
న్యూఢిల్లీ: వయసు నిర్ధారణకు ఆధార కార్డు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిహారం నిమిత్తం రోడ్డు ప్రమాద మృతుడి వయసును నిర్ధారించడానికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఆధార్ కార్డును బట్టి కాకుండా పాఠశాల టీసీలో పేర్కొన్న తేదీని పుట్టిన తేదీగా పరిగణించాలని జువెనైల్ జస్టిస్ యాక్ట్–2015 టీసీలో పేర్కొన్న తేదీకి చట్టపరమైన గుర్తింపునిస్తోందని తెలిపింది.
‘ఆధార్ గుర్తింపు కార్డుగా పనికొస్తుందే తప్ప పుట్టినతేదీని నిర్ధారించడానికి కాదని దాన్ని జారీచేసే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2023లో సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది’ అని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం పేర్కొంది. 2015లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ రూ. 19.35 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
మృతుడి వయసును టీసీ ఆధారంగా లెక్కించి (45 ఏళ్లు) పరిహారాన్ని గణించింది. పంజాబ్– హరియా ణా హైకోర్టు ఆధార్ కార్డు ఆధారంగా వయసును గణించి (47 ఏళ్లుగా) పరిహారాన్ని రూ. 9.22 లక్షలకు తగ్గించింది. దీన్ని బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా వయసు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామా ణికంగా పరిగణించలేమని సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment