ఈ నెలకు పాతపద్ధతిలోనే సరకుల పంపిణీ
వేలిముద్రలు తీసుకుని పంపిణీకి పౌరసరఫరాల అధికారులకు ఆదేశం
సాక్షి, విశాఖపట్నం : ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా అమలు చేస్తున్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) మిషన్లు జిల్లా ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మిషన్లు మొరాయించడం, సర్వర్లు డౌన్ కావడం, సెల్‌నెట్‌వర్క్ పనిచేయకపోవడంతో జిల్లావ్యాప్తంగా వినియోగ దారులు నరకంచూస్తున్నారు. ఈపాస్ మిషన్ల ద్వారా మాత్రమే పంపిణీ చేయాలని జిల్లాఅధికారులు తేల్చి చెప్పడంతో డీలర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆది నుంచి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న డీలర్లు పనిచేయని మిషన్లను మూలన పెట్టేస్తున్నారు. కొత్త విధానంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం 30 శాతం మంది కార్డుదారులు రేషన్‌కు నోచుకోలేదు. యలమంచిలి, అనకాపల్లి, భీమిలి, నర్సీపట్నం పట్టణాల్లో 274 షాపులపరిధిలో మిషన్లు పని చేయకపోయినా, సర్వర్లు ఇబ్బంది పెడుతున్నా అతికష్టమ్మీద ఇప్పటి వరకు 60 శాతం కార్డు దారులకు రేషన్ సరఫరా చేయగలిగారు. వీటిలో ఈపాస్ మిషన్ల ద్వారా 20 శాతం కార్డుదారులకు సరకులివ్వగా, మిగిలిన 40 శాతం కార్డుదారులకు పాతపద్ధతిలోనే పంపిణీ చేశారు. ఇక విశాఖలోని 412 రేషన్ షాపుల్లో కొత్త విధానాన్ని ఒకేసారి అమలు చేశారు. ఈ షాపుల పరిధిలో 3,71,625 కార్డులుండగా, ఇప్పటి వరకు అతికష్టమ్మీద 75వేల కార్డుదారులకు పంపిణీ చేయగా,మరో 1.19లక్షల కార్డుదారులకు పాత పద్ధతిలోనే సరఫరా చేశారు. ఇప్పటి వరకు జీవీఎంసీపరిధిలో 54 శాతం మంది కార్డు దారులకు సరకులు పంపిణీ చేశారు. రోజూ రేషన్‌దుకాణాలకు వందలాదిమంది కార్డుదారులు రావడం...గంటలతరబడి నిరీక్షించడం..చివరకు మిషన్లు పనిచేయక, సర్వర్లు డౌన్‌కావడం వంటిసమస్యలతో వెనుదిరిగడం పరిపాటిగా మారుతోంది. ముఖ్యంగారోజువారీ కూలీ పనులు చేసుకునే నిరుపేదల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. గత పదిహేను రోజుల్లో సుమారు పదిరోజుల పాటు రేషన్‌షాపుల చుట్టూనే తిరగడం వలన జీవనోపాధి కోల్పోయే కుటుంబం గడవని పరిస్థితి నెలకొంది. మారుమూల ప్రాంతాల్లో తెల్లవారుజామున నెట్‌వర్క్ పనిచేస్తోంది. దీంతో కార్డుదారులను ఉదయమే రమ్మని చెప్పి స్లిప్‌లు ఇస్తుండడంతో వేకువజాము నుంచే షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. తాను వారం రోజులుగా క్రమం తప్పకుండా ఎఫ్‌పీషాపు చుట్టూ తిరుగు తున్నానని, ఒక రోజు సర్వర్ డౌన్ అయిందని..మరో రోజు నెట్‌వర్క్ లేదని.. ఇంకో రోజు మిషన్ పనిచేయడం లేదని తిప్పుతున్నారని..చివరకు వేలిముద్రలు తీసుకున్నా ఒకే కాక తర్వాత రమ్మని చెప్పి పంపిస్తున్నారని విశాఖ సీతమ్మధారకు చెందిన సీహెచ్ అప్పలనాయుడు వాపోయారు. ఇతర మున్సిపాల్టీల్లోనూ ఇదే దుస్థితి. దీంతో పాత పద్ధతిలోనే సరకులిచ్చేందుకు అనుమతులివ్వాలని డీలర్లు ఒత్తిడి తెస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రభుత్వ ఈవిధానాన్ని పక్కన పెట్టేందుకు ససేమిరా అంటోంది. దీంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు గుర్తించినప్పటికీ జిల్లా అధికారులు కూడా మిన్నకుండిపోతున్నారు. చివరకు వేలిముద్రలు తీసుకుంటే చాలు..మిషన్ ఫెయిల్ అయినా కార్డుదారులను తిప్పించుకోకుండా ఈ నెల వరకు సరకులు ఇవ్వా ల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ జే.నివాస్ ఆదేశాలు జారీచేశారు. నాలుగు రోజుల నుంచి ఇదే ప్రక్రియలో సరకుల పంపిణీ వేగం పుంజుకుంది.ఈ పాస్ మిషన్లను పక్కన పెట్టయినా 25వ తేదీలోగా సరకుల పంపిణీ పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ పాస్ ఫెయిల్..అయినా రేషన్
Published Fri, Apr 17 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM
Advertisement
Advertisement