సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేస్తుండగా.. ఈ నెల నుంచి ఐసీడీఎస్ (అంగన్‌వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని నేరుగా రవాణా చేయనుంది.
తద్వారా ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ఆదాయం సమకూర్చనుంది. ఇప్పటివరకు అంగన్‌వాడీలు రేషన్ దుకాణం నుంచి, స్కూళ్లు, హాస్టళ్ల యాజమాన్యాలు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి వ్యయప్రయాసలతో బియ్యం తెచ్చుకునేవారు. ఒకరోజు ప్రత్యేకంగా బియ్యం కోసం కేటాయించాల్సి వచ్చేది. పైగా రవాణా, ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఇబ్బందులు పడేవారు. వీటన్నింటికి పరిష్కారంగా ప్రభుత్వమే రేషన్‌ను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది.
ఫైన్ క్వాలిటీ ధాన్యం సేకరణ రాష్ట్రంలో అంగన్‌వాడీలు, స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థుల భోజనానికి ఏడాదికి 2.54 లక్షల టన్నుల బియ్యం అవసరం. ఇప్పటివరకు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు సార్టెక్స్ బియ్యాన్ని (సాధారణ రకాలు) ఫోర్టిఫై చేసి ఆహారంగా అందిస్తోంది. వచ్చే జనవరి నుంచి ఫైన్ క్వాలిటీ (స్థానిక రకాలు, సన్న రకాలు) బియ్యాన్ని కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగానే 2022–23 ధాన్యం సేకరణలో మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అవసరమైన ఫైన్ క్వాలిటీ ధాన్యాన్ని ఏడాదికి 4 లక్షల నుంచి 5 లక్షల టన్నుల మేర రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. తద్వారా విద్యార్థులకు, రైతులకు మేలు జరగనుంది. దీనికితోడు అప్పుడే పండిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ద్వారా వచ్చే బియ్యంతో వండే అన్నం ముద్దగా ఉంటుందనే ఫిర్యాదులను పరిష్కరించేలా.. సేకరణకు, మిల్లింగ్‌కు మధ్య రెండు నుంచి మూడునెలల వ్యవధి ఉండేలా చర్యలు చేపడుతోంది.
ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ రైస్
ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జిల్లాలతో పాటు ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లకు మాత్రమే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకున్న వారిలో రక్తహీనత శాతం తగ్గినట్టు ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి.
ఇందులో భాగంగానే పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు మొత్తం ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రజలకు అవగాహన కల్పించేలా అంగన్‌వాడీలు, స్కూల్ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
ఫోర్టిఫైడ్ రైస్ అంటే..
మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు బియ్యానికి అదనంగా చేర్చడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి12 వంటి కీలక సూక్ష్మపోషకాలను బియ్యంలో అదనంగా చేరుస్తారు.
విటమిన్ టాబ్లెట్ కంటే పవర్‌ఫుల్
ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ రైస్ విటమిన్ టాబ్లెట్ కంటే ఎంతో పవర్‌ఫుల్. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. దీంతోపాటు విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో 9,260 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని అంగన్‌వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లకు విస్తరిస్తున్నాం.
– అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ
పాఠశాలలకు నేరుగా బియ్యం
Published Tue, Oct 4 2022 4:11 AM | Last Updated on Tue, Oct 4 2022 2:37 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment