ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ చెప్పారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సరుకు రవాణాకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో కొత్త ఎంఎల్‌ఎస్ పాయింట్లు, బఫర్ గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
మారుమూల, కొండ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, ఎండీయూ వాహనం వెళ్లలేని గిరిజన గ్రామాలకు బైక్‌ల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
జనవరి నుంచి కందిపప్పు, పంచదార పంపిణీతో పాటు అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల వద్దకే నిత్యావసరాలు డెలివరీ చేసేలా చూడాలన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో అవసరాన్ని బట్టి కలెక్టర్ కొత్త రేషన్ షాపులు మంజూరు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో దాదాపు 45 శాతానికి పైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్టు కమిషనర్ తెలిపారు. జనవరి చివరి నాటికి ఖరీఫ్ సేకరణ పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని, ధాన్యం కొనుగోళ్ల సొమ్ముతో పాటు మిల్లర్ల బకాయిలనూ వేగంగా చెల్లిస్తున్నట్టు చెప్పారు.
16 రోజులు దాటిన ఎఫ్‌టీవోలకు చెల్లింపులు పూర్తి చేసినట్టు తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వం చెల్లించే బకాయిల్లో కొంత మొత్తం వెచ్చించి ఆరబోత యంత్రాలు (డ్రయర్లు) ఏర్పాటు చేయాలని, లేకుంటే.. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి ఆయా మిల్లులకు సీఎంఆర్ నిలిపివేస్తామని కమిషనర్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment