రేషన్ డీలర్ నుంచి మిల్లర్ వరకు అక్రమ దందా
ప్రతి నెలా వందల కోట్లలో వ్యాపారం
వరకు ఇచ్చి కొనుగోలు
డీలర్ల వద్ద, గ్రామాల్లో మహిళల నుంచి రూ.10 వరకు ఇచ్చి కొంటున్న దళారులు
దళారుల వద్ద కొని పొరుగు రాష్ట్రాల్లో రూ.20 వరకు విక్రయిస్తున్న పెద్ద వ్యాపారులు
రేషన్ బియ్యాన్ని కొని రీసైక్లింగ్ చేసి.. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్న కొందరు మిల్లర్లు
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామం
రేషన్ దుకాణానికి ఓ మహిళ వచ్చి డీలర్‌కు ఆహార భద్రతా కార్డు ఇచ్చింది.
డీలర్: అమ్మా బియ్యం ఇయ్యాల్నా.. పైసలా..
మహిళ: ఒక్కలకు ఎన్ని కిలోల బియ్యం ఇత్తండ్రు
డీలర్:10 కిలోలు
మహిళ: మా కార్డుల ఐదుగురం ఉన్నం గద. పైసలే ఇయ్యి
డీలర్: యేలి ముద్ర ఎయ్యమ్మా... కిలకు ఎనిమిది (రూ.8) లెక్కన నాలుగు వందలిస్త
మహిళ: సరేనయ్య.. పైసలియ్యి
వచ్చిన మహిళ వేలిముద్ర వేయగానే... సదరు డీలర్ 50 కిలోల బియ్యం తూకం వేసి, ఆ బియ్యాన్ని పక్కకు పెట్టి ఆమెకు రూ.400 ఇచ్చాడు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం 80 శాతం వరకు పక్కదారి పడుతోంది. రూపాయికి కిలో చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ బియ్యాన్ని రూ.8 నుంచి రూ.15 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్న ముఠాలు ప్రతి నెలా వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరం మొదలుకొని పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. రేషన్ దుకాణం నుంచి మొదలయ్యే ఈ దందా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో ముగుస్తోంది.
అక్రమ దందాలో చిన్న చిన్న దళారులు మొదలుకొని పెద్ద వ్యాపారులు, రైస్ మిల్లర్లు కూడా ఉండటం గమనార్హం. పీడీఎస్ బియ్యం జాతీయ రహదారులు, రైలు మార్గాల ద్వారా గమ్య స్థానాలకు నిరాటంకంగా చేరుతున్నా.. పట్టించుకునేవారే లేరు. బియ్యంతో పాటే పోలీస్, రైల్వే పోలీస్, పౌర సరఫరాల సంస్థ అధికారులను ‘కొనుగోలు’చేస్తున్న వ్యాపారులు ప్రభుత్వం కోట్లు వెచ్చించి పేదలకు పంచుతున్న బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలోని రూపాయి బియ్యం (కరోనా నాటి నుంచి దాదాపుగా ఉచితంగానే సరఫరా) ఇతర రాష్ట్రాల్లో రూ.20కు పైగా పలుకుతుండడం గమనార్హం.
కరోనా నాటి నుంచి ఉచితంగానే..
► సాధారణంగా ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబాల్లోని ఒక్కొక్కరికి 6 కిలోలు.. కిలో రూపాయి చొప్పున ఇస్తారు. అయితే కరోనా మొదలైన 2020 నుంచి ఒకటి రెండు నెలలు మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగానే బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలో గత జనవరి నుంచి మే, జూన్ నెలలు మినహా ఒక్కొక్కరికి ప్రతినెల 10 కిలోల చొప్పున ఇస్తున్నారు. ఆగస్టు నెలలో ఏకంగా 15 కిలోల చొప్పున పౌరసరఫరాల సంస్థ బియ్యం పంపిణీ చేసింది.
రేషన్ బియ్యంపై చులకన భావం!
► ఆహార భద్రతాకార్డు ఉన్న కుటుంబంలోని సభ్యులు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్ర వేసి తమ కోటా బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రామాల్లో పెరిగిన వరిసాగు, రైతు కుటుంబాలు సొంతంగా పండించిన బియ్యం తినే అలవాటు, రేషన్ బియ్యంపై ఉన్న చులకన భావం లాంటి కారణాల వల్ల చాలామంది ఈ బియ్యాన్ని ఆహారంగా వినియోగించడం లేదు. పట్టణాల్లోనూ చాలామంది రేషన్ బియ్యాన్ని ఇడ్లీ, దోశల పిండి, అటుకుల తయారీకి వాడుతున్నారు మినహా రోజువారీ భోజనానికి వినియోగించడం లేదు.
అయితే రెండు నెలలకు పైబడి పీడీఎస్ బియ్యం తీసుకోకపోతే రేషన్‌కార్డు రద్దు అవుతుందన్న భయంతో అందరూ తప్పనిసరిగా బియ్యాన్ని తీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్న బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు తమ దుకాణాల్లోనే తిరిగి కొంటున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాల్లో కిలో బియ్యానికి రూ. 6 నుంచి రూ. 8 వరకు చెల్లిస్తుండగా... గ్రామాలు, ఇతర పట్టణాల్లో కిలోకు రూ. 8 నుంచి రూ.10 వరకు చెల్లిస్తున్నారు.
రేషన్ దుకాణాల్లోకి వచ్చే బియ్యంలో 60 శాతం అక్కడే డబ్బులకు రీసేల్ అవుతుండగా, 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే పేదలు తీసుకుంటున్నారు. వీరిలో కొందరు దళారులకు విక్రయిస్తున్నారు. మిగతా 10 శాతం వరకు క్లోజింగ్ బ్యాలెన్స్ కింద డీలర్ల వద్ద నిల్వ ఉంటుంది. కాగా కొంటున్న బియ్యాన్ని డీలర్లు రూ.2 లాభం చూసుకొని ట్రాలీల్లో వచ్చే దళారులకు అమ్మేస్తున్నారు.
ఇలా డీలర్ల నుంచి, గ్రామాల్లో మహిళల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని సదరు ట్రాలీ దళారులు లారీల్లో వ్యాపారం చేసే వారికి రూపాయి, ఆపైన లాభం చూసుకొని విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసే పెద్ద వ్యాపారులు పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు. రెండు మూడు చేతులు మారిన తర్వాత రాష్ట్రాలు దాటే బియ్యం ధర రూ.20 వరకు పలుకుతోంది.
తద్వారా కిలో బియ్యానికి కనిష్టంగా రూ.5 చొప్పున లాభం వేసుకొన్నా.. ఇలా టన్నుల్లో విక్రయించే బియ్యానికి కోట్లల్లో లాభం సమకూరుతుందని స్పష్టమవుతోంది. ఈ లాభంతోనే పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులను వ్యాపారులు కొనేస్తున్నారని మంచిర్యాలకు చెందిన ఓ దళారి చెప్పాడు.
కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రవాణా
► ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పీడీఎస్ బియ్యం అధికంగా మహారాష్ట్రకు వెళుతోంది. రామగిరి ప్యాసింజర్ రైలు ద్వారా వరంగల్ నుంచి పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా వీరూర్‌కు వెళ్తుంది. లారీల్లో కూడా కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల నుంచి ఆసిఫాబాద్ గుండా వీరూర్‌కే చేరుతుంది.
కాగజ్‌నగర్ నుంచి, దహేగాం, బెజ్జూరుల నుంచి చింతలమానెపల్లి మీదుగా గడ్చిరోలి జిల్లా అహేరీకి వెళ్లే లారీలు కూడా ఉన్నాయి. భూపాలపల్లి, చెన్నూరు, కాటారం, ములుగు ప్రాంతాల నుంచి సిరోంచకు, ఖమ్మం, కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి కర్ణాటకకు పీడీఎస్ బియ్యంతో కూడిన లారీలు వెళ్తున్నాయి.
మిల్లర్లకూ వరం
► పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్రంలోని కొందరు మిల్లర్లు రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాలు, పట్టణాల నుంచి లారీలు బియ్యం మిల్లులకు వెళుతూపలుచోట్ల పట్టు పడడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
అలాగే ఆయా మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలు అక్కడ లేకపోవడాన్ని బట్టి కూడా.. మిల్లర్లు అసలు బియ్యాన్ని (మిల్లింగ్ చేసిన రైతుల ధాన్యం) అమ్ముకుంటూ, వాటి స్థానంలో పీడీఎస్ బియ్యాన్ని ఇస్తున్నట్టుగా స్పష్టమవుతోందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment