Public distribution system
-
మే నుంచి చిరుధాన్యాల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం కార్డుదారులకు పూర్తిస్థాయిలో నిత్యావసరాలను అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఆయా పంట ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2023ను మిల్లెట్ ఇయర్‌గా ప్రకటించిన నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాల్లో చిరుధాన్యాల (జొన్నలు, రాగులు) పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి జొన్న ఉత్పత్తులను సేకరించగా.. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎఫ్‌సీఐ ద్వారా రాగులు కొనుగోలు చేయనుంది. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేలా.. పేదలకు పీడీఎస్ కింద పౌష్టికాహార ఉత్పత్తులను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో ఖరీఫ్ నుంచి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు మిల్లెట్లు పండించేలా అవగాహన కల్పించనున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తులను స్థానికంగానే రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి పీడీఎస్‌లో పంపిణీ చేయనున్నారు. ఫలితంగా రైతులకు మార్కెట్లో పక్కా ధర భరోసా దక్కనుంది. వచ్చే ఖరీఫ్‌లో కందుల కొనుగోలు రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 4లక్షల టన్నుల వరకు కందుల దిగుబడి నమోదవుతోంది. ఈ క్రమంలోనే పీడీఎస్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఖరీఫ్‌లో నేరుగా రైతుల నుంచి కందులు సేకరించేలా పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 1.45 కోట్ల రైస్ కార్డులు ఉండగా.. ఇందులో ప్రతి నెలా సగటున 5,500 టన్నుల కందిపప్పు అవసరం అవుతున్నది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో కందిపప్పు సాధారణ రకం రూ.120–రూ.125, ఫైన్ వెరైటీ రూ.130 వరకు పలుకుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కే అందిస్తోంది. ఫలితంగా ఏప్రిల్‌లో ఏకంగా 7,100 టన్నుల కందిపప్పును వినియోగదారులకు సరఫరా చేసింది. బియ్యం బదులు గోధుమ పిండి కేంద్ర ప్రభుత్వం పీడీఎస్ కింద నెలకు 1,800 టన్నులు మాత్రమే గోధుమ ఉత్పత్తులను రాష్ట్రానికి కేటాయిస్తుండగా.. వాటిని తొలి ప్రాధాన్యత కింద వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు. కిలో రూ.16 చొప్పున కార్డుకు గరిష్టంగా రెండు కిలోలు సరఫరా చేస్తున్నారు. అయితే గోధుమను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు వినియోగదారుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇక్కడ ప్రతినెలా ఇచ్చే రేషన్‌లో కేజీ బియ్యం బదులు ఉచితంగా గోధుమ పిండి ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. స్థానిక అవసరాలకు అనుగుణంగా.. రాష్ట్రంలో ప్రజా పంపిణీకి అవసరమైన నిత్యావసరాల ఉత్పత్తులను స్థానికంగా రైతుల నుంచి కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఫలితంగా రైతులకు మద్దతు ధర భరోసా దక్కడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం సరుకు ఇచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
గిరిజన ప్రాంతాల్లో బైక్‌ల ద్వారా రేషన్ సరఫరా
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ చెప్పారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సరుకు రవాణాకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో కొత్త ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మారుమూల, కొండ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, ఎండీయూ వాహనం వెళ్లలేని గిరిజన గ్రామాలకు బైక్‌ల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జనవరి నుంచి కందిపప్పు, పంచదార పంపిణీతో పాటు అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల వద్దకే నిత్యావసరాలు డెలివరీ చేసేలా చూడాలన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో అవసరాన్ని బట్టి కలెక్టర్ కొత్త రేషన్ షాపులు మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 45 శాతానికి పైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్టు కమిషనర్ తెలిపారు. జనవరి చివరి నాటికి ఖరీఫ్ సేకరణ పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని, ధాన్యం కొనుగోళ్ల సొమ్ముతో పాటు మిల్లర్ల బకాయిలనూ వేగంగా చెల్లిస్తున్నట్టు చెప్పారు. 16 రోజులు దాటిన ఎఫ్‌టీవోలకు చెల్లింపులు పూర్తి చేసినట్టు తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వం చెల్లించే బకాయిల్లో కొంత మొత్తం వెచ్చించి ఆరబోత యంత్రాలు (డ్రయర్లు) ఏర్పాటు చేయాలని, లేకుంటే.. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి ఆయా మిల్లులకు సీఎంఆర్ నిలిపివేస్తామని కమిషనర్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. -
Ration Rice: వేలి ముద్ర వెయ్యి.. పైసలు తీసుకో.. కిలో రూ.8 నుంచి 10
రేషన్ డీలర్ నుంచి మిల్లర్ వరకు అక్రమ దందా ప్రతి నెలా వందల కోట్లలో వ్యాపారం వరకు ఇచ్చి కొనుగోలు డీలర్ల వద్ద, గ్రామాల్లో మహిళల నుంచి రూ.10 వరకు ఇచ్చి కొంటున్న దళారులు దళారుల వద్ద కొని పొరుగు రాష్ట్రాల్లో రూ.20 వరకు విక్రయిస్తున్న పెద్ద వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కొని రీసైక్లింగ్ చేసి.. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్న కొందరు మిల్లర్లు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామం రేషన్ దుకాణానికి ఓ మహిళ వచ్చి డీలర్‌కు ఆహార భద్రతా కార్డు ఇచ్చింది. డీలర్: అమ్మా బియ్యం ఇయ్యాల్నా.. పైసలా.. మహిళ: ఒక్కలకు ఎన్ని కిలోల బియ్యం ఇత్తండ్రు డీలర్:10 కిలోలు మహిళ: మా కార్డుల ఐదుగురం ఉన్నం గద. పైసలే ఇయ్యి డీలర్: యేలి ముద్ర ఎయ్యమ్మా... కిలకు ఎనిమిది (రూ.8) లెక్కన నాలుగు వందలిస్త మహిళ: సరేనయ్య.. పైసలియ్యి వచ్చిన మహిళ వేలిముద్ర వేయగానే... సదరు డీలర్ 50 కిలోల బియ్యం తూకం వేసి, ఆ బియ్యాన్ని పక్కకు పెట్టి ఆమెకు రూ.400 ఇచ్చాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం 80 శాతం వరకు పక్కదారి పడుతోంది. రూపాయికి కిలో చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ బియ్యాన్ని రూ.8 నుంచి రూ.15 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్న ముఠాలు ప్రతి నెలా వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరం మొదలుకొని పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. రేషన్ దుకాణం నుంచి మొదలయ్యే ఈ దందా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో ముగుస్తోంది. అక్రమ దందాలో చిన్న చిన్న దళారులు మొదలుకొని పెద్ద వ్యాపారులు, రైస్ మిల్లర్లు కూడా ఉండటం గమనార్హం. పీడీఎస్ బియ్యం జాతీయ రహదారులు, రైలు మార్గాల ద్వారా గమ్య స్థానాలకు నిరాటంకంగా చేరుతున్నా.. పట్టించుకునేవారే లేరు. బియ్యంతో పాటే పోలీస్, రైల్వే పోలీస్, పౌర సరఫరాల సంస్థ అధికారులను ‘కొనుగోలు’చేస్తున్న వ్యాపారులు ప్రభుత్వం కోట్లు వెచ్చించి పేదలకు పంచుతున్న బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలోని రూపాయి బియ్యం (కరోనా నాటి నుంచి దాదాపుగా ఉచితంగానే సరఫరా) ఇతర రాష్ట్రాల్లో రూ.20కు పైగా పలుకుతుండడం గమనార్హం. కరోనా నాటి నుంచి ఉచితంగానే.. ► సాధారణంగా ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబాల్లోని ఒక్కొక్కరికి 6 కిలోలు.. కిలో రూపాయి చొప్పున ఇస్తారు. అయితే కరోనా మొదలైన 2020 నుంచి ఒకటి రెండు నెలలు మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగానే బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలో గత జనవరి నుంచి మే, జూన్ నెలలు మినహా ఒక్కొక్కరికి ప్రతినెల 10 కిలోల చొప్పున ఇస్తున్నారు. ఆగస్టు నెలలో ఏకంగా 15 కిలోల చొప్పున పౌరసరఫరాల సంస్థ బియ్యం పంపిణీ చేసింది. రేషన్ బియ్యంపై చులకన భావం! ► ఆహార భద్రతాకార్డు ఉన్న కుటుంబంలోని సభ్యులు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్ర వేసి తమ కోటా బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రామాల్లో పెరిగిన వరిసాగు, రైతు కుటుంబాలు సొంతంగా పండించిన బియ్యం తినే అలవాటు, రేషన్ బియ్యంపై ఉన్న చులకన భావం లాంటి కారణాల వల్ల చాలామంది ఈ బియ్యాన్ని ఆహారంగా వినియోగించడం లేదు. పట్టణాల్లోనూ చాలామంది రేషన్ బియ్యాన్ని ఇడ్లీ, దోశల పిండి, అటుకుల తయారీకి వాడుతున్నారు మినహా రోజువారీ భోజనానికి వినియోగించడం లేదు. అయితే రెండు నెలలకు పైబడి పీడీఎస్ బియ్యం తీసుకోకపోతే రేషన్‌కార్డు రద్దు అవుతుందన్న భయంతో అందరూ తప్పనిసరిగా బియ్యాన్ని తీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్న బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు తమ దుకాణాల్లోనే తిరిగి కొంటున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాల్లో కిలో బియ్యానికి రూ. 6 నుంచి రూ. 8 వరకు చెల్లిస్తుండగా... గ్రామాలు, ఇతర పట్టణాల్లో కిలోకు రూ. 8 నుంచి రూ.10 వరకు చెల్లిస్తున్నారు. రేషన్ దుకాణాల్లోకి వచ్చే బియ్యంలో 60 శాతం అక్కడే డబ్బులకు రీసేల్ అవుతుండగా, 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే పేదలు తీసుకుంటున్నారు. వీరిలో కొందరు దళారులకు విక్రయిస్తున్నారు. మిగతా 10 శాతం వరకు క్లోజింగ్ బ్యాలెన్స్ కింద డీలర్ల వద్ద నిల్వ ఉంటుంది. కాగా కొంటున్న బియ్యాన్ని డీలర్లు రూ.2 లాభం చూసుకొని ట్రాలీల్లో వచ్చే దళారులకు అమ్మేస్తున్నారు. ఇలా డీలర్ల నుంచి, గ్రామాల్లో మహిళల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని సదరు ట్రాలీ దళారులు లారీల్లో వ్యాపారం చేసే వారికి రూపాయి, ఆపైన లాభం చూసుకొని విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసే పెద్ద వ్యాపారులు పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు. రెండు మూడు చేతులు మారిన తర్వాత రాష్ట్రాలు దాటే బియ్యం ధర రూ.20 వరకు పలుకుతోంది. తద్వారా కిలో బియ్యానికి కనిష్టంగా రూ.5 చొప్పున లాభం వేసుకొన్నా.. ఇలా టన్నుల్లో విక్రయించే బియ్యానికి కోట్లల్లో లాభం సమకూరుతుందని స్పష్టమవుతోంది. ఈ లాభంతోనే పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులను వ్యాపారులు కొనేస్తున్నారని మంచిర్యాలకు చెందిన ఓ దళారి చెప్పాడు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రవాణా ► ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పీడీఎస్ బియ్యం అధికంగా మహారాష్ట్రకు వెళుతోంది. రామగిరి ప్యాసింజర్ రైలు ద్వారా వరంగల్ నుంచి పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా వీరూర్‌కు వెళ్తుంది. లారీల్లో కూడా కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల నుంచి ఆసిఫాబాద్ గుండా వీరూర్కే చేరుతుంది. కాగజ్‌నగర్ నుంచి, దహేగాం, బెజ్జూరుల నుంచి చింతలమానెపల్లి మీదుగా గడ్చిరోలి జిల్లా అహేరీకి వెళ్లే లారీలు కూడా ఉన్నాయి. భూపాలపల్లి, చెన్నూరు, కాటారం, ములుగు ప్రాంతాల నుంచి సిరోంచకు, ఖమ్మం, కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి కర్ణాటకకు పీడీఎస్ బియ్యంతో కూడిన లారీలు వెళ్తున్నాయి. మిల్లర్లకూ వరం ► పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్రంలోని కొందరు మిల్లర్లు రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాలు, పట్టణాల నుంచి లారీలు బియ్యం మిల్లులకు వెళుతూపలుచోట్ల పట్టు పడడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అలాగే ఆయా మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలు అక్కడ లేకపోవడాన్ని బట్టి కూడా.. మిల్లర్లు అసలు బియ్యాన్ని (మిల్లింగ్ చేసిన రైతుల ధాన్యం) అమ్ముకుంటూ, వాటి స్థానంలో పీడీఎస్ బియ్యాన్ని ఇస్తున్నట్టుగా స్పష్టమవుతోందని అంటున్నారు. -
మరింత సమర్ధంగా ఇంటింటికీ బియ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. ఇంటింటికీ రేషన్ అందించే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ (ఎండీయూ వాహనాలు) క్రమం తప్పకుండా లబ్ధిదారుల ప్రాంతాలకు వెళ్లేలా పక్కాగా పర్యవేక్షించనుంది. ఇందులో భాగంగా రూట్ మ్యాపింగ్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి సాంకేతిక సేవలను వినియోగించనుంది. ఎండీయూ పరిధిలోని లబ్ధిదారులు తమ ఇళ్ల నుంచి ఎక్కువ దూరం వెళ్లకుండా సమీపంలోకే వాహనం వచ్చేలా అధికారులు ప్రత్యేక పాయింట్లను గుర్తిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఐదారు ఇళ్లకు ఒకచోట ప్రతి నెలా ఎండీయూలో రేషన్ అందించేలా సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. వాహనాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా బియ్యం లబ్ధిదారులకు అందుతుంది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చె నెలలో మండలానికి ఒక ఎండీయూ పరిధిలో దీనిని అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ విప్లవాత్మక చర్యలతో పెరిగిన రేషన్ పంపిణీ శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రతి నెలా రేషన్ తీసుకునేవారి శాతం గణనీయంగా పెరిగింది. లబ్ధిదారులకు నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం ఇవ్వడంతో పాటు 9,260 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించడం మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రతి నెలా 1.45 కోట్ల కార్డుదారులకు 2.30 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతుంది. గతంలో నెలకు 80 నుంచి 85 శాతం మాత్రమే రేషన్ పంపిణీ జరిగితే.. ఇప్పుడు 90 శాతానికి చేరుకొంది. మరోవైపు అనివార్య కారణాలతో ఎండీయూ వాహనదారులు ఎవరైనా తప్పుకుంటే వారి స్థానాన్ని భర్తీ చేసేంత వరకు గరిష్టంగా మూడు నెలల పాటు ఇన్చార్జి ఎండీయూకు (వేరే ఎండీయూ వాహనదారుడు పని చేస్తే) బాధ్యతలు అప్పగిస్తోంది. వీరికి నెలకు రూ.18,000 చొప్పున అదనంగా అందిస్తూ ఎక్కడా రేషన్ పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు చేపడుతోంది. 2 నుంచి 3 నెలలు నిల్వ చేసిన తర్వాతే రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసిన వెంటనే పీడీఎస్‌లోకి తీసుకురావడంతో సమస్యలు వస్తున్నాయి. కొత్త బియ్యం వండితే అన్నం బాగోలేదని, ముద్దగా అవుతుందనే ఫిర్యాదులున్నాయి. దీనిని అధిగమించేందుకు కస్టమ్ మిల్లింగ్ అనంతరం 2 నుంచి 3 నెలలు బఫర్ గోడౌన్లలో నిల్వ ఉంచిన తర్వాతే పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
ఇంటింటికీ గిరిజన ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ దుకాణాలు, రేషన్ పంపిణీ వాహనాల (ఎండీయూ) ద్వారా గిరిజన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. నవంబర్ 1వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ప్రారంభించనుంది. తొలి దశలో 290 రేషన్ వాహనాలు, 570 రేషన్ దుకాణాల్లో అమలు చేయనున్నారు. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించడంతోపాటు ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే వినియోగదారులకు అందించనున్నారు. ఎండీయూలకు ఆర్థిక బలం చేకూర్చేలా.. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థలో 9,260 ఎండీయూ వాహనాలు సేవలందిస్తున్నాయి. రేషన్ డోర్ డెలివరీ నిమిత్తం ఎండీయూ ఆపరేటర్లకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.18 వేల రెమ్యునరేషన్ ఇస్తోంది. వారికి మరింత ఆర్థిక బలం చేకూర్చేందుకు ప్రభుత్వరంగ సంస్థలైన గిరిజన, ఆయిల్ ఫెడ్, మార్క్‌ఫెడ్ ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. ఆయా సంస్థల నుంచి సబ్సిడీపై సరుకులను తీసుకునే ఆపరేటర్లు వాటిని ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు ప్రజలకు విక్రయించాల్సి ఉంటుంది. ప్రతినెలా పీడీఎస్ బియ్యం పంపిణీలో జాప్యం లేకుండా విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులకు తెలిసేలా వస్తువుల ధరల పట్టికను ప్రదర్శించనున్నారు. విక్రయించే ఉత్పత్తులు.. గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా తేనె, అరకు కాఫీ పొడి, వైశాఖి కాఫీ పొడి, త్రిఫల చూర్ణం, నన్నారి షర్బత్, ఆయుర్వేద సబ్బులు, చింతపండు, కుంకుడుకాయ పొడి, షికాకాయ పొడి, కారంపొడి, పసుపు, కుంకుమతోపాటు ఆయిల్‌ఫెడ్ నుంచి పామాయిల్, సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్, వేరుశనగ నూనెలను అందుబాటులో ఉంచనున్నారు. గిరిజనులకు మేలు చేసేలా.. గిరిజనులకు మేలు చేసేలా ఎండీయూ వాహనాల ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. తొలుత విశాఖ, తిరుపతి జిల్లాల్లో స్పందనను బట్టి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. రేషన్ లబ్ధిదారులే కాకుండా ప్రజలందరూ ఈ ఉత్పత్తులను కొనుక్కోవచ్చు. బియ్యం ఇచ్చే సమయంలో వినియోగదారులపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా విక్రయాలు చేసుకోవాలని ఎండీయూలకు సూచించాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
పాఠశాలలకు నేరుగా బియ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేస్తుండగా.. ఈ నెల నుంచి ఐసీడీఎస్ (అంగన్వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని నేరుగా రవాణా చేయనుంది. తద్వారా ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ఆదాయం సమకూర్చనుంది. ఇప్పటివరకు అంగన్వాడీలు రేషన్ దుకాణం నుంచి, స్కూళ్లు, హాస్టళ్ల యాజమాన్యాలు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వ్యయప్రయాసలతో బియ్యం తెచ్చుకునేవారు. ఒకరోజు ప్రత్యేకంగా బియ్యం కోసం కేటాయించాల్సి వచ్చేది. పైగా రవాణా, ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఇబ్బందులు పడేవారు. వీటన్నింటికి పరిష్కారంగా ప్రభుత్వమే రేషన్‌ను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఫైన్ క్వాలిటీ ధాన్యం సేకరణ రాష్ట్రంలో అంగన్వాడీలు, స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థుల భోజనానికి ఏడాదికి 2.54 లక్షల టన్నుల బియ్యం అవసరం. ఇప్పటివరకు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు సార్టెక్స్ బియ్యాన్ని (సాధారణ రకాలు) ఫోర్టిఫై చేసి ఆహారంగా అందిస్తోంది. వచ్చే జనవరి నుంచి ఫైన్ క్వాలిటీ (స్థానిక రకాలు, సన్న రకాలు) బియ్యాన్ని కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2022–23 ధాన్యం సేకరణలో మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అవసరమైన ఫైన్ క్వాలిటీ ధాన్యాన్ని ఏడాదికి 4 లక్షల నుంచి 5 లక్షల టన్నుల మేర రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. తద్వారా విద్యార్థులకు, రైతులకు మేలు జరగనుంది. దీనికితోడు అప్పుడే పండిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ద్వారా వచ్చే బియ్యంతో వండే అన్నం ముద్దగా ఉంటుందనే ఫిర్యాదులను పరిష్కరించేలా.. సేకరణకు, మిల్లింగ్‌కు మధ్య రెండు నుంచి మూడునెలల వ్యవధి ఉండేలా చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ రైస్ ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జిల్లాలతో పాటు ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లకు మాత్రమే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకున్న వారిలో రక్తహీనత శాతం తగ్గినట్టు ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు మొత్తం ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రజలకు అవగాహన కల్పించేలా అంగన్వాడీలు, స్కూల్ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ అంటే.. మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు బియ్యానికి అదనంగా చేర్చడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి12 వంటి కీలక సూక్ష్మపోషకాలను బియ్యంలో అదనంగా చేరుస్తారు. విటమిన్ టాబ్లెట్ కంటే పవర్ఫుల్ ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ రైస్ విటమిన్ టాబ్లెట్ కంటే ఎంతో పవర్ఫుల్. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. దీంతోపాటు విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో 9,260 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లకు విస్తరిస్తున్నాం. – అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
అబద్ధాలే.. రామోజీకి నిత్యావసరం!
నిత్యం అబద్ధాలాడటం... రామోజీరావుకు నిత్యావసరం!!. చంద్రబాబు నాయుడు ఐదేళ్లూ ఏమీ చేయకపోయినా... అదో గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా రోజూ కీర్తిస్తే జనాన్ని కొంతయినా నమ్మించగలమనేది ఆయన దింపుడు కళ్లం ఆశ. నిత్యావసరాల్లో కోత... అంటూ ఆదివారంనాడు ఆయన చేసిన ఆక్రందనలూ అందులో భాగమే. ఎందుకంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దిగిపోయేనాటికి ఉన్న రేషన్ కార్డులు 1.39 కోట్లు. ఇప్పుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఉన్నవి 1.45 కోట్లు. అంటే... ఏకంగా 6 లక్షల కుటుంబాలు పెరిగినట్లు. ఈ నిజాన్ని రామోజీరావు చెప్పరుగాక చెప్పరు. ఇక చంద్రబాబు ఏలిన ఐదేళ్లలోనూ కందిపప్పు, పంచదారపై నాటి ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు రూ.568 కోట్లు. కానీ వై.ఎస్.జగన్ హయాంలో ఈ మూడేళ్లలోనే కందిపప్పు, పంచదార రేషన్ డిపోల్లో ఇవ్వటానికి ప్రభుత్వం చేసిన వ్యయం ఏకంగా రూ.1,891 కోట్లు. ఈ రెండు లెక్కలూ చాలవూ... ఎవరి హయాంలో ఏం జరిగిందో కళ్లకు కట్టడానికి? కాకపోతే ఈ వాస్తవాలను ‘ఈనాడు’ కావాలనే చెప్పదు. పైపెచ్చు కందిపప్పు, పంచదారలో ప్రభుత్వం కోతపెడుతోందని రాస్తూ... చంద్రబాబు హయాంలో ప్రతినెలా ప్రతి కార్డుకూ కిలోలకు కిలోలు పంపిణీ చేశారనే గ్రాఫిక్స్ చూపించడానికి పడరాని పాట్లు పడుతోంది. ఈ ముసుగులు తొలగిస్తూ... నిజానిజాలేంటో చెప్పే కథనమిది!. రాష్ట్రంలో 2014 నుంచీ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పామాయిల్ కేటాయింపులే లేవన్నది నిజం. 2020 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సబ్సిడీ కందిపప్పు ధర రూ.67కే స్థిరంగా అందిస్తున్నారని, ఎక్కడా పెంచలేదన్నది నిజం. కానీ వీటిని ‘ఈనాడు’ చెప్పదు. అయినా చంద్రబాబు హయాంలో పండగ కానుకలు ఎందుకిచ్చారో మీకు తెలియదా రామోజీరావు గారూ? పీడీఎస్ డబ్బుల్ని హెరిటేజ్ లాంటి కంపెనీలకు దోచిపెట్టడానికి కాదా? ఎలాంటి నిబంధనలూ లేకుండా... టెండర్ల ఊసే లేకుండా ఇష్టం వచ్చిన ధరలకు ప్రభుత్వానికి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు మింగింది మీరందరూ కాదా? అసలు పేదలకు నాణ్యమైన సరుకులు ఇచ్చేందుకు ఏనాడైనా ప్రయత్నించారా? అప్పట్లో బియ్యాన్ని తీసుకున్నా తినగలిగే పరిస్థితి ఉండేదా? ఇప్పుడు మధ్యస్త సన్నరకం బియ్యాన్ని తీసుకుని ఖర్చుకు వెరవకుండా మరింత నాణ్యంగా సార్టెక్స్ చేసి అందిస్తుండటం నిజం కాదా? అప్పట్లో ఇన్ని అక్రమాలు జరిగినా ప్రశ్నించలేదెందుకు? పైపెచ్చు ఇప్పుడు ఇళ్లవద్దకే రేషన్ సరఫరా చేస్తున్న అద్భుతమైన వ్యవస్థపై కూడా... ఇంటి ముంగిటకు రాకుండా వీధి మలుపుల్లో ఉంటున్నారనే విమర్శలా? మరీ ఇంతలా దిగజారిపోతున్నారెందుకు రామోజీరావు గారూ? సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా నెలకొన్న పండగ వాతావరణం బాబుకు ఎదురవబోయే ఓటమిని ముందే చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారా? ఇవీ... చంద్రబాబు లెక్కలు టీడీపీ ప్రభుత్వం హయాంలో రాగులు, జొన్నలు, గోదుమ పిండి, ఉప్పు పంపిణీ చేయటం మొదలెట్టిందే చివర్లో. ‘ఈనాడు’ దృష్టిలో అది సూపర్. 1.39 కోట్ల కార్డుల్లో కేవలం 1 శాతానికే వీటినిచ్చినా... అబ్బో అంటున్నారు రామోజీ. ఎన్నికల భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి సంవత్సరంలో పంపిణీ చేశారీ చిరు ధాన్యాల్ని. గతంలో నెలకు 14 వేల టన్నుల గోధుమ పిండి అవసరం ఉంటే 900 టన్నులు తెచ్చి కొద్ది మందికే పంపిణీ చేశారు. ఇక్కడి ప్రజలకు బియ్యమే ఇష్టం. కార్మికులు, కూలి కుటుంబాలకు గోధుమ పిండితో రొట్టెలు చేసుకునే తీరిక ఉండదు. దీంతో గోధుమ పిండి తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో నిల్వలు పాడైపోతున్న కారణంగా పంపిణీ నిలిచిపోయింది. రాగులు, జొన్నల విషయంలోనూ ఇదే జరిగింది. 2018–19 మధ్య 25,034 టన్నుల రాగులు, 15,635 టన్నుల జొన్నలను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి కార్డుదారులకు సరఫరా చేశారు. వీటిని బయటి మార్కెట్ నుంచి కొనటంతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ నిలిపివేసింది. వీటి పరిమాణానికి సమానవైన బియ్యంపై సైతం సబ్సిడీ ఇవ్వలేదు. ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. వీటిని తీసుకునేందుకెవరూ ఆసక్తి చూపించకపోవడంతో మధ్యలోనే ఆగిపోతే.. దీనిక్కూడా ‘ఈనాడు’ మసి పూస్తూనే ఉంది. 2020లో కేంద్రం 1838 టన్నుల గోధుమలు మాత్రమే సరఫరా చేసేది. వాటిని పిండిగా చేసి రేషన్ దుకాణాలకు చేర్చేందుకు ఖర్చు అధికంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఆటా’ సరఫరాలను నిలిపివేసింది. అన్నీ... ఎన్నికల ముందే ఇక గత ప్రభుత్వం ఐదేళ్లలో 93 వేల టన్నుల కందిపప్పు, 3.16 లక్షల పంచదారను మాత్రమే పంపిణీ చేస్తే... వై.ఎస్.జగన్ ప్రభుత్వం మూడేళ్లలో 2.76 లక్షల టన్నుల కందిపప్పును, 2.14 లక్షల టన్నుల పంచదారను అందించింది. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం జూన్ 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూన్ వరకు కందిపప్పు గురించి పట్టించుకోనే లేదు. నవంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేసింది. 2017–18లో రాష్ట్రంలో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు వస్తున్నాయనగా మార్చి 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్డుదారులకు రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. పంచదార పరిస్థితీ అంతే. నెలకు సగటున 7724 టన్నులు అవసరం కాగా, కేంద్రం కేవలం 908 టన్నులకే రాయితీ ఇస్తోంది. మిగిలినదంతా రాష్ట్రం బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి... సబ్సిడీని భరిస్తోంది. పైపెచ్చు బాబు హయాంలో ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులుండేవి. ఆగస్టు 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున కందిపప్పు ఇచ్చి... ధర రూ.50 నుంచి రూ.120 మధ్యన విక్రయించారు. 2015 డిసెంబర్లో రూ.90కి విక్రయిస్తే... 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120కి పెంచేశారు. 2018లో కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ.63 ఉన్నప్పుడు కేవలం రూ.23 రాయితీ ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో రూ.115 ఉంటే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.48 సబ్సిడీ ఇస్తూ రూ.67కే అందిస్తోంది. మార్కెట్ ఒడిదుడుకులు, కోవిడ్ సంక్షోభం, ద్రవ్యోల్భణం కారణంగా నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగాయి. ఇదే నేరమైనట్లు... ధరలు పెంచేశారంటూ ‘ఈనాడు’ గుండెలు బాదుకోవటం చూస్తే చిత్రంగానే అనిపిస్తుంది. ఇంటింటికీ రేషన్‌పైనా నిందలా? ‘తోచీ తోచనమ్మ’ తరహాలో రామోజీరావుకు దేనిపై విమర్శలు చేయాలో తెలియటం లేదన్నది ఆయన కథనాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటింటికీ రేషన్ అందించటంలో ఏపీని యావద్దేశం ఆదర్శంగా తీసుకుంటోంది. ‘ఈనాడు’ మాత్రం పసలేని విమర్శలు చేస్తూనే ఉంది. బాబు హయాంలో రేషన్ సరుకుల కోసం యుద్ధాలే చేయాల్సి వచ్చేది. డిపోల్లో సర్వర్లు ఎప్పుడు పని చేస్తాయో తెలీక రోజంతా కూలి మానేసి క్యూలో పడిగాపులు పడేవారు. ఒక్కోసారి రేషన్ తీసుకోకుండానే ఇళ్లకెళ్లేవారు. వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి మరీ ఘోరం. కానీ ఈ నిజాలను ఇప్పటికీ ‘ఈనాడు’ చెప్పదు. పైపెచ్చు అప్పట్లో ఒకరోజు సెలవు పెట్టుకుని డిపోలకు వెళ్లేవారని, ఇపుడు ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తాయో తెలియక తంటాలు పడుతున్నారని రాయటంలోనే ఆ పత్రిక ఎంత నీచానికి దిగజారుతున్నదో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో... ఇపుడు 9,260 వాహనాల్లో లబ్ధిదారులకు ఇళ్లవద్దే రేషన్ అందుతోంది. ఈ మొబైల్ వాహనాలతో ఉపాధి పొందుతున్న ఆపరేటర్లకు నెలకు సుమారు రూ.25 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. కార్డుదారుల సమక్షంలో ఇంటి దగ్గరే సంచులు తెరచి, కచ్చితమైన తూకంతో ఇస్తుండటంతో కొలతలపై ఫిర్యాదుల్లేవు. వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణా లేదు. ఇప్పుడు రేషన్ తీసుకునేవారు 87 శాతం నుంచి 92 శాతానికి పెరిగారు. వాహనం వచ్చినప్పుడు ఇంట్లో సభ్యులు లేకపోతే సాయంత్రం సచివాలయం వద్ద రేషన్ వాహనాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఎండీయూ వాహనం నుంచి బియ్యం పొందే సౌలభ్యాన్ని కల్పించారు. ఇవన్నీ ‘ఈనాడు’ చెప్పని నిజాలే మరి! తగ్గిన బియ్యం అక్రమ రవాణా.. బాబు హయాంలో రేషన్ బియ్యం తినేవారు చాలా తక్కువ. ముక్కిపోవటం... పురుగులు పట్టడం... రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండటంతో పాటు గింజలు రంగు మారటం వంటివి అప్పట్లో అత్యంత సహజం. దీనిని కూడా బాబు బినామీలు తమ దళారులతో ప్రజల దగ్గర నుంచి పదీపరకా పెట్టి కొనేసేవారు. అక్రమంగా తరలించి ప్రజాధనాన్ని దోచేసేవారు. కానీ ఇప్పుడిస్తున్న సార్టెక్స్ బియ్యం నిరుపేదల కడుపు నింపుతోంది. అందుకే గతంలో కంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా తగ్గింది. టీడీపీ ఐదేళ్ల పాలనలో 117.45 లక్షల టన్నులు బియ్యం సరఫరా చేస్తే ఈ మూడేళ్లలోనే జగన్ ప్రభుత్వం 85.27లక్షల టన్నులు పేదలకు ఇచ్చింది. బియ్యం సార్టెక్స్‌కే కిలోకు రూపాయి చొప్పున నెలకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. బాబు ఐదేళ్ల కాలంలో బియ్యం సబ్సిడీపై చేసిన ఖర్చు రూ.12,377 కోట్లయితే జగన్ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున నాణ్యమైన బియ్యమిస్తూ ఈ మూడేళ్లలోనే రూ.12,379 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది. పాతాళంలోకి పడిపోయిన బాబును ఎలాగైనా పైకి లాగాలని చూస్తున్న రామోజీకి ఇవేమీ కనిపించట్లేదు! 19 నెలల ఉచిత బియ్యం కరోనా విపత్కర పరిస్థితుల్లో ఏప్రిల్ 2020లో పేదల కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పప్పు ధాన్యాల పంపిణీని ప్రారంభించింది. ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల నాన్‌సార్టెక్స్ బియ్యాన్ని అందించింది. అయితే కేంద్రం కేవలం జాతీయ ఆహార భద్రత (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డులకు మాత్రమే దీనిని వర్తింప జేసింది. రాష్ట్రంలో 1.45 కోట్ల కార్డులు ఉంటే.. 88 లక్షల ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే బియ్యం సరఫరా చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు దశల్లో అంటే 25 నెలల పాటు ఈ పథకం కొనసాగగా కేంద్రంతో సమానంగా ఐదు దశల వరకు 19 నెలల పాటు రాష్ట్ర కార్డులకు కూడా ప్రభుత్వం సొంత ఖర్చులతో బియ్యాన్ని అందించింది. ఇందు కోసం అదనంగా దాదాపు రూ.5700 కోట్ల వరకు ఖర్చు చేసింది. దీనికి తోడు పీఎంజీకేఏవై కింద శనగలు, కందిపప్పు పంపిణీకి రూ.1729 కోట్లు ఖర్చు చేసింది. ఆరవ విడతలో ప్రభుత్వం వద్ద సరిపడినన్ని నాన్ సార్టెక్స్ బియ్యం అందుబాటులో లేకపోవడంతో పంపిణీ ఆలస్యమై కేవలం చివరి రెండు నెలలు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే.. ఎంపిక చేసిన జిల్లాల్లో పంపిణీ చేశారు. ఇకనైనా ఈ వాస్తవాలు రాయండి రామోజీరావు గారూ!! -
కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్!
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఇంధనంతో పాటు కూరగాయల ధరలు మండుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ పథకాన్ని మరో 6 నెలల పాటు పొడిగించే యోచనలో ఉంది. ఇందులో చాలా మంది అనర్హులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పారదర్శకంగా అమలయ్యేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. రద్దు దిశగా రేషన్ కార్డులు రేషన్ కార్డు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం మీరు అనర్హులుగా తేలితే మీ రేషన్ కార్డు కూడా రద్దవుతుంది వీటతో పాటు ప్రభుత్వం మరో విజ్ఞప్తి కూడా చేస్తోంది. అనర్హులు ఎవరైనా, వారి రేషన్ కార్డును వారి స్వంతంగా రద్దు చేయాలని లేదంటే ప్రభుత్వం గుర్తించి రేషన్ రద్దుతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకోనున్నట్లు తెలిపింది. రూల్స్ ఏంటో చూద్దాం.. మీ సొంత ఆదాయంతో సంపాదించిన 100 చదరపు మీటర్ల ప్లాట్/ఫ్లాట్ లేదా ఇల్లు, ఫోర్ వీలర్ వెహికిల్/ట్రాక్టర్, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం రెండు లక్షల కంటే ఎక్కువ (గ్రామంలో), అదే నగరంలో సంవత్సరానికి మూడు లక్షలు ఉంటే, అలాంటి వారు వారి రేషన్ కార్డును ప్రభుత్వ సంబంధిత కార్యాలయంలో సరెండర్ చేయాలి. మరిన్ని నెలలు ఉచిత రేషన్ మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని మరో 3 నుంచి 6 నెలల వరకు పెంచనున్నట్లు సమాచారం. అయితే, దీనివల్ల ప్రభుత్వానికి 10 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. -
1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేవై) కింద ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతినెల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 4.23 కోట్ల మందికి రేషన్ ఇస్తుంటే.. ఇందులో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే సరుకులు అందిస్తోందన్నారు. మిగిలిన లబ్ధిదారులకు సొంత ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వమే రేషన్ పంపిణీ చేస్తోందన్నారు. కరోనా సమయంలో పీఎంజీకేవై కింద కేంద్రం ఉచిత రేషన్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2022 వరకు రాష్ట్రంలో ఉచిత రేషన్ పంపిణీ చేపట్టామన్నారు. ఇక్కడ కేంద్రం ఇచ్చే వాటాపోనూ నాన్–ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులకు మానవతా దృక్పథంతో తమ ప్రభుత్వం సొంతంగా ఉచిత బియ్యాన్ని అందించిందన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కొనసాగిస్తున్న ఉచిత రేషన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో.. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారని బొత్స తెలిపారు. రేషన్ దుకాణాల వద్దే.. తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లలో మినహా విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 1.67 కోట్ల మందితో పాటు మిగిలిన జిల్లాల్లోని 89.20 లక్షల ఎస్సీ, ఎస్టీలకు, 24.60 లక్షల మంది అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కార్డుదారులకు ఉచిత రేషన్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. వీరితో పాటు కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో అక్కడ కూడా ఈ విధానాన్ని అమలుచేస్తామన్నారు. తద్వారా రాష్ట్రంలోని 2.68 కోట్ల మందికి పైగా ఉచిత బియ్యం అందుతుందని బొత్స చెప్పారు. వీటిని రేషన్ దుకాణాల వద్ద మ.3.30 గంటల నుంచి సాయంత్రం వరకూ పంపిణీ చేస్తామని.. ఈ నెలాఖరు నాటికి వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు కూపన్లు అందజేస్తామన్నారు. ఇక ప్రతినెలా ఇచ్చే బియ్యాన్ని యథావిధిగా వాహనాల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ జరుగుతుందన్నారు. పీఎంజీకేవై అమలుకు ప్రత్యేక ప్రణాళిక అనంతరం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులు అందరికీ పీఎంజీకేవైను వర్తింపజేయాలని సీఎం జగన్ లేఖల ద్వారా ప్రధానమంత్రిని కోరారన్నారు. నీతి ఆయోగ్, మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులు, ఉన్నతాధికారలు అధ్యయనాల తర్వాత పీఎంజీకేవై అమలుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కంటే పీడీఎస్ లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందని.. ఇటీవల కొత్తగా 7,051 కార్డులను కూడా జారీచేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో పేదలకిచ్చే బియ్యం కోసం రూ.12వేల కోట్లు ఖర్చుచేస్తే తమ ప్రభుత్వం మూడేళ్లలోనూ రూ.14వేల కోట్ల వరకు ఖర్చుచేసిందన్నారు. సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు.. రాష్ట్రంలో 4.23 కోట్ల మంది నిరుపేదలు రేషన్ తీసుకుంటుండగా కేంద్రం ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద 2.68 కోట్ల మందిని మాత్రమే గుర్తించింది. వారికే ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. మిగిలిన 1.55 కోట్ల మంది ప్రజలను నిరుపేదలుగా పరిగణించట్లేదు. ఈ క్రమంలో కొంతమందికే కాకుండా నిరుపేదలందరికీ పీఎంజీకేవై కింద ఉచిత రేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నీతి ఆయోగ్ సైతం చేసిన సిఫారసులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అయినా కేంద్రం స్పందించలేదు. కరోనా సమయంలో కేంద్రం ఇస్తున్న 2.68 కోట్ల మందితో పాటు మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ ఇచ్చింది. ఆర్థికభారం మోయలేనిస్థాయికి చేరడంతో.. అందరకీ ఉచిత రేషన్ ఇవ్వమని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసి, కేంద్రం స్పందన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో.. ఉచిత రేషన్ పంపిణీ చేయకపోతే ధాన్యం కొనుగోళ్లు నిలిపేస్తామని, బిల్లులను కూడా ఆపేస్తామని బెదిరించింది. రైతులు ఇబ్బందులు పడకుండా వారి ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి వారి సిఫారసుల అనుగుణంగా వెనుకబడిన ప్రాంతాలు, సామాజికవర్గాల వారీగా ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లుచేసింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో మోయలేని ఆర్థిక భారం పడినా.. నిరుపేదల కడుపు నింపేందుకు కేంద్రంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భారం భరించి రెండేళ్లూ ఉచిత రేషన్ అందించింది. ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు చక్కబడకపోవడంతో కేంద్రాన్ని సాయం కోరినా ఫలితం దక్కకపోగా బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోంది. -
పంజాబ్‌లోనూ ఇంటి వద్దకే రేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రవేశపెట్టిన ‘ఇంటి వద్దకే రేషన్’ విధానం, నాణ్యమైన బియ్యం పంపిణీని పలు రాష్ట్రాలు ప్రశంసించడంతో పాటు వాటి అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పంజాబ్‌లో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం ‘ఘర్ ఘర్ రేషన్ యోజన’ పేరుతో లబ్ధిదారుల ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు రేషన్ కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేదని ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ‘తరచుగా రేషన్ పొందడానికి ఒక రోజు వెచ్చించాల్సి వస్తోంది. రేషన్ కోసం వృద్ధులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్తున్నారు. ప్రజలకు చేరే రేషన్‌లోనూ నాణ్యత కొరవడింది. ఇకపై పంజాబ్‌లో ఇది కొనసాగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది’ అని చెప్పారు. నాణ్యమైన రేషన్‌ను శుభ్రమైన సంచులలో ప్యాక్ చేసి ఇంటికే పంపిణీ చేసేందుకు త్వరలోనే విధానాలను రూపొందించనున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం పంజాబ్ కంటే ముందుగానే ఢిల్లీలో ఇంటింటికీ రేషన్‌ను పంపిణీ చేయాలనుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ అడ్డంకుల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా పర్యటనలో కేంద్ర బృందం, విజయవాడ పర్యటనలో కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్.. రాష్ట్రంలో రేషన్ పంపిణీ విధానంపై ప్రశంసలు కురిపించారు. దేశంలో దాదాపు 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరుస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజల కోసం అదనపు భారం భరిస్తున్న ఏపీ వాస్తవానికి ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది కిందటే రాష్ట్రంలో ఇంటి వద్దకే నాణ్యమైన రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. గంటల పాటు క్యూలో నిల్చుని రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు çపడుతుండటంతో పాటు ఒక రోజు పనిని వదులుకుని, కూలి పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఇటువంటి వారి కోసం రూ.530 కోట్లకు పైగా వ్యయంతో 2021 ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మొబైల్ వాహనాలతో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తంగా 1.45 కోట్ల కార్డుదారులు ఉండగా, నెలలో 18 రోజుల పాటు వీరందరికీ ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వాహనం విలువ రూ.5.81 లక్షలు కాగా, ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తోంది. ఈ వాహనాలను వాడుకున్నందుకు పౌర సరఫరాల శాఖ నెలకు సుమారు రూ.16.67 కోట్లకు పైగా చెల్లిస్తోంది. దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనదారుడితో పాటు హెల్పర్ల కింద సుమారు 17 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఇలా ఏటా నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సుమారు రూ.830 కోట్లకు పైగా ప్రజల కోసం అదనపు భారం భరిస్తోంది. -
ఆహార భద్రతలో ఏపీ భేష్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆహార భద్రతకు రాష్ట్రంలో ఢోకా లేదు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) అమలులో మన రాష్ట్రం మొదటి ర్యాంకు సాధించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైనట్లు తేలింది. తాజాగా నీతి ఆయోగ్, సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) భారత్ ఇండెక్స్ నివేదికల ప్రకారం పలు అంశాల్లో ఏపీ అద్భుత ప్రతిభ కనబరిచినట్టు తేలింది. అందరికీ ఆహార భద్రత కల్పించడంలో వంద శాతం విజయవంతమైంది. ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడంలో దేశంలోని ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఏపీ చేస్తున్నట్టు నీతి ఆయోగ్, ఎస్డీజీ ఇండెక్స్‌లో తేలింది. 2020–21కి గాను ఎస్డీజీ భారత్ ఇండెక్స్‌లో హెల్త్ ఇన్‌స్రూ?న్స్ కల్పించడంలో వందకు 91.27 మార్కులతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. వివిధ అంశాల్లో సాధించిన ప్రగతి.. ర్యాంకులు ఇలా.. ► గతంలో మాతా మరణాల నియంత్రణలో రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు మంచి ఫలితాలు సాధించింది. 59.63 శాతం మార్కులతో 5వ ర్యాంకు కైవసం చేసుకుంది. ప్రసవ సమయంలో తల్లుల మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ విషయంలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. ► 9 నెలల నుంచి 11 నెలల వయసున్న చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడంలో ఏపీ ముందంజ వేసింది. గతంలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 3వ స్థానానికి ఎగబాకింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ► వరి పండించే రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానం దక్కించుకుంది. ఈ అంశంలో పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. ► రాష్ట్రంలో నర్సులు, ఫిజీషియన్లు, మిడ్ వైఫరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో పదో స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 95.14 మార్కులతో రెండో స్థానానికి చేరింది. 115 మార్కులతో కేరళ మొదటి స్థానంలో ఉంది. ► నర్సులు, డాక్టర్ల రేషియో విషయంలో 95.14 మార్కులతో రెండో స్థానంలోను, సురక్షిత తాగునీటి సరఫరా అంశంలో 86.58 మార్కులతో మూడో స్థానంలోను మన రాష్ట్రం నిలిచింది. ► మరుగుదొడ్ల ఏర్పాటులోనూ ఏపీ ప్రగతి సాధించింది. నూటికి నూరు మార్కులు సాధించిన రాష్ట్రాల్లో ఏపీ కూడా చోటు దక్కించుకుంది. ► అందరికీ విద్యుత్ విషయంలోనూ ఏపీ గణనీయమైన వృద్ధి సాధించింది. ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించటంలో వందకు వంద మార్కులు సాధించిన అతి కొన్ని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి కావడం గమనార్హం. ► వ్యర్థాల నిర్వహణ, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే విషయంలో ఏపీ మంచి ఫలితాలు సాధించింది. వంద శాతం మార్కులు సాధించిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ► సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏపీ మొదటి స్థానం దక్కించుకుంది. 52.40 శాతం మార్కులతో ఈ ఘనత సాధించింది. ► ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాల విషయంలో రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించింది. 89.13 మార్కులతో మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఇందులో మహిళల ఖాతాల విషయంలో దేశంలోనే రెండో ర్యాంకు సాధించింది. -
ప్రజా పంపిణీలోనూ యువతకు ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన మొబైల్ మినీ వ్యాన్‌తో తనకు చక్కటి ఉపాధి లభించిందని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జంపాన కృష్ణచైతన్య గర్వంగా చెబుతున్నాడు. రూ.5,81,190 విలువైన మినీ వ్యాన్, వేయింగ్ మెషిన్‌కు తన వాటాగా కేవలం 10 శాతం మాత్రమే తాను చెల్లించానని తెలిపాడు. మిగిలిన 90 శాతాన్ని ప్రభుత్వమే సబ్సిడీ కింద బ్యాంకుకు వాయిదాల్లో చెల్లిస్తోందన్నాడు. వ్యాన్‌తో తనకు నెలకు రూ.18 వేలు వేతనం కూడా వస్తోందని సంతోషం వ్యక్తం చేశాడు. పేద ప్రజలకు ఇళ్ల వద్దే రేషన్ బియ్యం అందించే కార్యక్రమంలో భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందంటున్నాడు.. శ్రీకాకుళం జిల్లా ఆత్మకూరుకు చెందిన పులిచర్ల ఈళ్లయ్య. ప్రభుత్వం మొబైల్ మినీ ట్రక్కులను సబ్సిడీపై అందిస్తుండటంతో గతేడాది దరఖాస్తు చేసుకున్నానని వివరించాడు. ప్రతి నెలా 1న రూ.18 వేలు వేతనం పొందుతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో మొబైల్ మినీ ట్రక్కుల ద్వారా ఉపాధి పొందుతున్న ఏ ఒక్క యువకుడిని పలకరించినా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రక్రియ సత్ఫలితాలనిస్తోందని అర్థమవుతోంది. దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దే రేషన్ అందించే పద్ధతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఫిబ్రవరి 1తో ఏడాది పూర్తయ్యింది. ఇతర రాష్ట్రాలు సైతం ఆసక్తి కనబరుస్తున్న ఈ కొత్త ఒరవడిలోనూ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడం మరో విశేషం. రాష్ట్రంలోని ప్రజలకు నేరుగా వారి ఇళ్ల వద్దే రేషన్ సరుకులు అందించేలా ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి 1న 9,260 మొబైల్ వాహనాలను అందించింది. వాటి ద్వారా రోజుకు కనీసం 90 కార్డుదారులకు తగ్గకుండా వారి ఇళ్లకే వెళ్లి రేషన్ సరుకులు అందించేలా చర్యలు చేపట్టింది. 90 శాతం సబ్సిడీ.. ప్రతి నెలా వేతనం ప్రభుత్వం పౌరసరఫరాల పంపిణీ సంస్థ ద్వారా అందించిన ఈ వాహనాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ మొత్తాన్ని సమకూర్చింది. రేషన్ సరఫరా కోసం అందించిన నాలుగు చక్రాల మొబైల్ మినీ ట్రక్కు (ఒక్కొక్క వాహనం) రూ.5,72,539, బరువు తూచే యంత్రం రూ.8,651 మొత్తం ధర రూ.5,81,190. ఈ మొత్తంలో పది శాతాన్ని లబ్ధిదారుడు చెల్లించాడు. మిగిలిన 90 శాతంలో 60 శాతం ప్రభుత్వ సబ్సిడీ, మరో 30 శాతం లబ్ధిదారులకు వాయిదాల పద్ధతిలో రుణం ఇచ్చిన బ్యాంకులకు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. అయితే లబ్ధిదారుడు తొలుత చెల్లించిన 10 శాతం మినహా మొత్తం 90 శాతాన్ని ప్రభుత్వమే చెల్లించేలా గతేడాది జూలైలో నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని ఆయా కార్పొరేషన్ల ద్వారా 72 వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చే సింది. దీంతో ట్రక్కులు నిర్వహిస్తున్న యువతకు మరింత భరోసా లభించింది. అంతేకాకుండా ప్రతి నెలా వారికి వేతనం కూడా అందుతోంది. -
ఆ బియ్యం.. ఆరోగ్యానికి అభయం
సాక్షి, అమరావతి: చిన్నారులు, మహిళల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో నివేదిక ప్రకారం రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య విజయనగరం జిల్లాలో తాజాగా 78.7 నుంచి 66.7 శాతానికి తగ్గింది, మహిళల్లో రక్తహీనత 75.7 నుంచి 64.6 శాతానికి తగ్గడం గమనార్హం. సరైన పోషకాలు అందక సాధారణం కంటే తక్కువ బరువు ఉన్న మహిళల శాతం 25.8 నుంచి 16.9 శాతానికి తగ్గింది. ఆర్థిక భారం పడినా.. ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్టిఫికేషన్ బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డులకు(ఎన్ఎఫ్ఎస్ఏ) మాత్రమే ఈ రకమైన బియ్యాన్ని సరఫరా చేస్తుండగా మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో అందచేస్తోంది. ఎన్ఎఫ్ఎన్ఏలో కూడా కేంద్రం 75 శాతం కార్డులకు మాత్రమే అందిస్తోంది. మూడు జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్రంపై నెలకు సుమారు రూ.1.70 కోట్లకుపైగా అదనపు భారం పడనుండగా ఏడాదికి రూ. 20.40 కోట్లు అదనంగా ఖర్చు కానుంది. విశాఖపట్నం, కడప జిల్లాల్లో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య అధికంగా ఉన్నందున మొదటి దశలో అక్కడ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. ఈ సీజన్లో 27 లక్షల టన్నుల లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా గతేడాది జూన్ నుంచి మధ్యాహ్నం భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు విటమిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. ఫలితంగా చాలా వరకు రక్తహీనత సమస్యలు తగ్గాయి. గత సీజన్లో (ఖరీఫ్, రబీ) 2.4 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సేకరించారు. ప్రస్తుత సీజన్లో 27 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని మిల్లుల్లో ఫోర్టిఫైడ్ రైస్‌ను తయారు చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అంటే? బియ్యపు నూకలను పిండిగా చేసి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి 12 లాంటి కీలక సూక్ష్మ పోషకాలను జోడించి నీళ్లు పోసి ముద్దగా చేస్తారు. ఈ ముద్దను యంత్రంలో వేసి ఎక్స్ట్రాషన్ పద్ధతి ద్వారా బియ్యపు గింజలను తయారు చేస్తారు. ఈ కృత్రిమ బియ్యాన్ని ఆరబెట్టి ప్యాకింగ్ చేస్తారు. వీటినే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ అంటారు. ఇవి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. కిలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ సేకరణకు ప్రభుత్వం రూ.75 చొప్పున ఖర్చు చేస్తోంది. వంద కిలోల సాధారణ బియ్యంలో ఒక కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్‌ను కలిపి పంపిణీ చేస్తారు. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే చిన్నారుల్లో మెదడు, వెన్నెముక పెరుగుదలతో పాటు మహిళలకు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ సంస్థ టెండర్లు నిర్వహించి ఇతర రాష్ట్రాల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను కొనుగోలు చేస్తోంది. దశలవారీగా అన్ని జిల్లాల్లో.. రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, మహిళలకు ఫోర్టిఫైడ్ బియ్యం మంచి పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ బి –12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లాంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. విజయనగరంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇచ్చింది. దశలవారీగా అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. – గిరిజా శంకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ పోషకాలతో కూడిన ఆహారం పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కడప, విశాఖపట్నం జిల్లాల్లో వీటిని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. చౌక బియ్యం ద్వారా సమకూరే పోషకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో త్వరలో విజయనగరం జిల్లాలో సర్వే నిర్వహిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ -
‘ఏక్‌రూపాయ్‌వాలా కోడ్’.. రూ.కోట్ల దందా!
సాక్షి, కరీంనగర్: వాస్తవానికి ‘ఏక్‌రూపాయ్‌వాలా’ అనేది ఓ కోడ్. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న బియ్యాన్ని తరలించే వ్యక్తులు చెక్‌పోస్టుల వద్ద వాడే పేరు ఏక్‌రూపాయ్‌వాలా.! అంటే రూపాయి కిలో బియ్యాన్ని అక్రమంగా సేకరించి, కొంచెం ప్రాసెస్ చేసి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే దందాకు అక్రమార్కులు పెట్టుకున్న ముద్దుపేరు. ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న ‘ఏక్‌రూపాయ్‌వాలా’ నెట్వర్క్ రోజురోజుకూ విస్తరిస్తోంది. రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్రలోని సిరోంచా, గోండియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకునేదాకా వెళ్లింది. అక్రమార్గంలో మహారాష్ట్రకు చేరిన తెలంగాణ సర్కారు బియ్యం అటు తిరిగి.. ఇటు తిరిగి.. మన రాష్ట్రంలోని కొన్ని రైస్‌మిల్లులకు చేరుకుంటున్న వైనం ఇది. దళారుల ద్వారా స్మగ్లర్ల ద్వారా చేతులు మారుతూ రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్రలోని సిరోంచా, గొండియా మిల్లులకు చేరుకున్న పీడీఎస్ బియ్యం అక్కడ రాష్ట్ర సర్కారుకు లెవీ కింద కొంత బియ్యం పెట్టి మిగతా బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలోని మిల్లులకు అక్రమంగా తరలిస్తున్నారు. ఎందుకిలా? రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు, సింగిల్ విండో, మార్కెట్ కమిటీ ద్వారా సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మిల్లులుకు అప్పగి స్తుంది. వారు ఆ ధాన్యాన్ని మర ఆడించి ప్రతీ క్వింటాకు రా రైస్ అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల చొప్పున ఎఫ్‌సీఐకి పంపుతారు. ఇక్కడే కొందరు రైస్‌మిల్లర్లు తమ చేతివాటం చూపుతున్నారు. ప్రభుత్వం అప్పగించిన ధాన్యంలో కొంతభాగం ఇతర రాష్ట్రాలకు అంటే కనీస మద్దతు ధర అధికంగా ఉన్న రాష్ట్రాలకు తరలించి అక్కడ విక్రయిస్తారు. ఈలోపు ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యంలో అక్రమమార్గంలో సేకరించిన పీడీఎస్ బి య్యాన్ని కలుపుతున్నారు. ఇదంతా తెలిసిన విషయమే. కానీ.. ఈ బియ్యాన్ని తొలుత మహారాష్ట్రకు తరలించి అక్కడ సీజ్ చేసిన బియ్యంగా రశీదులు సృష్టించి తిరిగి తెలంగాణకే తరలిస్తున్నారు. ఇది ఈ దందాలో పూర్తిగా కొత్తకోణం. ఈ మొత్తం వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. నిబంధనల ప్రకారం చేయాల్సిన మిల్లులో ధాన్యాన్ని ఆడించాలి. కానీ.. రెడీమేడ్‌గా అక్రమ మార్గంలో సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని అందులో కలుపుతున్నారు. తద్వారా మిల్లులపై ఒత్తిడి లేకుండా కరెంటు, మ్యాన్ పవర్, రవాణా చార్జీలను ఆదా చేసుకుంటున్నారు. ఇందుకోసం దళారులను పెట్టి రూపాయి కిలో బియ్యం సేకరిస్తున్నారు. వీరు కొందరు యాచకులను చేరదీ స్తారు. వారితో ఇంటింటికీ తిరిగి పీడీఎస్ బియ్యాన్ని కిలో రూ.7 నుంచి రూ.9 చొప్పున సేకరిస్తారు. వాటిని మధ్యవర్తులు, దళారుల నుంచి రూ.15లకు కొనుగోలు చేసి, మహారాష్ట్రలోని సిరోంచా, గోండియా రైస్‌మిల్లర్లకు రూ.25 విక్రయిస్తారు. మహారాష్ట్రలో దొడ్డుబియ్యానికి డిమాండ్ ఉండడంతో.. అక్కడి మిల్లర్లు ఈ బియ్యాన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి కిలో రూ.32 లేదా కొత్తగా ప్యాకింగ్ చేసి బహిరంగ మార్కెట్లో కిలో రూ.40కిపైగా విక్రయిస్తారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో ఏక్‌రూపాయ్‌వాలా దందాను నడిపించేది ఒకే వ్యక్తి కావడం గమనార్హం. ఉమ్మడి ఆదిలా బాద్‌లోని అర్జునగుట్ట, ప్రాణహిత నదుల మీదుగా మహారాష్ట్రకు, లేదా మంథనిలోని కాళేశ్వరం ప్రాజెక్టు మీదుగా మహారాష్ట్రకు మరోరూటులో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న చెక్‌పోస్టులు, రెవెన్యూ, పోలీస్, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు, పౌరసరఫరా ల శాఖలకు లక్షలాది చేతులు మారుతున్నాయి. కరోనా విజృంభించడం, చెక్‌పోస్టుల వద్ద నిఘా తీవ్రం కావడంతో స్థానిక రైస్ స్మగ్లర్లు రూటుమార్చారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిపోయిన పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్ర నుంచి తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. మహారాష్ట్రలో సీజ్ చేసిన బియ్యంగా చూపించేందుకు నకిలీ రశీదులు సృష్టిస్తున్నారు. సోమవారం రాత్రి మంథని మండలంలో పోలీసులు పట్టుకున్న పీడీఎస్ రైస్ వాహనాలే ఇందుకు నిదర్శనం. మహారాష్ట్రలోని సిరోంచా, సరిహద్దు నుంచి వచ్చిన వీరి వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి దాదాపు 70 కి.మీ. దూరం ప్రయాణించాయి. ఈ మధ్యలో వారిని ఎవరూ అడ్డుకోకపోవడం అనుమానాల కు తావిస్తోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో యాచకుల నుంచి ఉన్నతా ధికారుల వరకు విస్తరించిన ఈ నెట్‌వర్క్‌కు కేంద్రం కరీంనగర్ కావడం గమనార్హం. కోట్లాది రూపాయల అక్రమ దందా చేస్తున్న ‘ఏక్‌రూపాయ్‌వాలా’ ఆటకట్టించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మా దృష్టికి రాలేదు ‘ఏక్‌రూపాయ్‌వాలా’కు సంబంధించి మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి దాడులు చేస్తున్నాం. ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – సురేశ్‌రెడ్డి, డీఎస్వో, కరీంనగర్ ఎవరినీ వదలం.. రేషన్ బియ్యం సమాచారం వస్తే ఎవరినైనా ఎక్కడైనా పట్టుకుంటాం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పట్టుకొని అదనపు కలెక్టర్ పేసిలో కేసులు నడుస్తున్నాయి. పట్టుకున్న బియ్యం ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వేలం వేస్తాం. – వెంకటేశ్, డీఎస్వో, పెద్దపల్లి చదవండి: Ranga Reddy: బాలికను కిడ్నాప్ చేసి.. పెళ్లి చేసుకున్నాడు -
2021–22లో ఆర్థిక వ్యవస్థ ‘వి’ షేప్ జోరు..
‘‘మరిన్ని సంస్కరణలు దేశానికి అవసరం. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడమే కాదు.. వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా భరిస్తున్న ఆహార సబ్సిడీ బిల్లును తగ్గించుకోక తప్పని పరిస్థితి. పీడీఎస్ రేట్లను పెంచాల్సిందే. ప్రజారోగ్యంపై మరిన్ని నిధులను వెచ్చించడం ద్వారా.. ఆరోగ్యం, వైద్యం కోసం ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని దించాల్సిన అవసరం ఉంది. కరోనాతో చతికిలపడిన దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలంగా పురోగతి సాధిస్తుంది. 2021–22లో 11 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుంది. ఇందుకు క్రమబద్ధమైన చర్యల మద్దతు కూడా ఉండాలి’’ అంటూ 2020–21 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను శుక్రవారం పార్లమెంటు ముందుంచారు. ఏటా బడ్జెట్‌కు ముందు విడుదల చేసే ఆర్థిక సర్వే ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిఫలిస్తుంటుంది. న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నామినల్ జీడీపీ 15.4 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020–21లో జీడీపీ మైనస్ 7.7 శాతానికి పడిపోవచ్చన్న అంచనాలను ప్రస్తావిస్తూ.. రానున్న ఆర్థిక సంవత్సరంలో వీ షేప్ రికవరీ (పడిపోయిన తీరులోనే వేగంగా పురోగమించడం) సాధిస్తుందని పేర్కొంది. కరోనా నివారణ వ్యాక్సిన్ల కార్యక్రమం ఇందుకు చేదోడుగా నిలుస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. జీడీపీ చివరిగా 1979–80 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5.2 శాతం వృద్ధిని చవిచూసింది. వ్యవసాయ రంగం ఒక్కటీ ఆశాకిరణంగా కనిపిస్తోందంటూ.. సేవలు, తయారీ, నిర్మాణరంగాలు లాక్డౌన్లతో ఎక్కువగా ప్రభావితమైనట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. సంస్కరణలు, నియంత్రణల సరళీకరణ, మౌలిక రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకంతో తయారీ రంగానికి ఊతమివ్వడం, వ్యాక్సిన్లతో విచక్షణారహిత వినియోగం పుంజుకోవడం, తక్కువ వడ్డీ రేట్లతో రుణాల లభ్యత పెరగడం వంటివి వృద్ధికి దోహదపడతాయని అంచనా వేసింది. 17 ఏళ్ల తర్వాత కరెంటు ఖాతా మిగులును చూపించబోతున్నట్టు తెలిపింది. ‘‘అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ ద్రవ్యపరమైన చర్యలు చిన్నగానే ఉన్నాయి. కానీ, ఆర్థిక రికవరీకి అవి ఎంతగానో తోడ్పడ్డాయి. దీంతో భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని ద్రవ్యపరమైన ప్రోత్సాహక చర్యలను ప్రకటించేందుకు వెసులుబాటు ఉంది’’ అని సర్వే పేర్కొంది. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. సాగు.. సంస్కరణల బాట వ్యవసాయ రంగాన్ని ఆధునిక వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉందని.. స్థిరమైన, నిలకడైన వృద్ధి కోసం ఈ రంగంలో సత్వరమే సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ‘‘వ్యవసాయరంగంలో పురోగతి దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ ఆదాయ వర్గాల భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే గ్రామీణ ఉపాధి హామీ రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా వ్యవసాయ రంగాన్ని చూడాల్సిన అవసరం ఉంది’’ అని విశదీకరించింది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ వ్యవసాయ రంగం తన బలాన్ని చాటుకుంటుందని పేర్కొంది. జీడీపీలో భాగమైన ఇతర రంగాలు కరోనాతో నేలచూపులు చూసిన వేళ, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఒక్కటే ఆశాకిరణంలా నిలిచాయని తెలిపింది. రుణ, మార్కెట్ సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్ కింద ఆహార శుద్ధికి తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి పెరిగిందని వివరించింది. దేశంలో సమ్మిళిత వృద్ధి అన్నది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లేకుండా సాధ్యం కాదంటూ.. ఇది వ్యవసాయరంగంపైనే ప్రధానంగా ఆధారపడి ఉందని పేర్కొంది. ‘‘నీటిపారుదల కింద సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది. హైబ్రిడ్, ఇతర మెరుగుపరిచిన విత్తనాల వాడకం, భిన్నమైన వంగడాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదే విధంగా విత్తన పరీక్షా కేంద్రాలను పెంచడం వంటివి తక్కువ ఉత్పాదకత ఆందోళనలను తగ్గిస్తుంది’’ అంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సాగు రంగం విషయమై సర్వే తన విస్తృతాభిప్రాయాలను తెలియజేసింది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనంతరం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తూ.. గ్రామస్థాయి కొనుగోళ్ల కేంద్రాలు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, గ్రామీణ మార్కెట్ల అభివృద్ధి, ఏపీఎమ్‌సీ మార్కెట్లకు బయట విక్రయించుకునే అవకాశం, గోదాముల నవీకరణ, రైల్వే రవాణా సదుపాయాల అభివృద్ధి అవసరమని తెలియజేసింది. ఈ చర్యలు ఉత్పత్తి అనంతరం నష్టాలను తగ్గించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కూడా సాయపడతాయని ఆర్థిక సర్వే తెలిపింది. మరింత పరిజ్ఞానంతో సాగు చేస్తే ఫలితాలు అధికమవుతాయని సూచిస్తూ.. ఇందుకోసం గ్రామీణ వ్యవసాయ పాఠశాలల ఏర్పాటును ప్రస్తావించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు (అటవీ, మత్స్య) దేశ ఉపాధిలో సగం వాటా ఆక్రమిస్తుండగా.. జీడీపీలో 18 శాతాన్ని సమకూరుస్తున్నాయి. కొత్త చట్టాలతో రైతులకు స్వేచ్ఛ నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేలో బలంగా సమర్థించుకుంది. నూతన తరహా మార్కెట్ స్వేచ్ఛకు నూతన వ్యవసాయ చట్టాలు తోడ్పడతాయని పేర్కొంది. దేశంలో చిన్న, మధ్యతరహా రైతుల జీవితాలను దీర్ఘకాలంలో మెరుగుపరుస్తాయని తెలిపింది. మొత్తం రైతుల్లో 85 శాతంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతోనే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించినట్టు వివరించింది. వీటికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలపై తన వాదనను సమర్థించుకుంది. వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీల (ఏపీఎమ్‌సీ) విషయంలో సంస్కరణల అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కిచెప్పింది. మౌలిక రంగానికి ప్రాముఖ్యత.. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు వృద్ధికి ఊతమిచ్చేందుకు ఉత్తమ మార్గంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. మొత్తం మీద ఆర్థికాభివృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి మౌలిక రంగం కీలకమైనదిగా పేర్కొంది. అన్‌లాక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ, మౌలిక రంగాలు వృద్ధి దిశగా పయనిస్తున్నాయంటూ, రోడ్ల నిర్మాణం తిరిగి కరోనా ముందు నాటి వేగాన్ని సంతరించుకుంటుందని అంచనా వేసింది. సంక్షోభానంతర సంవత్సరంలో (2021–22) క్రమబద్ధమైన చర్యల ద్వారా ఆర్థిక రికవరీకి వీలు కల్పించాలని, దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి దీర్ఘకాలిక వృద్ధి క్రమంలోకి కుదురుకునేలా చూడాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. 2020–25 కాలంలో రూ.111 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల నిధి అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేదిగా అభివర్ణించింది. ఇన్ఫ్రాలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం పీపీపీ అప్రైజల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు.. ఈ కమిటీ రూ.66,600 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులను సిఫారసు చేసినట్టు తెలియజేసింది. ‘రేషన్’ రేట్లను పెంచాల్సిందే ఆహార సబ్సిడీ నిర్వహించలేని స్థితికి చేరిందంటూ స బ్సిడీలను తగ్గించుకోక తప్పని పరిస్థితి ఉందంటూ ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 80 కోట్ల మందికి పైగా విక్రయిస్తున్న ఆహార ధాన్యాల ధరలను ప్రభుత్వం పెంచాలంటూ సూచించింది. రేషన్ షాపుల్లో బియ్యం కిలో ధర రూ.3, గోధుమలు కిలో రూ.2, ముతక ధాన్యాల ధరలు కిలో రూ.1గా ఉన్నట్టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం చెబుతోంది. పీడీఎస్ ద్వారా ఆహారోత్పత్తులపై సబ్సిడీ కోసం 2020–21 బడ్జెట్లో కేంద్రం రూ.1,15,569 కోట్లను కేటాయించడం గమనార్హం. ప్రజారోగ్యానికి పెద్దపీట.. ప్రజారోగ్యం కోసం జీడీపీలో కేటాయింపులను ఒక శాతం నుంచి 2.5–3 శాతానికి పెంచాలంటూ ఆర్థిక సర్వే ముఖ్యమైన సూచన చేసింది. దీనివల్ల ప్రజలు తమ జేబుల నుంచి చేసే ఖర్చును తగ్గించడం సాధ్యపడుతుందని తెలిపింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాలు పెరిగితే.. అది ప్రస్తుతమున్న ఖర్చులు 65 శాతం నుంచి 30 శాతానికి తగ్గేందుకు తోడ్పడుతుందని వివరించింది. లాక్డౌన్ విధానం కరోనా కేసులను నివారించడంతోపాటు లక్షమంది ప్రాణాలను కాపాడిందని సర్వే పేర్కొంది. సంక్షోభాలను తట్టుకునేవిధంగా ఆరోగ్య సదుపాయాలను అభివృద్ధి చేయాలని.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ మెరుగైన వైద్య సేవల కోసం టెలీమెడిసిన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని సర్వే సూచించింది. గ్రామీణ విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ల జోరు గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్లను కలిగిన విద్యార్థులు 36 శాతం నుంచి 2020–21లో 61 శాతానికి పెరిగినట్టు ఆర్థిక సర్వే ప్రస్తావించింది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, విద్యా పరంగా అసమానతలను తగ్గించొచ్చని సూచించింది. ‘‘డేటా నెట్వర్క్, కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, స్మార్ట్ఫోన్ల సేవలకు ప్రాధాన్యం పెరిగింది. డిస్టెన్స్ లెర్నింగ్, గ్రామీణ ప్రాంతాల నుంచి పనిచేసే అవకాశం ఇందుకు కారణం’’ అని సర్వే తెలిపింది. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను ఇందులో ప్రస్తావించింది. దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది వృద్ధి రుణ స్థిరత్వానికి దారితీస్తుంది. ఒకవేళ భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 2023–2029 మధ్య 3.8% కనిష్ట రేటు నమోదైనా కానీ, దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది. భారత్ తప్పకుండా వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతో మరింత మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం సాధ్యపడుతుంది. వృద్ధి 85% పేదరికాన్ని తగ్గించగలదు. జీడీపీలో ప్రజారోగ్యంపై ఖర్చును 2.5%కి పెంచితే.. అది ఒక సాధారణ కుటుంబం ఆరోగ్యం కోసం చేసే ఖర్చును 65% నుంచి 35%కి తగ్గిస్తుంది. – కేవీ సుబ్రమణియన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని వంద సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చే సంక్షోభంగా ఆర్థిక సర్వే అభివర్ణించింది. ► ప్రభుత్వ వినియోగం, ఎగుమతులు వృద్ధికి మరింత మద్దతుగా నిలుస్తాయి. 2020–21 ద్వితీయార్ధంలో ఎగుమతులు 5.8% తగ్గొచ్చు. దిగుమతులు సైతం 11.3 శాతం తగ్గొచ్చు. ► 2020–21లో కరెంటు ఖాతాలో 2% మిగులు. ► రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను సార్వభౌమ రేటింగ్ ప్రతిఫలించడం లేదు. ఇంత వరకు ఒక్క డిఫాల్ట్ రేటింగ్ లేని విషయాన్ని అర్థం చేసుకోవాలి. ► 2014–15 లో ప్రతీ రోజూ 12 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కొనసాగగా.. అది 2018–19 నాటికి 30 కిలోమీటర్లకు పెరిగింది. 2020–21లో రోడ్ల నిర్మాణం కరోనా కారణంగా రోజువారీ 22 కిలోమీటర్లకు పడిపోయింది. అన్‌లాక్‌తో తిరిగి ఇది పుంజుకోనుంది. ► కరోనా మహమ్మారి సవాళ్లలోనూ భారత ఏవియేషన్ పరిశ్రమ నిలదొక్కుకుని, దీర్ఘకాలంలో బలంగా పుంజుకోగలదని నిరూపించింది. ► 2019 జూలై నుంచి 2020 అక్టోబర్ మధ్య రూ.8,461 కోట్లతో 37 సాగర్మాల ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. ► రైల్వే రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. తద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ► కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలను ప్రకటించగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంతరించుకున్న వెంటనే వీటిని ఉపసంహరించుకోవడంతోపాటు, ఆస్తుల నాణ్యత మదింపు చేపట్టాలి. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ఇప్పటికీ స్వర్గధామం. 2020 నవంబర్‌లో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 9.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వర్ధమాన దేశాల్లో ఎఫ్‌పీఐలను ఆకర్షించింది భారత్ ఒక్కటే. ► భారత కంపెనీలు 2020–21లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.92,000 కోట్లను సమీకరించాయి. ఇది అంతక్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 46 శాతం అధికం. ► 9–12 తరగతుల విద్యార్థులకు దశల వారీగా వొకేషనల్ కోర్సులు. ► సామాజిక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం 2020–21లో రూ.17.16 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ► కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం... ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎమ్–జేఏవై)ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, అమలు చేయని రాష్ట్రాలతో పోలిస్తే ఆరోగ్య ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బీమా వ్యాప్తి పెరిగి, శిశు, చిన్నారుల మరణాల రేటు తగ్గేందుకు దోహదపడుతోంది. ► పన్నుల వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచేందుకు పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని పటిష్టం చేయాలి. ఇందుకోసం స్వతంత్ర వ్యవస్థ. ► ఐటీ–బీపీఎమ్ రంగం 2019–20లో 7.9 శాతం వృద్ధిని సాధించింది. ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ ఎంతో వేగాన్ని సంతరించుకుంది. డేటా వ్యయం తగ్గి మరింత అందుబాటులోకి వచ్చింది. నెలవారీ సగటున ఒక చందాదారు వైర్లెస్ డేటా వినియోగం 2019లో మార్చి నాటికి 9.1జీబీగా ఉంటే 2020లో 12.2 జీబీకి పెరిగింది. ► ద్రవ్యోల్బణం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా చూసేందుకు ఆహారోత్పత్తులకు ఉన్న వెయిటేజీలో మార్పులు చేయాలి. కోవిడ్–19 మహమ్మారిపరమైన గడ్డుకాలం గట్టెక్కామని, ఎకానమీ తిరిగి వేగంగా కోలుకుంటుందన్న ఆశాభావం సర్వేలో వ్యక్తమైంది. టీకాల లభ్యత, సేవల రంగం రికవరీ వంటి అంశాలు వృద్ధికి మరింతగా ఊతమివ్వగలవు. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ ఎకానమీ ప్రస్తుత అవసరాలకు తోడ్పడే పలు కీలక అంశాలను సర్వేలో పొందుపర్చారు. రాబోయే బడ్జెట్లోనూ ఇవి ప్రతిఫలించగలవని ఆశిస్తున్నాం. మరిన్ని రంగాలు పటిష్టమైన వృద్ధి బాట పట్టాలంటే 2021 ఆసాంతం ప్రభుత్వం నుంచి నిరంతరం సహాయ, సహకారాలు అవసరం. – ఉదయ్ శంకర్, ప్రెసిడెంట్, ఫిక్కీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలతో సర్వే ఆశావహ దృక్పథంతో రూపొందింది. కోవిడ్–19 వైరస్‌ను కట్టడి చేయడంతో పాటు పూర్తిగా నిర్మూలించగలిగితే 2021–22లో మరింత అధిక స్థాయిలోనూ వృద్ధి సాధించగలిగే అవకాశం ఉంది. – దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం -
కోడ్ పేరిట పేదల పథకానికి బ్రేక్
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర సబ్సిడీ సరుకులను ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రమంతటా పేదల గడప వద్దకే వెళ్లి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పంచాయతీ ఎన్నికల కోడ్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అడ్డు చెప్పారు. గ్రామాల్లో ఈ పథకం కింద మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీ ఎన్నికల దృష్ట్యా నిలిపివేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శుక్రవారం లేఖ రాశారు. కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేసుకోవచ్చని లేఖలో స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం, ఇందులో భాగంగానే ఈ నెల 21న మొబైల్ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించడం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 9,260 వాహనాలు ముందుకు కదలడంతో ఇక రేషన్ షాపుల వద్ద గంటల తరబడి వేచి చూసే పని ఉండబోదని, ఇంటి వద్దే బియ్యం, ఇతర సబ్సిడీ సరుకులు అందుతాయని, తద్వారా ఫిబ్రవరి నుంచి తమ కష్టాలు తీరతాయని భావించిన పేదలకు ఎన్నికల కమిషనర్ ఆదేశం శరాఘాతమైంది. వాస్తవానికి ఈ పథకం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైనుంచే అమలవుతోంది. అందువల్ల ఈ పథకాన్ని ఇప్పటికే కొనసాగుతున్నదిగా భావించి పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరినా ఎస్ఈసీ పట్టించుకోకపోవడం గమనార్హం. కేవలం పట్టణాల్లో మాత్రమే ఈ పథకాన్ని కొనసాగించుకోవచ్చని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఏజీ అభిప్రాయం కోరాలని నిర్ణయం.. ఈ పథకం అమలు కోసం ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు నాణ్యమైన బియ్యంతోపాటు మొబైల్ వాహనాలు వెళ్లాయి. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎస్ఈసీ నిలిపివేయడం సమంజసం కాదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇదే విషయమై అడ్వొకేట్ జనరల్‌తో చర్చించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. అంతిమంగా అడ్వొకేట్ జనరల్ సూచన మేరకు పథకం అమలుపై ముందుకెళ్లాలా.. వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
ఏపీలో సరికొత్త చరిత్ర.. ఇక ఇంటికే బియ్యం
సాక్షి, అమరావతి: పాదయాత్ర హామీలన్నీ నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేస్తూ నూతన ఒరవడికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. రేషన్ సరుకుల కోసం కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను నాడు పాదయాత్ర సమయంలో స్వయంగా గుర్తించిన సీఎం జగన్ ఇంటివద్దే వాటిని అందచేస్తామని మాట ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే రేషన్ సరుకుల సరఫరా వాహనాలను గురువారం ప్రారంభించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను అదే రోజు మంత్రులు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం 9,260 వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు. వాహనాల ఆపరేటర్లతో పాటు నోడల్ వీఆర్వోలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం రంగు మారి ఉండటం, నూకల శాతం ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వినియోగించడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తినేందుకు వీలుగా నాణ్యమైన బియ్యాన్ని ఇంటివద్దే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిల్లింగ్ సమయంలోనే నూకలు శాతాన్ని బాగా తగ్గించి కార్డుదారులకు నాణ్యతతో కూడినవి అందించేలా చర్యలు చేపట్టింది. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీలో కొందరు డీలర్లు సమయ పాలన పాటించకపోవడం, సక్రమంగా అందకపోవడం, నల్లబజారుకు తరలించడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే పేదలు సరుకుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు మొబైల్ వాహనం ద్వారా ఇంటివద్దే నాణ్యమైన బియ్యం అందించే విధానాన్ని ప్రభుత్వం తెస్తోంది. బుధవారం రాత్రి విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద బారులు తీరిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలు 22, 23న వాహనదారులకు శిక్షణ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియాన్ని ఇంటివద్దే పంపిణీ చేస్తారు. మొబైల్ ఆపరేటర్ (వాహనదారుడు) రోజూ ఉదయం బియ్యంతో పాటు ఈ–పాస్ యంత్రాన్ని రేషన్ డీలర్ నుంచి తీసుకోవాలి. ఆఖరులో మిగిలిన స్టాకుతో పాటు ఈ–పాస్ యంత్రాన్ని తిరిగి డీలర్‌కు అప్పగించాలి. ఆపరేటర్ రోజూ ఈ–పాస్ మిషన్‌లో తన హాజరును నమోదు చేసుకోవాలి. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీపై ఈ నెల 22, 23 తేదీల్లో మొబైల్ ఆపరేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వాహనం వినియోగం, తూకం యంత్రం, డోర్ డెలివరీ తదితరాలపై అవగాహన కల్పిస్తారు. ఈ నెల 24 నుంచి 29 వరకు వాహన ఆపరేటర్లు, నోడల్ వీఆర్వోలు ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. క్లస్టర్ పరిధిలోని రేషన్ డీలర్లు, వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని కలిసి పరిచయం చేసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి.. బియ్యం, నిత్యావసర సరుకులను కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్ వాహనాలను రివర్స్ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు ఈ వాహనాలను వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీతో సమకూర్చింది. ఒక్కో వాహనం విలువ రూ. 5,81,000 కాగా రూ.3,48,600 సబ్సిడీగా అందించింది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతి నెలా అద్దె చెల్లిస్తూ ఆరేళ్ల పాటు వినియోగించుకోనుంది. ఏ వర్గాలకు ఎన్ని వాహనాలు? ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 700 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,300 బీసీ కార్పొరేషన్ ద్వారా 3,800 మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా 660 ఈబీ కార్పొరేషన్ ద్వారా 1,800 మొబైల్ వాహనంలో వసతులు ఇలా మొబైల్ వాహనంలో తూకం వేసే యంత్రం (వేయింగ్ స్కేల్), కొలతల పరికరాలు ఉంటాయి. ఎల్ఈడీ ల్యాంప్స్, ఈ–పాస్ యంత్రాల ఛార్జింగ్ పాయింట్లు, మినీ ఫ్యాన్, చిన్న మైక్ ఉంటుంది. ప్రథమ చికిత్స బాక్సు, నగదు పెట్టె, అగ్ని మాపక యంత్రం, నోటీసు బోర్డు ఏర్పాటు చే శారు. తూకం యంత్రం 12 నుంచి 18 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. రేషన్ సరఫరాలో పాత విధానం ఇదీ – రేషన్ సరుకుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి రావడంతో రోజువారీ కూలీలు వేతనాలు కోల్పోయే వారు. – సరుకుల పరిమాణం, పంపిణీలో కోతలపై పలు ఫిర్యాదులు అందేవి. రేషన్ సరుకుల్లో కొత్త విధానం ఇలా... – కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్ సరుకుల పంపిణీ జరగడం వల్ల కూలీ పనులకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. – కార్డుదారుల సమక్షంలోనే సంచులు తెరిచి కచ్చితమైన ఎలక్ట్రానిక్ తూకంతో పంపిణీ చేస్తారు. – వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దే కార్డుదారుల వేలిముద్ర తీసుకుని నాణ్యమైన, కచ్చితమైన తూకం కలిగిన బియ్యాన్ని తిరిగి వినియోగించే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు. – కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతి బియ్యం బస్తాకూ సీల్ ఉంటుంది, ప్రతి సంచికీ యూనిక్ కోడ్ వల్ల ఆన్లైన్ ట్రాకింగ్ జరుగుతుంది. అన్ని మొబైల్ వాహనాలకు జీపీఎస్ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్ యాప్ ద్వారా పంపిణీ వివరాలు రియల్ టైంలో తెలుసుకోవచ్చు. మొబైల్ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాలి. దీనిపై నిరంతరం సోషల్ ఆడిట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ తూకం ద్వారా కచ్ఛితమైన తూకంతో సరుకుల పంపిణీ చేయనున్నారు. సచివాలయాల ద్వారా బియ్యం కార్డుల సేవల వివరాలు (2020 జూన్ నుంచి ఇప్పటివరకు) కొత్త బియ్యం కార్డులు 4,93, 422 కొత్త బియ్యం కార్డులలో సభ్యులను చేర్చడం 17,07,928 కొత్త బియ్యం కార్డులను విభజించడం 4,38,013 మొత్తం సేవలు 26,39,363 -
పోర్టబులిటీ.. ‘వలస’పాలిట పెన్నిధి
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థలో పోర్టబులిటీ సౌకర్యంతో లబ్ధిదారులు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఉచిత సరుకులు పొందుతున్నారు. ఉపాధి నిమిత్తం పనుల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలకు పోర్టబులిటీ సౌకర్యం ఆదుకుంటోంది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు లభించింది. పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి కూడా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ, కర్ణాటకల్లోనూ అంతర్రాష్ట్ర పోర్టబులిటీని అమల్లోకి తెచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు అక్కడే నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏప్రిల్ నుంచి నెలకు రెండు విడతల చొప్పున ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తోంది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ విడత ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1.51 కోట్ల కార్డుదారులుంటే ఇప్పటికి 1.13 కోట్ల కుటుంబాలు ఉచిత సరుకులు అందుకున్నాయి. ఈ నెలలో పంపిణీ ప్రారంభమైన వారంలోనే(శనివారం నాటికి) 34 లక్షలకు పైగా కుటుంబాలు పోర్టబులిటీతో లబ్ధిపొందారు. 13వ విడతలో సరుకులు తీసుకున్న, పోర్టబులిటీతో లబ్ధి పొందిన కుటుంబాల వివరాలు (జిల్లాల వారీగా): జిల్లా సరుకులు తీసుకున్న కుటుంబాలు పోర్టబులిటీతో..లబ్ధి పొందిన కుటుంబాలు అనంతపురం 10,57,690 2,56,362 చిత్తూరు 9,59,828 1,71,568 తూ.గోదావరి 13,14,140 4,22,821 గుంటూరు 11,39,290 4,68,253 కృష్ణా 9,84,295 3,74,443 కర్నూలు 9,80,230 3,49,778 ప్రకాశం 7,89,353 2,02,858 శ్రీకాకుళం 1,97,250 1,595 నెల్లూరు 6,47,311 1,76,644 విశాఖపట్నం 10,53,722 3,75,345 విజయనగరం 6,02,782 92,375 ప. గోదావరి 9,91,955 3,29,270 వైఎస్సార్ కడప 6,78,163 1,83,813 మొత్తం 1,13,96,009 34,05,125 -
తెలంగాణలో ఉన్నా రేషన్
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలోనే ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని అంతర్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. ఉపాధి పనుల నిమిత్తం మన రాష్ట్రం నుంచి తెలంగాణకు వలస వెళ్లిన పేదలకు అంతర్ రాష్ట్ర పోర్టబిలిటీ ఎంతో ప్రయోజనం కల్గిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఒక క్లస్టర్‌గా గుర్తించి ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా అమలైతే దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో రేషన్ కార్డులున్న 349 మంది తెలంగాణలో బియ్యంతో పాటు ఇతర సరుకులు తీసుకున్నారు. తొలి రోజు 9.76 లక్షల మందికి.. ► రాష్ట్రంలో 12వ విడత ఉచిత సరుకులు పంపిణీ ఆదివారం ప్రారంభమైంది. మొదటి రోజున 9.76 లక్షల మంది ఉచిత సరుకులు పొందారు. ► అంతర్ జిల్లాల పోర్టబిలిటీ ద్వారా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందిన 1.34 లక్షల మంది బియ్యంతో పాటు శనగలు ఉచితంగా తీసుకున్నారు. ► ఈ విడతలో 1,50,80,690 బియ్యం కార్డుదారులకు ఒక్కో మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున శనగలు కేటాయించారు. -
రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆహార ఇబ్బందులు తప్పాయి. రబీలో ఆశించిన మేరకు ధాన్యం దిగుబడి రావడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ సవ్యంగా సాగింది. రబీలో రికార్డు స్థాయిలో 31.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. కరోనా కారణంగా పనులు లేక ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం నెలకు రెండు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ► రాష్ట్రంలో ప్రస్తుతం 1,49,20,706 కార్డులు ఉన్నాయి. వీటిలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోనివి 89 లక్షలకు పైగా, ఆ చట్టం పరిధిలోకి రానివి 60 లక్షల వరకు ఉన్నాయి. ► ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారులకే కేంద్రం బియ్యం ఇస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. ► ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని కార్డుదారులకు పంపిణీతో రాష్ట్రంపై రూ.800 కోట్లు అదనపు భారం పడింది. ► జూలై నుంచి నవంబర్ వరకు ఉచితంగా బియ్యం ఇస్తామని కేంద్రం ప్రకటనతో రాష్ట్రంపై మరో రూ.1,663 కోట్ల అదనపు భారం పడనుంది. ► ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉండాల్సిన బఫర్ స్టాకూ వాడేశారు. కనీసం 15.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం స్పందించనేలేదు. రబీ ధాన్యమే ఆదుకుంది... నెలకు రెండు సార్లు పంపిణీతో ఆఖరు బఫర్ స్టాకునూ వాడుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అదనంగా కేటాయించాలని కేంద్రానికి లేఖ రాశాం. రైతుల నుంచి రబీలో కొనుగోలు చేసిన ధాన్యమే ప్రస్తుతం ఆదుకుంటోంది. – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ -
రాష్ట్రంలో 2.60 లక్షల క్లస్టర్లు
సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యాన్ని పేదల ఇళ్లకే డెలివరీ చేసేందుకు రాష్ట్రంలో 2.60 లక్షల క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,93,488 క్లస్టర్లున్నాయి. ఒక్కో క్లస్టర్ పరిధిలో 50 నుంచి 75 కుటుంబాలుండేలా చర్యలు తీసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసేందుకు, అవినీతికి తావులేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో క్లస్టర్లో ఒక్కో గ్రామ వలంటీర్ సేవలందిస్తారు. వలంటీర్లు బియ్యం కార్డుల మ్యాపింగ్‌ను దాదాపుగా పూర్తిచేశారు. నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన శ్రీకాకుళం జిల్లాలో లబ్ధిదారులు గడప దాటకుండానే సరుకులు సకాలంలో వారి ఇంటికే చేరుతున్నాయి. ఈ విధానం మరో మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా పౌరసరఫరాల శాఖాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ► క్లస్టర్ పరిధిలో ఉన్న కార్డుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఎదుటే నాణ్యమైన బియ్యం తూకం వేసి పంపిణీ చేస్తారు. ► ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 13,370 మొబైల్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ► ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అయ్యే అదనపు ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ► ఈ విధానం అందుబాటులోకొస్తే 1.49 కోట్ల కార్డుదారులందరికీ రెండు మూడు రోజుల్లోనే సరుకులందుతాయి. ► రవాణాలో బియ్యం కల్తీ చేయకుండా గోడౌన్ల నుంచి వచ్చే ప్రతి గన్నీ బ్యాగుపైనా ప్రత్యేకంగా స్ట్రిప్ సీల్, బార్ కోడ్ ఉంటాయి. ► క్లస్టర్ల వివరాలను గ్రామ సచివాలయాల నుంచి తీసుకుని, వాటి ఆధారంగా బియ్యం కార్డులను కేటాయిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ చెప్పారు. -
31,53,524 మెట్రిక్ టన్నులు
సాక్షి, అమరావతి: రబీ సీజన్(2019–20)లో 2,15,150 మంది రైతుల నుంచి రూ.5,744.96 కోట్ల విలువ చేసే 31,53,524.520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా వారికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,437 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కాగా క్వింటాలు ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.1,835, సాధారణ ధాన్యానికి 1,815 చొప్పున మద్దతు ధర నిర్ణయించింది. ► స్వయం సహాయక గ్రూపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. ► ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం ఉందని గుర్తించి ఆ మేరకు సేకరించిన ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ (సీఎమ్మార్) కోసం మిల్లులకు పంపుతారు. ధాన్యం మిల్లులకు చేరిన 15 రోజుల్లోగా మర ఆడించిన బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. ► బియ్యం కొరత ఉన్న జిల్లాలకు మిగులు ఉన్న జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ► సేకరించిన ధాన్యానికి మొత్తం రూ.5,744.96కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.4,514.66 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
వేలి ముద్రలు పడకపోయినా రేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి ష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సాధారణంగా ఈ–పాస్ మిషన్‌లో వేలి ముద్రలు వేస్తేనే సరుకులు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, లెప్రసీ (కుష్టు వ్యాధి) బాధితులు, తాపీ పని చేసే కార్మికులు, రజకులు (ఇస్త్రీ చేయడం) తదితర వృత్తులు చేసే వారికి వేలిముద్రలు అరిగిపోయి యంత్రాల్లో పడటం లేదు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఇచ్చే సరుకులు తీసుకోవడానికి వారు ప్రతి నెలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ‘నామినీ’ (బంధువుల) ద్వారా బయోమెట్రిక్ తీసుకొని సరుకులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐరిష్ యంత్రాల్లో సమస్య వేలి ముద్రలు సరిగా పడని వారికోసం ఐరిష్ మిషన్లు అందుబాటులో ఉంచినా, పలు కారణాలతో అవి సరిగా పనిచేయడంలేదు. పేదలెవరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నామినీ ద్వారా సమీప బంధువుల బయోమెట్రిక్ తీసుకొని లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తోంది. బంధువులు అందుబాటులో లేని పక్షంలో వీఆర్వో లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి బయోమెట్రిక్ తీసుకొని సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇంటి వద్దే సబ్సిడీ సరుకుల పంపిణీ వేలిముద్రలు, ఐరిష్ యంత్రాల సమస్య వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఇంటి వద్దే సబ్సిడీ సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిం ది. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సబ్సిడీ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురానుంది. వేలి ముద్రలు సరిగా పడకపోవడం తదితర కారణాలతో నామినీ వేలిముద్రల సాయంతో ఈనెలలో 35,282 మంది లబ్ధిదారులు ఉచిత సరుకులు తీసుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేలిముద్రల సమస్యను పరిష్కరించి నామినీ విధానంలో రేషన్ సరుకులు అందిస్తుండడంపై పేద లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కార్డు లేని వారికీ రేషన్
న్యూఢిల్లీ: రేషన్ కార్డు లేని వారికి సైతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే నిత్యావసరాలను సరఫరా చేసే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు పరిగణనలోనికి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏ రాష్ట్రానికి చెందిన రేషన్ కార్డు అయినా యావత్ దేశంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇది విధానపరమైన విషయమనీ, భారత ప్రభుత్వం ఇటువంటి సౌకర్యాన్ని కల్పించడానికి పూనుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. ‘సెంట్రల్ విస్టా’పై స్టేకు నో సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నూతన పార్లమెంట్, కేంద్రప్రభుత్వ కార్యాలయాల కొత్త భవనాల ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ‘కోవిడ్ సంక్షోభ సమయంలో ఎవరూ ఏమీ చేయలేరు’అంటూ వ్యాఖ్యానించింది. -
పకడ్బందీగా ‘పంపిణీ’ వ్యవస్థను అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యతని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం కావాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ప్రతీ మనిషికి 12 కిలోల బియ్యం ఇవ్వాలనే నిర్ణయం అభినంద నీయమని, అయితే పంపిణీలో సమస్యలు ఎదురుకావడం సరి కాదని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. షాపుల ఎదుట భారీ క్యూలు ఉండటం, భౌతిక దూరం పాటించకపోవడం దుష్పరిణామాలకు దారితీయకూడదని అభిప్రాయపడ్డారు.