సాక్షి, కర్నూలు: జిల్లాలో ఈ-రేషన్ విధానం అమలు కాబోతోంది. బోగస్ కార్డులకు అడ్డుకట్ట పడనుంది. ప్రజా పంపిణీ విధానం(పీడీఎస్)లో సమూల మార్పులు రానున్నాయి. ఇకపై జిల్లా వ్యాప్తంగా ఆధార్ అనుసంధానిత ప్రజాపంపిణీ వ్యవస్థ(ఏఈపీడీఎస్) ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పథకాన్ని జిల్లాలోని కొన్ని రేషన్ దుకాణాల్లో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలంటూ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆ శాఖ కమిషనర్ సునీల్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.100 కోట్లకు పైగా నిధులు ఆదా కావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో తొలిసారిగా ఈ పెలైట్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో రాష్ట్రంలో ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయంచారు. జిల్లాలో మొదటి దశలో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని రేషన్ దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ఏఈపీడీఎస్ అమలు చేయడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు రంగం సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం.
పథకంలో
భాగంగా కార్డుదారులకు బయోమెట్రిక్ పద్ధతిలో సరుకులను పంపిణీ చేస్తారు. ఇక్కడ ఫలితాల ఆధారంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఆమోదంతో జిల్లా అంతటా వర్తింపజేస్తారు. జిల్లాలో 11 లక్షలకుపైగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో సుమారు 39 లక్షల మంది సభ్యులకు గాను 10 లక్షల యూనిట్లకు మాత్రమే ఆధార్ సీడింగ్ పూర్తయింది. ఏఈపీడీఎస్ విధానం అమలైతే కీ రిజిస్టర్‌ను తాజా సమాచారంతో క్రోడీకరించి సరుకులు సరఫరా చేస్తారు.
ఏఈపీడీఎస్‌ను అమలుచేస్తే జిల్లాలో 30 శాతం యూనిట్లు ఆదా అవుతాయని భావిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను జిల్లాలో సమూలంగా ప్రక్షాళన చేయడానికి జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేయనున్న నేపథ్యంలో కొత్త విధానంపై త్వరలో డీలర్లందరికీ అవగాహన కల్పించి ఈ-పోస్ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న వనరులేంటి? అక్కడ ఏ నెట్‌వర్క్ పనిచేస్తుంది? తదితర అంశాలను పరిశీలించనున్నారు.
ఇక ఈ-రేషన్
Published Mon, Jan 6 2014 1:38 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM
Advertisement
Advertisement