Unique Identification Authority of India
-
Supreme Court Of India: వయసు నిర్ధారణకు ‘ఆధార్’ ప్రామాణికం కాదు
న్యూఢిల్లీ: వయసు నిర్ధారణకు ఆధార కార్డు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిహారం నిమిత్తం రోడ్డు ప్రమాద మృతుడి వయసును నిర్ధారించడానికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఆధార్ కార్డును బట్టి కాకుండా పాఠశాల టీసీలో పేర్కొన్న తేదీని పుట్టిన తేదీగా పరిగణించాలని జువెనైల్ జస్టిస్ యాక్ట్–2015 టీసీలో పేర్కొన్న తేదీకి చట్టపరమైన గుర్తింపునిస్తోందని తెలిపింది. ‘ఆధార్ గుర్తింపు కార్డుగా పనికొస్తుందే తప్ప పుట్టినతేదీని నిర్ధారించడానికి కాదని దాన్ని జారీచేసే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2023లో సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది’ అని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం పేర్కొంది. 2015లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ రూ. 19.35 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. మృతుడి వయసును టీసీ ఆధారంగా లెక్కించి (45 ఏళ్లు) పరిహారాన్ని గణించింది. పంజాబ్– హరియా ణా హైకోర్టు ఆధార్ కార్డు ఆధారంగా వయసును గణించి (47 ఏళ్లుగా) పరిహారాన్ని రూ. 9.22 లక్షలకు తగ్గించింది. దీన్ని బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా వయసు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామా ణికంగా పరిగణించలేమని సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. -
ఆధార్ కార్డు రద్దు చేసుకునే అవకాశం - ఎప్పుడు.. ఎలా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని ప్రకటించింది. అయితే ఇప్పుడు యూఐడీఏఐ ప్రకారం.. కొత్త ఫామ్ ఉపయోగించి 18 సంవత్సరాలు నిండిన వారు ఆధార్ నెంబర్ సైతం రద్దు చేసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త ఆధార్ రూల్స్ ప్రకారం, ఆధార్ కార్డు ఉన్న వారు 18 ఏళ్ళు నిండిన తరువాత కార్డుని రద్దు చేసుకోవచ్చు. దీనికోసం యూఐడీఏఐ ఫామ్-9ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. కొన్ని సందర్భాల్లో మాత్రమే రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డబుల్ ఆధార్ ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లను కలిగి ఉన్న సందర్భంలో.. ఒక ఆధార్ నెంబర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకటి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అందులో కూడా ఏవైనా మార్పులు.. చేర్పులు వంటివి చేఉకోవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పించింది. ఫోటోపై ఫోటో వచ్చినప్పుడు ఆధార్ కార్డులో ఫోటొపైన ఫోటో వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది. కొన్ని సందర్భాల్లో కొత్త ఫోటో గ్రాఫ్ తీసుకోకుండానే పాత ఫోటోను వినియోగించడం, లేదా బయోమెట్రిక్ సమాచారం లేకుండానే ఆధార్ నమోదు చేసిన సందర్భంలో వినియోగదారుడు ఆధార్ కార్డును రద్దు చేసుకోవచ్చు. బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహించకుండా ఉండటానికి పెద్దలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడిగా నమోదు చేసుకుని ఉంటే.. అలాంటి ఆధార్ నెంబర్ కూడా రద్దు చేసుకోవచ్చు. షెడ్యూల్ VI 27(1)(c) ప్రకారం, ఆధార్ నంబర్ హోల్డర్ అయిన నివాసి, పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, అతని/ఆమె ఆధార్ నంబర్‌ను రద్దు చేయడానికి ప్రాంతీయ అధికార కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత మూడు నెలల్లో కార్డు రద్దు చేస్తారు. ఆధార్ నెంబర్ రద్దు చేసుకున్న తర్వాత.. ఆధార్ నంబర్ హోల్డర్‌కు అథారిటీ అందించే సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇదీ చదవండి: రోహిత్ శర్మ అపార్ట్మెంట్స్ అద్దెకు.. నెలకు లక్షల్లో సంపాదన ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ 5 లేదా 15 సంవత్సరాలు నిండిన ఆధార్ నంబర్ హోల్డర్ అతని/ఆమె బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడంలో విఫలమైతే, అతని/ఆమె ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత అప్డేట్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవచ్చు. -
ఆధార్‌తో 90 కోట్ల మొబైల్ నంబర్స్ అనుసంధానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆధార్‌తో ఒక కోటికిపైగా మొబైల్ నంబర్స్ అనుసంధానం అయ్యాయి. జనవరిలో ఈ సంఖ్య 56.7 లక్షలు నమోదైందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌తో పాన్ నంబర్‌ను అనుసంధానించడం ఈ పెరుగుదలకు కారణం అని వివరించింది. ఇప్పటి వరకు 90 కోట్ల మంది ఆధార్‌తో తమ మొబైల్ నంబర్‌ను అనుసంధానించినట్టు అంచనా. ఆధార్‌ను ప్రామాణికంగా చేసుకుని నమోదైన లావాదేవీలు జనవరిలో 199.62 కోట్లు, ఫిబ్రవరిలో 226.29 కోట్లకు చేరుకున్నాయి. 2023 ఫిబ్రవరి వరకు ఇటువంటి లావాదేవీలు 9,255 కోట్లు నమోదు కావడం గమనార్హం. ఈ–కేవైసీ లావాదేవీలు ఫిబ్రవరిలో 26.79 కోట్లు కాగా ఇప్పటి వరకు ఇవి మొత్తం 1,439 కోట్లుగా ఉన్నాయి. -
అమ్మకానికి ‘ఆధార్’
ఆధార్ కార్డు గురించి, పౌరుల వ్యక్తిగత గోప్యతకు దానివల్ల కలుగుతున్న నష్టం గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగానికి తాజా పరిణామం మింగుడుపడటం లేదు. నాలుగురోజులక్రితం ఆంగ్ల దినపత్రిక ట్రిబ్యూన్ మహిళా జర్నలిస్టు ఒకరు రూ. 500 చెల్లించి కోట్లాది మంది పౌరుల సమస్త వివరాలూ పొందుపరిచిన ఆధార్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ సంపాదించారు. ఆమె మరో రూ. 300 చెల్లించి కావలసిన ఆధార్ కార్డు వివరాల కాపీని పొందడానికి వీలయ్యే సాఫ్ట్‌వేర్‌ను రాబట్టారు. పంజాబ్ రాజధాని చండీ గఢ్‌లో జరిగిన ఈ ఉదంతం గురించి అక్కడి ఆధార్ అధికారులను ప్రశ్నిస్తే వారు విస్మయపడ్డారు. ఆంగ్ల చానెల్ ‘ఇండియా టుడే’ విలేకరులు రహస్య కెమెరాలతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే అందులో మరింత దిగ్భ్రాంతికరమైన వివరాలు వెల్లడ య్యాయి. రూ. 2 చొప్పున చెల్లిస్తే కావలసినంతమంది వివరాలు ఇవ్వడానికి అనే కులు సిద్ధపడ్డారు. ఆ విలేకరులు అలా చెల్లించి 15,000మంది వివరాలను పొందారు. ఇది వెల్లడైన వెంటనే అప్రమత్తమై ఎక్కడెక్కడ లోపాలున్నాయో వెదికి సరిదిద్దడానికి బదులు ప్రభుత్వ యంత్రాంగం విలేకరుల మీద కేసులతో విరుచుకు పడింది. ఆధార్ డేటా లీకైన విషయం బయటపడటం ఇది మొదటిసారి కాదు. నిరుడు మే నెలలో లీక్ సంగతిని సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ఇది ఆధార్ కార్డును రూపొందించే యూనిక్ ఐడెంటిఫి కేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంస్థ లోపం కాదని, ఆ సమాచా రాన్ని ఉపయోగించుకుంటున్న వివిధ ప్రభుత్వ విభాగాల అవగాహనలేమి కారణ మని తెలిపింది. 210 ప్రభుత్వ విభాగాలు తమ తమ వెబ్సైట్లలో ఆధార్ వివరా లుంచాయని, దీన్ని గమనించి తొలగింపజేశామని వివరించింది. ఆ సమయంలో దాదాపు 10 కోట్లమంది పౌరుల వివరాలు బహిర్గతమయ్యాయని అంచనా వేశారు. అయితే పౌర సమాజ కార్యకర్తలు మాత్రం ఆధార్ డేటా ‘బయటి వ్యక్తుల’ చేతు ల్లోకి పోయిందని ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. చివరకు అదే నిజమని తాజా ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. పౌరుల నుంచి వివరాలు సేకరించి ఆ డేటాను నిక్షిప్తం చేసేందుకు దేశ వ్యాప్తంగా 3 లక్షలమంది ఆపరేటర్లను కామన్ సర్వీస్ సెంటర్ స్కీం (సీఎస్ సీఎస్) కింద కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నియ మించింది. ప్రస్తుతం ఆ పనిని చాలాచోట్ల పోస్టాఫీసులకూ, కొన్ని బ్యాంకు శాఖ లకూ అప్పగించింది. పర్యవసానంగా రోడ్డునపడిన అనేకమంది ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని వారి ద్వారా కొందరు ‘గుర్తు తెలియని వ్యక్తులు’ ఆధార్ సమా చారాన్ని అంగట్లో విక్రయిస్తున్నారని ట్రిబ్యూన్ పత్రిక అంటున్నది. ఇన్నాళ్లూ నిద్రపోయింది చాలక ఇప్పుడు అప్రమత్తం చేసిన మీడియాపై ప్రభుత్వం విరుచు కుపడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సమస్య తలెత్తాక ప్రభుత్వమైనా, యూఐ డీఏఐ బాధ్యులైనా చేయాల్సింది వెబ్సైట్ అన్యుల చేతుల్లోకి ఎలా పోయిందో ఆరా తీయడం. ఎందుకంటే ఆ వెబ్సైట్ కోసం వినియోగిస్తున్న సర్వర్లు, అందుకు ఉప యోగిస్తున్న సాఫ్ట్వేర్ అసాంఘిక శక్తుల చేతుల్లో పడటం కోట్లాదిమంది పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తుంది. ఆ సర్వర్లు, సాఫ్ట్వేర్ దుర్భేద్యమైనవని ఇన్నాళ్లూ ప్రభుత్వం నమ్మబలుకుతోంది. కేవలం యూఐడీఏఐ డైరెక్టర్ జనరల్, రాష్ట్ర స్థాయిలో ఉండే ఆ సంస్థ ప్రాంతీయ కేంద్రాల అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ మినహా మరెవరూ అధికారిక పోర్టల్‌ను తెరవలేరని అన్నది. కానీ రూ. 500 ఖర్చుపెడితే అది సంపాదించడం అత్యంత సులభమని ట్రిబ్యూన్ పత్రిక నిరూపించింది. ఆధార్ వ్యవహారం 2009లో మొదలైనప్పుడు పలువురు సామాజిక కార్య కర్తలు ఇది ప్రమాదకరమైన చర్య అని హెచ్చరించారు. ఇలాంటి ప్రాజెక్టునే మొదలుపెట్టిన బ్రిటన్ ఆ డేటాను కాపాడటం అసాధ్యమని గుర్తించి మధ్యలోనే దాన్ని విరమించుకున్న సంగతిని గుర్తుచేశారు. అయినా ప్రభుత్వం వినలేదు. అప్పుడు విపక్షంలో ఉండి ఆధార్‌ను వ్యతిరేకించిన బీజేపీ అధికారంలోకొచ్చాక దాన్ని మరింత విస్తృతపరిచింది. డేటా లీకయ్యే ప్రమాదమున్నదని చెప్పినప్పుడే ప్రభుత్వం నిపుణుల సహాయసహకారాలతో అందులో వాస్తవమెంతో తెలుసుకోవ డానికి ప్రయత్నించి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. కనీసం పౌరుల డేటా సేకరించిన బ్రిటన్ మధ్యలో ఎందుకు ఆపేసిందో, అందుకు గల కారణాలేమిటో తెలుసుకుని ఉంటే సమస్య తీవ్రత అర్ధమయ్యేది. పౌరుల సమస్త అవసరాలకూ ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసినప్పుడు అనివార్యంగా ఏదో ఒక స్థాయిలో డేటా లీక్ కావడం తప్పదు. తాజా పరిణామం గమనిస్తే అసలు మూలంలోనే పెను లోపమున్నదని అర్ధమవుతుంది. అరకొర పరిజ్ఞానంతో ఒక మూఢ విశ్వాసాన్ని ఏర్పరుచుకుని, దానికి భిన్నంగా ఎవరు ఏం చెప్పడానికి ప్రయత్నించినా మూర్ఖంగా కొట్టిపారేయడం వల్లే ఇప్పుడీ పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ తమ డేటా లీక్ కాదని, అసాధ్యమని వాదించినవారు ఇప్పుడు కొత్త వాదన లంకించు కుంటున్నారు. ఆధార్ సమాచారం బయటికొస్తే ఏం కొంప మునుగుతుందన్న తర్కం లేవదీస్తున్నారు. డేటా చౌర్యం చేసినవారు తప్పుడు పేర్లతో సిమ్ కార్డులు పొందడానికి, బ్యాంకు ఖాతాలు ప్రారంభించడానికి వాటిద్వారా అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. అసలు వ్యక్తికి సంబంధం లేకుండా, తెలియకుండా ఇవన్నీ జరిగిపోతుంటాయి. అమాయక పౌరులల్లో నమ్మకం కలిగించి వారిని ఎన్నో రకాలుగా మోసగించడానికి వీలుంటుంది. అన్ని టికీ ఆధార్ తప్పనిసరి చేయడాన్ని, దాని చెల్లుబాటును ప్రశ్నించే పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అది తేలేలోగా కనీసం ఆధార్‌పై అధికార యంత్రాంగానికి జవాబుదారీతనాన్ని నిర్ణయించాలి. డేటా చౌర్యం జరి గినప్పుడు అందుకు బాధ్యత ఎవరిదో నిర్ధారించి చర్యలు తీసుకోవాలి. కళ్లు మూసుకు కూర్చుంటే, ప్రశ్నించినవారిని దబాయిస్తే సమస్య పరిష్కారం కాదని గ్రహించాలి. -
‘ఆధార్’ యంత్రాలకు ఎస్టీక్యూసీ తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆధార్‌ను ధ్రువీకరించేందుకు ఉపయోగించే అన్ని యంత్రాలకు జూన్ 1 నుంచి ఎస్టీక్యూసీ(స్టాండర్డైజేషన్ టెక్నిక్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్) తప్పనిసరి కానుంది. ఈ మేరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఆధార్ సమాచారానికి మరింత భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కొత్త నిబంధల ప్రకారం ఎస్టీక్యూసీ లేని యంత్రాలతో జూన్ 1 నుంచి ఆధార్‌ను ధ్రువీకరించటం కుదరదు. -
మోసపూరిత ‘ఆధార్’ సైట్లపై ఉక్కుపాదం
న్యూఢిల్లీ: అనధికారికంగా, చట్టవిరుద్ధం గా ఆధార్ సేవలు అందిస్తూ, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న 50 ఏజె న్సీలపై యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఉక్కుపా దం మోపింది. 12 వెబ్సైట్లను గూగుల్ ప్లేస్టోర్‌లోని 12 మొబైల్ యాప్స్‌ను మూసేయించింది. మరో 26 వెబ్సైట్లు, మొబైల్ యాప్స్‌లను మూసేయాలంది. ఆధార్ సేవల కోసం ప్రజలు తమ అధికారి వెబ్సైట్ www. uidai. gov. ను, కామన్ సర్వీస్ సెంటర్లను లేదా ఆధార్ శాశ్వత నమోదు కేంద్రాలను మాత్రమే సంప్రదించాలని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషన్ పాండే పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. వెబ్సైట్లు, యాప్స్ అనధికారికంగా ఆధార్ లోగోను వాడినా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇక ఈ-రేషన్
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఈ-రేషన్ విధానం అమలు కాబోతోంది. బోగస్ కార్డులకు అడ్డుకట్ట పడనుంది. ప్రజా పంపిణీ విధానం(పీడీఎస్)లో సమూల మార్పులు రానున్నాయి. ఇకపై జిల్లా వ్యాప్తంగా ఆధార్ అనుసంధానిత ప్రజాపంపిణీ వ్యవస్థ(ఏఈపీడీఎస్) ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పథకాన్ని జిల్లాలోని కొన్ని రేషన్ దుకాణాల్లో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలంటూ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆ శాఖ కమిషనర్ సునీల్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.100 కోట్లకు పైగా నిధులు ఆదా కావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో తొలిసారిగా ఈ పెలైట్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయంచారు. జిల్లాలో మొదటి దశలో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని రేషన్ దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ఏఈపీడీఎస్ అమలు చేయడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు రంగం సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. పథకంలో భాగంగా కార్డుదారులకు బయోమెట్రిక్ పద్ధతిలో సరుకులను పంపిణీ చేస్తారు. ఇక్కడ ఫలితాల ఆధారంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఆమోదంతో జిల్లా అంతటా వర్తింపజేస్తారు. జిల్లాలో 11 లక్షలకుపైగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో సుమారు 39 లక్షల మంది సభ్యులకు గాను 10 లక్షల యూనిట్లకు మాత్రమే ఆధార్ సీడింగ్ పూర్తయింది. ఏఈపీడీఎస్ విధానం అమలైతే కీ రిజిస్టర్‌ను తాజా సమాచారంతో క్రోడీకరించి సరుకులు సరఫరా చేస్తారు. ఏఈపీడీఎస్ను అమలుచేస్తే జిల్లాలో 30 శాతం యూనిట్లు ఆదా అవుతాయని భావిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను జిల్లాలో సమూలంగా ప్రక్షాళన చేయడానికి జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేయనున్న నేపథ్యంలో కొత్త విధానంపై త్వరలో డీలర్లందరికీ అవగాహన కల్పించి ఈ-పోస్ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న వనరులేంటి? అక్కడ ఏ నెట్వర్క్ పనిచేస్తుంది? తదితర అంశాలను పరిశీలించనున్నారు.