
గ్రామీణులకు సబ్సిడీ గోధుమల నిలిపివేత!
- నగరాల్లో కార్డుకు రెండు కిలోలు..
- పట్టణాల్లో కిలో యథాతథం
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందించే సబ్సిడీ సరుకులు దశల వారీగా నిలిపివేతకు గురవుతున్నాయి. రెండేళ్ల క్రితం పామాయిల్ సరఫరాకు మంగళం పాడిన ప్రభుత్వం ఇటీవల కేంద్రం సబ్సిడీ ఎత్తివేయడంతో చక్కెర పంపిణీ నిలిపివేసింది. మరోవైపు కిరోసిన్ కోటా కూడా తగ్గించింది. తాజాగా గ్రామీణ ప్రాంతాలకు సబ్సిడీ గోధుమల పంపిణీ పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్లలో సబ్సిడీపై రెండు కిలోల చొప్పున, మున్సిపాలిటీల్లో యథాతథంగా కిలో చొప్పున గోధుమలు పంపిణీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ నెల కోటా నుంచి ఈ ఆదేశాలు అమలు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికా రులకు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
బియ్యం కోసం తగ్గిన గోధుమల కోటా
కేంద్రం నుంచి బియ్యం అదనపు కోటా కోసం రాష్ట్ర ప్రభుత్వం గోధుమల కోటాను తగ్గించుకుంది. కేంద్రం నుంచి కేటాయిస్తున్న బియ్యం కోటా సరిపోని కారణంగా గోధుమలకు బదులు బియ్యం కేటాయించాలని మొరపెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన కారణంగా గోధుమల కోటా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ జరిగే గ్రామీణ ప్రాంతాల గోధుమల కోటాను నిలిపివేసింది.