూ విభాగం పన్నుల విధింపులో తమ చేతివాటం చూపుతూ నగరపాలక ఖజానాకు నష్టం తెస్తున్నారు. రెవెన్యూ విభాగం సిబ్బంది అధికార పార్టీ వారికి, డబ్బు ఉన్న వాళ్లకు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు మరో న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో ఎన్నో బహుళ అంతస్థుల భవనాలు, వ్యాపార సముదాయాలకు రూ.లక్షల్లో మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. పెద్ద పెద్ద భవనాలకు పన్ను విధించేటప్పుడు పరిశీలించాల్సిన ఓఎంసీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖజానాకు గండిపడుతున్నా ఓఎంసీ కమిషనర్, ప్రత్యేక అధికారులు కఠిన చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. ఆర్ఐలు విధించిన పన్నులపై పూర్తి పరిశీలన చేస్తే అక్రమ పన్నులు బట్టబయలు అవుతాయని నగరవాసులు అభిప్రాయ పడుతున్నారు. టీడీపీ నేతల అండదండలతోనే.. అధికార పార్టీ నాయకులు నగరంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు, అవినీతి పన్నులు, అక్రమార్కులకు అండగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా అక్రమాలకు అండగా ఉంటూ అధికారులతో సంప్రదింపులు చేస్తూ తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అనధికారిక కట్టడాలు, అక్రమ పన్నులు, భవన నిర్మాణ అనుమతులు, సివిల్ పనుల టెండర్లు ఇలా ప్రతి పనిలో అధికార పార్టీ చోటామోటా నాయకుల హవా కొనసాగడం గమనార్హం. ఇప్పటికైనా సామాన్య ప్రజలకు ఒక న్యాయం, డబ్బు, హోదా, అండదండలు ఉన్న పర్గాలకు మరో న్యాయం పాటించకుండా సమన్యాయం పాటించి నగరపాలక సంస్థకు నష్టం జరగకుండా సకాలంలో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. పన్నుల విధింపులు, వసూలు సక్రమంగా జరిగితే వచ్చే ఆదాయంతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
‘రిజిస్ట్రేషన్’ బాధ్యతలకు మేం సిద్ధమే
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాల నిర్వహణకు రెవెన్యూ వర్గాలు అంగీకరించా యి. ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల భర్తీ తదితర డిమాండ్ల విషయంలో ప్రభుత్వం హామీ ఇచ్చినందునే ఇందుకు అంగీకరిస్తున్నట్టు టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, అధ్యక్షుడు కె.గౌతం కుమార్ తెలిపారు. ఆదివారం టీజీటీఏ కార్యవర్గ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా వ్యవస్థలో పారదర్శకత వస్తుందని, ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు దగ్గరవుతాయన్నా రు. ప్రభుత్వం తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు. ఈ భేటీలో టీజీటీఏ కోశాధికారి రాములు, ఉపాధ్యక్షులు ముంతాజ్, విష్ణుసాగర్ పాల్గొన్నారు. -
రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్?
సాక్షి, హైదరాబాద్ : నాలుగు నెలలుగా భూ రికార్డుల ప్రక్షాళన కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్‌గా ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉన్నతస్థాయి వర్గాల్లో కసరత్తు జరుగుతోంది. ఎప్పుడో నిజాం నవాబు నాటి రికార్డులను ఎంతో శ్రమకోర్చి ప్రక్షాళన చేసిన క్షేత్రస్థాయి వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి సీసీఎల్ఏ సిబ్బంది వరకు ఈ ప్రోత్సాహకాన్ని ఇస్తారని, ఏప్రిల్ నెల జీతంతోపాటు బోనస్ వస్తుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఏం చేద్దాం.. ఎలా చేద్దాం వాస్తవానికి భూ రికార్డుల ప్రక్షాళనలో పాల్గొన్న రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ గత నెలలోనే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. మరోవైపు ఈ ప్రోత్సాహకం విషయంలో ఏం చేద్దామన్న దానిపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఏ) ప్రతిపాదిస్తున్న విధంగా సిబ్బంది మొత్తానికి నెల జీతం బోనస్‌గా ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.18 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడనుందని రెవెన్యూ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. అయితే రెవెన్యూ శాఖలో పని చేస్తున్న మొత్తం 40 వేల మంది సిబ్బందికీ బోనస్ ఇవ్వాలా లేదా భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న వీఆర్ఏలు, వీఆర్వోలు, తహసీల్దార్లు, ఇతర కార్యాలయ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆర్డీవో కార్యాలయాల నుంచి కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల సిబ్బంది వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందున అందరికీ బోనస్ వర్తింపజేయాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనస్ ఎవరికి ఇస్తారన్నది త్వరగా తేల్చి వీలుంటే మార్చి లేదా ఏప్రిల్ నెల జీతంలో బోనస్ జమ చేస్తారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
టీఆర్ఎస్లో వసూల్ రాజాలు
రంగారెడ్డి/అత్తాపూర్: పార్టీ పేరు చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్న కొందరు వసూల్ రా జాల విషయంలో టీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గా వ్యవహరిస్తుంది. అధికారం అడ్డం పెట్టుకుని అడ్డదారిన సంపాదిస్తున్న వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వారిని పార్టీ నుంచి స స్పెండ్ చేయడంతోపాటు చట్టపరంగా శిక్షించడానికి వెనుకాడటం లేదు. తాజాగా జరుగుతున్న సంఘటనలే దీనికి ఉదాహరణ.... ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారికి అండగా ఉండి రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేస్తానని డబ్బులు వసూలు చేసి సస్పెండ్‌కు గురైన అత్తాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుర్రంపల్లి యాదగిరిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి... గుర్రంపల్లి యాదగిరి గత కొన్ని రోజులుగా అత్తాపూర్ డివిజన్లో నిర్మాణంలో ఉన్న భవనాల వద్దకు వెళ్లి అనుమతులు లేవని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇదేక్రమంలో వారం రోజుల క్రితం అత్తాపూర్ భరత్‌నగర్ కాలనీలో ఉన్న ఓ ప్రభుత్వ స్థలంలో కబ్జాదారుల నుంచి రూ. 25వేలు తీసుకున్నాడు. ఇందు కోసం రెవెన్యూ సిబ్బంది రాకుండా చూస్తానని నమ్మబలికాడు. ఈ తతంగమంతా సామాజిక మాధ్యమాలలో రావడంతో అతడిని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరుసటి రోజు రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయ ఆర్ఐ, వీఆర్వో గుర్రపల్లి యాదగిరిపై తమ పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేశాడని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు తన పేరును దేవాలయ శాఖ అధికారుల వద్ద వాడి బద్నాం చేశాడని అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరామ్‌రెడ్డి, డివిజన్‌కు చెందిన మరో ఇద్దరు తాము ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నాలుగు ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆధారాలతో సహా గుర్రంపల్లి యాదగిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. చేసిన నేరాలను అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మల్లికార్జున్ తెలిపారు. తాజాగా మరొకరు... గుర్రంపల్లి యాదగిరి కథనం మరువక ముందే అధికార పార్టీకి చెందిన మరో నేత వీడియోకి చిక్కినట్లు సమాచారం. దేవాదాయ శాఖకు చెందిన స్థలంలో నిర్మాణం చేపడుతున్న ఓ వ్యక్తి నుంచి రూ. 40 వేలకు పైగా డబ్బులు తీసుకున్నాడని అతడి వెన్నంటే ఉండే అనుచరుడు మ రో రూ. 10 వేలు తీసుకున్నట్లు బాధితుడు వెల్లడించాడు. ఈ వీడియో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేకు కూడా చేరినట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో ఆ నాయకుడిపై కూడా చర్యలు తీసుకునేందుకు అధినాయకత్వం సిద్ధమవుతుంది. అతడే మరో రెండు చోట్ల కూడా డబ్బులు తీసుకున్నట్లు తెలిసిందని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. రేపో మాపో అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వస్తుందని నాయకులు పేర్కొంటున్నారు. -
రికార్డుల సవరణ.. రయ్.. రయ్..
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రికార్డుల సవరణ శరవేగంగా జరుగుతోంది. రికార్డులను పరిశీలించిన తర్వాత రైతుల వద్ద ఉన్న వివరాలకు, రికార్డులకు మధ్య ఉన్న తేడాలను రెవెన్యూ యంత్రాంగం సరి చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రక్షాళనలో రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాల విస్తీర్ణంలోని భూముల రికార్డులను పరిశీలించారు. అందులో 45 లక్షలకు పైగా ఎకరాల భూమి సరి చేయాల్సిందిగా తేలింది. ఈ సరి చేయాల్సిన భూమిలో ఇప్పటివరకు 23 లక్షల ఎకరాల రికార్డులను సరి చేసినట్టు భూ ప్రక్షాళన గణాంకాలు చెపుతున్నాయి. ఆ ప్రకారం నమోదైన మొత్తం తప్పుల్లో 55 శాతం వరకు రికార్డులను సరి చేశారు. మరోవైపు రెవెన్యూ రికార్డులను సరి చేసేందుకు క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది సొమ్ములు అడుగుతున్నారని, చిన్న తప్పులను కూడా కాసులు లేనిదే సరిచేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటం గమనార్హం. చాలా వరకు చిన్న సవరణలే.. వాస్తవానికి రికార్డుల సవరణకు అవసరమైన విషయాలను పరిశీలిస్తే చాలా వరకు చిన్న చిన్న పొరపాట్లే ఉన్నాయని భూ రికార్డుల ప్రక్షాళనలో అర్థమవుతోంది. ఎక్కువగా సర్వే నంబర్లలో తప్పులు, పట్టాదార్ల పేర్లలో క్లరికల్ తప్పులు, పౌతి చేయాల్సినవి, ఆన్లైన్ రికార్డుల్లో ఎక్కించాల్సినవి, మ్యుటేషన్ అప్డేట్ చేయాల్సినవి, పాస్ బుక్కుల వివరాలు ఆన్లైన్లో ఎక్కించాల్సినవి.. ఇలా అన్నీ ఉన్నపళంగా సరి చేసేందుకు వీలైన తప్పులే 90 శాతానికి పైగా నమోదవుతున్నాయి. ఇక కోర్టు కేసులు, అటవీ భూములు, అసైన్డ్ భూముల్లో నమోదవుతున్న పొరపాట్లను ఇప్పటికిప్పుడు సరిచేసే అవకాశం లేదు. దీనికితోడు దాదాపు 3 లక్షల సర్వే నంబర్లలో భూమి ఎక్కువగా ఉంటే రికార్డుల్లో తక్కువగా ఉండటం, రికార్డుల్లో ఎక్కువగా ఉండి భూమి తక్కువ ఉండటం వంటి కేసులు నమోదయ్యాయి. ఈ రికార్డులను కూడా సర్వే చేయకుండా నివృత్తి చేయలేని పరిస్థితి. ఇలాంటివన్నీ కలసి 10 శాతం వరకు ఉంటున్నాయి. కోర్టు కేసులైతే ఇప్పటివరకు 24 వేల సర్వే నంబర్లలోని భూముల్లోనే వచ్చాయి. అసైన్డ్, ఫారెస్టు అన్నీ కలిపినా 85 వేల సర్వే నంబర్లకు మించలేదు. రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యే సరికి కూడా ఈ గణాంకాల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదు. దీంతో చిన్న తప్పులను సరిచేసేందుకు పెద్దగా సమయం తీసుకోవడం లేదని, రైతుల అంగీకారంతో రికార్డులను సవరించి 1బీ ఫారాలు ఇచ్చి సంతకాలు తీసుకుంటున్నామని, వాటిని గ్రామసభల్లో అంటిస్తున్నామని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. 31 నాటికి కష్టమే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో తప్పుల సవరణ శరవేగంగా జరుగుతున్నప్ప టికీ డిసెంబర్ 31 నాటికి ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రికార్డుల సవరణ లో భాగంగా రోజుకు 40 వేల వరకు సర్వే నంబర్లను సరి చేస్తున్నామని, అలా చేసినా మరో 10 లక్షలకు మించి పూర్తయ్యే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. ఇంకా వేగంగా చేయడం వల్ల పొరపాట్లు జరిగే అవకాశముం దని, దీనికితోడు ఈ రికార్డులను ఆన్లైన్ చేసేందుకు ఇంకా సమయం తీసుకుంటుంద ని వారంటున్నారు. ప్రక్రియ సజావుగా సాగాలంటే కనీసం మరో నెలరోజులైనా గడువును పొడిగించాలని కోరుతున్నారు. ‘ఆమ్యామ్యాలు’ ఇవ్వాల్సిందే..! రికార్డుల ప్రక్షాళనలో క్షేత్రస్థాయిలో ‘ఆమ్యామ్యాలు’ నడుస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లోని తప్పులను సరి చేసేందుకు ఎకరాల లెక్కన రైతుల నుంచి రెవెన్యూ సిబ్బంది వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎకరానికి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు డిమాండ్‌ను బట్టి వసూలు చేసి తప్పులు సరి చేస్తున్నారని, ఇదేమంటే తాము పై అధికారులకు ఇచ్చుకోవాలని వీఆర్వోలు చెబుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జగిత్యాల జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో రెవెన్యూ అధికారులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. అయితే అందరు సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయకపోయినా, రైతు అవసరాన్ని బట్టి గట్టిగానే వసూలు చేస్తున్నారనే ఆరోపణలు మాత్రం క్షేత్రస్థాయిలో వెల్లువెత్తుతుండటం గమనార్హం. -
భయపెట్టిన భూకంపం
యూనివర్సిటీ క్యాంపస్/యాదమరి: జిల్లాలోని తమిళనాడు సరిహద్దు మండలాల్లో శనివారం అర్ధరాత్రి భూకంపం కలకలం సృష్టించింది. యాదమరి మండలంలోని తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో పలుమార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రెవెన్యూ సిబ్బంది ఆయా గ్రామాలను సందర్శించి సమాచారం సేకరించారు. ఈ వివరాలను హైదరాబాద్‌లోని నేషనల్ జియోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్కు సమాచారం అందించారు. చిత్తూరుకు 30 కిమీ దూరంలో అర్ధరాత్రి 01.02 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని, వీటి తీవ్రత 2.6గా నమోదైనట్లు వారు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, చిత్తూరు జిల్లా ప్రమాదకర జోన్లో లేదని సేఫ్ జోన్లోనే ఉందని అన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎస్వీయూకు చెందిన ప్రొఫెసర్లు తెలిపారు. మళ్లీ ప్రకంపనలు.. యాదమరి మండలం తాళ్లమడుగులో ఆదివారం రాత్రి 7–8గంటల మధ్య నాలుగు పర్యాయాలు కంపించింది. భూమి కదలడం, పెద్ద శబ్దాలు రావడంతో గ్రామస్తులు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. -
ఇసుక లెక్కలు సరే..
♦ నిబంధనల అమలు ఎక్కడ? .. ♦ కఠిన శిక్షలు ఏమయ్యాయి? ♦ ‘సాక్షి’ కథనంతో అధికారుల్లో చలనం వచ్చినా.. తాడేపల్లిరూరల్ : ‘పర్యవేక్షకులే ఇసుకాసురులు’ శీర్షికన ఈనెల 20న ప్రచురించిన ‘సాక్షి’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఇసుక రీచ్‌లలో గురువారం నుంచి రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేసి వచ్చి వెళ్లే వాహనాల లోడింగ్ వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఎవరికి తోలుతున్నారనే విషయాలను కూడా సేకరిస్తూ లారీ నంబర్‌తో కలిపి ఆధార్ కార్డ్‌ను లింక్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఉచిత ఇసుక పాలసీలో నిబంధనలను మాత్రం గాలికొదిలేశారు. ఎవరైనా తప్పు చేస్తే కఠిన శిక్షలు తప్పవని వివిధ శాఖలకు చెందిన అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. నిబంధనల ప్రకారం రీచ్‌ల నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించకూడదు. కానీ గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ లాంటి మహానగరాలకే ఇసుక తరలిపోతోంది. అంతేగాక నిబంధనల ప్రకారం ట్రాక్టర్లకు, చిన్న చిన్న ఆరు టైర్ల టిప్పర్లకే లోడ్ చేయాల్సి ఉండగా, రాజధాని ప్రాంతంలో 10 టైర్లు, 12 టైర్లు, 14 టైర్ల వాహనాలకు కూడా లోడ్ చేసి, ఇతర రాష్ట్రాలకు దర్జాగా ఇసుకను తరలిస్తున్నారు. ఇదిమాత్రం అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టగానే రీచ్‌ల సమీపంలోనూ, ప్రధాన రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఈ చెక్ పోస్టులు కనిపించకపోవడం గమనార్హం. ఏదో తూతూమంత్రంగా రెవెన్యూ శాఖ అధికారులతో లెక్కలు తీసినంతమాత్రాన దోపిడీ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. రెవెన్యూ అధికారులు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లెక్కలు వేస్తున్నారే తప్ప రాత్రి సమయంలో తరలిపోయే లక్షల టన్నుల ఇసుక లెక్కలు ఎలా తీస్తారో స్పష్టత లేదు. -
అధికారులను అడ్డుకున్న పాము
తవ్వకాల్లో బయటపడిన పురాతన విగ్రహాలను తరలిస్తున్న అధికారులకు అనుకోని అవాంతరం ఎదురైంది. పురాతన విగ్రహాలను తీసుకెళ్తున్న రెవెన్యూ సిబ్బందిని పాము వెంబడించడంతో.. అధికారులు ఆ విగ్రహాలను అక్కడే వదిలి పరుగులు తీశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన భూస్వామి రాజా తన పొలాన్ని బుల్డోజర్ల సాయంతో చదును చేయిస్తున్న క్రమంలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకొని విగ్రహాలను పరిశీలించారు. పురాతన శివలింగం, వీరభద్రుడి విగ్రహంతో పాటు ఆనవాళ్లు కోల్పోయిన మరో విగ్రహం తవ్వకాల్లో బయటపడింది. దీంతో తహశీల్దార్ కనకదుర్గ వాటిని స్వాధీనం చేసుకొని పురావస్తు శాఖ కార్యాలయానికి పంపించేందుకు తీసుకెళ్తుండగా.. ఓ పాము ఆమెను వెంబడించింది. రెవెన్యూ సిబ్బంది అందరు ఆమె వెంట ఉన్నా.. పాము మాత్రం కేవలం విగ్రహాలు పట్టుకున్న ఎమ్మార్వోనే వెంబడించింది. దీంతో భయాందోళనలకు గురైన రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం కార్యాలయానికి వెళ్లిన సిబ్బందికి కూడా విచిత్ర అనుభవాలు ఎదురవుతుండటంతో పాటు ఆందోళన పెరిగిపోవడంతో.. ఉన్నతాధికారుల ఆదేశాలతో విగ్రహాలను గురువారం తిరిగి యధాస్థానానికి చేర్చారు. ఈ విషయం సమీప గ్రామాలకు పాకడంతో విగ్రహాలను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. -
అధికారుల కనుసన్నల్లోనే!
♦ రాయకూర్ కెనాల్ వద్ద ఇసుక డంప్‌లు ♦ ప్రభుత్వ అనుమతుల పేరుతో పక్కదారి.. ♦ ఒక్కో ఇసుక ట్రాక్టర్‌కు రూ. 2,300 ♦ అత్యవసరం అయితే రూ. 2,500 ♦ చోద్యం చూస్తున్న రెవెన్యూ సిబ్బంది కోటగిరి : ఇసుక అనుమతుల విషయంలో సామాన్యులకు చుక్కలు చూపే అధికారులు.. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అవుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కళ్లముందే సాక్ష్యాలున్నా.. చర్యలకు ముందుకు రావడం లేదు. సులేమాన్‌ఫారం సమీపంలోని నిజాంసాగర్ కెనాల్ కట్ట వద్ద కొందరు ఇసుక వ్యాపారులు ఇసుకను డంప్ చేస్తున్నారు. దీనిని రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుకతో పాటు ఇటుక బట్టీల నుంచి తరలించిన ఇటుకలనూ ఇక్కడ డంప్ చేసి తర్వాత తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ పనులకుగాను మండలంలోని పోతంగల్ లేదా కొడిచర్ల మంజీర నది నుంచి ఇసుక రవాణాకు రెవెన్యూ అధికారులు వారంలో ఓ రోజు అనుమతి ఇస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఇసుక వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారికి కొన్ని ప్రాంతాల్లో వీఆర్వోలు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ అనుమతుల పేరుతో కొందరు వేబిల్లులు పొంది ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతితో లబ్ధిదారుడు మంజీర నదినుంచి ఒక ట్రాక్టర్ ఇసుకను తరలించాలంటే సుమారు వెయ్యి రూపాయలు ఖర్చవుతాయి. అదే ఒక ఇసుక ట్రాక్టర్‌ను ఇసుక వ్యాపారి రూ. 1,900 నుంచి 2,300 వరకు విక్రయిస్తున్నారు. వినియోగదారుల అవసరాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుకకు రూ. 2,500 లు కూడా వసూలు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి రెవెన్యూ అధికారుల అనుమతి లభించడం కష్టమైనవారు వ్యాపారులనుంచి ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ స్థలాల్లో ఇసుక డంప్‌లు కానీ ఇటుక డంప్‌లు కానీ ఏర్పాటు చేయడం నేరం. అలా ఎవరైనా చేస్తే చర్యలు తీసుకుంటాం. అనుమతులు తీసుకోకుండా ఇసుక రవాణా చేస్తే క్రిమినల్ కేసులు పెడుతాం. ఎవరినీ ఉపేక్షించం. ఇసుక వ్యాపారులకు వీఆర్వోలు సహకరిస్తే వారిపైనా చర్యలు తీసుకుంటాం. - రాజేశ్వర్, తహసీల్దార్ -
‘రియల్’దందా..!
జిల్లా కేంద్రం శ్రీకాకుళమైనా, మండల కేంద్రం పాతపట్నమైనా... మరే పట్టణంలోనైనా.. మూడు సెంట్లు స్థలం దొరికితే సొంత ఇల్లు కట్టుకోవాలని భావించేవారే ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ కూడబెట్టుకున్న సొమ్ముతో సొంత జిల్లాలో ప్లాట్ కొనుక్కోవాలని ఆశ పడేవారు ఎక్కువ మంది ఉంటున్నారు. ఈ పరిస్థితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారగా...కొంతమంది అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వారితో కుమ్మక్కయ్యే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకూ ముడుపులు బాగానే ముడుతున్నాయి. ఫలితంగా విలువైన ప్రభుత్వ భూములన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. అందమైన బ్రోచర్లు చూసి, బ్రోకర్ల మాటలు విని వాటిని కొనుక్కున్నవారంతా నిలువునా మోసపోతున్నారు. ఇలాంటి వ్యవహారానికి పాతపట్నంలో వెలుగు చూసిన వ్యవహారం ప్రత్యక్ష నిదర్శనం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం పరిసరాల్లో సుమారు 30 వరకూ రియల్ ఎస్టేట్ సంస్థలు వెలిశారుు. ఈ సంస్థలు వేసిన లేఅవుట్లలో ప్రభుత్వ భూములున్నాయి. ఇలా దాదాపు 27 ఎకరాల భూమి ఇటీవల కాలంలో కబ్జా అయిపోయింది. ఈ అక్రమాలను సక్రమంగా చేసుకోవడానికి రియల్ వ్యాపారులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలుపుతున్నారు. వారు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను నయానో, భయానో లొంగదీసుకొని వ్యవహారం చక్కబెడుతున్నారు. ఇలా సుమారు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి లేఅవుట్ల కింద మారిపోయింది. ఇందులో చాలావరకూ గిరిజనులు సాగు చేసుకుంటున్న డీ పట్టా భూములు ఉన్నాయి. వాటిని విక్రయించే హక్కులేకున్నప్పటికీ రియల్ వ్యాపారులు అధికార పార్టీ నాయకుల అండతో లాక్కొంటున్నారు. వాటిని పక్క సర్వే నంబర్ల ఆధారంగా వారసత్వ భూములుగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేస్తున్నారు. పోరంబోకు భూమికి ఎసరు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన పాతపట్నం పరిసర గ్రామాలకు చెందినవారు, అలాగే పరిసర గిరిజన గ్రామాల్లో ఉద్యోగాలు చేస్తూ పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యం తదితర అవసరాల కోసం పాతపట్నంలో నివాసం ఉంటున్నవారు రియల్ ఎస్టేట్లలో ప్లాట్ల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ డిమాండుకు తగ్గట్లుగా కొందరు అధికార పార్టీ నాయకులు, ముఖ్యనేతల అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారం ఎత్తారు. పాతపట్నం పరిసరాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న డీ పట్టా, ప్రభుత్వ భూములపై కన్నేశారు. వాటి పక్కనే జిరాయితీ భూములు కొనుగోలు చేసి, ఆ ముసుగులో ప్రభుత్వ భూములను కలిపేసుకున్నారు. ఉదాహరణకు ప్రహరాజుపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 32లో కొంతమంది రైతులకు జిరాయితీ భూమి ఉంది. దాన్ని కొనుగోలు చేసిన ఓ రియల్ఎస్టేట్ సంస్థ ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమికి సర్వే నంబరు 32/1/ఎగా సబ్‌డివిజన్ చేసి 1.83 ఎకరాలను కాజేశారు. దీన్ని వారసత్వ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయమై కొంతమంది గ్రామస్థులు ఎన్కంబరేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయగా... అసలు ఆ సర్వే నంబరు, సబ్‌డివిజన్ లేదని అధికారులు ధ్రువీకరించారు. అధికారులు గుర్తించినవి కొన్నే కోదూరు పంచాయతీ ప్రహరాజపాలెం రెవెన్యూ పరిధి సర్వే నంబరు 30లో 1.53 సెంట్లు, సర్వే నంబరు 31లో పోరంబోకు గయ్యాలు 60 సెంట్లు, సర్వే నంబరు 33లోని జగ్గయ్య కోనేరు 2.56 ఎకరాలు, అలాగే రంకిణి పంచాయతీ చిన్నపద్మాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 3లో 55 సెంట్లు ఆక్రమణలో ఉందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇందంతా కలిపి ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిలో ఐదో వంతు కూడా లేదు. సర్వే నంబరు 31లో 1.50 ఎకరాలు, 32లో 2.56 ఎకరాలు, 35లో 3.89 ఎకరాలు, 35/2లో 21 సెంట్లు, 35/3లో 24 సెంట్లు, 35/4లో 87 సెంట్లు, 35/5లో 1.04 ఎకరాలు, 36లో 6.78 ఎకరాలు, 36/1లో 5.18 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. ఆ భూములన్నీ రియల్ ఎస్టేట్ లేఅవుట్‌ల్లో కలిసిపోయాయి. సుమారు 22 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమి విలువ రూ.10 కోట్లు పైమాటే. ‘కమీషన్’ కక్కుర్తి డీ పట్టా ఆధారంగా ప్రభుత్వ భూములను గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. వారిని బుట్టలో వేసి భూమిని అప్పగించిన బ్రోకర్లకు ఎకరాకు రూ.లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకూ కమీషన్‌ను రియల్ వ్యాపారులు ముట్టజెప్పుతున్నారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుండటంతో కొంతమంది బ్రోకర్లు రియల్ వ్యాపారులుగా మారిపోయారంటే పరిస్థితి ఊహించవచ్చు. పాతపట్నం పరిసరాల్లో వెలిసిన చాలా లేఅవుట్లకు పంచాయతీ అఫ్రూవల్స్ లేవు. ప్లానులు, అనుమతులూ లేవు. భూమార్పిడి రుసుం చెల్లించిన దాఖలాలు లేవు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారుు. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం కోదూరు పంచాయతీ ప్రహరాజపాలెం రెవెన్యూ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి వేసిన వెంచర్లను గుర్తించాం. ఆయా లేఅవుట్‌ల్లో సర్వే చేయించాం. రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ స్థలాన్ని తొలగించాం. రియల్ ఎస్టేట్ సంస్థలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. -ఎన్.దాలినాయుడు, తహసీల్దారు, పాతపట్నం -
అవినీతికి పాల్పడితే కఠినచర్యలు
భూపాలపల్లి తహసీల్దార్ సత్యనారాయణ భూపాలపల్లి: సాదా బైనామాల భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని భూపాలపల్లి తహసీల్దార్ సత్యనారాయణ హెచ్చరించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సాదా బైనామాల రిజిస్ట్రేషన్లపై వీఆర్ఓలు, సర్పంచ్‌లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. లావాణి, పోడు భూములు, ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారికి ఈ పథకం వర్తించదన్నారు. 2014 జూన్ 2లోపు ఇతరుల నుంచి కొనుగోలు చేసిన భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని, అంతేకాక ఒక కుటుంబానికి ఐదెకరాల లోపు మాత్రమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. జూన్ 2 నుంచి 10వ తేదీ వర కు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ కళ్ళెపు రఘుపతిరావు, జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, ఆర్ఐ రహమాన్, పలు గ్రామాల సర్పంచ్‌లు, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
కంచే చేను మేస్తే..
►రెవెన్యూ సిబ్బంది చేతివాటం ►పేరు, సర్వే నంబర్లు లేకుండా పట్టాలు ►వీఆర్వోలు, వారి బంధువుల పేర్లతో భూముల మార్పు ►పట్టా భూములుగా మారుతున్న ప్రభుత్వ భూములు కలువాయి మండలం నూకనపల్లిలో సర్వే నంబర్ 239-1లో రెండు ఎకరాల భూమి మీరయ్య పేరుతో ఉంది. ఈ భూమిని స్థానిక వీఆర్వో తన తల్లిపేరుతో మార్పు చేశాడు.నెల్లూరు రూరల్ పరిధిలోని సౌత్మోపురు గ్రామంలో సర్వే నంబర్ 89-డీలో 2.74 ఎకరాల భూమి వెంకటసుబ్బారెడ్డి పేరుతో ఉంది. దీనిని వీఆర్వో తన పేరుతో మార్పు చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం జరిగాయి. కంచే చేను మేసిన చందాన రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. పేదల భూములు పరిరక్షించాల్సిన రెవెన్యూ సిబ్బంది రాబందుల్లా మారుతున్నారు. చేతివాటం ప్రదర్శించి నిరుపేదల భూములును ఆక్రమించి పేర్లు మార్పు చేస్తున్నారు. నెల్లూరు(పొగతోట) : అల్లూరుకు చెందిన సత్యనారాయణకు సర్వే నంబర్ 348-1లో ఎనిమిది ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి భూముల అనుభవం మరోకరి పేరుతో ఉందని రికార్డులో నమోదు చేశారు. పాసుపుస్తకాల కోసం సత్యనారాయణ అధికారుల చుట్టు తిరుగుతుంటే భూములు నీపేరుతో లేవని అధికారులు చెబుతున్నారు. చిల్లకూరు మండలంలో ఇదే పరిస్థితి. సమస్య ఏంటని మండల రెవెన్యూ అధికారిని ప్రశ్నిస్తే పక్క పోలం అతను ఫిర్యాదు చేశాడు. దీంతో పాసు పుస్తకాలు ఇవ్వడం కుదరదని చెప్పడం గమనర్హం. ఇలా రెవెన్యూలో జరుగుతున్న లీలలు అన్నీఇన్ని కావు. కొందరు అధికారులు రెవెన్యూ భూములను దర్జాగా పట్టా భూములుగా మార్చేస్తున్నారు. పేరు, సర్వే నంబర్లు లేకుండా నివాసస్థలాలు, భూముల కేటాయింపు పట్టాలు బయటకు వస్తున్నాయి. పట్టా వెనుక తహసీల్దార్ సంతకం, కార్యాలయం స్టాంప్ వేసి ఉంటున్నాయి. నాలుగేళ్ల క్రితం నెల్లూరు తహసీల్దార్‌గా పని చేసిన అధికారి నేటికి నివాసస్థల పట్టాలు ఇస్తున్నారు. ఒక్కొక్క పట్టా రూ.లక్ష - 2 లక్షల వరకు పలుకుతోంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారిపోయాయి. అధికారులు, సిబ్బంది కుమ్మకై భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. నష్టపోయిన బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరగడం వారి వంతైంది. ఆక్రమణల పర్వం.. జిల్లా పరిశ్రమల స్థాపనకు అనుకులమైన ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో భూముల విలువ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు అధికంగా జరుగుతున్నాయి. అధికారపార్టీని అడ్డుపెట్టుకొని కొందరు రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతూ భూములు ఆక్రమిస్తున్నారు. ఈ ప్రక్రియలో కోట్లాది రూపాయాలు చేతులు మారుతున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ సిబ్బందిపై అనేక ఫిర్యాదులు వస్తున్నా ఉన్నాతాధికారులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపులేకుండాపోతుంది. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడే రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. భూముల పేర్లు మార్పు విషయం పరిశీలిస్తాం. పేర్లు మార్పు చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు పరిరక్షించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. న్యాయం చేయండి : గ్రామంలోని సర్వే నంబర్ 239-1లో రెండు ఎకరాల భూమిని 1992లో నా భర్త మీరయ్యకు కేటాయించి పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి భూమి సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. రెవెన్యూ సిబ్బంది భూమిని అతని తల్లి పేరుతో మార్పు చేసుకున్నాడు. జిల్లా అధికారులు విచారించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. - ఖాసింబీ, నూకనపల్లి