Ration supply
-
ఎండీయూ ఆపరేటర్లకూ వాహనమిత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ రేషన్ సరఫరా చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ) ఆపరేటర్లకు బీమా ప్రీమియాన్ని ఈ ఏడాది నుంచి వాహన మిత్ర పథకంలో భాగంగా చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తమకు వచ్చే వేతనం నుంచి ఎండీయూ వాహనాల ప్రీమియాన్ని ఏటా బ్యాంకులు జమ చేసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండీయూ ఆపరేటర్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు విన్నవించారు. ఇదే విషయాన్ని మంత్రి కారుమూరి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే సీఎం సానుకూలంగా స్పందించారు. బీమా ప్రీమియం చెల్లింపును వాహనమిత్ర పథకం కిందకు చేర్చి 2021 నుంచి అమలు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది జూలైలో సొంతంగా ఆటో, ట్యాక్సీలు నిర్వహించుకునే వారికి చెల్లించే వాహనమిత్ర పథకంతో.. ఎండీయూ ఆపరేటర్లకూ ప్రీమియం మొత్తం రూ.9 కోట్లు ప్రభుత్వం నేరుగా చెల్లించనుందని మంత్రి కారుమూరి శనివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. -
గిరిజన ప్రాంతాల్లో బైక్‌ల ద్వారా రేషన్ సరఫరా
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ చెప్పారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సరుకు రవాణాకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో కొత్త ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మారుమూల, కొండ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, ఎండీయూ వాహనం వెళ్లలేని గిరిజన గ్రామాలకు బైక్‌ల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జనవరి నుంచి కందిపప్పు, పంచదార పంపిణీతో పాటు అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల వద్దకే నిత్యావసరాలు డెలివరీ చేసేలా చూడాలన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో అవసరాన్ని బట్టి కలెక్టర్ కొత్త రేషన్ షాపులు మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 45 శాతానికి పైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్టు కమిషనర్ తెలిపారు. జనవరి చివరి నాటికి ఖరీఫ్ సేకరణ పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని, ధాన్యం కొనుగోళ్ల సొమ్ముతో పాటు మిల్లర్ల బకాయిలనూ వేగంగా చెల్లిస్తున్నట్టు చెప్పారు. 16 రోజులు దాటిన ఎఫ్‌టీవోలకు చెల్లింపులు పూర్తి చేసినట్టు తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వం చెల్లించే బకాయిల్లో కొంత మొత్తం వెచ్చించి ఆరబోత యంత్రాలు (డ్రయర్లు) ఏర్పాటు చేయాలని, లేకుంటే.. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి ఆయా మిల్లులకు సీఎంఆర్ నిలిపివేస్తామని కమిషనర్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. -
సీఎం జగన్ బాటలోనే పంజాబ్ ప్రభుత్వం
చండీగఢ్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణ పొందిన ‘ఇంటివద్దకే రేషన్ సరుకుల పంపిణీ’ పథకాన్ని పంజాబ్ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 26,000 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ముక్తసర్ జిల్లాలో పత్తి రైతులకు రీయింబర్స్మెంట్ కింద రూ.41.89 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. కేబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి గోధుమ పిండితోపాటు ఇతర సరుకులను హోం డెలివరీ చేయనున్నారు. మొబైల్ ఫెయిర్ ప్రైస్ షాప్స్(ఎంపీఎస్)గా పిలిచే రవాణా వాహనాల్లో రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరవేస్తారు. చదవండి👉🏾 (సీఎం జగన్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ) -
తెలంగాణ: డిసెంబరులో ఉచిత బియ్యం 5 కిలోలే.. రాష్ట్ర వాటా బందు!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం ఇక యూనిట్ (లబ్ధిదారు)కు 5 కిలోల చొప్పున మాత్రమే పంపిణి జరగనుంది. కేంద్రం ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) కింద ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ గడువు 2022 మార్చి వరకు పొడిగించి కోటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర కోటాపై నిర్ణయం జరగలేదు. ఇప్పటి వరకు పీఎంజీకేవై కింద కేంద్రం యూనిట్‌కు అయిదు కిలోలు మాత్రమే కోటా కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం మరో అయిదు కిలోలు కలిపి యూనిట్‌కు 10 కిలోల చొప్పున పంపిణీ చేస్తూ వచ్చింది. తాజాగా కేంద్రం ఉచితం బియ్యం గడువు పొడిగించినా.. రాష్ట్ర ప్రభుత్వ మాత్రం కేంద్రం కోటాకే పరిమితమైంది. ఈ నెలలో ఉచిత బియ్యం కోటాను 5 కిలోలకు పరిమితం చేస్తూ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: Police Slapped Man Video: ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి) ఉచిత బియ్యం ఇలా.. ► కరోనా కష్టకాలంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు యూనిట్‌కు 12 కిలోల చొప్పున, ఆ తర్వాత జూలై నుంచి ఆగస్టు వరకు యూనిట్‌కు 10 కిలోల చొప్పున పంపిణీ చేశారు. ► సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని భావించినా.. కరోనా సంక్షోభం వెంటాడుతుండటంతో నవంబరు వరకు గడువు పొడిగించారు. తాజాగా మరో నాలుగు నెలల వరకు పొడిగించారు. ► హైదరాబాద్ మహానగరంలో ఆహార భత్రద కార్డులు కలిగిన సుమారు 17.21 లక్షల కుటుంబాలున్నాయి. ఇందులో 59.55 లక్షల యూనిట్లు ఉన్నాయి. -
1వ తేదీ నుంచి యధావిధిగా రేషన్ పంపిణీ: కొడాలి నాని
శ్రీకాకుళం జిల్లా: ఒకటవ తేదీ నుంచి రేషన్ యథావిధిగా పంపిణీ చేస్తాం.. షాపులు మూసేస్తే రేషన్ సప్లై ఆగిపోదు అన్నారు మంత్రి కొడాలి నాని. ఇప్పుడు 11 వేల వాహనాలతో ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రభుత్వమే చేస్తోంది.. డీలర్లకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.. రేషన్ డీలర్ల బెదిరింపులకు ప్రభుత్వం భయపడేది లేదు అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘గతంలో రేషన్ షాపుల పరిస్థితి వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. గతంలో ప్రజాపంపిణీ వ్యవస్థ మొత్తం రేషన్ దుకాణం నుంచే జరిగేది. రేషన్ దుకాణాలు బంద్ చేస్తాం అంటే వాటిని పక్కనపెట్టి పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నేరుగా పంపిణీ చేస్తాం’’ అని తెలిపారు. (చదవండి: సీఎం జగన్‌ను చంద్రబాబు ఇంచుకూడా కదపలేరు: కొడాలి నాని) ‘‘రేషన్ దుకాణాలు కొనసాగాలంటే వారి భాష, పద్ధతి మారాల్సిన అవసరం ఉంది. లేదు మేము ఇలాగే ఉంటాం అంటే డీలర్లను బైపాస్ చేసి వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తాం. ప్రజలకు నిత్యావసరాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. దాన్ని ఎవరు అడ్డుకుందాం అనుకున్నా కుదరదు’’ అన్నారు. చదవండి: కుక్కలు ఎవరు బాబూ!? -
టీకా తీసుకోకుంటే రేషన్ కట్?
సాక్షి, బెంగళూరు: కోవిడ్ ముప్పును అడ్డుకునేలా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, అందుకు కఠిన చర్యలు చేపట్టాలని సర్కారు భావిస్తోంది. కోవిడ్ టీకా వేసుకోని వారికి రేషన్ వితరణ చేయరాదని పౌరసరఫరాల శాఖ సంకల్పించింది. చాలామంది మొదటి డోస్ వేసుకుని రెండో డోస్ తీసుకోవడం లేదు. రెండో టీకా తీసుకోవాలని గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోని కార్డుదారులకు రేషన్ ఇచ్చేది లేదని డీలర్లు బోర్డులు ప్రదర్శించాలని పలుచోట్ల తహసీల్దార్లు ఆదేశించారు. రేషన్‌దారులు టీకా తీసుకున్నట్లు ప్రమాణపత్రం, లేదా మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించాలి. అలాగైనా కచ్చితంగా టీకాలు తీసుకుంటారని భావిస్తున్నారు. చింతామణి తాలూకా తహసీల్దార్ హనుమంతరాయప్ప రేషన్ దుకాణాల డీలర్లతో దీనిపై సమావేశం నిర్వహించారు. కరోనా మూడో దశ రాకుండా అడ్డుకోవడమే తమ ఉద్దేశమన్నారు. టీకా వాహనాలు ప్రారంభం.. గ్రామీణప్రాంతాల్లో వాహనాల్లో సంచరిస్తూ అర్హులైన వారికి కోవిడ్ టీకాలను ఇవ్వాలని సీఎం బసవరాజ బొమ్మై సూచించారు. ఈ మేరకు బుధవారం నగరంలో టీకా వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైసూరు మేయర్ పీఠం మొదటిసారిగా బీజేపీకి దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీకి వెళ్లి గురువారం కొందరు కేంద్ర మంత్రులతో సమావేశమై పెండింగ్‌లో ఉన్న పథకాల పట్ల చర్చిస్తానన్నారు. వినాయక చవితిని ఘనంగా నిర్వహించాలన్న డిమాండ్లపై సీఎం స్పందించలేదు. మంత్రులు గోవిందకారజోళ, మురుగేశ్‌నిరాణి, బీసీ.పాటిల్ పాల్గొన్నారు. కాగా, వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ఒక నెలలోగా క్లియరెన్స్ చేయాలని సీఎం ఆదేశించారు. ఏడాదికి పైబడి పెండింగ్‌లో ఉన్న అన్ని ఫైళ్లను పరిష్కరించాలన్నారు. కరోనా టెస్టులు పెరగాలి.. కరోనా మూడో దశ నియంత్రణకు ముందు జాగ్రత్తగా టెస్టులను పెంచాలని ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు. జిల్లాల వారి కోవిడ్ పరీక్షల సంఖ్య పెరగాలి. మొత్తం పరీక్షల్లో 10 శాతం 18 ఏళ్లులోపు వారికి నిర్వహించాలి. 50 శాతం పరీక్షలను తాలూకా కేంద్రాల్లో నిర్వహించాలని అధికారులకు సూచించారు. చదవండి: దారుణం: మద్యం తాగి యువతిపై సామూహిక అత్యాచారం -
లాక్డౌన్ కష్టకాలంలో రేషన్ ఆపేస్తారా?
సాక్షి, హైదరాబాద్: మూడు నెలలు రేషన్ తీసుకోలేదని చెప్పి ఇప్పుడు రేషన్ సరుకులతోపా టు రూ.1,500 ఆర్థిక సాయాన్నీ నిలిపివేయడం సబబు కాదని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడం వల్ల వివిధ ప్రాంతాల్లోని వారంతా సొంతూళ్లకు వ చ్చారని, వారంతా వలసలో ఉన్నప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేషన్ తీసు కుని ఉండరని, ఈ కోణంలో ప్రభుత్వం చూసి తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.1,500 నగదు, రేష న్ ఇవ్వాలని ధర్మాసనం అభిప్రాయపడింది. లాక్డౌన్లో పనులు కూడా లేక చాలా మంది ఇబ్బందిపడుతున్న తరుణంలో వీటిని ఇవ్వకపోవడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. నోటీసు కూడా ఇవ్వకుండా రేషన్ కార్డుల్ని భారీగా ఏరివేయడంపై దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాలను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ జరిపింది. జంటనగరాల్లో 20.6 లక్షల రేషన్ కార్డులకుగాను 17.6 లక్షలను అధికారులు తిరస్కరించారని, రేషన్ కార్డు లేదని చాలామందికి లాక్డౌన్ నగదు సా యం ఇవ్వలేదని పిటిషనర్ న్యాయవాది చె ప్పారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తదు పరి విచారణ జూలై నెలకు వాయిదా పడింది. -
‘ఈ నెల 16 నుంచి రేషన్ పంపిణీ’
సాక్షి, విజయవాడ : పౌరసరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో రేషన్ పంపిణీ చేపట్టనున్నట్లు జాయింట్ కలెక్టర్ మాధవీలత తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్క సభ్యునికి అయిదు కిలోల ఉచిత బియ్యం ఇస్తామని తెలిపారు. అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు 35 కిలోల ఉచిత బియ్యం సరఫరా చేస్తామన్నారు. అన్నపూర్ణ కార్డు దారులకు పదికిలోల ఉచిత బియ్యం, ప్రతీ కార్డుకి కిలో శనగపప్పు ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 14 న డీలర్లు గోడౌన్ల నుంచి స్టాక్ తీసుకెళ్లాలని, బయో మెట్రిక్ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ షాపుల వద్ద శానిటైజర్లు ,సబ్బు ,నీళ్లు ఉంచాలని, లబ్ధిదారులు మార్కింగ్ చేసిన చోట నిలబడి భౌతిక దూరం పాటించాలని సూచించారు. వినియోగదారులు తప్పనిసరిగా మాస్కులు కాని రుమాలు కానీ ధరించాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. (భారత్‌లో కరోనా : 52,952 కేసులు, 1,783 మంది మృతి ) వైరల్ ట్వీట్‌పై సానియా మీర్జా వివరణ -
‘సగం’ మందికి చేరిన బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ వేగంగా జరుగుతోంది. గడిచిన రెండు మూడు రోజులుగా సర్వర్ సమస్యల కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తగా, ఆదివారానికి సమస్య కొలిక్కి రావడంతో పంపిణీ కార్యక్రమం సజావుగా కొనసాగింది. శనివారం ఒక్క రోజే గరిష్టంగా 10.04 లక్షల మంది కార్డుదారులు రేషన్ బియ్యాన్ని తీసుకోగా ఆదివారం మధ్యాహ్నానికి 6.50 లక్షల మంది రేషన్ తీసుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 87.59 లక్షల కుటుంబాల్లో 2.80 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 45.11 లక్షల కుటుంబాల్లో 1.60 కోట్ల మంది 1.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. నిజానికి సాధారణ రోజుల్లో ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున నెలకు 1.57 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని శాఖ పంపిణీ చేస్తుంటారు. ఈ ప్రక్రియ ప్రతి నెలా 15 రోజుల పాటు కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం ఒక్కో లబ్ధిదారుడికి 12 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా ఇప్పటికే నెల కోటాను దాటి 1.67 లక్షల మెట్రిక్ టన్నుల పంపిణీని పూర్తి చేసింది. ఆదివారం సైతం చాలా రేషన్ దుకాణాల వద్ద జనం గుంపులుగా కనిపించినా డీలర్లు వేగంగానే పంపిణీ ప్రక్రియ పూర్తి చేశారు. 15 తర్వాత కిలో కందిపప్పు.. కేంద్ర ప్రభుత్వం సైతం రేషన్ లబ్ధిదారులకు కిలో కందిపప్పు ఇచ్చేందుకు సమ్మతించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 87.59 లక్షల కుటుంబాలకు కిలో చొప్పున మొత్తంగా 26,685 మెట్రిక్ టన్నుల మేర కందిపప్పు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కందిపప్పును కేంద్ర సంస్థ అయిన నాఫెడ్.. పౌర సరఫరాల సంస్థకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మరో వారం పది రోజుల్లో పూర్తవగానే ఈ నెల 15 తర్వాత నుంచి కందిపప్పును పంపిణీ చేయనున్నారు. -
సన్నబియ్యంతో లక్షలాది కుటుంబాల్లో వెలుగు: లక్ష్మణ్
సాక్షి, గుంటూరు: ఏపీ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడంపై జనచైతన్య వేదిక హర్షం వ్యక్తం చేసింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో లక్షలాది కుటుంబాలకు మేలు చేకూరుతుందన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయటం వల్ల ప్రతీ కుటుంబానికి దాదాపు వెయ్యి రూపాయలు ఆదా అవుతాయని తెలిపారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ మంచి పథకమని, అయితే అమలులో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పంపిణీ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. -
రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ
సాక్షి, అమరావతి : ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని తెలిపారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, శ్రీరంగనాథ రాజుతో పాటు ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం, పౌర సరఫరాల సీఎంవో అధికారులు పాల్గొన్నారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ.. రేషన్ షాపుల ద్వారా పంపిణీ అవుతున్న బియ్యం పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బియ్యం తినడానికి పనికి రాకపోవడంతో రీసైక్లింగ్‌కు పంపుతున్నామని తెలిపారు. కేంద్రం నుంచి వస్తోన్న బియ్యంలో 25 శాతం నూక వస్తోందని, దీనిని వండితే అన్నం ముద్దగా మారుతోందని అన్నారు. రేషన్ పంపిణీలో వినూత్న మార్పులు తీసుకువచ్చి కల్తీ లేని బియ్యాన్నిఅందిస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని, దీనికోసం 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వంపై వెయ్యి కోట్లు భారం పడుతుందన్న మంత్రి బియ్యం సేకరణకు అవలంభించాల్సిన విధానాలపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. -
తెల్ల ‘మొహం’
పౌర సరఫరాల వ్యవస్థకు మంగళం పాడేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రేషన్ డిపోల ద్వారా అందించే సరుకులన్నింటినీ ఒక్కొక్కటే కుదించుకుంటూ వచ్చింది. తాజాగా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసేందుకు ఫేస్ రికగ్నైజేషన్(ముఖాల గుర్తింపు) పరికరాలు ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వేలిముద్రలు పడక, ఈ పోస్ పనిచేయక అవస్థలు పడుతున్న రేషన్‌దారులకు కొత్త పద్ధతిలో మరింత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సాక్షి,విజయవాడ: పేదలకు ఇచ్చిన తెల్లకార్డును రద్దుచేసేందుకు ప్రభుత్వం కొత్తకొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, బయోమెట్రిక్ తదితర విధానాలను ప్రవేశపెట్టింది. అయినప్పటీకీ తెల్ల కార్డులు ఉన్న పేదల సంఖ్య తగ్గలేదు. దీంతో కొత్తగా ఫేస్ రికగ్నైజేషన్ (ముఖ గుర్తింపు) విధానాన్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ–పోస్ మిషన్‌కే కార్డుదారుడు ముఖం నమోదు చేసే కెమెరాను అనుసంధానం చేస్తారు. దాంతో ఆ ముఖాన్ని కార్డుపై ఉన్న ముఖాలతో సరిపోల్చి దాని ఆధారంగా కార్డుదారులను గుర్తించి, సరుకులు పంపిణీ చేస్తారు. కార్డులపై ఉన్న ఫొటో గుర్తింపు ఆధారంగా.. జిల్లాలో 12.57 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతికార్డుకు కార్డుదారుడు, వారి కుటుంబసభ్యుల ఫొటోలను అను సంధానం చేశారు. అయితే ఈ ఫొటోలు స్పష్టంగా లేవు. కుటుంబసభ్యులంతా ఒక గ్రూపుగా తీయించుకున్నారు. దీంతో కొంతమంది ముఖాలు స్పష్టంగా కనపడటం లేదు. అయితే వేలిముద్రలు నమోదు ఆధారంగా ఫొటోలు సరిగా లేకపోయినా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే వృద్ధులకు, కాయకష్టం చేసుకునే వారికి వేలిముద్రలు సరిగా పడక పోవడం వల్ల సరుకులు పూర్తిగా అందడం లేదు. జిల్లాలోనే ప్రతి నెల కనీసం రెండువేల మందికి ఈ విధంగా నిత్యావసరాలు అందడం లేదు. ఇది కాక సర్వర్ మొరాయిస్తూ ఉండటంతో పేదలు గంటలు తరబడి రేషన్ దుకాణాల వద్దనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కొత్తగా ముఖాలు గుర్తింపు పెడితే ఇంకా ఎన్ని ఇబ్బందులు వస్తాయోనని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ఒడిశా తరహాకు భిన్నంగా... ఒడిశాలో ఇప్పటికే ముఖాలు గుర్తింపు ఆధారంగా సరుకులు పంపిణీ జరుగుతోంది. అయితే అక్కడ కార్డుదారుల కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫొటోలను తీసి వేర్వేరుగా ఆన్లైన్ చేశారు. అందువల్ల కార్డులోని ఎవరు సరుకులకు వచ్చినా వెంటనే వారి ఫొటో ఆధారంగా ఈపోస్ మిషన్ వారిని గుర్తిస్తోంది. అయితే ఇక్కడ వ్యక్తిగతంగా ఫొటోలు తీయకుండా కార్డులో ఉన్న గ్రూపు ఫొటో ఆధారంగా సరిపోల్చాలంటే ఒకొక్క కార్డుకు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు పట్టే అవకాశం ఉంది. 20శాతం మించి ఫొటో గుర్తించకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ముఖాలు సరిగా లేకపోతే మిషన్ గుర్తించకపోతే సరుకులు లభించవు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారుల వాయిస్ రికార్డింగ్ పద్ధతిని ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో ప్రవేశపెట్టింది. అది విజయవంతం కాలేదు. ఇప్పుడు తిరిగి ముఖాల గుర్తింపు పద్ధతి ప్రవేశపెడుతున్నారని ఇది ఎంతమేరకు విజయవంతమవుతుందో చూడాలని పౌరసరఫరాల శాఖాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధానంపై ఆలోచిస్తున్నాం. ఐరిస్, వేలిముద్రలు సరిగా పడని నేపథ్యంలో ముఖాలను గుర్తించే మెషిన్లను పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఆమేరకు కసరత్తు జరుగుతుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మాకు ఏవిధమైన ఉత్తర్వులు అందలేదు. – నాగేశ్వరరావు, డీఎస్వో -
'సివిల్ సప్లైస్..' వెరీ మైనస్
* గాడితప్పిన పౌర సరఫరాల శాఖ * నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న సీఎస్డీటీలు * కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ ఉద్యోగి * సిబ్బంది తీరుపై నిప్పులు చెరిగిన ఇన్చార్జి జేసీ * నేడు అధికారులతో పునః సమీక్ష జిల్లాలో పౌర సరఫరాల వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన చెరుకూరు శ్రీధర్.. సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించడంతో ఈ శాఖపై దృష్టి సారించలేకపోయారు. ప్రస్తుతం ఇన్చార్జి జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న ముంగా వెంకటేశ్వరరావు సైతం పుష్కరాలు, సీఎం పర్యటనలు, వ్యక్తిగత కారణాల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా రేషన్ సరుకులు బ్లాక్ మార్కెట్‌కు విచ్చలవిడిగా తరలిపోతున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో : పౌర సరఫరాల శాఖపై అజమాయిషీ కొరవడడంతో సిబ్బంది మొక్కుబడిగా పనిచేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. నామమాత్రపు కేసులతో సరిపెడుతున్నారు. విజిలెన్స్ అధికారులు, పోలీసు సిబ్బంది పెట్టే కేసులు తప్ప.. పౌర సరఫరాల సిబ్బంది నమోదు చేసేవి పూర్తిగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఇన్చార్జి జేసీ శనివారం వరిధాన్యం సేకరణపై మిల్లర్లు, పౌర సరఫరాల సిబ్బంది, వ్యవసాయ, సహకార శాఖ సిబ్బంది, వెలుగు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం పౌర సరఫరాల శాఖ అధికారులు, సీఎస్డీటీలతో ప్రత్యేకంగా సమీక్షించారు. కిరోసిన్ హాకర్స్‌ను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. 6ఏ కేసులపై ఆర్డీవోలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డీఎస్వో చిట్టిబాబు మాట్లాడుతూ.. కొంతమంది సీఎస్డీటీలు తన మాట వినడం లేదని, సరిగా రెస్పాండ్ కావడం లేదంటూ ఇన్చార్జి జేసీకి విన్నవించారు. దీంతో ఆయన సిబ్బంది పనితీరుపై నిప్పులు చెరిగారు. ‘ మీరెవరూ పనిచేయడం లేదు. ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. డీటైల్ రివ్యూ చేస్తా.. మీరు ఇన్స్పెక్షన్ రిపోర్టులు తీసుకురండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్చార్జి జేసీ వెంకటేశ్వరరావు సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత డీఎస్వో చిట్టిబాబు సమావేశాన్ని కొనసాగించారు. కైజాల యాప్ వాడుకలో జిల్లా చివరి స్థానంలో ఉన్నట్లు తెలిసింది. డీఎస్వో తప్ప మిగతావారు దీనిని సక్రమంగా వినియోగించడం లేదని సమాచారం. నీరుగారుతున్న కేసులు.. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సరుకు డీలర్‌కు చేర్చడం, పంపిణీ సక్రమంగా జరుగుతుందా.. టైంటేబుల్ ప్రకారం రేషన్ షాపు తెరుస్తున్నారా.. తూకాల్లో ఏదైనా తేడా ఉందా.. వంటి విషయాలు సీఎస్డీటీలు చూడాలి. దీంతోపాటు ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్‌లు, ఈ– పాస్ మిషన్లు పనిచేస్తున్నాయా.. లేదా అనేది పర్యవేక్షించాలి. ఇందులో భాగంగా ప్రతి నెల సీఎస్డీవోలు 10, ఏఎస్‌వోలు 5 షాపులను విధిగా తనిఖీ చేసి తేడాలుంటే కేసులు నమోదుచేయాలి. ఈ ప్రక్రియ జిల్లాలో సక్రమంగా జరగలేదన్న ఆరోపణలున్నాయి. ఒకవేళ నమోదుచేసిన కేసుల్ని సైతం జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి కనుసన్నల్లో నీరుగార్చుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవకతవకలను కప్పిపుచ్చేందుకు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా ఈ సీటులోనే తిష్ట వేసినట్లు శాఖ వర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
తహశీల్దార్లే ఆధార్ం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అక్టోబర్ రేషన్ సరఫరాపై అటు లబ్ధిదారులు.. ఇటు అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానాన్ని ఈ నెల నుంచి కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడమే దీనికి కారణం.జిల్లాలో సుమారు 95 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయిందని అధికారులు చెబుతున్నా రేషన్ కార్డులతో అనుసంధానం విషయంలో మాత్రం స్పష్టత కొరవడింది. దీంతో ఈ నెలా రేషన్ ఎలా సరఫరా చేయాలా అని జిల్లా పౌరసరఫరాల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో బోగస్ కార్డుల ఏరివేత ప్రక్రియ జరుగుతోంది. ఆధార్ కార్డుల్లో పేర్లు లేనివారికి రేషన్ ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో అధికారులు కొన్నాళ్లుగా ఆధార్ అనుసంధాన ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి గత నెలలోనే ఆధార్ అనుసంధానం చేసుకోని లబ్ధిదారులకు మొదట రేషన్ కట్ చేసినా.. గత నెల 18న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటు కావడంతో ఆఘమేఘాల మీద పూర్తి స్థాయిలో రేషన్ సరఫరా చేశారు. సీఎం పర్యటనలో నిరసనలు ఎదురవకుండా ఉండేందుకు ఆ నెలకు మాత్రమే సడలింపునిచ్చారని అప్పట్లో అధికారవర్గాలే పేర్కొన్నాయి. తాజాగా అక్టోబర్ కోటాకు సంబంధించి బియ్యం విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. కారణం అడిగితే ఈనెల 2 నుంచి 20వ తేదీ వరకు అన్ని చోట్లా జన్మభూమి కార్యక్రమం ఉండడమేనంటున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం వరకు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడం.. ఆ తర్వాత సాయంత్రం జిల్లా క లెక్టర్ నేతృత్వంలో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరవడంతోనే సరిపోతోందని అధికారులు వాపోతున్నారు. ఇప్పటికే వివిధ సమీక్షల పేరిట అధికారులు, నేతలు ముప్పతిప్పలు పెడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో దసరా సెలవులను కూడా పూర్తిస్థాయిలో మంజూరు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో కార్డుల ఏరివేత ఉంటుందా? ఆధార్‌తో లింకు పెట్టి గతంలో రద్దయిన సుమారు 50 వేల రేషన్ కార్డుల పరిస్థితి ఏమిటి? పూర్తిస్థాయిలో రేషన్ సరఫరా అవుతుందా అన్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ధ్రువీకరణే కీలకం కాగా రేషన్ కార్డుల ప్రక్షాళన ప్రక్రియలో తహశీల్దార్లే కీలకం కానున్నారు. సర్వే నివేదికల మేరకు తిరస్కరణకు గురైన కార్డుల కార్డుల జాబితాను డౌన్ లోడ్ చే యడం, దాన్ని పరిశీలించి, ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే బాధ్యతను తహశీల్దార్లకే అప్పగించారని జిల్లా అధికారులు చెబుతున్నారు. ‘డైనమిక్’ లిస్ట్ (రేషన్ సరఫరాలో కచ్చితత్వ పంపిణీ జాబితా)లో సరుకుల విడుదల కూడా తహశీల్దార్లు ఇచ్చే పత్రాల మేరకే జరుగుతుందని చెబుతున్నారు. ఈ నెల రేషన్‌కు సంబంధించి ఇప్పటికే కార్డు కు అరకిలో చొప్పున పంచదార పంపిణీ చేయించామని, కిరోసిన్ కోటా ఇంకా విడుదల కాలేదని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి సీహెచ్ ఆనందకుమార్ తెలిపారు. మరోవైపు..డీలర్లు డీడీలు కట్టిన మేరకే సరుకులు సరఫరా జరుగుతాయని, గతంలో రద్దు అయిన కార్డులకు ఈసారి కోటా ఇస్తారా లేదా అన్నది జాయింట్ కలెక్టర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈనెల కోటా సరఫరాపై అన్ని వైపుల నుంచి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదీ పరిస్థితి జిల్లాలో 49980 అంత్యోదయ, 678824 తెల్లరేషన్ కార్డులు, 1248 అన్నపూర్ణ, 150 చేనేత కార్డులున్నాయి. అన్నపూర్ణ, చేనేత కార్డులపై ఇచ్చే కోటా పూర్తిగా ఉచితం. తెల్లరేషన్ కార్డుల్లో ఇప్పటికే బోగస్ పేరిట చాలావరకు రద్దు చేస్తున్నారు. ఈనెల కోటా కింద ఇప్పటివరకు 9943 మెట్రిక్ టన్నుల బియ్యం విడుదలయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇవి ప్రస్తుతం అమల్లో ఉన్న కార్డులకు సరిపోతాయంటున్నారు. అలాంటప్పుడు ఈ నెల కూడా ఆధార్‌తో సంబంధం లేకుండా రేషన్ సరఫరా అవుతుందా..ఈనెల 20వ తేదీతో ముగిసిపోతున్న జన్మభూమి కార్యక్రమం తరువాత స్పష్టత వస్తుందా అన్నది చూడాల్సిందే. మొత్తానికి గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు, ప్రచార కార్యక్రమాల కోసం తిరుగుతున్న అధికారులకు రేషన్ కార్డుల ప్రక్రియపైనా ప్రజలు నిలదీస్తున్నారు. అందుకే ఈ నెల కోటా కూడా ఆధార్‌తో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో ఇచ్చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
పేదలకు వ్యక్తిగత రేషన్‌కార్డులు
హన్మకొండ అర్బన్ : పేదలకు రేషన్ సరఫరా కోసం వ్యక్తిగత రేషన్‌కార్డులు జారీ చేయాలని దీని ద్వారా వ్యక్తి వలస వెళ్లిన ప్రాంతంలో కూడా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ జి.కిషన్ అన్నారు. నవంబర్ నుంచి ప్రభుత్వం చేపట్టే కొత్త పింఛన్లు, రేషన్‌కార్డుల జారీ, నిరు పేదలకు ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ జిల్లా కలెక్టర్లతో సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పథకాల అమలు కోసం కలెక్టర్ల అభిప్రాయాలు అడిగారు. లబ్ధిదారులకు వలస వెళ్లిన చోట రేషన్ సరుకులు ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా పథకాల అమలులో పారద్శకత కోసం రేషన్ సరుకుల పంపిణీ ఆన్లైన్ విధానం ద్వారా చేయాలని, డ్రైవింగ్ లెసైన్స్, పాన్‌కార్డు, ఏటీఎం, ఆధార్‌కార్డుల మాదిరిగా పేదలకు ఒక్కొక్కరికీ ఒక కుటుంబ సరఫరా కార్డు ఇవ్వాలని తద్వారా వారు ఎక్కడ ఉంటే అక్కడ రేషన్ సరుకులు పొందే వెసులు బాటు ఉంటుందని అన్నారు. కలెక్టర్ సూచనలను విన్న రేమండ్ పీటర్ కిషన్‌ను అభినందించారు. పింఛన్‌కు కుటుంబ ఆదాయం, వయస్సు నిర్ధారణకు తీసుకోవాల్సిన చర్యలు కలెక్టర్ సూచించారు. కుటుంబంలో ఒక్కరికే పింఛన్.. వికలాంగులకు మినహాయింపు ప్రసుత్తం పింఛన్ మొత్తాన్ని భారీగా పెంచినందున కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇ్వవాల ని సూచించారు. వికలాంగులకు ఈ విషయం లో మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలు పొందే విషయంలో అర్హులకు అన్యా యం జరగకుండా పక్కాగా సమాచార సేకర ణ, వాస్తవాల నిర్ధారణ చేయాలన్నారు. అనంతరం పీటర్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణ విషయంలో కొత్తవారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని ఈ విషయంలో కొంత సమయం పడుతుందని అన్నారు. జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ పాండాదాస్, డీఈఓ విజయ్‌కుమార్, డీఆర్వో సురేందర్‌కరణ్, డీఆర్డీఏ పీడీ శంకరయ్య, డీఎస్వో ఉషారాణి పాల్గొన్నారు. -
‘అమ్మహస్తం’ అదృశ్యమయ్యేనా?
మే నెల రేషన్ సరఫరా ఏదీ? నిలిచిపోయిన ఏడు రకాల సరుకులు సరుకుల పంపిణీకి ముగిసిన కాంట్రాక్టు పట్టించుకోని పౌరసరఫరాల శాఖ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో నిరుపేదలకు రేషన్ సరుకుల పంపిణీ అరకొరగా మారింది. మే నెల రేషన్ లో రెండు, మూడు మినహా మిగతా సరుకుల సరఫరా లేకుండా పోయింది. నెల ప్రారంభమై వారం రోజులు గడిచినా బియ్యం, గోధుమ పిండి తప్ప మిగిలిన సరుకులు చౌకధర దుకాణాలకు చేరలేదు. ముఖ్యంగా పామాయిల్‌తో పాటు చక్కెర, కందిపప్పు, చింతపండు, పసుపు, కారం, ఉప్పు సరఫరా లేకుండా పోయింది. గతేడాది ‘అమ్మహస్తం’ కింద తొమ్మిది సరుకుల సరఫరాకు కుదుర్చుకున్న కాంట్రాక్టు గడువు ఏప్రిల్ మాసంతో పూర్తికావడంతో ఈ నెల సరుకుల సరఫరా నిలిపోయింది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పాత కాంట్రాక్టు పునరుద్ధరణ, లేక కొత్త కాంట్రాక్టుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితం మే నెలకు సంబంధించి సుమారు ఏడు రకాల సరుకుల సరఫరా నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి పాలసీ నిర్ణయాలు తీసుకుంటే గానీ సరుకుల సరఫరాకు మోక్షం లభించే అవకాశాలు లేకుండా పోయినట్లు తెలుస్తోంది. సబ్సిడీ సరుకులపై అనుమానాలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. రూపాయికి కిలో బియ్యం మినహాయిేస్తే మిగిలిన సరుకుల సరఫరా లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం ప్రస్తుతం లబ్ధిదారులకు అందించిన తెల్లరేషన్ కార్డులను అమలు చేస్తుందా.? లేక వాటిని రద్దు చేసి వేరే కార్డులను జారీ చేస్తుందా? అనేది నిరుపేదలకు తొలిచేస్తున్న ప్రశ్న. మరోవైపు సబ్సిడీ సరుకులు కొనసాగించేనా.. లేదా అనే అంశంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా పరిధిలో సుమారు 17.69 లక్షల వరకు తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఇందుకోసం ప్రతి నెలా గ్రేటర్‌కు కోటా ప్రకారం పెద్దఎత్తున సరకుల సరఫరా జరుగుతుంది. ఈ నెల సరుకుల సరఫరా లేకుండా పోవడంతో లబ్ధిదారులు చౌకధర ల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. -
రేషన్‌కు ఆన్లైన్ అడ్డు
బేస్తవారిపేట, న్యూస్‌లైన్: ప్రభుత్వం రెండేళ్ల క్రితం రచ్చబండ, రెవెన్యూ సదస్సుల్లో మంజూరు చేసిన తాత్కాలిక రేషన్‌కార్డులకు రేషన్ సరఫరా నిలిచిపోయింది. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి మంజూరు చేయించుకున్న కార్డుదారులకు మూడు నెలల నుంచి డీలర్లు రేషన్ ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా రచ్చబండలో కార్డులు పంపిణీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారులు కుటుంబ సభ్యుల ఫొటోలు వీఆర్వోలకు అందజేశారు. కంప్యూటర్లో ఫొటోలు, కార్డుల సమాచారం రెవెన్యూ కార్యాలయాల్లో ఆన్లైన్లో నమోదు చేశారు. హైదరాబాద్ సర్వర్‌లో సమస్య తలెత్తడంతో కొంత మంది ఫొటోలు మాత్రమే అప్లోడు అయ్యాయి. జిల్లాలోని 56 మండలాల్లో 20, 970 మంది కార్డుదారుల సమాచారం అప్లోడు కాలేదు. సమాచారం కంప్యూటర్లో నమోదుకాని కార్డుదారులందరికీ మూడు నెలల నుంచి రేషన్ నిలిపివేశారు. జిల్లాలో అత్యధికంగా పామూరు 1069, మార్కాపురం 1,146, ఒంగోలు(అర్బన్) 982, కనిగిరి 945, యర్రగొండపాలెం 729, పుల్లలచెరువు 726, పొదిలి 670, త్రిపురాంతకం మండలంలో 608 మంది కార్డుదారుల సమాచారం అప్లోడు కాలేదు. కంప్యూటర్లో సమాచారం అప్లోడు చేసినపుడు కొందరికి వేరే కార్డుకు యూఐడీ నంబర్ ఇచ్చినట్లు వెబ్సైట్ చూపిస్తోంది. దీంతో రేషన్ కార్డుల సమాచారం ఆన్లైన్ చేయడం కుదరడంలేదు. సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో ఫొటోలు అప్లోడు చేయలేకపోతున్నారు. మూడు నెలలుగా పేదలకు బియ్యం, కందిపప్పు, పామాయిల్, చక్కెర, కిరోసిన్ అందకుండా పోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రతినెలా రేషన్ దుకాణాల వద్దకు వెళ్లడం డీలర్లు ఈనెల కూడా రాలేదని చెప్పడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. వెబ్సైట్ సమస్య వల్లే.. దక్షిణామూర్తి ఏఫ్ఐ, గిద్దలూరు కంప్యూటర్ డేటా నమోదు చేయని, ఫొటోలు అప్లోడు చేయనివాళ్లకు రేషన్ సరఫరా నిలిచిపోయింది. రెండు నెలల క్రితమే డీలర్లకు జాబితా అందించాం. వెబ్సైట్లో సమస్యలుండి ఫొటోలు అప్లోడు కాకపోతే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. -
అత్తెసరు రేషన్
= ఇంకా దుకాణాలకు చేరని సరుకులు = అరకొరగానే సరఫరా = పత్తాలేని అదనపు కోటా = పట్టింపులేని అధికారులు సాక్షి,సిటీబ్యూరో: కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుంది..నగరంలో రేషన్ సరఫరా తీరు. పేదలకు ఎంతో సబ్సిడీతో సరుకులు సరఫరా చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం..సరుకులను పూర్తిగా సరఫరా చేయడంలో చతికిలపడింది. ఈనెల 14న దసరా పండుగ సమీపిస్తున్నా ఇప్పటివరకు నగరంలోని చాలా దుకాణాలకు సరుకులు చేరలేదు. ఒకవేళ వచ్చినా సగంసగం సరుకులు ఇస్తూ డీలర్లు చేతులు దులిపేసుకుంటున్నారు. నెలనెలా ఇవ్వాల్సిన కోటా పరిస్థితి ఇలా ఉంటే.. పండుగల సమయంలో ఇవ్వాల్సిన అదనపు కోటా పత్తా లేకుండా పోయింది. సాధారణంగా దసరా,దీపావళి, సంక్రాంతి, రంజాన్, బక్రీద్ వంటి పర్వదినాల్లో ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు అదనంగా చక్కెర, పామాయిల్ తదితరవాటిని సరఫరా చేసేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. పండుగలు దగ్గరపడుతున్నప్పటికీ అదనపు కోటా ఊసేలేకుండా పోయింది. సీమాంధ్ర ఆందోళన ఫలితం గా అదనపు కోటా దేవుడెరుగు..అసలు కోటాకే ఎసరు వచ్చిపడినట్లయ్యింది. పామాయిల్ దూరం: సీమాంధ్ర ఉద్యమం సెగతో పేద ల వంటనూనె పామాయిల్ దూరమైంది. ఈనెల పా మాయిల్ కోటా ఇప్పటివరకు దుకాణాలకు చేరకపోగా, పండగల అదనపు కోటా జాడలేకపోయింది. గతనెలలో ఆలస్యంగా దశల వారీగా సుమారు 70 శాతం మా త్రమే పామాయిల్ సరఫరా చేశారు. గత రెండునెలలు గా నెల్లూరు నుంచి పామాయిల్ రవాణాకు అడ్డంకు లు ఏర్పడడంతో పూర్తిస్థాయి సరఫరా జరగలేదు. బహిరంగమార్కెట్లో మంచినూనె ధరలు మండిపోతుండడం తో లబ్ధిదారులు పామాయిల్ కోసం దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. తగ్గిన గోధుమల కోటా: చౌకధర దుకాణాల ద్వారా గోధుమలు ఇకముందు ఇస్తారో లేదోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతినెలా కొరత పేరిట దుకాణాలకు కోటా తగ్గిస్తున్నారు. దీంతో ప్రస్తుతం తెల్లకార్డుదారులకు కేవలం ఒకకిలో గోధుమలు, ఒకకిలో పిండి మాత్రమే ఇస్తున్నారు. గతంలో కార్డు ఒక్కంటికి కనీసం 30కిలోల వరకు ఇచ్చేవారు. పండుగల సమయంలో అదనపుకోటాను సైతం కేటాయించేవారు. ప్రస్తుతం అదనపుకోటా ఊసేలేకపోగా, అసలు కోటా కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పేదలు పిండివంటలకు దూరమయ్యే దుస్థితి ఏర్పడింది.