అత్తెసరు రేషన్ | Included goods and shops | Sakshi
Sakshi News home page

అత్తెసరు రేషన్

Published Sun, Oct 13 2013 3:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

Included goods and shops

 

=    ఇంకా దుకాణాలకు చేరని సరుకులు
 =    అరకొరగానే సరఫరా
 =   పత్తాలేని అదనపు కోటా
 =    పట్టింపులేని అధికారులు

 
సాక్షి,సిటీబ్యూరో: కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుంది..నగరంలో రేషన్ సరఫరా తీరు. పేదలకు ఎంతో సబ్సిడీతో సరుకులు సరఫరా చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం..సరుకులను పూర్తిగా సరఫరా చేయడంలో చతికిలపడింది. ఈనెల 14న దసరా పండుగ సమీపిస్తున్నా ఇప్పటివరకు నగరంలోని చాలా దుకాణాలకు సరుకులు చేరలేదు.

ఒకవేళ వచ్చినా సగంసగం సరుకులు ఇస్తూ డీలర్లు చేతులు దులిపేసుకుంటున్నారు. నెలనెలా ఇవ్వాల్సిన కోటా పరిస్థితి ఇలా ఉంటే.. పండుగల సమయంలో ఇవ్వాల్సిన అదనపు కోటా పత్తా లేకుండా పోయింది. సాధారణంగా దసరా,దీపావళి, సంక్రాంతి, రంజాన్, బక్రీద్ వంటి పర్వదినాల్లో ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు అదనంగా చక్కెర, పామాయిల్ తదితరవాటిని సరఫరా చేసేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. పండుగలు దగ్గరపడుతున్నప్పటికీ అదనపు కోటా ఊసేలేకుండా పోయింది. సీమాంధ్ర ఆందోళన ఫలితం గా అదనపు కోటా దేవుడెరుగు..అసలు కోటాకే ఎసరు వచ్చిపడినట్లయ్యింది.
 
పామాయిల్ దూరం: సీమాంధ్ర ఉద్యమం సెగతో పేద ల వంటనూనె పామాయిల్ దూరమైంది. ఈనెల పా మాయిల్ కోటా ఇప్పటివరకు దుకాణాలకు చేరకపోగా, పండగల అదనపు కోటా జాడలేకపోయింది. గతనెలలో ఆలస్యంగా దశల వారీగా సుమారు 70 శాతం మా త్రమే పామాయిల్ సరఫరా చేశారు. గత రెండునెలలు గా నెల్లూరు నుంచి పామాయిల్ రవాణాకు అడ్డంకు లు ఏర్పడడంతో పూర్తిస్థాయి సరఫరా జరగలేదు. బహిరంగమార్కెట్‌లో మంచినూనె ధరలు మండిపోతుండడం తో లబ్ధిదారులు పామాయిల్ కోసం దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు.
 
తగ్గిన గోధుమల కోటా: చౌకధర దుకాణాల ద్వారా గోధుమలు ఇకముందు ఇస్తారో లేదోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతినెలా కొరత పేరిట దుకాణాలకు కోటా తగ్గిస్తున్నారు. దీంతో ప్రస్తుతం తెల్లకార్డుదారులకు కేవలం ఒకకిలో గోధుమలు, ఒకకిలో పిండి మాత్రమే ఇస్తున్నారు. గతంలో కార్డు ఒక్కంటికి కనీసం 30కిలోల వరకు ఇచ్చేవారు. పండుగల సమయంలో అదనపుకోటాను సైతం కేటాయించేవారు. ప్రస్తుతం అదనపుకోటా ఊసేలేకపోగా, అసలు కోటా కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పేదలు పిండివంటలకు దూరమయ్యే దుస్థితి ఏర్పడింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement