=ఆధార్ కేంద్రాల్లో భారీగా వసూళ్లు
=ప్రయివేటు వ్యక్తుల నిర్వహణతో అవినీతి
=కొన్నిచోట్ల అనధికార కేంద్రాల ఏర్పాటు
=నగదు బదిలీపై అమలు కాని
=సుప్రీం ఆదేశాలు
సుప్రీం సూచనల్ని బేఖాతరు చేస్తున్నారు. నగదు బదిలీకి ఆధార్ తప్పనిసరంటున్నారు. కార్డుల్లేని వారు గగ్గోలు పెడుతున్నారు. ఇదే సాకుతో ఆధార కేంద్రాల సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులిస్తేనే నమోదు చేస్తున్నారు. అనధికార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయివేటుకు బాధ్యతలు అప్పగించడంతో భారీగా వసూలు చేస్తున్నారు. ఆధార్ కార్డుల పంపిణీ తుది దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రతి గ్రామంలో కార్డుల్లేని జనాభా వందల్లో ఉన్నారు.
యలమంచిలి, న్యూస్‌లైన్ : సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపించడం లేదు. నగదు బదిలీకి డిసెంబర్ నెలాఖరు గడువు విధించడంతో ఆధార్ కార్డులు లేనివారు ఆవేదన చెందుతున్నారు. జిల్లా జనాభా 42 లక్షల 90 వేలు కాగా ప్రకారం 39 లక్షల 99వేల మంది ఆధార్‌లో నమోదు చేయించుకున్నట్టు అధికార యంత్రాంగం చెబుతోంది. మూడు లక్షల దరఖాస్తుల్ని తిరస్కరించారు. దాదాపు అయిదు లక్షల కార్డుల ఆచూకీ తెలియకపోగా 30 లక్షల కార్డులు తయారైనట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఆధార్ కార్డుల పంపిణీలో అధికారుల వద్ద ఉన్న లెక్కల కచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రయివేటు వల్లే అక్రమాలు
ఆధార్ కార్డుల తయారీ బాధ్యత ప్రయివేటుకు అప్పగించడంతో అక్రమాలను నియంత్రించే అధికారం అధికారులకు లేకుండా పోయింది. ఇటీవల జిల్లాలో ఆధార్ నమోదు వేగవంతానికి మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో కూడా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో అనధికారికంగా రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు.
ఎస్.రాయవరం మండలంలో ఏకంగా అధికారులకు తెలియకుండానే ఆధార్ కేంద్రాలను నడుపుతుండటం విశేషం. ఆధార్ సిబ్బంది వసూళ్లపై రెవెన్యూ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ‘వాళ్లు మా మాట వినడం లేదని’ వాపోవడం గమనార్హం. ఆధార్ కేంద్రాల్లో పొరపాట్లను సరిచేయకుండానే జిల్లాలో 45 శాశ్వత ఆధార్ కేంద్రాలకు అనుబంధంగా మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
ఆపరేటర్ల పరీక్షలోనూ అక్రమాలే
ఆదార్ కేంద్ర ఆపరేటర్లు యూడీఏఐ పరిధిలో సిఫి నిర్వహించే కంప్యూటర్ పరీక్షను ఆన్‌లైన్‌లో రాయవలసి ఉంది. ఇందుకు 10వ తరగతి విద్యార్హతతో ఎస్‌బీఐలో రూ.300 చలానా చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ప్రకటించిన తేదీలో ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ వినియోగానికి సంబంధించిన పలు అంశాలను సిలబస్‌లో చేర్చారు. పరీక్ష తప్పినవాళ్లు మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం కల్పించింది. ఈ పరీక్షకు మధ్యవర్తులు తెరపైకి వస్తున్నారు. అసలు పరీక్ష రాయకుండానే రూ.2500 వరకు చెల్లిస్తే ధ్రువపత్రాన్ని చేతిలో పెడుతున్నారు. ఇటీవల కొందరు ఆపరేటర్లతో బేరసారాలు కూడా జరిగాయని సమాచారం.