ఇంకెన్నాళ్లు..
♦ రేషన్ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం
♦ ఎట్టకేలకు జిల్లాకు చేరుకున్న వేయింగ్ మిషన్లు
♦ తాజాగా ఈ పాస్ మిషన్లలో సాంకేతిక లోపం
♦ వారం గడిచినా.. ప్రారంభం కాని రేషన్ సరఫరా
♦ పండుగలు సమీపిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన
హన్మకొండ అర్బన్: జిల్లాలో రేషన్ బియ్యం అందక పేద, మధ్య తరగతి వర్గాలు అల్లాడుతున్నాయి. ప్రతి నెలా ఒకటి నుంచి 14వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా... ఇప్పటివరకూ మొదలుకాలేదు. పౌరసరఫరాల వ్యవస్థలో రేషన్‌షాపుల ద్వారా బియ్యం పంపిణీ కోసం చేపట్టిన ఈ పాస్ విధానం అమలులో అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. మరో పది రోజుల్లో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బియ్యం పంపిణీ కాకపోవడం.. ఎప్పుడిస్తారో స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు షాపుల చుట్టూ తిరుగుతున్న పేదలకు సమాధానం చెప్పలేక డీలర్లు తలపట్టుకుంటున్నారు.
మిషన్లు వచ్చినా..
రేషన్‌డీలర్లకు ఈ పాస్ యంత్రాలు పంపిణీ చేసిన అధికారులు వేయింగ్ మిషన్లు లేక హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే వాటి కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు జిల్లాకు వేయింగ్ మిషన్లు చేరుకున్నా యి. అయితే ఈ పాస్ యంత్రాలను వేయింగ్ మిషన్‌కు అనుసంధా నం చేసే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. శుక్రవారం హన్మకొండ మండలం పరిధిలోని డీలర్లను ఈ పాస్ మిషన్లతో కలెక్టరేట్‌కు రావాలని అధికారులు ఆదేశించారు. అయితే ఎంత సేపు ప్రయత్నించినా.. చాలా మిషన్ల అనుసంధానం ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో డీలర్లు వెనుదిరిగారు. జిల్లాలో 599 షాపుల్లో ఈ ప్ర క్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ఈ నెల వరకు అవకాశమివ్వండి..
మిషన్లలో సాంకేతిక సమ్స్యలను దృష్టిలో పెట్టుకుని పండుగలు ఉన్నందున ఆగస్టు నెలలో మాదిరిగా పంపిణీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రేషన్‌డీలర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం జేసీ దయానంద్‌కు వినతిపత్రం అందజేశారు. జేసీ నిర్ణయం మేరకు అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఆలస్యమైనా ఈ పాస్ ద్వారానే...
ఈ నెల తప్పనిసరిగా ఈ పాస్ విధానం ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని కమిషనర్‌నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందువల్ల కాస్త ఆలస్యమైనా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేస్తాం. జిల్లాలో వేలేరుతోపాటు మరికొన్ని మండలాల్లో మిషన్ల అనుసంధానం పూర్తయింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా మొత్తం పూర్తి చేస్తారు. గతంలో మాదిరిగా ఒక్కనెల పంపిణీకి అనుమతి ఇవ్వాలని రేషన్‌డీలర్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జేసీకూడా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేయమన్నారు.– విజయలక్ష్మి, డీసీఎస్‌ఓ