రేషన్‌ బియ్యానికి దళారి దయ్యం | Ration rice was misleading | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యానికి దళారి దయ్యం

Published Wed, Oct 11 2017 1:12 AM | Last Updated on Wed, Oct 11 2017 1:12 AM

Ration rice was misleading

నల్లగొండ జిల్లా తిప్పర్తి మేజర్‌ గ్రామ పంచాయతీకి చెందిన ఓ తెల్ల రేషన్‌ కార్డుదారుడికి నెలకు 24 కిలోల బియ్యం ఇస్తున్నారు. బియ్యం దొడ్డుగా ఉండటంతోపాటు పురుగులు, మెరిగలు ఎక్కువగా ఉంటుండటంతో వాటిని అదే గ్రామానికి చెందిన వ్యాపారికి కిలోకు రూ.8 చొప్పున అమ్ముతున్నాడు. ఆ వ్యాపారి అవే బియ్యాన్ని రైస్‌మిల్లుకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నాడు. మిల్లులో పాలిష్‌ చేసి ఆ బియ్యాన్నే మార్కెట్‌లో కిలో రూ.35కు విక్రయిస్తున్నారు.
.. రాష్ట్రంలో రేషన్‌ బియ్యం దందాలో ఇదో కోణం!

అనేకచోట్ల రేషన్‌ షాపుల్లో కొన్న బియ్యాన్ని అదే డీలర్‌కు విక్రయిస్తున్నారు. అందుకు బదులుగా డబ్బులు లేదా చక్కెర, పప్పు, ఇతర సరుకులు తీసుకుంటున్నారు. సదరు డీలర్‌ ఆ బియ్యాన్ని గంపగుత్తగా మిల్లర్‌కు అప్పగించేస్తున్నాడు.
.. ఇది మరో కోణం!!

సాక్షి, నెట్‌వర్క్‌: ప్రభుత్వం పేదల కోసం అం దిస్తున్న సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఓవైపు డీలర్లు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతుంటే.. మరోవైపు దొడ్డుగా ఉన్నాయని, అన్నం బాగుండటం లేదంటూ చాలామంది లబ్ధిదారులు బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు. మరికొన్నిచోట్ల రూపాయి కిలో బియ్యాన్ని పాలిష్‌ చేసి బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి హైదరాబాద్‌ మినహా మిగతా 9 జిల్లాల్లో అంత్యోద య, అన్నపూర్ణ, ఆహార భద్రత కార్డులు 75,01,851 ఉన్నాయి. వీటికి ప్రతినెలా సుమారు 14,79,07,851 యూనిట్ల బియ్యం(యూనిట్‌కు 6 కేజీలు) కోటా కేటాయిస్తున్నారు.  తెల్లరేషన్‌ కార్డుదారుడికి ఒక్కొ క్కరికి 6 కిలోలు, అంత్యోదయ కార్డుకు 35 కేజీలు, అన్నపూర్ణ కార్డుదారులకు ఉచితంగా 10 కేజీల బియ్యాన్ని అందజేస్తున్నారు.

ఎంఎల్‌ఎస్‌(మండల్‌ లెవల్‌ స్టాక్‌) పాయింట్ల నుంచి రేషన్‌ దుకా ణాలకు బియ్యం సరఫరా సక్రమంగానే జరుగుతుండగా.. చాలాచోట్ల డీలర్లు, అధికారులు కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నారు. కొన్నిచోట్ల రేషన్‌ బియ్యాన్ని వండుకొని తినేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల బియ్యం తీసుకెళ్లకుంటే కార్డులు రద్దు చేస్తారని కొందరు డీలర్లు ప్రచారం చేశారు. దీంతో చాలామంది బియ్యాన్ని తీసుకెళ్లినా అవి ఇళ్లలోనే మూలుగుతున్నాయి. ఇంకొందరు బియ్యాన్ని కోళ్లఫాంలకు, పశువులకు దాణాగా వాడుతున్నారు. కొందరు వ్యాపారులు రేషన్‌ బియ్యాన్ని బాగా పాలిష్‌ పట్టి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇలా పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యంలో దాదాపు 80 శాతం వివిధ మార్గాల ద్వారా పక్కదారి పడుతున్నట్టు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.

ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారంటే..
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో 8 వేల మంది లబ్ధిదారులుండగా.. అందులో 4 వేల మందికిపైగా రేషన్‌ బియ్యం తింటున్నారు. మిగతావారు రైస్‌డిపోలు లేదా గిరిజనులు, బాలసంతుల వారికి విక్రయిస్తున్నారు. కిలో బియ్యం రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. వ్యాపారులు రైస్‌ డిపోల్లో ఇతరులకు కిలో బియ్యం రూ.15కు విక్రయిస్తున్నారు. రైస్‌మిల్లుల్లో రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి స్టీమ్‌రైస్‌ పేరుతో మార్కెట్‌లో క్వింటాలుకు రూ.3,500 నుంచి రూ.4 వేల దాకా విక్రయిస్తున్నారు.  

పేదలకు ఈ బియ్యమే దిక్కు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో చాలామంది లబ్ధిదారులు రేషన్‌ బియ్యం తింటున్నారు.  ఈ పంచాయతీ పరిధిలో మొత్తం 15 వేలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో 5,500 మందికి తెల్లకార్డులు ఉన్నాయి. మొత్తం 12 రేషన్‌ షాపుల ద్వారా సుమారు 770 క్వింటాళ్ల బియ్యం నెలనెలా అందిస్తున్నారు. మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని పట్టణ ప్రాంతం(రామకృష్ణాపూర్‌) మినహా నిరుపేదవాడల్లో చాలామంది రేషన్‌ బియ్యమే తింటున్నారు.

అక్కడ వినియోగం 10 శాతమే..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం గ్రామ పంచాయతీలో 1,630 కుటుంబాలు ఉన్నాయి. 1,435 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతినెలా 250 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం దుకాణాలకు వస్తాయి. వీరిలో 80 శాతం బియ్యాన్ని కార్డుదారులు తీసుకెళ్తున్నా... వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. కొందరు పశువులకు దాణాగా వాడుతున్నారు. దళారులు ఇంటింటా తిరిగి కిలో రూ.6 నుంచి రూ.7 వరకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.

పసుపు కలిపేసి..
జనగామ జిల్లా నర్మెట మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో 9,571 జనాభా ఉంది. మూడు రేషన్‌ దుకాణాలున్నాయి. 1,653 మందికి తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయి. రేషన్‌ దుకాణాలకు 290.22 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం కేటాయిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి కొందరు వ్యాపారులు ఈ బియ్యాన్ని సేకరించి అధికారులకు అనుమానం రాకుండా అందులో పసుపు కలిపి దేవుడి బియ్యంగా రైస్‌మిల్లులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

పాలమూరు బియ్యంపై డోన్‌ వ్యాపారుల కన్ను
పాలమూరు రేషన్‌ బియ్యంపై రాయలసీమలోని డోన్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారులు కన్నేశారు. వీరు ఇంటింటికి తిరిగి బియ్యాన్ని కొని దళారులకు చేరవేస్తున్నారు. ఆ బియ్యాన్ని కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

బస్తాల్లో కలిపేస్తున్నారు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల గ్రామంలోని రేషన్‌ షాపు పరిధిలో ఆరు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారు వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నాయి. 666 రేషన్‌ కార్డులు ఉండగా 631 తెల్ల రేషన్‌కార్డులు, 35 ఏఏవై (35 కిలోల బియ్యం లభించేవి) రేషన్‌కార్డులు ఉన్నాయి. రేషన్‌ బియ్యం సరఫరా చేయగానే దళారీలు ఆటోల ద్వారా పల్లెల్లోకి వచ్చి ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల నుంచి కిలో రూ.4, రూ.5 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని నేరుగా మహబూబాబాద్, కాకినాడ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడి మిల్లర్లు కిలో రూ.15కు కొనుగోలు చేస్తున్నారు. రీసైక్లింగ్‌ చేసి.. మార్కెట్‌లో లభిస్తున్న 25 కిలోల బ్యాగులో ఈ బియ్యాన్ని 5 నుంచి 10 కిలోల వరకు కలుపుతున్నట్లు తెలిసింది. బయట కూడా సన్నబియ్యం పేరుతో కిలో రూ.28 నుంచి రూ.30లకు అమ్ముతున్నారు. రీసైక్లింగ్‌ బియ్యాన్నే బియ్యం రవ్వగా మార్చి కిలో రూ.25కు, పిండి కొట్టి రూ.30లకు విక్రయిస్తున్నారు.

212 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత
నర్సింహులపేట(డోర్నకల్‌)/దామరచర్ల/కోదాడ: మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో పోలీసులు ముగ్గురి ఇళ్లలో సోదాలు చేసి 212 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మంగళవారం తెలిపారు.

మరో 145 బస్తాల బియ్యం.. 
పోలీసులు దాడులు చేసి మొత్తం 145 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కేశవాపురం గ్రామపంచాయతీ పరిధిలోని తెట్టెకుంటలో 72 బస్తాలు, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండలో 73 బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నారు.

తినబుద్ధి అయితలె..
రేషన్‌ బియ్యం వండితే అన్నం ముద్ద అయితంది. ఉడుకు ఉన్నప్పుడే తినబుద్ధి అయితంది. చల్లారినంక తినబుద్ధి అయిత లేదు. సర్కారోళ్లు రూపాయి కిలో బియ్యం అని చెబుతుండ్రు కానీ ఉపయోగపడ్తలె. మాకు సన్నబియ్యం అందించాలె..    
– అలుగు కొమురమ్మ, ముల్కనూర్, వరంగల్‌ అర్బన్‌ జిల్లా

ధర ఎక్కువైనా సన్నబియ్యం ఇయ్యాలె..
రేషన్‌ బియ్యం ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. ఇళ్లలోనే నిల్వలు పేరుకు పోతున్నాయి. పాడైపోయిన బియ్యాన్ని పందుల్ని సాదు కునేటోళ్లు కొనుక్కపోతున్నరు. కిలోకు రూ.10 అయినా సరే సన్నబియ్యం అందిస్తే మేలు.    
    – కొన్నె తిరుపతి, నర్మెట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement