Subsidized rice
-
రేషన్ బియ్యానికి దళారి దయ్యం
నల్లగొండ జిల్లా తిప్పర్తి మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన ఓ తెల్ల రేషన్ కార్డుదారుడికి నెలకు 24 కిలోల బియ్యం ఇస్తున్నారు. బియ్యం దొడ్డుగా ఉండటంతోపాటు పురుగులు, మెరిగలు ఎక్కువగా ఉంటుండటంతో వాటిని అదే గ్రామానికి చెందిన వ్యాపారికి కిలోకు రూ.8 చొప్పున అమ్ముతున్నాడు. ఆ వ్యాపారి అవే బియ్యాన్ని రైస్‌మిల్లుకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నాడు. మిల్లులో పాలిష్ చేసి ఆ బియ్యాన్నే మార్కెట్లో కిలో రూ.35కు విక్రయిస్తున్నారు. .. రాష్ట్రంలో రేషన్ బియ్యం దందాలో ఇదో కోణం! అనేకచోట్ల రేషన్ షాపుల్లో కొన్న బియ్యాన్ని అదే డీలర్‌కు విక్రయిస్తున్నారు. అందుకు బదులుగా డబ్బులు లేదా చక్కెర, పప్పు, ఇతర సరుకులు తీసుకుంటున్నారు. సదరు డీలర్ ఆ బియ్యాన్ని గంపగుత్తగా మిల్లర్‌కు అప్పగించేస్తున్నాడు. .. ఇది మరో కోణం!! సాక్షి, నెట్వర్క్: ప్రభుత్వం పేదల కోసం అం దిస్తున్న సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఓవైపు డీలర్లు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతుంటే.. మరోవైపు దొడ్డుగా ఉన్నాయని, అన్నం బాగుండటం లేదంటూ చాలామంది లబ్ధిదారులు బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు. మరికొన్నిచోట్ల రూపాయి కిలో బియ్యాన్ని పాలిష్ చేసి బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాల్లో అంత్యోద య, అన్నపూర్ణ, ఆహార భద్రత కార్డులు 75,01,851 ఉన్నాయి. వీటికి ప్రతినెలా సుమారు 14,79,07,851 యూనిట్ల బియ్యం(యూనిట్‌కు 6 కేజీలు) కోటా కేటాయిస్తున్నారు. తెల్లరేషన్ కార్డుదారుడికి ఒక్కొ క్కరికి 6 కిలోలు, అంత్యోదయ కార్డుకు 35 కేజీలు, అన్నపూర్ణ కార్డుదారులకు ఉచితంగా 10 కేజీల బియ్యాన్ని అందజేస్తున్నారు. ఎంఎల్ఎస్(మండల్ లెవల్ స్టాక్) పాయింట్ల నుంచి రేషన్ దుకా ణాలకు బియ్యం సరఫరా సక్రమంగానే జరుగుతుండగా.. చాలాచోట్ల డీలర్లు, అధికారులు కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నారు. కొన్నిచోట్ల రేషన్ బియ్యాన్ని వండుకొని తినేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల బియ్యం తీసుకెళ్లకుంటే కార్డులు రద్దు చేస్తారని కొందరు డీలర్లు ప్రచారం చేశారు. దీంతో చాలామంది బియ్యాన్ని తీసుకెళ్లినా అవి ఇళ్లలోనే మూలుగుతున్నాయి. ఇంకొందరు బియ్యాన్ని కోళ్లఫాంలకు, పశువులకు దాణాగా వాడుతున్నారు. కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని బాగా పాలిష్ పట్టి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇలా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంలో దాదాపు 80 శాతం వివిధ మార్గాల ద్వారా పక్కదారి పడుతున్నట్టు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారంటే.. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో 8 వేల మంది లబ్ధిదారులుండగా.. అందులో 4 వేల మందికిపైగా రేషన్ బియ్యం తింటున్నారు. మిగతావారు రైస్‌డిపోలు లేదా గిరిజనులు, బాలసంతుల వారికి విక్రయిస్తున్నారు. కిలో బియ్యం రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. వ్యాపారులు రైస్ డిపోల్లో ఇతరులకు కిలో బియ్యం రూ.15కు విక్రయిస్తున్నారు. రైస్‌మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి స్టీమ్‌రైస్ పేరుతో మార్కెట్లో క్వింటాలుకు రూ.3,500 నుంచి రూ.4 వేల దాకా విక్రయిస్తున్నారు. పేదలకు ఈ బియ్యమే దిక్కు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో చాలామంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తింటున్నారు. ఈ పంచాయతీ పరిధిలో మొత్తం 15 వేలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో 5,500 మందికి తెల్లకార్డులు ఉన్నాయి. మొత్తం 12 రేషన్ షాపుల ద్వారా సుమారు 770 క్వింటాళ్ల బియ్యం నెలనెలా అందిస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పట్టణ ప్రాంతం(రామకృష్ణాపూర్) మినహా నిరుపేదవాడల్లో చాలామంది రేషన్ బియ్యమే తింటున్నారు. అక్కడ వినియోగం 10 శాతమే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం గ్రామ పంచాయతీలో 1,630 కుటుంబాలు ఉన్నాయి. 1,435 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతినెలా 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం దుకాణాలకు వస్తాయి. వీరిలో 80 శాతం బియ్యాన్ని కార్డుదారులు తీసుకెళ్తున్నా... వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. కొందరు పశువులకు దాణాగా వాడుతున్నారు. దళారులు ఇంటింటా తిరిగి కిలో రూ.6 నుంచి రూ.7 వరకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. పసుపు కలిపేసి.. జనగామ జిల్లా నర్మెట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో 9,571 జనాభా ఉంది. మూడు రేషన్ దుకాణాలున్నాయి. 1,653 మందికి తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ దుకాణాలకు 290.22 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం కేటాయిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి కొందరు వ్యాపారులు ఈ బియ్యాన్ని సేకరించి అధికారులకు అనుమానం రాకుండా అందులో పసుపు కలిపి దేవుడి బియ్యంగా రైస్‌మిల్లులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు బియ్యంపై డోన్ వ్యాపారుల కన్ను పాలమూరు రేషన్ బియ్యంపై రాయలసీమలోని డోన్ ప్రాంతానికి చెందిన వ్యాపారులు కన్నేశారు. వీరు ఇంటింటికి తిరిగి బియ్యాన్ని కొని దళారులకు చేరవేస్తున్నారు. ఆ బియ్యాన్ని కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బస్తాల్లో కలిపేస్తున్నారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల గ్రామంలోని రేషన్ షాపు పరిధిలో ఆరు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారు వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నాయి. 666 రేషన్ కార్డులు ఉండగా 631 తెల్ల రేషన్‌కార్డులు, 35 ఏఏవై (35 కిలోల బియ్యం లభించేవి) రేషన్‌కార్డులు ఉన్నాయి. రేషన్ బియ్యం సరఫరా చేయగానే దళారీలు ఆటోల ద్వారా పల్లెల్లోకి వచ్చి ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల నుంచి కిలో రూ.4, రూ.5 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని నేరుగా మహబూబాబాద్, కాకినాడ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడి మిల్లర్లు కిలో రూ.15కు కొనుగోలు చేస్తున్నారు. రీసైక్లింగ్ చేసి.. మార్కెట్లో లభిస్తున్న 25 కిలోల బ్యాగులో ఈ బియ్యాన్ని 5 నుంచి 10 కిలోల వరకు కలుపుతున్నట్లు తెలిసింది. బయట కూడా సన్నబియ్యం పేరుతో కిలో రూ.28 నుంచి రూ.30లకు అమ్ముతున్నారు. రీసైక్లింగ్ బియ్యాన్నే బియ్యం రవ్వగా మార్చి కిలో రూ.25కు, పిండి కొట్టి రూ.30లకు విక్రయిస్తున్నారు. 212 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత నర్సింహులపేట(డోర్నకల్)/దామరచర్ల/కోదాడ: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో పోలీసులు ముగ్గురి ఇళ్లలో సోదాలు చేసి 212 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మంగళవారం తెలిపారు. మరో 145 బస్తాల బియ్యం.. పోలీసులు దాడులు చేసి మొత్తం 145 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కేశవాపురం గ్రామపంచాయతీ పరిధిలోని తెట్టెకుంటలో 72 బస్తాలు, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండలో 73 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. తినబుద్ధి అయితలె.. రేషన్ బియ్యం వండితే అన్నం ముద్ద అయితంది. ఉడుకు ఉన్నప్పుడే తినబుద్ధి అయితంది. చల్లారినంక తినబుద్ధి అయిత లేదు. సర్కారోళ్లు రూపాయి కిలో బియ్యం అని చెబుతుండ్రు కానీ ఉపయోగపడ్తలె. మాకు సన్నబియ్యం అందించాలె.. – అలుగు కొమురమ్మ, ముల్కనూర్, వరంగల్ అర్బన్ జిల్లా ధర ఎక్కువైనా సన్నబియ్యం ఇయ్యాలె.. రేషన్ బియ్యం ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. ఇళ్లలోనే నిల్వలు పేరుకు పోతున్నాయి. పాడైపోయిన బియ్యాన్ని పందుల్ని సాదు కునేటోళ్లు కొనుక్కపోతున్నరు. కిలోకు రూ.10 అయినా సరే సన్నబియ్యం అందిస్తే మేలు. – కొన్నె తిరుపతి, నర్మెట -
రేషన్ బియ్యం స్వచ్ఛందంగా వెనక్కు
కలెక్టర్‌కు అంగీకార పత్రాలను ఇచ్చిన 70 రైతు కుటుంబాలు సాక్షి, పెద్దపల్లి: ‘‘ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాయి.. మేము పండించిన బియ్యా న్ని మేమే తింటాం. ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఇస్తున్న బియ్యం సబ్సిడీ పక్కదారి పట్టకుండా మేమే ప్రభుత్వానికి అప్పగిస్తున్నాం’’ అంటూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊశన్నపల్లె గ్రామానికి చెందిన 70 మంది ముందుకు వచ్చారు. ఈ రైతు కుటుంబాలు రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛందంగా జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చా రు. సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ అలగు వర్షిణికి ఈ మేరకు అంగీకార పత్రాలను అందజేశారు. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి స్వగ్రామం ఇది. పూర్తిగా రైతు గ్రామం కాగా, 571రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా 107 క్వింటాళ్ల బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా కిలోకు రూపాయి చొప్పు న పంపిణీ చేస్తున్నారు. ఈ యేడు వర్షాలు బాగా కురిశాయి, పంటలు సమృద్ధిగా పండాయి. రైతు కుటుంబాలన్నీ తాము పండించిన ధాన్యాన్నే బియ్యంగా తింటున్నా యి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం పక్క దారి పట్టడంతోపాటు ప్రభుత్వంపై పడుతు న్న భారాన్ని శంకర్‌రెడ్డి రైతులకు వివరించారు. దీంతో 70 రైతు కుటుంబాలకు చెందిన 285 యూనిట్‌దారులు సబ్సిడీ బియ్యం అవసరం లేదని ముందుకు వచ్చారు. దీంతో గ్రామంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈద శంకర్‌రెడ్డి సమక్షంలో కలెక్టర్ వర్షిణికి బియ్యం వద్దని అంగీకార పత్రాలను అందజే శారు. రాష్ట్రంలోనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రైతు కుటుంబాలను చైర్మన్, కలెక్టర్ అభినందించారు. రాష్ట్రంలో సబ్సిడీ బియ్యం తీసుకోని కుటుంబాలన్నీ ఇలానే ముందుకు రావాలని, ప్రభుత్వంపై సబ్సిడీ భారాన్ని తగ్గించి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు నందించాలని పిలుపునిచ్చారు. గంగారం గ్రామంలో కూడా ఈ కార్యక్రమం మంగళ వారం కొనసాగనుంది. -
ధాన్యం కొనుగోళ్లకు రూ.3 వేల కోట్ల అప్పు
- బ్యాంకు రుణాలతో రైతులకు చెల్లింపులు - డబ్బుల్లేక సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ తిప్పలు - బకాయిలు ఇవ్వలేమంటూ చేతులెత్తేసిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు సరిపడే నిధులు లేకపోవటంతో పౌర సరఫరాల సంస్థ తల్లడిల్లుతోంది. రెండేళ్లుగా తమకు రావాల్సిన బకాయిల విడుదల చేయాలని ప్రభుత్వానికి పౌర సరఫరాల శాఖ మొర పెట్టుకుంటున్నా డబ్బులిచ్చే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ చేతులెత్తేసింది. ఈ విభాగాలకు తానే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో తాజా పరిణామాలన్నీ మంత్రి ఈటల రాజేందర్‌కు విషమ పరీక్షగా ఉన్నాయి. ఒకవైపు రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిల వంటి చెల్లింపులకు ఆర్థికశాఖ మల్లగుల్లాలు పడుతోంది. ధాన్యం కొనుగోళ్లకు అత్యవసరంగా రూ.3000 కోట్లు ఇవ్వాలనే సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చింది. రెండు శాఖల అధికారులతో ఇటీవల ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ సమక్షంలో సమీక్ష నిర్వహించినా బకాయిలు, చెల్లింపుల వివాదం సమసిపోలేదు. ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా 2136 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే ప్రక్రియ మొదలైంది. దీంతో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించటం ప్రభుత్వానికి సవాలుగా మారింది. గత్యంతరం లేకపోవటంతో ధాన్యం కొనుగోళ్లకు సరిపడేన్ని నిధులను అప్పుగా తెచ్చుకోవాలనే నిర్ణయం జరి గింది. బ్యాంకుల నుంచి రూ.3000 కోట్లు అప్పు తీసుకునేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. దీంతో తక్షణ సంక్షోభానికి పరిష్కారం లభిం చినట్లయింది. ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సబ్సిడీలకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన రూ.7500 కోట్ల మూలధనం రెండున్నరేళ్లలోనే హరించుకుపోయింది. రూ పాయికి కిలో బియ్యం, బియ్యం పంపిణీ సీలింగ్ ఎత్తివేయటం, కుటుంబాలకు మించి న కార్డులుండటం ఈ పరిస్థితికి దారి తీసింది. బియ్యం సబ్సిడీ చెల్లింపులకు 2015-16 బడ్జెట్లో రూ. 2500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం గత ఏడాది కేవలం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. మిగతా సొమ్ము మంజూరు చేయకుండా దాటవేసింది. అంతకుముందు ఏడాది 2014-15కు సంబంధించి దాదాపు రూ.700 కోట్లు బకాయి పడింది. రెండేళ్లకు సంబంధించి మొత్తం రూ.2200 కోట్లు పేరుకుపోయాయి. దీంతో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చిక్కుల్లో పడింది. వీటికి తోడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, అకౌంట్ల వివరణలు కేంద్రానికి పంపించకపోవటం, పలు సాంకేతిక సమస్యలతో రూ.2500 కోట్ల లోటు తలెత్తింది. అందుకే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు చేతిలో చిల్లిగవ్వ లేదని, కొనుగోలు కేంద్రాలకు డబ్బులిచ్చే పరిస్థితి లేదంటూ కార్పొరేషన్ అసలు విషయాన్ని మంత్రి ఎదుట వెళ్లబోసుకుంది. సబ్సిడీ బియ్యంతోనే గండి సబ్సిడీ బియ్యమే కార్పొరేషన్ కొంపకు ముప్పు తెచ్చింది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ సరిపోకపోవటం, అదనంగా సర్దుబాటు చేయాల్సిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం పెం డింగ్‌లో పెట్టడంతో ఖజానా ఖాళీ అయిం ది. కేంద్రం రాష్ట్రంలోని లబ్ధిదారుల్లో 1.91 కోట్ల మందికి మాత్రమే ఆహార సబ్సిడీ చెల్లిస్తుంది. ఒక్కో లబ్ధిదారుడికి 4కిలోల బియ్యం లెక్కగట్టి నిధులు కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 2 కిలోలు ఇస్తుండటంతో ప్రతి నెలా 1.8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతోంది. కేంద్రం కేవలం 1.12 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందిస్తోంది. మిగిలిం ది మిల్లర్ల ద్వారా రాష్ట్ర సేకరణ విభాగం నుంచి కొనుగోలు చేస్తోంది. కిలోకు రూ.24 చొప్పున కొనుగోలు చేస్తున్న ఈ బియ్యాన్ని రూపాయికే పంపిణీ చేయటంతో భారం నెలనెలా తడిసిమోపెడవుతోంది. ఎప్పటికప్పుడు సబ్సిడీని విడుదల చేయాల్సిన సర్కారు పెండింగ్‌లో పెట్టడంతో కార్పొరేషన్ అప్పుల బాట పట్టింది. -
బియ్యం భోక్తలు
మార్కాపురం : పేదలకు దక్కాల్సిన సబ్సిడీ బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయి. కొందరు డీలర్లకు అక్రమ ఆదాయానికి మార్గంగా మారాయి. కిలో రూపాయి ప్రకారం ఒక వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. వాస్తవానికి ప్రభుత్వం బయట సుమారు రూ.22 చెల్లించి కొనుగోలు చేస్తుంది. పట్టణాల్లో మాత్రమే ఈ-పాస్ విధానం అమలవుతుండగా..గ్రామీణ ప్రాంతాల్లో డీలర్లు రేషన్‌కార్డుల ద్వారా అందిస్తున్నారు. దీంతో పశ్చిమ ప్రకాశంలో పేదలకు చెందాల్సిన బియ్యం లారీల ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. మార్కాపురం నుంచి నంద్యాల మీదుగా అనంతపురం, యర్రగొండపాలెం నుంచి కోస్తా జిల్లాలకు బియ్యం అక్రమ రవాణా అవుతున్నాయి. మొత్తం మీద నెలకు 800 నుంచి వెయ్యి బస్తాల బియ్యం అక్రమంగా తరలి వెళ్తున్నాయి. పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం,గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెంలలో పౌరసరఫరా శాఖ గోడౌన్లు ఉన్నాయి. మార్కాపురం గోడౌన్ ద్వారా మార్కాపురం పట్టణ, రూరల్, పెద్దారవీడు, పెద్దదోర్నాల, తర్లుపాడు మండలాల్లోని రేషన్ దుకాణాలకు ప్రతినెలా దాదాపు 980 టన్నుల బియ్యం గిద్దలూరు గోడౌన్ నుంచి గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాలకు 700 టన్నుల బియ్యం, కంభం గోడౌన్ నుంచి కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలకు 530 టన్నులు, యర్రగొండపాలెం గోడౌన్ ద్వారా యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాలకు 750 టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి స్టేజ్ 1 కాంట్రాక్టర్లు సివిల్ సప్లయ్ గోడౌన్లకు చేరుస్తారు. అక్కడి నుంచి స్టేజ్ 2 కాంట్రాక్టర్లు ఆయా గ్రామాల్లోని రేషన్‌షాపులకు తరలిస్తారు. పశ్చిమ ప్రకాశంలోని త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, కంభం, అర్ధవీడు, గిద్దలూరు, రాచర్ల, పెద్దారవీడు, పెద్దదోర్నాల, తర్లుపాడు మండలాల్లో కొంత మంది డీలర్లు రేషన్ బియ్యాన్ని దుకాణాలకు చేర్చకుండానే అక్రమంగా బియ్యాన్ని కొనుగోలు చేసే వ్యాపారులకు కిలో రూ.5 నుంచి రూ.7 ప్రకారం అమ్ముతున్నారు. ఈ బియ్యాన్ని రైసు మిల్లుల ద్వారా లెవీ రూపంలో మళ్లీ ప్రభుత్వానికి సుమారు కేజీ రూ.22 ప్రకారం అమ్ముతున్నారు. మరి కొంత మంది వ్యాపారులు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, ద్వారకా తిరుమల దేవస్థానాల్లోని కాంట్రాక్టర్లకు నిత్యాన్నదానానికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. బయటి మార్కెట్లో వంద కిలోల బియ్యం బస్తా రూ.3500 నుంచి రూ.4 వేల మధ్య ఉండటంతో సబ్సిడీ బియ్యానికి డిమాండ్. అక్రమాలు ఇలా... మున్సిపాలిటీల్లో మాత్రమే ఈ-పాస్ విధానం అమలవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో డీలర్లు రేషన్‌కార్డుదారులకు ఇవ్వాలి. కొంత మంది కార్డుదారులు బియ్యం నాణ్యత లేకపోవటంతో తీసుకోకపోగా, మరి కొంత మందికి డీలర్లు ఇవ్వటం లేదు. దీంతో ప్రతి మండలం నుంచి సుమారు 50 బస్తాల బియ్యం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తోంది. ఈ విషయంపై పలువురు డీలర్లు కూడా తాము అధికారులకు ఇస్తున్న లంచాల గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి నెలా తహశీల్దార్‌కు రూ.500, డిప్యూటీ తహశీల్దార్‌కు రూ.500, ఆర్.ఐ.కి రూ.500, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెట్ డీటీకి కలిపి రూ.500, సేల్స్ రిజిష్టర్‌కు రూ.300, అటెండర్‌కు రూ.100, లారీ డ్రైవర్‌కు రూ.100, ఒక బస్తా దించినందుకు కూలి రూ.5 మామూళ్ల రూపంలో చెల్లిస్తున్నామని తెలిపారు. గోడౌన్ నుంచి వచ్చే బియ్యంలో కిలో గోతం, 500 గ్రాముల బియ్యం తరుగుగా వస్తుందని, 100 బస్తాల బియ్యం వస్తే 150 కిలోల తరుగు పోతుందని అంటున్నారు. ఇటీవల త్రిపురాంతకం మండలంలో ఒక రెవెన్యూ అధికారి కారు కొనుగోలు చేసేందుకు ప్రతి డీలర్ వద్ద నుంచి రూ.2,500 అదనంగా వసూలు చేయగా, సీఎం జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ప్రతి డీలర్‌కు దాదాపు అదనపు ఖర్చు వస్తుందని తెలిపారు. ఇలాంటప్పుడు సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టడంలో ఆశ్చర్యమేమిటని అంటున్నారు. ఎక్కడ నుంచి ఎక్కడకు... మార్కాపురం ప్రాంతంలో కొనుగోలు చేసిన బియ్యాన్ని మార్కాపురం, తర్లుపాడు, కంభం, గిద్దలూరు రైల్వేస్టేషన్లలో రైళ్ల ద్వారా నంద్యాల, అనంతపురానికి చేరుస్తున్నారు. యర్రగొండపాలెం ప్రాంతంలో సేకరించిన సబ్సిడీ బియ్యాన్ని కోస్తా జిల్లాలకు చేర్చి అక్కడి నుంచి పోర్టులకు తరలించి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. గత నెలలో మార్కాపురంలో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇటీవల రైల్వేస్టేషన్లో కూడా అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 20 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. ప్రతి నెలా గోడౌన్ నుంచి బియ్యం షాపులకు తరలించే సమయంలో రూట్ ఆఫీసర్ ఉండాలి. పలు మండలాల్లో రూట్ ఆఫీసర్లు లేకపోవటంతో మార్గ మధ్యంలోనే బియ్యం బస్తాలు పక్కదారి పడుతున్నాయి. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై 6ఏతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లాలో ఇటీవలే టంగుటూరు, సంతనూతలపాడు, ఉలవపాడులలో అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీలను పట్టుకుని కేసులు నమోదు చేశాం. ముగ్గురు ఏఎస్ఓలను నియమించి వారికి సిబ్బందిని కేటాయించి వాహనాలను సమకూర్చాం. నేనే స్వయంగా మార్కాపురం డివిజన్‌పై దృష్టి సారించి సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటాం. సివిల్ సప్లయ్ గోడౌన్లలో బియ్యం తూకం తక్కువ రాకుండా ఉండేం దుకు తూకాల మిషన్లను ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని చోట్ల 10 టన్నుల కాటాను ఏర్పాటు చేశాం. - ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఒంగోలు