
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం కార్డుదారులకు పూర్తిస్థాయిలో నిత్యావసరాలను అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఆయా పంట ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2023ను మిల్లెట్ ఇయర్‌గా ప్రకటించిన నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాల్లో చిరుధాన్యాల (జొన్నలు, రాగులు) పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి జొన్న ఉత్పత్తులను సేకరించగా.. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎఫ్‌సీఐ ద్వారా రాగులు కొనుగోలు చేయనుంది.
చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేలా..
పేదలకు పీడీఎస్ కింద పౌష్టికాహార ఉత్పత్తులను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో ఖరీఫ్ నుంచి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు మిల్లెట్లు పండించేలా అవగాహన కల్పించనున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తులను స్థానికంగానే రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి పీడీఎస్‌లో పంపిణీ చేయనున్నారు. ఫలితంగా రైతులకు మార్కెట్‌లో పక్కా ధర భరోసా దక్కనుంది.
వచ్చే ఖరీఫ్‌లో కందుల కొనుగోలు
రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 4లక్షల టన్నుల వరకు కందుల దిగుబడి నమోదవుతోంది. ఈ క్రమంలోనే పీడీఎస్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఖరీఫ్‌లో నేరుగా రైతుల నుంచి కందులు సేకరించేలా పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 1.45 కోట్ల రైస్ కార్డులు ఉండగా.. ఇందులో ప్రతి నెలా సగటున 5,500 టన్నుల కందిపప్పు అవసరం అవుతున్నది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో కిలో కందిపప్పు సాధారణ రకం రూ.120–రూ.125, ఫైన్ వెరైటీ రూ.130 వరకు పలుకుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కే అందిస్తోంది. ఫలితంగా ఏప్రిల్‌లో ఏకంగా 7,100 టన్నుల కందిపప్పును వినియోగదారులకు సరఫరా చేసింది.
బియ్యం బదులు గోధుమ పిండి
కేంద్ర ప్రభుత్వం పీడీఎస్ కింద నెలకు 1,800 టన్నులు మాత్రమే గోధుమ ఉత్పత్తులను రాష్ట్రానికి కేటాయిస్తుండగా.. వాటిని తొలి ప్రాధాన్యత కింద వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు. కిలో రూ.16 చొప్పున కార్డుకు గరిష్టంగా రెండు కిలోలు సరఫరా చేస్తున్నారు. అయితే గోధుమను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు వినియోగదారుల నుంచి ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇక్కడ ప్రతినెలా ఇచ్చే రేషన్‌లో కేజీ బియ్యం బదులు ఉచితంగా గోధుమ పిండి ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది.
స్థానిక అవసరాలకు అనుగుణంగా..
రాష్ట్రంలో ప్రజా పంపిణీకి అవసరమైన నిత్యావసరాల ఉత్పత్తులను స్థానికంగా రైతుల నుంచి కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఫలితంగా రైతులకు మద్దతు ధర భరోసా దక్కడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం సరుకు ఇచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు.
– హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment