సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. ఇంటింటికీ రేషన్ అందించే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ (ఎండీయూ వాహనాలు) క్రమం తప్పకుండా లబ్ధిదారుల ప్రాంతాలకు వెళ్లేలా పక్కాగా పర్యవేక్షించనుంది. ఇందులో భాగంగా రూట్ మ్యాపింగ్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి సాంకేతిక సేవలను వినియోగించనుంది. ఎండీయూ పరిధిలోని లబ్ధిదారులు తమ ఇళ్ల నుంచి ఎక్కువ దూరం వెళ్లకుండా సమీపంలోకే వాహనం వచ్చేలా అధికారులు ప్రత్యేక పాయింట్లను గుర్తిస్తున్నారు.
ఈ కొత్త విధానం ద్వారా ఐదారు ఇళ్లకు ఒకచోట ప్రతి నెలా ఎండీయూలో రేషన్ అందించేలా సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. వాహనాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా బియ్యం లబ్ధిదారులకు అందుతుంది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చె నెలలో మండలానికి ఒక ఎండీయూ పరిధిలో దీనిని అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రభుత్వ విప్లవాత్మక చర్యలతో పెరిగిన రేషన్ పంపిణీ శాతం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రతి నెలా రేషన్ తీసుకునేవారి శాతం గణనీయంగా పెరిగింది. లబ్ధిదారులకు నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం ఇవ్వడంతో పాటు 9,260 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించడం మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రతి నెలా 1.45 కోట్ల కార్డుదారులకు 2.30 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతుంది.
గతంలో నెలకు 80 నుంచి 85 శాతం మాత్రమే రేషన్ పంపిణీ జరిగితే.. ఇప్పుడు 90 శాతానికి చేరుకొంది. మరోవైపు అనివార్య కారణాలతో ఎండీయూ వాహనదారులు ఎవరైనా తప్పుకుంటే వారి స్థానాన్ని భర్తీ చేసేంత వరకు గరిష్టంగా మూడు నెలల పాటు ఇన్‌చార్జి ఎండీయూకు (వేరే ఎండీయూ వాహనదారుడు పని చేస్తే) బాధ్యతలు అప్పగిస్తోంది. వీరికి నెలకు రూ.18,000 చొప్పున అదనంగా అందిస్తూ ఎక్కడా రేషన్ పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు చేపడుతోంది.
2 నుంచి 3 నెలలు నిల్వ చేసిన తర్వాతే
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసిన వెంటనే పీడీఎస్‌లోకి తీసుకురావడంతో సమస్యలు వస్తున్నాయి. కొత్త బియ్యం వండితే అన్నం బాగోలేదని, ముద్దగా అవుతుందనే ఫిర్యాదులున్నాయి. దీనిని అధిగమించేందుకు కస్టమ్ మిల్లింగ్ అనంతరం 2 నుంచి 3 నెలలు బఫర్ గోడౌన్లలో నిల్వ ఉంచిన తర్వాతే పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
మరింత సమర్ధంగా ఇంటింటికీ బియ్యం
Published Sun, Nov 27 2022 5:24 AM | Last Updated on Sun, Nov 27 2022 5:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment